|

మత్తడి దుంకిన తెలంగాణ జల కవితోత్సవం

tsmagazine
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన బృహత్‌ కవి సమ్మేళనం మరిచిపోకముందే అదేస్థాయిలో, అదే ఉత్సాహంతో, అదే స్ఫూర్తితో వనపర్తి జిల్లా కేంద్రంలో ‘తెలంగాణ జలకవితోత్సవం’ రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. వందలాదిమంది కవులు పాల్గొని తమ జలకవిత్వాన్ని వచన, గేయ, పాట ప్రక్రియలలో వినిపించారు. కవుల కలాలు కురిపించిన కవిత్వ ధారలతో వనపర్తి తడిసిముద్ద అయ్యింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తెలంగాణకు ఒక ఆకుపచ్చని జ్ఞాపకమైంది.

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందుకు వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆ దిశలో సాగుతున్న ప్రయత్నాల తొలి ఫలాలు పాలమూరు వాసులకు అందుతున్నవి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రారంభమై లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసి వలసపోయిన జనాలు తిరిగి తమతమ గ్రామాలకు వచ్చేటట్లు చేసింది.

తెలంగాణ వికాస సమితి, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో కవులు, రచయితలు మూడు దశాబ్దాల అనంతరం నిండిన గణప సముద్రం చెరువును సందర్శించి రైతుల మనోభావాలు తెలుసుకున్నారు. నీళ్లతోనిండిన గణపసముద్రము లాంటి చెరువులు కవులకు కవితా వస్తువులయ్యాయి. పచ్చని పంట పొలాలవంటి కవిత్వం రావడానికి కారణమయ్యాయి.

రాష్ట్రంలోని అన్నిజిల్లాలనుండి దాదాపు 500మందికి పైగా పాల్గొన్న కవులకు వనపర్తి పాలిటెక్నిక్‌ కళాశాలలోని సురవరం ప్రతాపరెడ్డి వేదికతోపాటు మరి తొమ్మిది వేదికలలో వారివారి కవిత్వాన్ని వినిపించే అవకాశమిచ్చాయి. అష్టభాషా బహిరీ గోపాలరావు, రాణి శంకరమ్మ, గోన బుద్ధారెడ్డి, దున్న ఇద్దాసు, కుప్పాంబిక, సురభిమాధవరాయలు, మానవల్లి రామకృష్ణకవి తెల్కపల్లి రామచంద్రశాస్త్రి, వల్లపురెడ్డి బుచ్చారెడ్డివంటి ప్రముఖ కవి పండితుల పేర్లను ఉప వేదికలకు ఉంచడం ఎంతో ఔచిత్యం. హైదరాబాద్‌నుండి వచ్చే కవులకోసం రవీంద్రభారతినుండి రెండు బస్సులను ఏర్పాటు చేశారు.

ప్రారంభసభలో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. వనపర్తికి జలకళతోపాటు కవులరాకతో కవిత్వకళ వచ్చిందని, తెలంగాణ ఉద్యమంలో కవులపాత్రను

మరువలేమని, జల కవితోత్సవం చరిత్రలో నిలిచిపోతుందని, ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఎడారిగా మారిపోయిన ప్రాంతానికి నీళ్లు అందించే భాగ్యం తనకు కలిగిందని అన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ, అచిరకాలంలోనే కర్నూలు బియ్యంపోయి వనపర్తి బియ్యం వస్తాయని, చరిత్రను తిరగ రాస్తాయని, కృష్ణా జలాలు బిరబిరా పారడంతో ఆరు దశాబ్దాలుగా బీడువారిన పాలమూరు పొలాల దప్పిక తీరిందని, త్వరలోనే పల్లెపల్లెతోపాటు అన్ని పట్టణాలకు తాగునీరు అందుతుందని, ఆనందభాష్పాలతో ప్రతి తెలంగాణ గడప కళకళలాడుతుదని అన్నారు.

తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ, జల ప్రాధాన్యంపై కవులు స్పందించడం సమాజంలోని మార్పుకు అద్దం పడుతున్నదని, కవితలను పుస్తక రూపంలో తీసుకురావడం ఆనందదా యకమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జల కవితోత్సవంలో సాంస్కృతిక విప్లమొచ్చిందని బి.సి. కార్పొరేషన్‌ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌ అన్నారు.

చక్కని ప్రణాళిక, తెలంగాణ రుచులతోకూడిన భోజనం, నిరంతరంగా అందించిన చల్లని మజ్జిగ వలన కార్యక్రమం సజావుగా జరిగింది. కవులకు, ముఖ్య అతిథులకు జ్ఞాపిక, శాలువా, సర్టిఫికెట్‌లతో ఘనంగా సన్మానం చేశారు. ఆహ్వాన సంఘం సభ్యు లైన డా|| వీరయ్య, నాగవరం బలరాం, మల్యాల బాలస్వామి, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, డా|| భీంపల్లి శ్రీకాంత్‌, డా|| గుంటి గోపి, వనపట్ల సుబ్బయ్య, డా|| ఎ. జయంతిల పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రస్థాయి జల కవితోత్సవం దిగ్విజయం అయ్యింది.

సంబరాజు రవిప్రకాశరావు