|

భూపాలపల్లికి కానుకగా కాళేశ్వరం

కాళేశ్వరం తొలిఫలితం ఓరుగల్లుకే..
tsmagazine

కాళేశ్వరం ప్రాజెక్టును జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు కానుకగా ఇస్తున్నట్టు నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తొలి ఫలితం ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు దక్కుతుందని ఆయన అన్నారు. కాళేశ్వరం పూర్తి కావస్తున్నందున ఎల్లంపల్లి-మిడ్‌ మానేరు-లోయర్‌ మానేరు డ్యాం మీదుగా ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి.ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలియజేశారు.జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మంత్రి విస్తృతంగా పర్యటింటి, వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

తెలంగాణలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కొందరు నాయకులు అడుగడుగునా కోర్టు కేసులు వేస్తూ ఆటంకాలు సృష్టిస్తున్నారని మంత్రి విమర్శించారు. దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టులను మంత్రి హరీశ్‌ రావు సందర్శించారు.దేవాదుల ఫేజ్‌-3 పనులు శరవేగంగా జరుగుతున్నట్టు భూపాలపల్లిలో మీడియాకు తెలిపారు.వర్షాకాలం లోపున తుపాకులగూడెం సిమెంటు కాంక్రీటు పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

మొత్తం 4.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులకు గాను 1.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు జరిగాయని అన్నారు. పనులు మరింత వేగవంతం చేయాలని, తుపాకులగూడెం బ్యారేజి పూర్తయితేనే 10 నెలలపాటు దేవాదుల పంపులు నిరంతరాయంగా పనిచేస్తాయని ఆయన గుర్తుచేశారు. తుపాకులగూడెం బ్యారేజి వల్ల దేవాదుల ప్రాజెక్టు పరిధిలో 6 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుందన్నారు. తుపాకులగూడెం బ్యారేజి పూర్తయితే ప్రతి ఏటా 100 టి.ఎం.సి.లను ఎత్తి పోసుకోవచ్చునని మంత్రి అన్నారు.

దేవాదుల ప్యాకేజీ5 పనులను కూడా సమీక్షించినట్టు మంత్రి తెలిపారు. ఎస్‌ ఆర్‌ ఎస్పీ ద్వారా 83 వేల ఎకరాలకు భూపాలపల్లి నియోజకవర్గంలో నీరు అందించాల్సి ఉంటే గత పాలకులుకాగితాల మీదనే నీళ్లు చూపించారని విమర్శించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో లక్ష 90 వేల ఎకరాల కు సాగుభూమి ఉందని ఆయన చెప్పారు.ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి.కాలువల ద్వారా 83 వేల ఎకరాలు, మైనర్‌ ఇరిగేషన్‌ కింద 50 వేల ఎకరాలు నీరందిస్తామని మంత్రి తెలియజేశారు.పనులను మరింత వేగవంతం చేయాలని ఇంజనీర్లను ఆదేశించామని చెప్పారు.అలాగే

దేవాదుల ప్రాజెక్టుతో పూర్వ వరంగల్‌ జిల్లా సస్యశ్యా మలం అవుతుందని మంత్రి చెప్పారు. తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణం పూర్తయితే 365 రోజులు 100 టీఎంసీల నీటిని లిఫ్టు చేసే అవకాశం ఉంటుందన్నారు. తుపాకుల గూడెం బ్యారేజీ నిర్మాణం కోసం చేపట్టిన కాఫర్‌ డ్యాంతో వర్షాకాలంలో కూడా కాంక్రీటు పనులు చేయవచ్చునని తెలిపారు.తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించామని మంత్రి హరీష్‌రావు చెప్పారు.2019 నాటికి తుపాకుల గూడెం బ్యారేజీ నిర్మాణంతో పాటు దేవాదుల ఫేజ్‌-3 పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఎస్సారెస్పీ మరమ్మతుల పనులు వేగవంతంగా సాగుతున్నాయని, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హరీశ్‌ రావు అన్నారు. పాకాల సరస్సు లోకి గోదావరి జలాలను త్వరగా తెప్పించడానికి పనులను వేగవంతం చేయించినట్ట్టు తెలిపారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో కొత్త ఒరవడి

తెలంగాణ సోయితోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రీ డిజైన్‌, రీ ఇంజనీరింగ్‌ చేసినట్టు మంత్రి తెలియజేశారు. భవిష్యత్‌లో దేశానికి అన్నంపెట్టే భాండాగారంగా తెలంగాణ మారుతుందని ఆయన చెప్పారు. నీటి ప్రాజెక్టులను కట్టడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. రైతుల ఆత్మహత్యలను నివారించాలని, ప్రతి నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేశారని మంత్రి అన్నారు. తుపాకుల గూడెం నుంచి శ్రీరాం సాగర్‌ వరకు 270 కిలోమీటర్ల మేరకు గోదావరి నది ఏడాది పొడవునా 365 రోజులపాటు సజీవంగా ఉంటుందన్నారు. మహారాష్ట్ర నుంచి సముద్రం వరకు నౌకాయానం జరుగుతుందన్నారు.మత్స్య పరిశ్రమ, టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

గతంలో ప్రాణహిత-చేవెళ్ల పథకం కింద 16 లక్షల ఎకరాలకే ఆయకట్టును ప్రతిపాదించారని రీ డిజైన్‌, రీ ఇంజనీరింగ్‌ అనంతరం 37 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి లభించనుందని ఇరిగేషన్‌ మంత్రి గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్ళ పథకంలో 11 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు ప్రతిపాదించగా 147 టీఎంసీలకు వాటి సామర్ధ్యాన్ని కేసిఆర్‌ పెంచారని హరీశ్‌ రావు తెలియజేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను నిర్మించి ఎత్తిపోతల ద్వారా మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ, గంధమల్ల తదితర రిజర్వా యర్లను నిర్మించి తెలంగాణలోని అత్యంత కరువుపీడిత ప్రాంతాలలోని సుమారు 37 లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వ్యూహాత్మక వైఖరితో అంతర్రాష్ట్ర అనుమతులు, జలసం ఘం అనుమతులు సాధించుకోగలిగినట్టు హరీశ్‌ రావు వివరించారు.

కాళేశ్వరం నుంచి మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు డ్యాం మీదుగా హుజురాబాద్‌,పరకాల, మహబూబాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఆయకట్టుకు నీరందుతుందని హరీశ్రావు తెలిపారు. ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి కింద 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కొన్ని నియోజకవర్గాలకు ఎస్‌.ఆర్‌.ఎస్‌.పీ నుంచి చుక్క నీరు కూడా వెళ్ళలేదన్నారు. ఎల్‌.ఎం.డి.దిగువన 5.40 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ కాలువలు శిధిలమై పూర్తి ఆయకట్టుకు నీరందలేదని హరీశ్‌ రావు విమర్శించారు. 1070 కోట్ల వ్యయంతో చేపట్టిన శ్రీరామ్సాగర్‌ ఆధునీకరణ పనుల వల్ల పూర్తి ఆయకట్టుకు నీరందనుందని అన్నారు. శ్రీరామ్‌సాగర్‌ రెండోదశ కింద చేపట్టిన పనుల వల్ల పాలకుర్తి నియోజకవర్గంలో రైతులకు సాగునీరు లభిస్తుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి అటు దేవాదుల నుంచి కూడా సాగు నీరు వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత సాగునీటిరంగంలో దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాలను కేసీఆర్‌ ప్రశ్నించడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని ఆయన గుర్తు చేశారు. కంతనపెల్లి బ్యారేజీకి 2009 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసినా తట్టెడు మన్ను తీయలేదని విమర్శించారు. భూపాలపల్లి జయశంకర్‌ జిల్లాలోని రామప్ప చారిత్రాత్మక దేవాలయానికి ప్రమాదం కలుగకుండా పైప్ద్‌ ఇరిగేషన్‌ విధానంతో పనులు చేపట్టామని చెప్పారు.

ములుగు, భూపాలపల్లి, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్యాప్‌ ఆయకట్టుకు నీరందిస్తున్నట్టు హరీశ్‌ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37 లక్షల 9 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు నీటిని అందిస్తామని మంత్రి ప్రకటించారు. త్వరలోనే తెలంగాణ మరో కోనసీమ కానుందని ఆయన అన్నారు. తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. వందేళ్ళ తర్వాత కూడా కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకునే విధంగా సాగునీటి రంగంలో పనులు సాగుతున్నట్టు తెలియజేశారు. కాళేశ్వరం లింక్‌ 1 లో మూడు బ్యారేజీ లు,మూడు పంప్‌ హౌస్‌లను అతి తక్కువ వ్యవధిలో 20 నెలల్లోనే పూర్తి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

కాళేశ్వరం పనులు మూడు షిఫ్టులలో వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే దాదాపు 70 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయినట్టు మంత్రి తెలియజేశారు. తెలంగాణను ఆకుపచ్చని తెలంగాణగా, కోటి ఎకరాల మాగాణిగా మార్చడం సీఎం సంకల్పం అని మంత్రి తెలిపారు.