ముగ్గురు ఉద్దండుల పేర మూడు కేంద్రాలు

neకళాభారతి పేర నిర్మించే తెలంగాణ సాంస్కృతిక వారథి భవనానికి మిద్దె రాములు పేరును, పక్కనే ఉన్న మరో భవనానికి వరంగల్‌ శంకరన్న పేరును, భవనంలోని ఆర్ట్‌గ్యాలరీకి కాపు రాజయ్య పేరును పెడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన ముగ్గురు ఉద్దండుల పేర్లను ప్రకటించడంతో కళాకారుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఇందిరాపార్క్‌ ఎదురుగా ఉన్న 14 ఎకరాల సువిశాలమైన స్థలంలో కళాభారతి భవనాన్ని నిర్మించనున్నారు. ఇప్పటివరకు జిహెచ్‌ఎంసీ పరిధిలోఉన్న ఈ స్థలాన్ని భవన నిర్మాణానికి వీలుగా ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారు. ప్రపంచప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ కళాభారతి కోసం తయారుచేసిన డిజైన్‌కు ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు.

త్వరలోనే ఆ స్థలంలో కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ఘన చరిత్రకు అద్దం పట్టే విధంగా, వారసత్వ కట్టడాల నిర్మాణ కౌశల్యానికి గుర్తుగా నిలిచిపోయేలా ఈ భవన నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించే కళాభారతిలో 4 వేర్వేరు ఆడిటోరియంలు ఉంటాయి. 3000 మందికి సామర్ద్యం కలిగిన ఒక పెద్ద ఆడిటోరియంతో పాటు, 1500 మంది సామర్ద్యం కలిగిన ఒక ఆడిటోరియం, 1000 మంది సామర్ద్యం కలిగిన మరో ఆడిటో రియం నిర్మిస్తారు. ఇక 500 మందికి సరిపోయే చిన్న ఆడిటోరియం కూడా నిర్మించనున్నారు. లక్షా 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కళాభారతిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 10వేల మందితో ఒకేసారి సమావేశాలు నిర్వహించుకున్నా సరిపోయేలా, 3వేల వాహ నాలకు పార్కింగ్‌ సౌకర్యం ఉండేలా దీన్ని రూపొందించనున్నారు. ఇందులో ప్రివ్యూ థియేటర్లు, శిక్షణ`రిహార్సల్స్‌, లైబ్రరీ, ఆర్ట్‌ మ్యూజియం, పెయింటర్‌ గ్యాలరీ, వీఐపీ లాంజ్‌, మీడియా లాంజ్‌, డార్మిటరీలు, అతిథిగృహాలు, రెస్టారెంట్లు, గదులు ఉండేలా విశాలంగా నిర్మిస్తున్నారు. ఈ కళాభారతి తెలంగాణ తల్లి సికలో వికసించే పుష్పంలా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు.