మట్టెవాడలో, ఆ మిద్దె మీది అర్రలో…

శ్రీ మాడభూషి శ్రీధర్‌


1931వ సంవత్సరం. హన్మకొండ హైస్కూల్‌. ఆరో తరగతిలో చేరడానికి వచ్చినాడొక పది పదకొండేళ్ల బాలుడు. ఫీజు కట్టిన తరువాత మంచినీళ్లు తాగడానికి నీళ్లకుండ దగ్గరికి వచ్చినాడు.
నీళ్లుతాగడం పూర్తయిందో లేదో మరో బాలుడు కనిపించాడు. దాదాపు అదేవయసు అక్కడికి వస్తే మాటా మాటా కలిసింది. మాటే కాదు, ఇంటి పేరు కూడా కలిసింది. నీ పేరు అంటే పాములపర్తి నరసింహారావు అన్నాడు, అవునా నా పేరు పాములపర్తి సదాశివరావు అని చెప్పాడు. ఇంటి పేరువలెనే ఇద్దరూ కలిసిపోయారు. బంధుత్వం ఉందో లేదో కాని ఆ బంధం కొనసాగింది. చాలామంది వారు అన్నదమ్ముల పిల్లలని అనుకుంటారు. వీరు మాత్రం
అన్నదమ్ములకన్నా ఎక్కువే. బడి గంట కొట్టగానే మట్టెవాడలోఇంటికి తీసుకువెళ్లాడు సదాశివరావు. వరంగల్లులో భద్రకాళి చెరువుకు ఆ వైపు గాంధీ హాస్పటల్‌ వెనుక ప్రాంతం. అక్కడ ఫైర్‌ స్టేషన్‌ పక్కన ఒక చిన్న సందు. అందులో ఉంటుంది ఒక సామాన్యుడి ఇల్లు. అందులో చిన్నగది, దానికి ఎత్తైన మెట్లు. ఎప్పుడో పాతకాలంలో ఆ గది పైన కట్టిన గది. మట్టెవాడ ఇంట్లో మిద్దెమీది అర్ర.

మట్టెవాడ
పివి పట్టుబట్టి పోతన పంచశతి ఉత్సవాలు వరంగల్లులో భద్రకాళి చెరువు తీరాన పోతన నగర్‌ స్థాపించి మట్టెవాడ పరిసరాల్లోనే జరిపించారు.
ఆ మేడ పైనే సదాశివరావు జీవనంలో ప్రధానభాగం గడిచింది. పివి వరంగల్లు వస్తే ఆ మిద్దె మీదే ఉండే వారు. పోతన పంచ శతి ఉత్సవాలకు కేంద్రమంత్రి హోదాలో వచ్చినా అతిధి గృహాల్లో కాకుండా ఈ మిద్దెమీది అర్రకే వచ్చేవారు. అక్కడ ఏసీలు లేవు, ఫ్రిజ్‌లు లేవు. అతిధి గృహాల్లో ఫైవ్‌ స్టార్‌ హోటల్లో ఉండే విలాసాలు ఎందుకు ఉంటాయి. కాని వీరి స్నేహానుబంధం అక్కడ దొరకదుకదా. చెక్క కుర్చీలు నులక మంచాలు. ఆ మేడ గదిలో నులక మంచం మీద కూర్చొని పివి ఆ మధ్య అధ్యయనం చేసిన విదేశీ సాహిత్య ధోరణుల గురించి చెప్పడం తాను విన్నానని కోవెల సుప్రసన్నాచార్య ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

సదాశివరావుతోపాటు పివి ఆ పైకి ఎత్తుమెట్ల మీదుగా ఎక్కి అక్కడే ఉండేవారు. సదాశివరావుగారి భార్యకు కోపులకొద్దీ చాయ్‌ చేసి పైకి అందించడమే పని. కొడుకు నిరంజన్‌ కు ఆ చాయ్‌ లు తీసుకుపోవడమే పని.

జాతీయ కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శిగా పివి పార్టీ సభల్లో, ఇతర అధికారిక సమావేశాల్లో ఇందిరాగాంధీ చేయవలసిన ప్రసంగా పాఠాలలో చర్చించవలసిన విధానాలు, వాక్యాలు రూపొందేవి. అక్కడ ముడిసరుకు సదాశివ్‌ ఆలోచనల్లో దొరికేది. ‘ఇట్లా మనం రాసుకున్న మన ప్రసంగాలు మనమే చదివే రోజు వస్తుందంటావా’ అని పివి అడిగే వారట. కాని సదాశివ్‌ పివి ప్రసంగాలు పివి స్వయంగా చెప్పే రోజు చూడగలిగాడు. పివి ప్రధాని అయిన తరువాత.

అక్కడ పాములపర్తి ఆలోచనలు తీర్చిదిద్దింది వారిద్దరి స్నేహం, వారిద్దరి జీవితం. పాములపర్తి జంట ఆ గదిలో మాట్లాడుకున్న మాటలు, సాగించిన సమాలోచనలు, అక్షరరూపం దాల్చిన ఆ ఆలోచనలు, రూపుదిద్దుకున్న విధానాలు ఈ దేశానికి దిశానిర్దేశం చేశాయంటే నమ్ముతారా?

రాజ్యాధికారం ఆరంభమయ్యే ప్రాంతాన్ని రాజధాని అంటారు. కాని ఆ రాజ్య నిర్వహణకు, దేశక్షేమ విధానాలకు మూలమైన ఆలోచనలు జరిగే ప్రాంతం అసలు రాజధాని కాదూ? అయితే వరంగల్లు పట్టణం మట్టెవాడ మిద్దె మీది అర్ర కొన్నాళ్లు ఈ దేశానికి రాజధాని.

1940 – 50 దశకాలలో అదే బంగ్లా రూంలో నెలకు పది రోజులైనా నిదురించే వారు. అనేక గంటలు తమ గురువు గార్లపాటి రాఘవ రెడ్డి, కాళోజీ సోదరులు, ఇతర సాహిత్య ఉద్దండులతో చర్చా కార్యక్రమాలను నిర్వహించింది ఆ మిద్దె మీద అర్రలోనే.

ఇదే బంగ్లా గదిలో… తన మేధా సంపత్తిని దేశమంతా తలా కొంచెం పంచి ఇచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి పీ వీ గారికి ఆ గదితో ఉన్న సాన్నిహిత్యం అంతులేనిది.

‘కాకతీయ’ రోజులు
పాములపర్తి సదాశివరావు సంపాదకత్వంలో కాకతీయ పత్రిక వచ్చేది. ఆ పత్రిక ముద్రణాలయం, పత్రిక కార్యాలయం సదాశివ రావు ఇంటి ముందు గదుల్లో వుండేవి, పైన వున్న మిద్దె గదిలో సదాశివ రావు మామూలుగానే రచనా వ్యాసంగం, అక్కడే స్నేహితులతో చర్చా గోష్టులు.
కాకతీయ పత్రికలో పివి వ్యాసాలు రాసేవారు. ఎడిట్‌ చేసేవారు. చందాదారులను చేర్పించే పని చేసేవారు. అప్పట్లో పత్రికలకు పోషకులు చందాదారులే. అంటే సంవత్సరానికి పత్రికలు తెప్పించుకోవడానికి ముందే డబ్బు ఇవ్వడం. దాంతో సర్క్యులేషన్‌ స్థిరమై పోయేది. కొంత ఆదాయం సమకూరేది. ఈ పత్రికలోనే పెండెం శ్రీనివాసరావు, ‘ఆంధ్రప్రభ’లో ఆ తరువాత సీనియర్‌ సంపాదకుడైన పి ఎన్‌ స్వామి, చలసాని ప్రసాదరావు వ్యాసాలు రాస్తూ ఉండేవారు.

మా నాన్నగారు ఎం ఎస్‌ ఆచార్య విలేకరిగా ‘కాకతీయ’లో వార్తలు రాసేవారు. ఆ విధంగా నాన్న, పివి, ఇతర పాత్రికేయులు కాకతీయలో సహ పాత్రికేయులు.

ఓ నెలలో అయిదారుసార్లు పీ వీ రావడం. వచ్చినప్పుడు ఒకటో రెండు రోజులు మకాం వేయడం, కాళోజీ సోదరులతో వారానికొకసారి కవితా గోష్టులు. రోజంతా అక్కడే! కాలం గడిచిపోతూనే ఉండేది. అది ఆలోచనలు కొలువుదీరిన చోటు.

పాములపర్తి యువకుల వాహ్యాళి
ఇద్దరు పాములపర్తి ఆలోచనలు ఆ భద్రకాళి గుట్టల మధ్య, చెరువు గట్లమీద, గుడి మెట్ల పైన, మట్టెవాడ పోలీసు స్టేషన్‌ పక్కన సందులోంచి ముందుకు పోతూ ఉంటే చెరువు తీరం. మళ్లీ రోడ్డు మీదకు వస్తే జై భారత్‌ సినిమా టాకీస్‌ (ఇప్పుడు అక్కడే రాంలక్ష్మణ్‌ సినిమాహాల్స్‌
ఉన్నాయి). దాని ముందు మిర్చి బజ్జీలు కొనుక్కుని తింటూ కాలక్షేపం. హనుమకొండ దాకా నడిస్తే కూచోమని పిలిచే రాతి సోఫాలు, అందమైన స్తంభాలు. నంది, మంటపాలు, వేయిస్తంభాల గుడి.

మరోసారి పద్మాక్షమ్మ గుట్ట, ఇంకోసారి గోవిందరాజు గుట్ట, సిద్ధేశ్వరాలయం, వరంగల్లు అండర్‌ బ్రిడ్జిదాటి ముందుకు పోతే వరంగల్లు కోట, మెట్టుగుట్ట వారు తిరగని ప్రాంతాలు లేవు. వాడలు లేవు. కోటలు లేవు, బాటలు లేవు. దారివెంట మాటలు…చర్చలు వాదాలు వివాదాలు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, విషయం ఏమిటి, సిలబస్‌ ఏది అనే పరిమితులే లేవు. సదాశివ్‌ -నరసింహారావు. 1944- 45 మధ్యకాలం. పాత బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా దృశ్యాల వలె. వారి చిన్నతనంలో ముద్రించిన జ్ఞాపకాలు ముద్రలు.

బస్తీ పోయి రావడం
ఇద్దరు పాములపర్తి యువకులు ఎప్పుడైనా ఓసారి చెరో 5 రూపాయలు తీసుకొని హైదరాబాద్‌ పాసెంజర్‌ బండి ఎక్కడం, నాంపల్లి స్టేషన్లో దిగి ఎదురుగా రాయల్‌ హొటలో లేదా నాంపల్లి షరాయిలో రెండు రోజులు మకాం పెట్టడం. ఇష్టమైన పాన్‌ బీడా వేసుకోవడం, ‘టివోలీ’ ‘లైట్‌ హౌస్‌’ థియేటర్లలో సినిమాలు చూడడం. పబ్లిక్‌ గార్డెన్‌, టాంక్‌ బండ్‌, కోఠిలో నడుస్తూ మాట్లాడుకుంటూ … మళ్ళీ పాసెంజర్‌ ట్రైన్‌ ఎక్కి వరంగల్‌ చేరడం, అప్పటికి ఇంకా ‘చారాణా’ (నాలుగణాలు) మిగిలేదట!

శృతిలయలు
పీవీ ‘‘ఏక సంథాగ్రహి’’ చూసిన సినిమాల్లోని పాటలను ఇంటికి రాగానే ఎంతో రాగ యుక్తంగా పాడేవారని సదాశివరావు చెప్పేవారు.

ఇద్దరూ హర్మనీ పెట్టె, తబలా కొనుక్కొన్నారు. ఇద్దరూ సంగీత సాధన చేసే వారు. బాల్యంలో నేర్చుకున్న ఆ సంగీత సాధనే వారిని పెద్దపెరిగిన తరువాత క్లాసికల్‌ సంగీతం (ముఖ్యంగా హిందుస్తానీ సంగీతం) పై గొప్ప పట్టు సంపాదించి పెట్టింది. వివిధ సంగీత రాగ, తాళాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయించింది. చాలా గొప్ప కళాకారుల సంగీత ప్రదర్శన బాగోగులపై సమీక్షించి, చర్చించి, విమర్శించేదాకా సాగింది. శాస్త్రసంగీత విమర్శనా శీలురైనారు.

రాజకీయాల్లో ఒడుదొడుకులు చూస్తూ ముందుకు సాగిపోతున్న దశలో ఈ ఇద్దరు మిత్రులు దూరమైపోవడం సహజమే. కాని సంగీత సాహిత్య అభిరుచులను పంచుకోవడంలో ఈ దూరం వారిని దూరం చేయలేదు. 1981 ప్రాంతంలో సదాశివ రావు ఆచార్య బృహస్పతి అనే ఒక పెద్ద సంగీత విద్వాంసుడు రాసిన ఒక పుస్తకం చదివి అందులో కొన్ని అంశాలపై రచయిత వివరణలు కోరుతూ ఒక ఇన్‌ లాండ్‌ లెటర్‌ ను ఆ పుస్తక ప్రచురణకర్తకు రాశారు. పివి ఆ లేఖను ఢల్లీలోని ఆ రచయిత ఇంటికి పంపారు. కానీ అప్పటికే ఆయన నిర్యాణం చెందారు. ఆయన సతీమణి శ్రీమతి సులోచనా బృహస్పతి తాను కూడా సంగీత విదూషీమణి. సదాశివ్‌ కోరిన వివరణలిస్తూ, ఆ విధంగా విమర్శ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ పుస్తక మలి ప్రచురణలో ఈ విషయాలు పొందుపరుస్తామని లేఖ రాశారట.

ఈ లేఖా పరిచయాన్ని ఉటంకిస్తూ సదాశివ రావు ఆమె అడ్రస్‌ తెలియజేస్తే ఆమెకు ఇంటర్వ్యూ ఇవ్వమని పి వి కి సూచించారు మరో ఇన్లాండ్‌ లెటర్‌లో.

అప్పుడు విదేశాంగ మంత్రిగా ఉన్న పీ వీ తన ఇంట్లోనే ఆమె సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, వరంగల్‌ 1982 లో పోతన పంచశతి ఉత్సవాలలో పివి ఆహ్వానం పై ఆమె వచ్చి పాట కచేరీ చేశారు. వారి శాస్త్రీయ సంగీత అభిరుచికి ఈ సంఘటన ఒక మచ్చుతునక.
వరంగల్లులో చాలా కాలం ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేసి ఇటీవలే పరమపదించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ వీ ఎల్‌ నరసింహారావు పివికి బంధువు. 1982లో ఆయన వరంగల్‌లో జనప్రియ గాన సభను నెకొల్పారు. ఆ సమితిని పివి స్వయంగా ప్రారంభించి నేదునూరి కృష్ణమూర్తి కర్ణాటక గాత్ర కచేరీని మిత్రుడు సదాశివ రావుతో కలిసి, రాజకీయాలను పక్కన బెట్టి చాలాసేపు ఆస్వాదించారు.

వరంగల్లులో ఉపాధ్యాయ ఉద్యమాల నాయకుడు, కొండబత్తిని జగదీశ్వరరావు మాటల్లో… ‘‘కాకతీయ కళా సమితి కార్యక్రమాల్లో పీవీ కూడా అప్పుడప్పుడూ పాల్గొనేవారు. పీవీ తబలా వాయిస్తే, సదాశివరావుగారు హార్మోనియంపై అరుదైన రాగా గమకాల్ని తమ గొంతులో పలికించేవారు. ఆ దృశ్యం ఎంతో కమనీయంగా వుండేది’’. అసలు ఊహించగలమా పివి తబలా వాయించడం, పాడడం, హార్మనీతో స్వరాలు కలపడం.

పివి అభిమాన సంఘం
సదాశివరావు సూచన కనుగుణంగా అప్పటి రోటరీ గవర్నర్‌, విఖ్యాత వైద్యులు ఐ. వెంకట్‌ రావు అధ్యక్షతలో మిమిక్రీ సుప్రసిద్ధుడు నేరెళ్ళ వేణు మాధవ్‌, డాక్టర్‌ సంపత్‌ రాజారాం, ముదిగొండ వీరభద్ర రావు, ప్రొఫెసర్‌ జె రాఘవేందర్‌ రావు మరి కొందరు ప్రముఖులు సభ్యులుగా 1983లో వరంగల్‌లో పీవీ అభిమాన సంఘం ఏర్పడింది, దీని ఉద్దేశం ప్రతి ‘నాయకునికీ – నియోజకవర్గానికీ ఒక అనుసంధాన కార్యాలయం వుండాలి. నియోజకవర్గ ప్రజల సమస్యలను నాయకుని దృష్టి లోనికి తీసుకొని పోయి ఆ సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఉపయోగపడాలన్నది.
మిత్ర సంపద
పివి ఒక్కడే కాదు. ఆ మిద్దెమీది గది మెట్లెక్కిన మిత్రులెందరో. పక్షం రోజులకు ఒక్కసారైనా విచ్చేసే కాళోజీ సోదరులు, అడవా సత్యనారాయణ, డాక్టర్‌ టీ యెస్‌ మూర్తి, అజంజాహీ మిల్లు కార్మిక నాయకులు ఎందరో. మూడునెలలకోసారి వచ్చి సదాశివ్‌తో నాలుగైదు గంటలు గడిపేవాడు పివి. వీరిద్దరూ జయవిజయలు అని సదాశివ్‌ తనయుడు నిరంజన్‌ వర్ణించారు. వీరిని వీనుల విందు చేసే అవకాశం వచ్చినందుకు తన జీవితం ధన్యమని నిరంజన్‌ వివరించారు.

అలనాటి ప్రముఖుడు, దళిత ఉద్యమ రచయితా, లోహియా భావ జాలపు మేధావి జి. సురమౌళి. అసెంబ్లీలో అనువాదకుడిగానూ, రేడియోలో వార్తలు చదివే ఆంకర్‌ గానూ పనిచేసేవారు. పివి ని తరచు కలిసే మిత్రుడు.

మట్టెవాడలో సదాశివ రావు దగ్గరకు వచ్చే డాక్టర్‌ టీ యెస్‌ మూర్తి పివికి ఇష్టమైన వ్యక్తి. మూర్తి వరంగల్లు నుంచి స్వతంత్ర ఎంఎల్యేగా ఎన్నికైనారు.

వరంగల్లులో రవివర్మ ఫోటో స్టూడియో ఎఱుగని వారు ఉండరు. రవివర్మ తీసిన అమ్మానాన్న ఫోటో, తాతగారి ఫోటో, చిన్నారి పిల్లల ఫోటో ఫ్రేం లేని ఇల్లు వరంగల్లులో నాకు తెలిసి లేదు. మా నాన్నగారి ‘జనధర్మ’ వారపత్రికలో ప్రతివారం మొదటి పేజీలో చిన్న అడ్వర్టయిజ్‌మెంట్‌ రవివర్మ స్టూడియో గురించి ఉండేది. కొన్నాళ్లకు ఆ ప్రకటన చివరి పేజికి మారింది. నేను ఎందుకని నాన్నను అడగలేదు. హమ్మో. నాన్నను అడగడమా అని. వెళ్లి రవివర్మ స్టూడియో యజమాని బిట్ల నారాయణనే అడిగాను. అంత చనువు ఇచ్చారాయన నాకు. ‘జనధర్మ’ పేరు పక్కనే రవివర్మ అంటే బాగుండదని మార్చానన్నాడట నాన్న. నాన్న చిత్రాన్ని అనేక సంవత్సరాలపాటు పెయింట్‌ చేసి ఇచ్చిన బిట్లనారాయణని మరిచిపోవడం సాధ్యం కాదు.


సదాశివరావు, పివి, కాళోజీని కలిపి ఆయన తీసిన ఒక్క స్టిల్‌ ఫోటో ముగ్గురు ప్రముఖులు స్నేహాన్ని వివరించే కావ్యం. పివి నచ్చిన ఆర్టిస్టు బిట్ల నారాయణ.

జనధర్మ అభినందన
జనధర్మ వారపత్రిక పివి నరసింహారావు అభినందన సంచికను ప్రచురించింది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన నాటి సంఘటన నాకింకా గుర్తు. ముఖ్యమంత్రి నరసింహారావు ఓ మోస్తరు పెద్దగదికి వచ్చారు. జనధర్మ ముద్రించే జగదీశ్వర్‌ ప్రెస్‌ దగ్గర సన్మాన సభావేదిక. అక్కడ హడావుడి, ఆడంబరాలు ఏమీ లేవు. దారాలో కూర్చిన పూల మాలలు, ఓ శాలువా, అంతకు మించి కొందరు పెద్దలు ఆత్మీయంగా మాట్లాడిన మాటలు. ఎంత సీదా సాదా సన్మానం, ఎంత మనసైన అభినందన. ఈ నాటి గజపూలమాలల సన్మానాలతో పోలికే లేదు. ఆ అభినందన సంచికలో సుదీర్ఘమైన వ్యాసం రాసింది పాములపర్తి సదాశివరావు.

కోవెల సుప్రసన్నాచార్యులు, డాక్టర్‌ ఐ వెంకట్రావు, ముదిగొండ వీరభద్రరావు, సంపత్‌ రాజారాం రాజకీయాలతో సంబంధంలేని అనేక మంది మిత్రులు పివికి వరంగల్లులో ఉండేవారు.

పోయిరండి
పివి నరసింహారావు అప్పుడు విదేశాంగ మంత్రి. 1986లో సార్క్‌ సమావేశానికి బెంగుళూరులో భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. అంటే పి వి నరసింహారావు బాధ్యత అతిథి సత్కారం చేయడం. ఆ తరువాత 1995లో ప్రధానిగా ఉన్నపుడు సార్క్‌ ఎనిమిదో సమావేశం జరిగింది. ఆతిథ్యం ఇచ్చే దేశపు అధినేత హోదాలో పి వి వీడ్కోలు సందేశం ఇవ్వాలి. ‘‘ఎవరైనా అతిథి ఇంటికి వచ్చి వెళితే తెలుగులో పొమ్మని చెప్పం, పోయి రండి అంటాం. మీరు కూడా పోయి రండి’’ అని ముగించారు. దేశాధిపతుల కళ్లు నీటి చెలమలయినాయి.

ఎర్త్‌ 1992 సమావేశంలో పర్యావరణంపైన ప్రసంగం కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది.

ప్రకృతిని గౌరవించడం మా సంస్కృతి. పొద్దున్నే నిద్రలేచి మంచం దిగి నేను కాళ్లతో తొక్కేముందు భూమి తల్లికి మొక్కి, ఈ శ్లోకం చదువుకుంటాం.

‘‘సముద్రవసనే దేవి పర్వతస్తన మండితే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే….’’

విష్ణుదేవి పత్నివి, సముద్రాన్ని చీర గా కట్టుకున్నదానివి, పర్వతములే ఎదగా ఉన్నదానివి, నిన్ను కాళ్లతో తాకుతున్నాం, క్షమించు తల్లీ. ఇది ఎంతో సంచలన వార్తగా ప్రపంచ పత్రికలో ప్రచురితమైంది. నేలతల్లిని, తనకు జన్మనిచ్చిన తల్లిని కూడా ఆయన నిరంతరం తలుచుకునే వారు. ‘ఢల్లీకి రాజైనా తల్లికి కొడుకే’ అని పి వి నరసింహారావు పదే పదే అనేవారు. భారతదేశపు అనర్ఘ రత్నమైన పివి వరంగల్లు సాన బెట్టిన వజ్రం.