|

మహోన్నత వ్యక్తి అబ్దుల్‌ కలాం

మహోన్నత వ్యక్తి అబ్దుల్‌ కలాంమాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ అబ్దుల్‌కలాం 84వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని డిఆర్‌డిఎల్‌ ఎదుట నెలకొల్పిన అబ్దుల్‌కలాం విగ్రహాన్ని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అక్టోబర్‌ 15న ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కలాం విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఏపీజే అబ్దుల్‌ కలాం దేశ ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.

భారత్‌ గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి కలాం అని కీర్తించారు. మన రాజధానిలోని డీఆర్‌డీఎల్‌లో అయిదు రకాల క్షిపణులను తయారు చేసి కలాం ”మిసైల్‌ మ్యాన్‌”గా గుర్తింపు పొందారని తెలిపారు. ఇక్కడ పనిచేసినంత కాలం ఒక చిన్నగదిలో సాదాసీదా జీవితం గడిపారని, రాష్ట్రపతి పదవి దక్కినా పేదలపట్ల ఆదరణ భావాన్ని చూపారని అన్నారు. ”మన స్వాతంత్య్రాన్ని కోల్పోవద్దు, ఇతరుల స్వాతంత్య్రాన్ని హరించొద్దు” అనే సూక్తిని అబ్దుల్‌కలాం జీవితాంతం ఆచరించి చూపారని కొనియాడారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉధృతంగా ఉద్యమం సాగిన సందర్భంగా, యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తొలి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డీఆర్‌డీఎల్‌కు కలాం మిసైల్‌ కాంప్లెక్స్‌గా నామకరణం చేయించాలని, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నాడు ఆయనకు నివాళులర్పించిన సందర్భంగా తీర్మానించామని అన్నారు. ఇందుకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడం ఆనందంగా వుందన్నారు. అహింసా మార్గంలో ఉద్యమించిన జాతిపిత గాంధీజీ అంతటి మహోన్నత వ్యక్తి అబ్దుల్‌కలాం అని ప్రస్తుతించారు కేసీఆర్‌.

తన జీవిత చరిత్ర వ్రాసుకున్నట్లయితే, అందులో కలాం చరిత్రను తెలియజెప్పేలా కొన్ని పేజీలు తప్పకుండా వుంటా యన్నారు. గుండె జబ్బులకు స్టంట్లు వేయించుకోలేక అనేకమంది రోగులు ప్రాణాలు కోల్పోయేవారని, అట్లాంటి పరిస్థితులలో పేదవారికి అందుబాటులో వుండే విధంగా తక్కువ ధరకు స్టంట్లు తయారు చేయించారని గుర్తు చేశారు. అలాగే డెంటల్‌ సర్జరీలో ప్రధానమైన డెంటల్‌ కిట్లను కూడా తక్కువ ధరకే అందేవిధంగా తయారు చేయించిన ఘనత కలాం సొంతం అన్నారు.

తాను సియాటిల్‌ వెళ్ళినప్పుడు, క్షిపణి ప్రయోగాలకు ఉపయోగించే పరికరాలు అధికశాతం హైదరాబాద్‌ నుండే వస్తున్నాయని అక్కడివారు చెప్పడం హైదరాబాద్‌కు గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. రాకెట్లను ప్రపంచంలో ఎక్కడ ప్రయోగించినా అందులో హైదరాబాద్‌ డీఆర్‌డీఎల్‌ పరికరాలుంటాయన్నారు. ప్రయోగాల కోసం అతి సున్నితమైన క్షిపణులు, రాకెట్‌ భాగాలను అందిస్తున్న డీఆర్‌డీఎల్‌ శాస్త్రవేత్తలు, ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు.

విగ్రహావిష్కరణకు ముందు డీఆర్‌డీఎల్‌లో అబ్దుల్‌ కలాం నివాసమున్న ఇంటిని సీఎం సందర్శించారు. కలాం విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి పీవై రాజును సీఎం కేసీఆర్‌ సన్మానించారు. డీఆర్‌డీఎల్‌ డైరెక్టర్‌ కె.జయరామన్‌, సంస్థ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కేసీఆర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఎల్‌, డీఆర్‌డీఓ అధికారులు వైవీ రత్న ప్రసాద్‌, భట్టాచార్య శాస్త్రవేత్తలు ఉద్యోగులు పాల్గొన్నారు.