|

మహామహోపాధ్యాయ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి

కప్పగంతుల లక్ష్మణశాస్త్రి తెలంగాణ గర్వించదగ్గ కవి పండితులలో ముందువరుసలో ఉంటారు. సంస్కృతంతోపాటు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ భాషలలో మాతృభాష అయిన తెలుగుకు సమానమైన పాండిత్యం, అధికారం కల్గినవాడు. చమత్కారంగా మాట్లాడటంలో, గంగాప్రవాహ సమానమైన ఉపన్యాసంలో సాటిలేనివాడు.

సారస్వతసేవలో తరించిన గొప్ప సంస్థానాల్లో ఒకటైన ‘వనపర్తి’ పట్టణములో 1911 జూలై 2న లక్ష్మణశాస్త్రి జన్మించాడు. వీరి తల్లిదండ్రులు పద్మావతీ శ్రీనివాసులు. అటు తల్లి తరపువారు, ఇటు తండ్రి తరపువారు వేదవేదాంగపండితులు. నిగమాగమ సంప్రదాయ నిష్ఠా మహనీయులు. అట్టి పూర్వపూర్వుల సంప్రదాయం లక్ష్మణశాస్త్రికి అబ్బింది. వనపర్తిలో ప్రాథమిక విద్యను ప్రారంభించిన తర్వాత తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చేరి పది సంవత్సరములపాటు అలంకరణ, వ్యాకరణ శాస్త్రాలు చదువుకొని ‘సాహిత్య శిరోమణి’ అయినాడు. తరువాత మద్రాసు మైలాపూరు సంస్కృత కళాశాలలో అద్వైత విద్యలో ఆరితేరాడు. అన్నామలై విశ్వవిద్యాలయంలో వ్యాకరణ శాస్త్రం

లోతుపాతులను తెలుసుకున్నాడు. పులిసి కృష్ణమాచార్యులు, లక్ష్మీనరసింహశాస్త్రి, చక్రాల నరసింహాచారి, కరుంగళం కృష్ణశాస్త్రి, సేతు మాధవరావు వంటి ఉద్దండ పండితులు లక్ష్మణశాస్త్రి గురువులు.


రాజా రామేశ్వరరావు కాలంలో వనపర్తి సంస్థాన ఆస్థానకవిగా కీర్తిప్రతిష్టలు గడించిన లక్ష్మణశాస్త్రి హైదరాబాదు వివేకవర్థని ఉన్నత పాఠశాలలో, వనపర్తి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగం చేశాడు. కప్పగంతుల ప్రతిభావ్యుత్పత్తులు తెలిసి సురవరం ప్రతాపరెడ్డి ఆయనను హైదరాబాద్‌ పిలిపించారు. 1947లో సిటీ కళాశాల ఉన్నత పాఠశాలలో పని చేసి ఆ తర్వాత 1948లో సమాచార పౌరసంబంధ శాఖలో ‘అసిస్టెంట్‌ డైరెక్టర్‌’గా నియమితులైనారు. చాలాకాలం ‘ఆంధ్రప్రదేశ్‌’ పత్రికకు సంపాదకులుగా, ప్రచురణ శాఖాధిపతిగా ఉన్నారు. విద్యాశాఖలో డిప్యూటి డైరెక్టర్‌ పదవి పొంది ప్రాచ్య భాషల అభివృద్ధికి, ఓరియంటల్‌ కళాశాలల బలోపేతానికి కృషి చేశారు. 1970లో పదవీ విరమణ చేశారు. సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన ‘విజ్ఞాన వర్ధినీ పరిషత్తు’లో సభ్యులుగా ఉండి పుస్తక ప్రచురణలో విశేష కృషి చేశాడు.

ఆంధ్ర వ్యాకరణ వివరణము, సంస్కృత పాఠమాల, మణిమంజూష కథలు, ‘కర్ణసుందరి’ అనువాదం, వ్యాస మహాభారతం గద్యానువాదం, బదరీశతకానువాదం, సూర్యోపరాగ దర్పణం తెలుగు తాత్పర్యం, బౌద్ధ దర్శనం తెలుగానువాదం, ఆంధ్ర సంస్కృత నిఘంటువు, శాస్త్రీయ విజ్ఞానం సంపాదకత్వం, భారతీయ సదాచార్‌ వ్యవహార్‌ అనువాదంలతో పాటు పత్రికలకు, రేడియోకు అనేక వ్యాసాలు రాశారు. వివిధ సభలలో వీరు చేసిన ఉపన్యాసాలు వారి తలస్పర్శి పాండిత్యానికి నిదర్శనాలు. బాబూ రాజేంద్రప్రసాద్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందడం లక్ష్మణశాస్త్రి గీర్వాణ భాషా నైపుణ్యానికి గీటురాయి. మాదిరాజు విశ్వనాథరావుతో కలిసి రచనలు చేసి జంటకవులుగా పేరు పొందారు.

1944లో తిరుపతి సంస్కృత కళాశాల నుండి ‘ఆంధ్ర బిల్హణ’, 1973లో మదన మోహన మాలవీయ శిక్షా సంస్థానం నుండి ‘సుధీంద్రమౌళి’ బిరుదాన్ని పొందారు. కాశీ విద్వత్పరిషత్తు వారు ‘మహామహోపాధ్యాయ’ బిరుదునిచ్చారు. వీరు ‘బ్రాహ్మీభూషణ’ బిరుదాంకితులు కూడా.

బిల్హణకవి సంస్కృతంలో రాసిన ‘విక్రమాంకదేవ చరితము’ ను కప్పగంతుల-మాదిరాజు జంట కవులు తెలుగులోకి అనువదించారు. మూలములోని అన్ని పదాలను ఆంధ్రీకరించినందువల్ల ఈ అనువాదం స్వతంత్ర రచన వలె భాసిల్లింది. ప్రబంధాలలో ఉండే అన్ని వర్ణనలు ఇందులో ఉన్నవి. స్వతంత్ర ప్రయోగాలు చాలా కనిపిస్తవి. అచ్చతెనుగు పద్యాలు విశేష సంఖ్యలో ఉన్నవి. గొప్ప గొప్ప పండితుల అభిప్రాయాలు ఇందులోని ప్రధాన ఆకర్షణ. వనపర్తి, రాజానగరం సభలలో వివిధ శాస్త్రాలపై పండితులు చేసిన ఉపన్యాసాలను లక్ష్మణశాస్త్రి తన సంపాదకత్వంలో ‘శాస్త్రీయ విజ్ఞానం’ పేరుతో ప్రకటించాడు. రామేశన్‌ ‘గ్లింప్సెస్‌ ఆఫ్‌ బుద్ధిజం’ను బౌద్ధ దర్శనం పేరుతో తెలుగులోకి అనువాదం చేశాడు. ‘ఇది సమర్ధవంతమైన, సమగ్రమైన అనువాదమని’ పి.వి.నరసింహారావు ప్రశంస దీనికి దక్కడం గమనార్హం. వేదవ్యాసకృత మహాభారతానికి వీరు చేసిన గద్యానువాదం విశేషఖ్యాతిని పొందింది. విశ్లేషణాత్మక వ్యాసాలు పలువురిని ఆలోచింపజేసినవి. తిరుమల రామచంద్ర, దేవులపల్లి రామానుజరావు, సామల సదాశివలు తమతమ ఆత్మకథల్లో కప్పగంతులవారిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాండిత్య ప్రతిభకు నీరాజనాలు పట్టారు.

తెలంగాణ పండితవర్గంలో ప్రత్యేక గౌరవం పొంది, స్వయంకృషితో ఎదిగి, ఉన్నతోద్యోగాలు చేసిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి 1981 జనవరి 10 నాడు పరమపదించారు.

నంబరాజు రవి ప్రకాష్