|

‘మరణం చివరి చరణం కాని కవి’ అలిశెట్టి ప్రభాకర్‌

-అట్టెం దత్తయ్య


చిత్రకళది అంతర్జాతీయ భాష. కవిత్వానిది ప్రాదేశిక భాష. కవిత్వంలో కొంత చిత్రలేఖనం, చిత్రలేఖనంలో కొంత కవిత్వం మిళితమై ఉంటాయి. చిత్రం రూపానందాన్నిస్తే, కవిత్వం రసానందాన్నిస్తుంది. ఈ రెండింటిలో వ్యంజన – రంజన నిగూఢంగా ఉంటాయి. చిత్రకారుడు బాహ్య ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా చిత్రించగలడో కవి కూడా అంత:ప్రపంచాన్ని అంతే అద్భుతంగా చిత్రించగలడు. మొత్తంగా ఏ కళ అయినా మానవ జాతికి మేలు చేసేదిగా ఉండాలి. జీవిత సమరంలో మనిషికి దారి చూపడమే ముఖ్య కర్తవ్యంగా కళ కొనసాగాలి. అచ్చంగా ఇలాంటి చిత్రాలను గీసి, కవితలను రాసి అందరి హృదయాలను చొరగొన్న కవి, చిత్రకారుడు అలిశెట్టి ప్రభాకర్‌.

జనవరి 12, 1954న అలిశెట్టి ప్రభాకర్‌ జన్మించాడు. తల్లి లక్ష్మి, తండ్రి చిన్నరాజం. ప్రభాకర్‌ తోబుట్టువులు మొత్తం ఆరుగురు అక్కా చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మధ్యతరగతి నేత కుటుంబం. ప్రాంతం కరీంనగర్‌ జిల్లా, ముకురంపుర గ్రామం. ఎక్కువ కాలం నివాస స్థలం జగిత్యాల. ప్రభాకర్‌ పదవ తరగతిచదువుతున్న రోజుల్లోనే తండ్రి మరణించాడు. బంధువుల నీడలో ఇంటర్‌ పూర్తి చేసుకున్నాడు. ఒకనాటి బస్సు ప్రయాణంలో అన్ని సర్టిఫికేట్లను పోగొట్టుకున్నాడు. పోయిన వాటిని తిరిగి పొందే మార్గం తెలియక, సహకరించేవారు లేక, అన్నింటిని మించి వాటిగురించి పెద్దగా శ్రద్ధ పెట్టక చదువుకు, సర్టిఫికేట్లకు ఆరోజుతో నీళ్ళొదినట్లయింది. ఆయనకు జీవితంమీద, శరీరంమీద, తిండిమీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేదేకాదు. చిత్రలేఖనం, కవిత్వం, మిత్రులు ఈ త్రికంతోనే కాలంగడిచిపోయింది. తన పెళ్ళి కూడా చెల్లెలు పెండ్లి మండపంలోనే తాను ఇష్టపడిన, తనను ఇష్టపడిన ‘భాగ్య’ మెడలో తాళికట్టి ఆ బీదరాలిని ఇల్లాలిని చేసుకున్న నిరాడంబరుడు.


చిన్నప్పటినుండి చిత్రలేఖనంపై మక్కువ ఎక్కువ. ప్రారంభంలో పత్రికల్లో వచ్చే సినిమా బొమ్మలు వేస్తూ కాలం గడిపేవాడు. తర్వాత పండుగల చిత్రాలు, ప్రకృతి దృశ్యాలు, సినీనటుల బొమ్మలు వేస్తూ వివిధ పత్రిల దగ్గరినుండి కొంత పారితోషికం పొందుతూ ఆనందించేవాడు. ఇట్లా బొమ్మలు వేసి వేసి విసిగిపోయి కవిత్వ ప్రపంచంలోకి అడుగిడినాడు. తనలో ప్రారంభంనుండి పాతుకుపోయిన పాత కళను కొన్ని సంవత్సరాల తర్వాత కవితకు తోడు చేసి ‘కవితాచిత్రాలు’ ప్రారంభించాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలలో ఇవి ప్రదర్శింపబడినాయి. ఈ ‘కవితాచిత్రాల’ ప్రదర్శనల ద్వారా విశేషమైన ఆదరణ పొందాడు.

కొడుకు భవిష్యత్తుమీద భయం కలిగిన ప్రభాకర్‌ తల్లి అతని ఆలోచనలకు తగ్గట్టుగా ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి పంపించింది. మూడు నాలుగు నెలల్లో ఫోటోగ్రఫీ మీద మంచి పట్టు సాధించాడు. స్టూడియోలు పెట్టుకున్నాడు. అవి తర్వాత కాలంలో మిత్రుల చర్చావేదికలుగా, కవిత్వ కార్యశాలలుగా కూడా ఉపయోగపడ్డాయి. ఈ ఫోటోగ్రఫీ వృత్తి ప్రభాకర్‌ జీవన చరమాంకం వరకు కొనసాగింది. ఈ వృత్తి ఎంతోకొంత ఆకలిని తీర్చింది. కుటుంబపోషణకు తోడ్పడింది. ప్రాంతాలు మారినా పనిని మాత్రం మార్చకుండా వివిధ పేర్లతో కొనసాగించాడు. జగిత్యాలలో ‘స్టూడియో పూర్ణిమ’ (1975) కరీంనగర్‌లో ‘స్టూడియో శిల్పి’ (1979), హైదరాబాద్‌లో ‘స్టూడియో చిత్రలేఖ’ (1983) పేర్లతో స్టూడియోలు స్థాపించుకున్నాడు.

జగిత్యాలలో గల ‘సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో అలిశెట్టి ప్రభాకర్‌ కవిత్వ రంగంలోకి ప్రవేశించడం సాహితీ లోకపు అదృష్టం. ప్రారంభ దశలో ప్రభాకర్‌ కవిత్వంలో ఏ భావజాలమూ, ఎటువంటి సిద్ధాంత ప్రతిపాదనలూ కనబడవు. మానవ సంస్కరణ, సమస్యలను గురించి ప్రశ్నించే తీరు మాత్రమే కనిపించేది. ఈ తరుణంలోనే 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ‘పరిష్కారం’ అనే కవిత ప్రచురితమైన మొదటి కవిత. అలిశెట్టి ఈ విధమైనా కవితా ప్రస్థానం కొన్ని గ్రంథాల ప్రచురణకు మార్గం వేసింది. అవి: ఎర్ర పావురాలు (1978), మంటల జెండాలు (1979), చురకలు (1979), రక్తరేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభ గీతం (1990), సిటీలైఫ్‌ (1992) వంటి పుస్తకాలు వెలుగు చూశాయి.

అలతి అలతి పదాలలో లోతైనా అర్థాలను ఇమిడ్చి, పొట్టి పాదాలుగా కవితలను పొందుపర్చిన కవి అలిశెట్టి ప్రభాకర్‌. శ్రమను నమ్ముకున్నవాడు. శ్రామికుడికి ఫలితం దక్కాలని కాంక్షించి, కవిత్వం రాసిన వ్యక్తి. నిరంతరం సమాజం కోసం తనువును సైతం లెక్క చేయకుండా కవిత్వమే ఊపిరిగా తపించినవాడు

”ఒక చెమట బిందువుని / విపులీకరిస్తే

ప్రతిఫలిస్తాయెన్నో / కళాఖండాలు…” చెమట బిందువు వెనుక ఎంతటి కష్టం, కళ దాగుంటుందో దాని ఆంతర్యం తెలిసిన వాడు. విపులీకరించగల సామర్థ్యం ఉన్నవాడు. చెమటబిందువుకు ముందు శ్రమను దర్శించి, చెమట బిందువు ఆనందంతో అనుభవాన్ని పూరిస్తుందని చెప్పిన అలిశెట్టి యొక్క నాలుగు పాదాల కవిత ఒక కళాఖండం. చెమట బిందువు వాసన పసిగట్టిన కవి కన్నీటిబొట్టు వేడిని కూడా తడమకుండా వదలలేడు. చెమట బొట్టును విపులీకరిస్తూనే, కన్నీటి బొట్టును తత్త్వాన్ని పరిశోధించారు. శ్రమ భౌతికంగా బయటకు కనిపిస్తుంది కాబట్టి విపులీకరణ గురించి లోతుగా ఆలోచిస్తాడు. బాధ అంతర్గతం, ఆలోచనాత్మకం కాబట్టి పరిశోధన అంటాడు. విపులీకరణ, పరిశోధన తారతమ్యాలు తెలిసిన మార్మిక కవి అలిశెట్టి ప్రభాకర్‌. ”ఒక కన్నీటి బొట్టుని / పరిశోధిస్తే / పరిధే దొరకదు మరి / బాధలకు” అంటాడు. శ్రామికుడు లేకుంటే సమాజం లేదు. శ్రామికుడే అంతస్తులను, ఐశ్వర్యవంతులను తయారు చేస్తున్నాడని నమ్మినవాడు. ”అంతస్తూ ఐశ్వర్యం / శ్రామికుడి భిక్షం / నా దృష్టిలో ధనమదాంధుడే / అడుక్కుతినేవాడు…” మరి శ్రామికుడు దరిద్రుడిగానే ఎందుకు మిగిలిపోతున్నాడు? అని తీవ్ర స్వరంతో పిడికిలి బిగిస్తాడు. ఈ క్రమంలోనే దోపిడిదారి విధానం, పెత్తందారి వ్యవస్థ నిలదీతను కవిత్వీకరించిన కవి అలిశెట్టి ప్రభాకర్‌.


కవిగా ప్రభాకర్‌ అణగారిన జనాల ఆకలిని చిత్రించిన విధానం అద్వితీయం. కొన్ని తరాలనుండి ఆకలి కొందరికి, ఆయాసం మరికొందరికి తప్పని సొత్తుగా వస్తున్న విషయం తెలిసిందే. ఆకలిని కవిత్వీకరించి ”అత్యధికంగా / అత్యద్భుతంగా/ అస్థిపంజరాల్ని / చెక్కె ఉలి ఆకలి…” అంటాడు. మరోకవితలో ”అందంగా / తోకాడించే / కుక్కపిల్లలాంటిది / కాదు / కుట్టిన / ఎర్రతేలు మంటలాంటిది / ఆకలి” అనడంలో ఎందరి బీదల, కష్టజీవుల కడుపు బాధలను పంచుకుని జాలి చూపుతూ హృదయాలను కరిగించేంతటి కవితలు అందించాడో సహృదయ పాఠకులు గుర్తించగలరు.

ఛిద్రమైపోతున్న స్త్రీ వ్యవస్థను ”ఎంత అధునాతనంగా ఎదిగినా / అశ్రుబిందువు నించి / స్త్రీకింకా విముక్తి కలుగలేదు…” అంటూ అభివ్యక్తీకరించాడు. వేశ్యలుగా మారిన దీనత్వపు జీవితాలను ”తను శవమై / ఒకరికి వశమై / తనువు పుండై / ఒకరికి పండై / ఎప్పుడూ ఎడారై / ఎందరికో ఒయాసిస్సై” అంటూ కవిత్వీకరించిన తీరు ఎందరినో కదిలించింది. వేల మంది పాఠకుల నాలుకలపై నిలిచింది ఈ కవిత. ఇంతేకాదు అలిశెట్టి సమాజాన్ని ప్రశ్నించాడు. పిరికి తనాన్ని ఈసడించుకున్నాడు. చరిత్రకు కొత్త అర్థాలను ప్రతిపాదించిన కవి అలిశెట్టి ప్రభాకర్‌.

‘చురకలు’ పేరుతో అలిశెట్టి ప్రభాకర్‌ రాసిన రెండు పాదాల కవితలు వ్యంగ్య శిఖరాలుగా నిలిచాయి. ఈ చురకలను యువకులు కొంతకాలం జగిత్యాలలో ఇంటి గోడలమీద రాసుకున్నారంటే కవి సమాజంపై ఎంతటి ప్రభావాన్ని వేస్తాడో గుర్తించవచ్చు. వీటికి ఒక శీర్షిక పెట్టి కింద రెండు లైన్లు రాస్తాడు. ఉదాహరణకు ‘మైకు’ శీర్షికకు ”ఎవ్వడూ తవ్వలేని / వాగ్దానాల నిధి” అంటాడు. ఇటువంటివి డెబ్బయి వరకుంటాయి. ‘వకీలు’ కు ”న్యాయాన్ని ఏ కీలు కాకీలు / విరగొట్ట గలవాడే వకీలు” అని రాసాడు. ఇట్లా ప్రతి పదంలో వ్యగ్యం, అర్థశ్లేష విరబూయించిన కవి.

అలిశెట్టి అనగానే అందరికి ఎక్కువగా గుర్తుకు వచ్చే కవితలు ‘సిటీ లైఫ్‌’. వీటిని ఎందుకు రాసాడో అతని మాటల్లో ”ధ్వంసమైపోతున్న సమస్త మానవ విలువల్నీ, హింసా రాజకీయాల్ని నిరసించడంతో పాటు నిప్పు కణికల్లాంటి, కన్నీటి గుళికలు ప్రతిరోజు ఆంధ్రజ్యోతి పాఠకులకు అందించే చిన్న చిన్న కవితలు” అని ముందుమాటలో చెప్పుకున్నాడు. కాన్వెంటు స్కూళ్ళ సందడి, సిటీ బస్సుల మోత, ఆర్ట్స్‌ కాలేజీ అందం, హైదరాబాద్‌ తందూరి రోటీల రుచి, ఎలక్షన్‌ల ప్రచారం తీరు, సెక్రటేరియట్‌ ఫైళ్ళ కదలిక విధానం, బస్తీలలో బతుకుపోరాటాలు, ఉద్యోగ జీవితాలు మొదలైన వాటిని వస్తువుగా ఎంచుకుని రమణీయంగా, సరళ సుందరంగా అందించాడు.

ప్రభాకర్‌ కవితల్లో ప్రాంరంభంలో ఇంతటి ఘాటు తనం కనిపించదు. జగిత్యాల జైత్రయాత్ర సభ ప్రభాకర్‌ కవిత్వానికి రంగును పులిమింది. ఒక భావజాలానికి పరిమితం చేసింది. అడవి మనుషులను ఆకర్షించింది. నిర్భయంగా ప్రశ్నించడం నేర్పించింది.

ఇంతటి కవితా సృజన ఏకాకిత్వంలో సాగేది కాదు. వాఙ్మనః కర్మలతో బాహ్య ప్రపంచాన్ని అనుసంధించుకున్న విశిష్ట స్థితిలో వెలువడినదని తోస్తుంది. అలిశెట్టి ప్రభాకర్‌ కవిత్వం ఎప్పుడూ వర్తమాన కాల ప్రభావానికి లోనవుతూనే భవిష్యత్‌ కాలంపై తన ప్రభావాన్ని పరుస్తూ ఉంటుంది. ఈతని రచనా శక్తి సంఘ పరిణామాన్నీ, రాజకీయ కల్లోలాల్నీ స్పర్శా మాత్రంగానే కాకుండా జీవన ధాతువుగానే తడుము తుంది. తరుముతుంది. ఇంతటి బాధ్యతయుతంగా రాసిన ఈ కవిత్వం మాసిపోకుండా చిరకాలం నిలుస్తుందనేది నిర్వివాదాశం. మంచి కవితకు మరణం ఉండదు.

కుంచెను, కలాన్ని, కెమెరాను నమ్ముకున్న అలిశెట్టి తన అరోగ్యం మీద, సంపాదన మీద ధ్యాస ఎప్పుడూ పెట్టలేదు. చివరిరోజుల్లో ఊపిరితిత్తుల రోగపు బారిన పడి కష్టాలు అనుభవించాడు. అంతలోనే తనకు నచ్చని హైదరబాదుకు మకాం మార్చాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలహీనుడైన అలిశెట్టికి కొంతమంది స్నేహితుల సహకారం దొరికింది. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. తన జయంతి (12-01-1954)నే వర్ధంతి (12-01-1993) రోజుగా మార్చుకుని తనువు చాలించాడు. బ్రతికిన ముప్పైతొమ్మిది సంవత్సరాల జీవిత కాలాన్ని తనకోసం, తన కుటుంబం కోసం కాకుండా తన సృజన శక్తిని సమాజం కోసం సమర్పించడంలో వినియోగించాడు. చక్కని చిత్రాలను, చిక్కని కవితా అక్షరాలను మిగిల్చాడు. బ్రతికున్నన్నాళ్ళు కళలకు ప్రాణం పోసాడు. మరణానంతరం ఆ కళాక్షరాలు అతడిని బ్రతికిస్తున్నాయి. బ్రతికిస్తూనే ఉంటాయి. అవును మరి ! మరణం అతని చివరి చరణం కాదు !!