|

మనది పతార ఉన్న రాష్ట్రం శాసనసభలో సీఎం కేసీఆర్‌


రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని, అప్పులు తీర్చే సామర్ధ్యం ఉన్న రాష్ట్రాలకే అప్పులు ఇస్తారని, మనకు పతార ఉండడం వల్లనే అప్పులు వస్తున్నాయనే విషయాన్ని ప్రతిపక్ష సభ్యులు గమనించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేర్కొన్నారు. అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై ఆయన సవివరంగా సమాధానమిచ్చారు. అప్పులు చేయడం అభివృద్ధి కోసమేనని, ఆ అప్పులు తీర్చే ఆర్థిక స్థోమత కూడా రాష్ట్రం కలిగి ఉందని సీఎం స్పష్టం చేశారు. బ్యాంకులు కొద్ది మొత్తంలో అప్పులు కావాలంటేనే ఎన్నో పత్రాలను పరిశీలిస్తాయని, అలాంటిది వేలకోట్ల అప్పులు ఇచ్చేటప్పుడు ఆయా సంస్థలు ఎంతో నిశితంగా పరిశీలించి కానీ అప్పులు ఇవ్వవని అన్నారు. వాటి గైడ్‌లైన్స్‌ అన్నీటికీ మన రాష్ట్రం సరిపోవడం వల్లనే అప్పులు వస్తున్నాయన్నారు. తాను తిరిగి ముఖ్యమంత్రి కాగానే రెండు మూడు రోజులకే పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ వాళ్ళు 15వేల కోట్లు అప్పు ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు. ఇది మన తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న పతార అని సీఎం పేర్కొన్నారు. తాము ఎఫ్‌ఆర్‌బిఎం పరిధి దాటి అప్పులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారని, తాము ఆ పరిధులు దాటలేదని స్పష్టం చేశారు. మనకున్న స్థోమతను బట్టి ఇంకా 1.18 లక్షల కోట్లు అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉందని, వాటిని కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. మనకున్న విశ్వసనీయతను బట్టి 25 సంవత్సరాల బాండ్లు కూడా అమ్ముడుపోయాయని తెలిపారు. జపాన్‌, అమెరికా లాంటి దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయని పేర్కొన్నారు.

రైతుకు నేరుగా రుణమాఫీ

రైతుబంధులో కౌలురైతుల గురించి అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిస్తు కౌలురైతులంటూ ఉండరని, కేవలం భూమి పట్టేదార్లే ఉంటారని, వారే అసలైన రైతులని అన్నారు. వారికే తాము రైతుబంధు ఇస్తామన్నారు. పట్టేదారులైన అవసరమైతే మానవతా దృక్పథంతో తమ భూమి కౌలు తీసుకున్న వారికి ఇవ్వాలని, అది వారిద్దరి మధ్య అవగాహన అని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో ఇల్లు కిరాయికి ఇచ్చిన వ్యక్తి తన ఇల్లు కిరాయదారుకు రాసి ఇస్తారా అని ప్రశ్నించారు. అందుకే తాము గతంలో పహాణీలో ఉన్న 36 కాలంలు తీసివేసి కేవలం మూడు కాలంలే ఏర్పాటు చేశామన్నారు. దాని ప్రకారమే పాసుపుస్తకాలు ఇచ్చినట్లు తెలిపారు. రుణమాఫీని కూడా నాలుగు విడతలుగా చేస్తామన్నారు. వడ్డీ భారం పడకుండా చూస్తామన్నారు. ఈ రుణమాఫీ చెక్కుల ద్వారా నేరుగా రైతులకే చెల్లిస్తామన్నారు. తాము ఎప్పుడు రైతు పక్షపాతిగానే ఉంటామన్నారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా 500 మంది ఉన్న గ్రామపంచాయతీలకు కూడా 8 లక్షల రూపాయలు వచ్చే విధంగా చూస్తామన్నారు. ఉపాధిహామీ నిధులు కూడా పంచాయతీలకే ఇస్తామన్నారు. ఇవికాక పంచాయతీల సొంత ఆదాయం అదనంగా ఉంటుందన్నారు. గ్రామాలకు రూ. 50వేల కోట్ల నిధులు అభివృద్ధి పథకాలకు ఖర్చు చేయనున్నట్లు సీఎం తెలిపారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

బిల్లుల ఆమోదం

మొదటి రోజు సీఎం కేసీఆర్‌ సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టగా, రెండవ రోజు సభలో పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు, జీఎస్‌టీ బిల్లుకు, అడవుల సంరక్షణ చట్ట సవరణ బిల్లులను సభ ఆమోదం తెలిపింది.