|

మాట వజ్రాయుధమ్మగు మనసు వెన్న…

tsmagazineప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్‌ సభా మందిరంలో శతావధాన కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. అవధాని డాక్టర్‌ జి.ఎం. రామశర్మ ఈ సందర్భంగా పృచ్ఛకులు అడిగిన పలు అంశాలపై ఆశువుగా పద్యాలు, వచన గేయాలు వినిపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ శతావధాన కార్యక్రమానికి స్వయంగా హాజరై అవధాని జి.ఎం. రామశర్మను ఘనంగా సత్కరించారు. తాను పుట్టిన గడ్డకు చెందిన రామశర్మ శతావధానం చేయడం ఎంతో గర్వించదగిన విషయమని ముఖ్యమంత్రి ప్రశంసిం చారు. శతావధానం సందర్భంగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌.పైన, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైన అవధాని రామశర్మ చెప్పిన పద్యాలు…

దత్తపది పూరణలు

సద్దిమూట, అవ్వమాట, సిద్ధ్దిపేట, పెద్దపీట
అంశం : కేసీఆర్‌ పలుకుబడుల కోటగా వర్ణించాలి

ఉ|| ఆయన మాటమేటి, భళిరాయన సుద్దుల సద్దిమూటయౌ
ఆయన బాస యాస అమృతాయతమై మను అవ్వమాటయౌ
ఆయన సిద్దిపేట నుదయమ్మయినట్టి వరాలమూట, స
ద్గేయుడు కేసీయార్‌-తెలుగుకే సభలందిడె పెద్దపీటనున్‌

వివరణ: ఆయన మాట జాతిహితాన్ని అందించే సూక్తులతో కూడి సద్దిమూటలా ఉంటుంది. ఆయన యాస అవ్వమాటలా అమృతాన్ని పంచిపెడుతుంది. ఆయన సిద్ధ్దిపేట జిల్లాలో పుట్టిన వరాలమూట. తెలుగుకు పెద్దపీటవేసే శుభసంకల్పం చేసిన కేసీయార్‌ ప్రశంస నీయుడు.

చిత్త, దత్త, క్రొత్త, మత్త – చుంచన కోట భువనేశ్వరీ మాత గూర్చి

ఉ|| చిత్తము పద్మమౌచు వికసించును చుంచన కోట దేవతా
దత్త వర ప్రసాదమున ధన్యత గల్గును జీవనమ్ములో
క్రొత్త వెలుంగులున్‌ గలుగు కోమల రూప భవానినిన్‌ గనన్‌
మత్తనువల్లి మల్లెవలె మంత్రమయమ్ముగ వెల్గు నెప్పుడున్‌
వివరణ: చుంచనకోట అమ్మవారి వర ప్రసాదంతో చిత్తం పద్మంలా వికసిస్తుంది. జీవితంలో క్రొత్త వెలుగు కలుగుతుంది. ఆ తల్లిని చూడగానే నాతనువల్లి మల్లెగా మారి మంత్రమయమౌతుంది.

ఆశువు; నలుపు, తెలుపు, గెలుపు, మలుపు –
తెలంగాణ ఉద్యమాన్ని మహాభారత యుద్ధంగా అన్వయిస్తూ…

గీ|| నలుపు మనసుల కౌరవుల్‌ బలము గలిగి
యుద్ధవీరత తెలుపుట యోగ్యమగునె
తెలుపు మనసుల పాండవుల్‌ ధీరులైరి
గెలుపు ధర్మానికై కథ మలుపు తిరిగె

సమస్యా పూరణలు

భార్యకు సేవజేయ భువి భర్త తరించును జన్మజన్మకున్‌
ఉ|| నిర్యదమంద రాగ రస నీరధి, యోగ విధాన వారధిన్‌
ధైర్య పరాక్రమమ్ములను ధన్యతగా నిడు శాంభవిన్‌ మహీ
ధుర్యుడు రాజు కొల్చి సిరితో తులతూగును గాన శంభుశో
భార్యను…

వివరణ: ధైర్య పరాక్రమాలను ధన్యతగా ప్రసాదించే శాంభవీ దేవిని కొలిచే రాజు సిరితో తులతూగుతాడు. కాబట్టి అటువంటి శంభునకు శోభను కలిగించే ఆర్యామహాదేవిని (శంభుశోభా+ ఆర్యను=శంభుశోభార్య), సేవించిన రాజు (భువి భర్త) తరిస్తాడు.

-కన్నవారి కన్న ఖలులు గలరె

గీ|| కంపు సీరియళ్ళ వంపులు కొంపలన్‌
కంపలట్లు తగిలె కెంపులూడె
కోప తాపములకు గురిచేయు సీరియల్‌
కన్నవారి కన్న ఖలులు గలరె

వివరణ: కొంపలలో కంపల వలె దాపురించి కోప తాపాలకు గురిచేసే టీవీ సీరియల్సును చూచేవారి కన్న చెడ్డవారు లేరు.

పద్యము వ్రాయువాడు చెడి పాతకమున్గను సత్కవీశ్వరా!
ఉ|| పద్యము శారదా హృదయ పద్మము, భావరసైక సద్మమున్‌
పద్యములన్‌ భళా! యతుల ప్రాసల సత్కవచాలతోడ నై
వేద్యము గాగ భారతికి వేద్యము చేయగనొప్పు, తప్పుగా
పద్యము వ్రాయువాడు…

వివరణ: పద్యము సరస్వతీదేవి హృదయ పద్మము, యతిప్రాసలు దాని సహజ కవచాలు. అటువంటి పద్యాలను సారస్వతానికి నైవేద్యంగా అర్పించాలి. అట్లుకాక తప్పుగా పద్యం వ్రాసేవాడు పాపి అవుతాడు.

లలిని ప్రపంచ తెల్గు సభలన్‌ గన వచ్చిన వారు మూర్ఖులే
చ|| సలలిత సాహితీ ప్రభల చల్లగ జల్లెడు మానసమ్ముతో
వెలయగ జేసె మా ప్రభుత, వేడుక నీ సభలన్‌, తెలుంగుకున్‌
వెలుగుల పీఠమున్‌ బరచె ప్రీతిగ – దుష్కలుషీకృతాత్మతో
లలిని ప్రపంచ….

వివరణ: తెలుగు ప్రభలను పంచడానికే మా ప్రభుత్వం ఈ సభలను ఏర్పాటు చేసి తెలుగుకు పెద్దపీట వేసింది. అయితే మనస్సులలో కల్మషం నింపుకొని ఈ ప్రపంచ తెలుగు సభలను చూడడానికి వచ్చిన వారు మూర్ఖులే.

హరి తత్వమ్మును మెచ్చి నాస్తికుడు బ్రహ్మానందమున్‌ జెందెగా

మ|| పరమానంద మరందబిందు లహరీ భవ్యమ్ము దివ్యమ్ము నీ
ధరణీ చక్రము మెచ్చ పచ్చదనమై ధర్మాన వర్ధిల్లెగా
హరిత శ్రీకర హారమున్‌ ప్రభుత వహ్వా! కూర్చి పేర్చంగ-ఈ
హరితత్వమ్మును...

వివరణ: మన మాగాణాన్ని పచ్చదనంతో పెంపొందే విధంగా చేస్తూ మన ప్రభుత్వం హరిత హారాన్ని చేపట్టింది. అటువంటి హరితత్వాన్ని అనగా పచ్చదనాన్ని (హరితత్వము కాదు) మెచ్చి నాస్తికుడు ఆనందాన్ని ఎందుకు పొందడు. తప్పక పొందుతాడు.

అశువులు

అంశం: ఆ దేవ సభలో ఈ శతావధానం గూర్చి చర్చ
ఆ వె|| మింటినుండి చూసి మేటి శుక్రుడు కవి
ఈ సు నందు చుండె నీ సభ గని/ ఆ సుధర్మ లోన ఈ సభా పద్యాలె
ఆలకించుచుండె నమర గణము

వివరణ: శుక్రునికి కవి అని పేరున్నది. ఇక్కడి ఈ కవితా సభను చూసి ఆ కవి (శుక్రుడు) ఈర్ష్య చెందుతున్నాడు. ఆ సుధర్మ సభలోనూ ఈ పద్యాలనే దేవతలు వింటున్నారు.

కేసీఆర్‌ గూర్చి

గీ|| మన తెలంగాణ ప్రగతి సంపదలు నింప
కేసియారొక నాయక కేసరి సరి
మాట వజ్రాయుధమ్మగు మనసు వెన్న
సభలు జరిపించుచుండె ధీ ప్రభలు వెలుగ

సమస్య: రాఘవ నీ కుఠారమును ప్రార్థన జేసెద నిష్టసిద్ధికై

పూరణ:లాఘవ మొప్ప తాటకను లాస్యపులూస్యముతోడ కూల్చితే
ఆ ఘన రావణాసురుని నగ్నిమదస్త్రముతోడ కాల్చితే
రాఘవ నీదు బాణమది రాజస తేజము నట్టి భూరి ఘో
రాఘ వనీ కుఠారమును ప్రార్థన జేసెద నిష్టసిద్ధికై

వివరణ: ఓ రామా! అలవోకగా తాటకను కూల్చినావు. రావణుని ఆగ్నేయాస్త్రంతో కాల్చినావు. అటువంటి భయంకరమైన పాపమనే అడవికి గొడ్డలి (ఘోర+అఘవనీ కుఠారము) యైన నీ బాణాన్ని ప్రార్థిస్తాను.

వర్ణన

అంశం : తెలంగాణ ప్రభుత్వ పథకాలు

సీ|| షీ టీమ్సు కల్పించి కేటుగాళ్ళకు దుమ్ము
దుల్పించి వనితకు ద్యుతిని పెంచి
సన్న బియ్యమ్ముతో నన్నదానము జేసి / ఆహార భద్రత నాదరించి
ఆసరా పథకాన ఆశా ప్రభల నించి / కళ్యాణ లక్ష్మితో కాంతి బెంచి
మిషను భగీరథన్‌ మేలెంచి నీళ్ళిచ్చి /కాకతీయ మిషను కళల గూర్చి
గీ|| హారిత హారాన ప్రకృతికి హారతిచ్చి/ ప్రీతి కోతలు లేని కరెంటు నిచ్చి
జనము నీరాజనము లీయ సాగుచున్న / మా తెలంగాణ ప్రభుతయే మాన్య చరిత / అర్థం సుగమం

వర్ణనలు

తెలంగాణ ప్రభుత్వం సప్తాశ్వ రథంగా వర్ణించాలి
తే||గీ|| ప్రభుత సప్తాశ్వరథముగా పరిఢవిల్ల
చంద్రశేఖర సూర్యుడే సాంద్రమెసగె/ ప్రగతి కిరణాల కరుణతో పంచిపెట్టె
మన తెలంగాణ గగనమే మహిమ యుతము/ అర్థం సుగమం

కల్యాణలక్ష్మి పథకాన్ని మత్త కోకిలలో వర్ణించండి
మ||కో|| రాణ గల్గగ కన్యకన్నుల రమ్యకాంతులు వెల్గ క
ళ్యాణ లక్ష్మి పథమ్ము రంజిలె లాలితమ్ముగ మా ప్రజా
ప్రాణశక్తి యె శోభిలెన్‌ సుమ రాజ రాజిత సూత్రమై
వీణలై సువధూమణుల్‌ వినువిందు రాగములూనిరే

వివరణ: కల్యాణలక్ష్మితో కన్నెల కన్నులలో కాంతులు విరజిమ్మినవి. అది ప్రాణశక్తిని ఉద్దీపనం చేసింది. వధువులంతా వీణలై రాగవతులైనారు.