మండుటెండల్లో శీతలామృత పద్య వృష్టి – డా.ఎన్‌.వి .ఎన్‌.చారి

వరంగల్లులో సహదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ , పోతన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పోతన విజ్ఞాన పీఠంలో వధాని సుధాంశు, సాహితీ కళాసాగర, పద్యావిద్యానిధి మద్దూరి రామమూర్తి చే మూడు రోజులపాటు నిర్వహించబడిన శతావధానం రస హదయులకు, సాహితీ ప్రియంభావుకులకు, పద్య ప్రియులకు వేసవి దాహార్తిని తీర్చే చలివేంద్రమైంది. మండుటెండల్లో శీతలామత పద్య వష్టి మనోక్షేత్రాల్లో హాయిని నింపింది.

మొదటిరోజు సమస్యతో ఆరంభించారు. పచ్ఛకులు తమతమ సమస్యాస్త్రాలను ఎంత బలంగా సంధించారో అంతకంటే పదునుగా , చమత్కారం తో మెరుపులతో విరుపులతో సమస్యా పురాణం చేశారు మద్దూరి రామమూర్తి. నెమలికొండ హరిప్రసాద్‌ అడిగిన ”రణమే శాంతికి మూలమౌ ననుచు ధర్మాత్ముండు బుద్డుండనెన్‌ ” అన్న సమస్యకు తన పద్య ధారా ”ధారణమే” శాంతికి మూలమని అద్భుతంగా పూరించారు. అవధాని చిటితోట విజయకుమార్‌ ” హరుడేసంతత లోక విత్త హరుడై న్యాయము పాటించునే అని అడిగితే, విఘ్న సంహరుని” గా మలచి అందంగా పూరించారు. శంకరాభరణం కంది శంకరయ్య చిత్రంగా… ” పారెదరోరుగల్‌ వాసులు మీ అవధానమన్నచో ” అని ఇస్తే అంతే గడుసుగా…. పౌరులు సత్కవీశ్వరులు భావ మరందము గ్రోల రీతి ”సొంపారెదరంచు” చమత్కరించారు.

అక్కర సదానందాచారి అసంబద్ధంగా ఇచ్చిన సమస్య… జారిణి పంచి పెట్టెడు ప్రసాదము తిన్న మహోదయమ్మగున్‌ అన్న ప్రశ్నకు, శ్రీరమణీ మణీ నిరత సేవిత పాద సరోజు సుందరా -కార మనోజు సంశ్రిత సుఖప్రతిపాదక కల్పపుం భువిన్‌ సారపు భక్తి గొల్తు కాదు సంతసమందగ నాలయంపు” పూ-జారిణి”………. అంటూ జారిణిని పూజారిణిగా స్తవనీయము గావించిన ప్రతిభ కనిపిస్తుంది.

పాలకుర్తి రామ మూర్తి ”రాముని తండ్రి భీష్ముడని వ్రాసెను తన భారతమ్మునన్‌ ” అంటూ పొంతన లేని సమస్యకు సమాధానంగా …. ”కామవిదూర సద్గుణ శుకర్షికి తండ్రి మహాభిలాష నా- నా మహితంబులౌ కతి ధనము లొసంగిన వ్యాస మౌని, సంగ్రామము నందు నా పరుశురాము నెదిర్చెనెవడటన్నఔ -రా ముని తండ్రి భీష్ముఆని వ్రాసెనుపో తన భారతమ్మునన్‌ అంటూ చమత్కారంగా చెప్పినారు.

పాతూరి రఘురామయ్య …. ”చింతన లోపించిన యతి సిద్ధిని పొందెన్‌ అని ఇస్తే, దాన్ని దుశ్చింత్‌ చేసి చక్కగా పూరించారు. డా. ఎల్లంభట్ల నాగయ్య …. రాతికి కోతిపుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్‌” అని విషమ సమస్య ఇస్తే , అలవోకగా క్రమాలంకారంలో అందంగా పూరించి ప్రశంసలు పొందారు అవధాని. పల్లేరు వీరాస్వామి ఇచ్చిన ”అంగము నెత్తి చూపె జనులందరు మెచ్చగ పండితుండటన్‌ అన్న అశ్లీల సమస్యను…. హస్తాంగము గా పూరణ చేశారు .

ఎన్‌.ఎస్‌. రంగాచార్య సమస్య…. ” కోపగించిన రాముడప్పుడు కొలాంజిను సీతపై ” అన్న సమస్యలో , ఆధునిక రాముడు సీత పై కట్టివిసిరాడని నేటి పరిస్థిని వివరించారు .

వరదాచార్యులు ”పాపియే తప్పకన్‌ పరమ పావనమోక్షమునందు నమ్ముమా” అని ఇస్తే , పాపిని నిష్పాపిగా సమంజసం పూరణ గావించారు. సిద్ధింకి బాబు ”వాలంబొక్కటి తక్కువయ్యె వామాక్షి సీతమ్మకున్‌” అన్న సమస్యలో వాలమును తోకగా కాక పులి అని అర్థంలో క్రూరమగాలవంటి రాక్షస కాంతలలో పులి ఒక్కటే లేదు అని రసవంతంగా పూరించడం ఈ అవధానికే చెల్లుతుంది. మెడపర్తి వారు ”కావు కాదాయ రామమూర్తి కలలోనైనన్‌” ఆంటే, కాకవి కాదంటూ చక్కగా తిప్పికొట్టారు.

డా ఎం.వి ఎం చారి ”జలజలా జాలు వారు జలజమ్ములే చాలును జాతులేలకో” అన్న సమస్య ఇస్తే అందమైన పద్యం ఇలా జాలువారింది.జలజ లతాంతముల్‌ దిశల సాగగా రమ్య వనీ స్థలంబుల్‌

పులకిత మయ్యె నేడు తలపోయుగ కమ్మని సౌరభమ్ములన్‌-

అలికుళ ఝంక తుల్‌ మనికి హాయిని గూర్చగ పచ్ఛకోత్తమా …..

మంథాని శంకరయ్య …. ”జాషువా జాడకై వెదికె జాలిగ గబ్బిల మిప్పుడీ గడిన్‌” అని ఇచ్చిన సమస్యకు సమాధానంగా, గబ్బిలాల వేదనను వర్ణిస్తూ పద్యం చెప్పారు . సుంకర సాంబయ్య ”భవుని ముఖంబునన్‌ వెలయు వాణికి వందన మాచరించెదన్‌” అని ఇచ్చిన సమస్యను పద్మ సంభవుని ముఖమునన్‌ అని భవున్ని పద్మసంభవునిగా మార్చి సమస్యలో అసంబద్ధతను తొలగించారు.

దత్తపదిలో 25 మంది పచ్ఛకులు పాల్గొన్నారు. దహెగం సాంబమూర్తి యువత, నవతా, కవిత, భవిత పదాలతో దేశ సంక్షేమము గురించి చెప్పమన్నారు. గణపతి శర్మ జమున, సావిత్రి, వాణిశ్రీ, జయంతి సినీ నటీమణుల పేర్లు ఇస్తే కంజమున” సీదువనగ నా కల్పకమ్ము- వాణిశ్రీ కంఠ హారమై వరల జేసె -భువిని సావిత్రి ధర్మమ్ము బోధ జేసె విజ్జయంతిగా నిలిచెనా విశ్వనాథ అంటూ … కవి సమ్రాట్‌ విశ్వనాథపై అందమైన పద్యం చెప్పారు.

అక్కెర కరుణా సాగర్‌ ఇచ్చిన సాస , రిరి,గాగ, మామ సంగీత పదాలతో మనో చాంచల్యాన్ని చక్కగా వర్ణించారు. వల్సపైడి చీపురు కట్ట, పాముల పుట్ట, చెత్త బుట్ట, పేడతట్టతో పరిశుభ్రత గురించి చెప్పమని అడిగితె, కాదేదీ కవిత కనర్హం అన్నట్లు ఉత్పల మాలలో ” చీపురు కట్ట తా తెలియ జేయు విశిష్టములైన శుభ్రతన్‌ అంటూ స్వచ్ఛ భారత్‌ ఆవశ్యకతను తెలిపారు. అన్నావజ్జ లవారు ముండ, తుండ, దందా, పిండ పదాల తో ఆదిశంకరుల అద్వైతాన్ని వివరించమంటే ”జ్ఞానాబ్ధిన్‌ తరియించి భక్తి” అంటూ అద్వైతాన్ని అద్భుతంగా వర్ణించారు.

పొగాకు, మమత, రామప్ప శిల్ప వైభవం వర్ణించమని అడిగితే ‘ధీర మదంగ రావ మయ ధింతక ధింతక ధింధిమి ధ్వని – ప్రేరిత నత్య లాస్య సరి రీరి రి గా మపాద పాణిలీ- లార చేనైక మంజుల వలస విభాసుర భావ భంగిమల్‌ – చిరుతరమ్ములై యలర చాటెను రామప్ప మందిరమ్మునన్‌ అంటూ శ్రావ్య లలితమాధుర్య పద్యం వెలువడింది. గందె శ్రీనివాస్‌ అడిగిన కష్ణయ్య, పెద్ది వెంకటయ్య హనుమంతుని సముద్ర లంఘనం, హసన్‌ దత్తపదులు శీతలము, కోమలము, మలయము, మాధుర్యము,పదాలతో ప్రవరుడు ఇంటికి వచ్చే సంరంభంతో పాటు ఆధునిక సమకాలీన సమస్యలపై పచ్ఛకులు బాణాలను సంధించారు. సందర్భోచిత పూరణలతో అవధాని సభికులను మంత్ర ముగ్దులను చేశారు వర్ణనలతో పాల్గొన్న కవులలో డా .కొమర్రాజు రామలక్ష్మి సెల్‌ ఫోను ఫేస్బుక్‌ పబ్జీలతో పెడదార్లు పడుతున్న యువతకు నాటి ఆటపాటల వైభవం గురించి అడిగితే ఎంతో సందేశాత్మక పద్యం చెప్పారు. పలువురు అడిగిన వర్ణనలలో కాకతీయ వైభవం, రామప్ప శిల్పకళా, కాళోజి అనుముల క ష్ణ మూర్తి, సమ్మక్క సారలమ్మ వైభవం, భద్రకాళి వైభవం, ఒద్దిరాజు సోదరులు ఇలా ఓరుగల్లు చారిత్రిక నేపథ్యం, పౌరాణిక నేపథ్యం, సామాజిక అంశాలు వస్తువులుగా అర్థవంతమైన పద గుంఫనలతో కూడిన పద్యాలు అవధాని నోటి వెంట సరస్వతీ సత్కారమా అన్నట్లు వెలువడ్డాయి.

25 ఆశువులు రోజుకు కొన్ని చొప్పున పూర్తిచేశారు. పచ్ఛకులు అడిగి ఆశువులకు అనర్గళంగా, అతివేగంగా పద్యాలను చెప్పి ఆకట్టుకున్నారు

రెండవ రోజు ఆరంభ సభకు పోతన విజ్ఞానపీఠం కార్యదర్శి నమిలికొండ అధ్యక్షత వహించగా, సహదయ మార్గదర్శక మండలి సభ్యులు వనం లక్ష్మి కాంతారావు జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు

మూడవరోజు ఉదయం ప్రముఖ రచయిత

డా .రామా చంద్రమౌళి జ్యోతి ప్రకాశన చేసి ఆరంభించిన సభలో అవధాని 75 పద్యాలను గంటన్నరలోపే తట్టుకోకుండా, అందించడం లేకుండా ధారణ చేసి శ్రోతల మన్నలను అందుకున్నారు. ఆడిటోరియం చప్పట్ల తో మారు మ్రోగింది . 65 సంవత్సరాల వయస్సులో శతావధానం చేయడం ఒక ఎత్తైతే ధారణ మరొక సాహసం. ఎంతో సులభంగా ధారా ధారణలతో శతావధాన మహా యజ్ఞం విజయవంతమైంది.

అవధాన సమారోహణ సభకు సహదయ మార్గదర్శక సభ్యులు గన్నమరాజు గిరిజామనోహర బాబు అధ్యక్షత వహించగా, తెలంగాణ మాస పత్రిక ప్రధాన సంపాదకులు అష్టకాల రామ్మోహన్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రకాశనంతో శుభారంభం గావించి తమ సందేశం ఇచ్చారు. సంయోజకులు గిరిజా మనోహర బాబు మాట్లాడుతూ, మద్దూరి రామమూర్తి శతాధిక అవధానాలు చేశారని మొదటి సారి శతావధానంతో వరంగల్లు రసహదయులను అలరిస్తుందని తెలిపారు. మేడసాని మోహన్‌, గరికపాటి రాళ్ళ బండి కవితా ప్రసాద్‌, కోటలక్ష్మి నరసింహం, ఆముదాల మురళి, మెట్రామ శర్మ, అష్టకాల నసింహ రామ శర్మ వంటి ఎందరో అవధానులు వరంగల్లులో అష్ట, అష్టోత్తర, ద్విదశ, శతావధానాలతో ఆకట్టుకున్నారని తెలిపారు. డా. శ్రీరంగాచార్య మూడురోజులపాటు సంయోజకత్వం వహించారు. కాళోజి ఫౌండేషన్‌ అధ్యక్షులు, సాహితీ విశ్లేషకులు నాగిళ్ల రామశాస్త్రి, ప్రముఖ కవి వరిగొండ కాంతారావు అప్రస్తుత భాషణం చేసి ఆకట్టుకున్నారు. మూడు రోజుల పాటు అవధాన సంచాలకులుగా వ్యవహరించిన సంస్క తాంధ్ర మహా పండితులు డా. రంగాచార్య ఈ సభలో శతావధాని నిర్వహణా క్రమాన్ని, పచ్ఛక నియమాలను, సమయ పాలనను వివరించారు.

సమాపక సభలో అవధాని వ్రాసిన 25 మాలికలతో కూడిన మాలికారామాన్ని ఆచార్య సుప్రసన్న ఆవిష్కరించారు. అనంతరం ఇరు సంస్థల కార్యదర్శులు నమిలికొండ బాలకిషన్‌ రావు, డా.ఎన్‌.వి.ఎన్‌.చారి అవధానికి పద్య విద్యానిధి బిరుదును ప్రకటించారు . కుందా వజ్జల కష్ణ మూర్తి
బిరుదు-సన్మాన పద్య పత్రాన్నిచదివారు. అనంతరం అవధానికి ఘనసన్మానం చేశారు. పచ్ఛకులను, అతిథులను సన్మానించారు.