|

ముఖ్యమంత్రి ఆదర్శం

cm-kcrమిషన్‌ భగీరథ కార్యక్రమంలో భాగంగా పైపులైన్‌ వేసే పనులను జనవరి 19న అధికారులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రాతినిధ్యం వహించే గజ్వేల్‌ నియోజకవర్గంలో చేపట్టారు. జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవెల్లి గ్రామ పరిధిలో ఉండే కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం గుండా పైపులైను వేయాల్సి వచ్చింది. రైట్‌ ఆఫ్‌ వే చట్టం ప్రకారం పైపు లైను వేస్తున్నట్లు అధికారులు కేసీఆర్‌కు సమాచారం అందించారు. దానికి కేసీఆర్‌ కూడా అంగీకరించారు. రైట్‌ ఆఫ్‌ వే చట్టం ప్రకారం ఎవరి భూమిలోనుంచైనా పైపు లైను వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పారు. దానికి ముఖ్యమంత్రి కూడా అతీతుడు కాదని చెప్పి కేసీఆర్‌ అధికారులకు సహకరించారు.

దాదాపు 300 మీటర్ల మేర కేసీఆర్‌ భూమిలో పైపులైను వేశారు. గోదావరి నది నుంచి నీళ్లు తీసుకొచ్చే ఈ పైపులైను శివారు వెంకటాపురం నుంచి వరదరాజపురం వరకు వెళ్తున్నది. పైపులైను నిర్మాణం కోసం కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో కొంత మేర అల్లం పంటను కూడా తొలగించాల్సి వచ్చింది. రైతులైనా, ఎవరైనా సరే తెలంగాణ ప్రజలందరికీ మంచినీరు అందించే మిషన్‌ భగీరథ కార్యక్రమానికి సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు.

మిషన్‌ భగీరథలో భాగంగా తెలంగాణలో పది నియోజకవర్గాలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 30వ తేదీ నాటికే మంచినీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంతో పాటు మెదక్‌ జిల్లాలోని సిద్ధిపేట, దుబ్బాక, వరంగల్‌ జిల్లాలోని పాలకుర్తి, స్టేషన్‌ ఘనపూర్‌, జనగామ, నల్గండ జిల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ నియోజకవర్గాలకు తొలివిడత మంచినీరు అందించనున్నారు.