|

మందులు, భోజనం అందుతోందా?

కరోనా రోగులకు కె.సి.ఆర్‌ పరామర్శ

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో కరోనా చికిత్స అమలు తీరు, వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా సీఎం కేసీఆర్‌  వరంగల్‌ పర్యటన చేపట్టారు. హెలీకాప్టర్‌లో వరంగల్‌ చేరుకున్న సీఎం, తొలుత ఎంజీఎం దవాఖానాను సందర్శించారు. ఐసీయూలో, జనరల్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషంట్ల ప్రతీ బెడ్డు వద్దకు కలియతిరిగి పేరు పేరునా వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. మందులు, భోజనం సరిగ్గా అందుతున్నదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. మీరంతా త్వరలోనే కొలుకుం టారనీ కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. 

మీరే మా ధైర్యం…

ఈ సందర్భంగా వరంగల్‌ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్‌ వెంకటా చారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. సీఎంను ఉద్దేశించి, మీరే మా ధైర్యం.. కేసీఆర్‌ జిందాబాద్‌.. కేసీఆరే నా నిండు ప్రాణం.. అని ఆయన ఉద్వేగంతో నినదించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ జనరల్‌ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. 

ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి పారిశుధ్య పరిస్థితులను, సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్య మంత్రి ఆదేశించారు. దవాఖాన సిబ్బందితో, నర్సులతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న సేవలను అభినందించారు. 

అనంతరం సీఎం కేసీఆర్‌ వరంగల్‌ సెంట్రల్‌ జైలును సందర్శించారు. జైల్లో ఖైదీలు తయారు చేసిన చేనేత, స్టీలు తదితర ఉత్పత్తులను పరిశీలించారు. బ్యారకుల్లో కలియతిరిగి, శిక్షను అనుభ విస్తున్న ఖైదీలతో మాట్లాడారు. వారు జైలుకు ఏ శిక్ష  మేరకు వచ్చారు? వారి ఊరు ఎక్కడ? వారి కుటుంబ పరిస్థితి ఏమిటి? అని అడిగి తెలుసుకున్నారు. ఖైదీల సమస్యలను ఓపికతో ఆలకించారు.. జైల్లో వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. వారి అభ్యర్థనలను స్వీకరించారు.

అక్కడి నుంచి ముఖ్యమంత్రి వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని, అన్ని జిల్లాల కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉంది? కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటి?  అని అడిగి తెలుసుకున్నారు. లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణ వారం పదిరోజుల్లో పూర్తి చేయాలన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ‘‘రాష్ట్ర రెవెన్యూ నష్టం గురించి ఆలోచించకుండా లాక్‌ డౌన్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో డిజాస్టర్‌ మేనేజమెంట్‌ చట్టం నియమ నిబంధనల ప్రకారం, లాక్‌ డౌన్‌ ను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత డీజీపీతో సహా కలెక్టర్లకు ఉన్నది. 

ఉదయం సడలించిన 4 గంటలు మినహా, మిగతా 20 గంటలపాటు లాక్‌ డౌన్‌ ను కఠినంగా అమలు చేయాలె. అత్యవసర సేవలను, పాస్‌లు ఉన్నవాళ్ళని మినహాయించి, ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదు. 

అదే సమయంలో.. ధాన్యం సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి. నేను హెలీకాప్టర్‌ లో వస్తున్న సందర్భంలో రోడ్లమీద వడ్ల కుప్పలు ఆరబోసి కనిపించాయి. నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతరు. అందుకే ధాన్యం సేకరణ ప్రక్రియను సత్వరమే ముగించాలి’’ అని సీఎం కెసిఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను, ఇతర ఉన్నతాధి కారులను ఆదేశించారు. 

వీడియో కాన్ఫరెన్సులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో పేరు పేరునా సీఎం మాట్లాడారు. కరోనా, ధాన్యం సేకరణ, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాల మీద వారితో సమగ్ర చర్చ జరిపారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు జరగక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కఠినంగా అమలు చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు లాక్‌ డౌన్‌ను స్వచ్ఛందంగా అమలు చేస్తున్నారని, నగరాల్లో, పట్టణాల్లో మాత్రం లాక్‌ డౌన్‌ మరింత సమర్థవంతంగా అమలు కావాల్సి ఉందన్నారు. దీనిపై అందరూ దృష్టిపెట్టాలని సీఎం కేసీఆర్‌ కోరారు. లాక్‌ డౌన్‌ సమయం ముగిశాక ఉదయం 10.10 గంటల తర్వాత పాస్‌ హోల్డర్స్‌ తప్ప మరెవ్వరూ రోడ్డు మీద కనిపించకుండా డీజీపీ కఠిన చర్యలు చేపట్టాలన్నారు. 

 అదేవిధంగా జిల్లాల్లో మందుల సరఫరా ఎలా ఉంది?, ఆక్సిజన్‌ సరఫరా ఎలా ఉంది? అని సీఎం ఆరా తీశారు. మొదటి జ్వర సర్వేకు కొనసాగింపుగా.. రెండో విడత కూడా ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని సీఎం సూచించారు. హాస్పిటళ్ల పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడానికి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సహా అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలిచ్చారు. 

కోవిడ్‌ హాస్పిటళ్లలో సేవలందిస్తున్న అన్నిరకాల ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారు. వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సీఎం కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సూపర్‌ స్ప్రెడర్స్‌ (ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయాల వ్యాపారులు, సేల్స్‌ మెన్‌) తదితరులందరినీ గుర్తించి జాబితాను రూపొందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు.  వీరందరికీ వ్యాక్సినేషన్‌ చేసే విషయమై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. యాదాద్రి, నాగర్‌ కర్నూల్‌ తదితర జిల్లాల్లో కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గడం లేదని, వెంటనే ఈ జిల్లాలకు స్వయంగా వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని హెల్త్‌ సెక్రటరీ రిజ్వీని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.  ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే,  ధాన్యం సేకరణ కార్యక్రమం వెంటనే ముగించాలన్నారు. ఈ క్లిష్ట సమయంలో దవాఖానాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికీ సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలియజేశారు. 

జైలు స్థలంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం

 వరంగల్‌ పర్యటనలో భాగంగా.. ఎంజీఎం సందర్శన, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరంగల్‌ సెంట్రల్‌ జైలును నగర శివార్లకు తరలించి ఓపెన్‌ ఎయిర్‌ జైలుగా మారుస్తామని, అదే స్థలంలో సకల సౌకర్యాలతో అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌) నిర్మిస్తామని స్పష్టం చేశారు. వరంగల్‌ ఎంజీఎం దవాఖానాను విస్త్రృత పరిచి, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వైద్యం కోసం ఇక్కడికి వచ్చే విధంగా సకల సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దుకుందామన్నారు. అలాగే, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెంటనే పటిష్ట పరుచుకోవాలని సీఎం అన్నారు.  ఇక్కడి నుంచి తరలించే సెంట్రల్‌ జైలు కోసం నగర శివార్లలో విశాలమైన ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ సెంట్రల్‌ జైలును చర్లపల్లి ఓపెన్‌ ఎయిర్‌ జైలులాగా, ఖైదీల పరివర్తన కేంద్రంగా నిర్మించుకుందామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ దవాఖానాలో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు, కరోనా కట్టడి, ధాన్యం సేకరణ, లాక్‌ డౌన్‌ అమలు పై కూడా సీఎం కేసీఆర్‌ కూలంకంశంగా చర్చించారు.  

 ఈ పర్యటనలో సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.