మరో రెండు మానవీయ పథకాలు

కనుచూపులకు రక్ష ‘కంటి వెలుగు’
రైతు కుటుంబానికి ధీమా ‘రైతుబంధు జీవితబీమా’

గటిక విజయ్‌ కుమార్‌
tsmagazine

అత్యంత మానవీయ కోణంతో ఆలోచించి, దేశంలో మరెక్కడా లేని పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 15 నుంచి మరో రెండు అద్భుత పథకాలను అమల్లోకి తెచ్చింది. తెలంగాణ ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన అద్దాలు, మందులు ఇవ్వడంతో పాటు ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయడం కోసం ‘కంటి వెలుగు’ అనే కార్యక్రమం ప్రారంభించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంటి వెలుగు కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని మల్కాపూర్‌ గ్రామంలో ప్రారంభించారు. 18 నుంచి 60 సంవత్సరాల లోపు రైతులు ఏ కారణంతో చనిపోయినా సరే, వారు సూచించిన నామినీకి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ‘రైతుబంధు జీవిత బీమా’ పథకాన్ని కూడా అదే రోజు ప్రారంభించారు. ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌.ఐ.సి.) ద్వారా బీమా పథకం అమలు చేస్తున్నారు.

tsmagazine
కంటి వెలుగు
సమాజంలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతుంటారు. వీరిలో కొంత మందికి అసలు తమకు కంటి సమస్య ఉందనే విషయం కూడా తెలియదు. కొందరికి ఆ విషయం తెలిసినా కంటి వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల సరైన చికిత్స చేయించుకోరు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పట్టణాలకు వెళ్లలేక కంటి చూపు బాగలేకున్నా ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లల పరిస్థితి మరింత దయనీయం. పుస్తకాల్లో అక్షరాలు కనిపించవు. బోర్డుపై అక్షరాలు కనిపించవు. దీంతో చదువులో వెనుకబడి పోతారు. చూపు సమస్య ఉందనే విషయం స్ప హలోకి కూడా రాదు. వారికి వచ్చిన జబ్బును గుర్తించి, చికిత్స ప్రారంభించేలోపు చూపు మరింత మందగించే పరిస్థితి వస్తుంది. కొన్ని రకాల కంటి జబ్బులకు ప్రాథమిక దశలోనే చికిత్స చేయించు కోకపోవడం వల్ల శాశ్వత అంధత్వానికి దారి తీస్తుంది. ఇది గమనించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రంలోని ప్రజలందరికీ వారి గ్రామాలు, డివిజన్లు, బస్తీల్లోనే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు, అద్దాలు ఇవ్వాలని నిర్ణయించారు. అవసరమైన శస్త్ర చికిత్సలు కూడా ప్రభుత్వ ఖర్చుతోనే చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగమంతా రెండు మూడు నెలల పాటు అధ్యయనం చేసి, కంటి వెలుగు కార్యక్రమానికి రూపకల్పన చేశారు.అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమం నడుస్తున్నది.

 •  తెలంగాణలోని 3.70 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించడానికి ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని రూపొందించారు. 2018 ఆగస్టు 15న ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మె ల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా తమ సొంత నియోజ కవర్గాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 • ప్రభుత్వమే పూనుకుని తమ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం దేశంలోనే ఇది ప్రథమం.
 • అన్ని గ్రామాలు, పట్టణాల్లోని అన్ని డివిజన్లలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు.
 • కంటి పరీక్షలు నిర్వహించడం కోసం 827 బందాలు రాష్ట్ర వ్యాప్తంగా శిబిరాలు నిర్వహిస్తున్నాయి. బందంలో మెడికల్‌ ఆఫీసర్‌, ఆప్తమెట్రిస్ట్‌, ఎఎన్‌ఎం, ఆశ వర్కర్లు తదితర సభ్యులుంటారు. గ్రామంలోని ప్రతీ ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించడం పూర్తయ్యే వరకు బందం గ్రామంలోనే ఉంటున్నది.
 • 940 మంది మెడికల్‌ ఆఫీసర్లు, 1000 మంది ఆప్తమెట్రిస్టులు, 8000 మంది సపోర్టింగ్‌ స్టాఫ్‌ కంటి పరీక్ష శిబిరాల నిర్వహణలో తలమునకలయ్యారు.
 • కంటి వెలుగు శిబిరాల నిర్వహణ వల్ల సాధారణ వైద్యానికి ఇబ్బంది కలుగకుండా ప్రతీ పి.హెచ్‌.సి.లో కనీస వైద్య బందం ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
 • ప్రతీ రోజు ఒక వైద్య బందం సగటున గ్రామాల్లో 250 మందికి, పట్టణాల్లో 300 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నది.
 • చూపు దోషం ఉన్న వారికి వెంటనే అందివ్వడానికి 40 లక్షల కళ్లద్దాలను ముందే సిద్దం చేసి పెట్టింది.
 • అవసరమైన వారికి అక్కడికక్కడే మందులు, అద్దాలు అందిస్తున్నది. ప్రత్యేకమైన అద్దాలు కావాల్సిన వారిని గుర్తించి, వారికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అద్దాలు తయారు చేయించి, ఇస్తున్నది.
 • ఆపరేషన్లు అవసరమైన వారిని ఈ శిబిరాల్లోనే గుర్తిస్తున్నారు. వారికి సమీప పట్టణాల్లోని కంటి వైద్య శాలల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 • పరీక్షలు చేయడంతో పాటు కంటి జబ్బులున్న వారికి తగు జాగ్రత్తలు కూడా ఈ శిబిరంలో సూచిస్తున్నారు.

tsmagazine

రైతుబీమా

తెలంగాణ రైతాంగంలో అధికభాగం సన్న, చిన్నకారు రైతులే. వీరికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఎండనక, వాననక, చమటోడ్చి పంటలు పండించి అందరి కడుపు నింపుతున్న అన్నదాత అనూహ్యంగా మరణిస్తే తట్టుకోగలిగే శక్తి, స్థోమత రైతు కుటుంబాలకు ఉండదు. తమను పోషించే ఇంటిపెద్ద మరణిస్తే ఆ కుటుంబం అగాథం అవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో అటువంటి దురవస్థ ఏ రైతుకుటుంబానికి పట్టకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ రైతుజీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది.

 •  ఏ రైతు ఏ కారణంతో మరణించినా అతని కుటుంబా నికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు జీవిత బీమా పథకాన్ని ప్రవేశ పెట్టింది.
 • 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సున్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.
 • 2018 ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.
 • భారత జీవిత బీమా సంస్థ ఎల్‌.ఐ.సి. ద్వారా అమలు చేస్తున్న ఈ రైతుబంధు జీవిత బీమాపథకం క్రింద మరణించిన రైతుకుటుంబానికి 5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు.
 • తన నామినీని ఎంచుకునే అవకాశం రైతులకే ఉంటుంది. దీనికోసం ముందుగానే నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరించారు.
 • ఈ పథకానికి చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రైతు తరఫున ప్రభుత్వమే ప్రతీ ఏటా చెల్లిస్తుంది. ఒక్కో రైతుకు 2,271.50 రూపాయల చొప్పున ఈ ఏడాది ప్రీమియాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఎల్‌.ఐ.సి.కి చెల్లించింది. గ్రామాల్లో రైతులకు జీవితబీమా పత్రాలను పంపిణీ చేసింది.
 • రైతు మరణించిన పది రోజుల్లోగానే 5 లక్షల ఆర్థిక సహాయం నామినీకి అందే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
 • దేశ చరిత్రలో ఇలాంటి పథకం మరే రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదు. ఎల్‌.ఐ.సి. చరిత్రలో కూడా ఇంత పెద్ద గ్రూప్‌ ఇన్సూరెన్సు గతంలో చేయలేదు.
 • ఎవరైనా కొత్తగా వ్యవసాయ భూమి కొనుగోలు చేసి, వ్యవసాయం ప్రారంభిస్తే వారికి కూడా బీమా వర్తింప చేస్తారు.
 • ఎవరైనా రైతు ఏదైనా కారణం చేత వ్యవసాయం మానేసినా, ప్రీమియం చెల్లించిన ఏడాది కాలం పాటు బీమా సౌకర్యం కొనసాగుతుంది.

జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులకు కూడా కంటిచూపు ఎంతో ముఖ్యమని, తాము ఏ పని చేసుకోవాలన్నా చూపు కావాల్సిందేనని, అలాంటి కంటిచూపును అశ్రద్ధ చేయకుండా పరీక్ష చేయించుకుని, శస్త్ర చికిత్సలు చేయించు కోవడం ఎంతో అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మెదక్‌జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని మల్కాపూర్‌ గ్రామంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ”కంటివెలుగు” కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయిదుగురికి కంటి అద్దాలను అందచేశారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని తన స్వంత నియోజకవర్గమైన గజ్వేల్‌ నియోజకవర్గం మల్కాపూర్‌ గ్రామంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

సమాజంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కంటి చూపు విషయంలో అశ్రద్ధ చేస్తున్నారన్నారు. ఇందుకు ఉదాహరణగా ఎర్రవల్లి గ్రామాన్ని ఆయన పేర్కొన్నారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లిలో కంటి వైద్య శిబిరం నిర్వహించి, పరీక్షలు చేయగా గ్రామంలో 217 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఒక్క గ్రామంలోనే ఇందరుమంది కంటి సమస్యలతో బాధపడుతుంటే రాష్ట్రం మొత్తంలో పరిస్థితి ఏ విధంగా ఉందోనని ఊహించానన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలందరి కళ్ళను పరీక్షించడానికి కంటివెలుగు కార్యక్రమాన్ని తెచ్చానన్నారు.

ప్రతి ఒక్కరికీ చక్కని కంటి చూపు కోసం ప్రభుత్వం ఎంత ఖర్చయినా వెనుకాడదని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకుని కంటిచూపు మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ కంటివెలుగు కార్యక్రమం ద్వారా 3.70 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్ళద్దాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాటరాక్ట్‌ శస్త్ర చికిత్సలు కూడా నిర్వహింపచేస్తామన్నారు. వీటికి ఎవ్వరు కూడా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, అంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాటరాక్ట్‌ ఆపరేషన్‌ విషయంలో ఎలాంటి భయాందోళనలు చెందవద్దని, అది చిన్న ఆపరేషన్‌ అని తెలిపారు.

”నేను రెండు కళ్ళకు కాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించుకున్నాను, 40 నిమిషాల తరువాత ఇంటికి పంపించారు” అని తెలిపారు. కంటి పరీక్షల్లో ఎవరికైతే కాటరాక్ట్‌ ఆపరేషన్‌ అవసరమవుతుందో వారు తప్పకుండా ఆపరేషన్‌ చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రం మొత్తంలో 185 ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. వెయ్యి మంది ఉన్న గ్రామంలో వైద్య బృందం నాలుగురోజులు అదే గ్రామంలో ఉండి వైద్య పరీక్షలు పూర్తి చేస్తుందని సీఎం పేర్కొన్నారు. గ్రామాలలోని యువజన సంఘాలు, యువకులు ముందుకొచ్చి ఈ కంటి పరీక్షలకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి పరీక్షించుకునేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.