మూడు దశలలో పరిషత్‌ ఎన్నికలు

రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలు మూడు దశలలో నిర్వహిస్తున్నారు. మే 6,10,14 తేదీలలో ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్‌ వి.నాగిరెడ్డి షెడ్యూల్డును ప్రకటించారు. రాష్ట్రంలోని ఒక జిల్లాలో ఒక దశలోనూ, నాలుగు జిల్లాలలో రెండు దశల్లోనూ, మిగతా 27 జిల్లాలలో మూడు దశల్లోనూ పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఫలితాలు మాత్రం పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత, మే 27న ప్రకటిస్తారు.

రాష్ట్రంలో మొత్తం 5,857 ఎంపిటిసి స్థానాలు ఉండగా వివిధ కారణాలవల్ల 40 చోట్ల ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగతా 5,817 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. కాగా, జెడ్పీటిసీ స్థానాలు మొత్తం 539. ఇందులో ములుగు జిల్లాలోని మంగపేట జడ్పీటిసీ స్థానానికి మినహా, మిగిలిన 538 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికలకు ఎప్పుడూ బ్యాలెట్‌ బాక్సులనే వినియోగిస్తున్నందున ఇప్పుడు కూడా వాటి ద్వారానే ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి వెల్లడించారు. ఇందుకుగాను మొత్తం 1,18,154 బ్యాలెట్‌ బాక్సులను వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు.

మొదటిదశలో 197 జడ్పీటిసీ స్థానాలకు, 2,166 ఎంపిటిసీ స్థానాలకు, రెండవ దశలో 180 జడ్పీటిసీ స్థానాలకు, 1,913 ఎంపిటిసీ స్థానాలకు, మూడవ దశలో 161 జడ్పీటిసి స్థానాలకు, 1,738 ఎంపిటిసి స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

ఈ ఎన్నికలలో 1,56,11,474 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 77.34 లక్షల మంది పురుషులు, 78.76 లక్షల మంది మహిళలు ఉన్నారు. 313 మంది థర్డ్‌ జెండర్‌ కు చెందిన వారున్నారు. ఇందుకుగాను మొత్తం 32,042 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

మొత్తం 32 జడ్పీటిసిలలో 16 స్థానాలను మహిళలకు కేటాయించారు. ఎస్టీలకు 4, ఏస్సీలకు 6, బిసిలకు 6, జనరల్‌ కు 16 స్థానాలను కేటాయించారు. ఎంపిటిసి స్థానాలు 538 ఉండగా, వాటిలో 267 స్థానాలను మహిళలకు కేటాయించారు. మొత్తం పరిషత్‌లలో షెడ్యూల్‌ పరిషత్‌ లు 32 ఉన్నాయి. మిగిలిన స్థానాలలో ఎస్టీలకు 60, ఎస్సీలకు 98, బిసిలకు 95, జనరల్‌ కు 253 స్థానాలు కేటాయించారు. జడ్పీటిసి స్థానాలు 539 ఉండగా, 274 మహిళలకు కేటాయించారు. ఎస్టీలకు 79, ఎస్సీలకు 94 , బిసిలకు 90, జనరల్‌కు 276 స్థానాలు కేటాయించారు.

మొత్తం 5,843 ఎంపిటిసి స్థానాలలో 2,843 మహిళలకు కేటాయించారు. షెడ్యూల్‌ ఏరియా ఎంపిటిసిలు 172 ఉండగా, 100 శాతం ఎస్టీలు ఉన్న ఎంపిటిసి స్థానాలు 119 ఉన్నాయి. మిగిలిన స్థానాలలో ఎస్టీలకు 633, ఎస్సీలకు 1,042, బిసిలకు 1,011, జనరల్‌కు 2,866 స్థానాలు కేటాయించారు.

ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి దశకు ఏప్రిల్‌ 22న, రెండవ దశకు ఏప్రిల్‌ 26న, మూడవ దశకు ఏప్రిల్‌ 30న ఎన్నికల నోటీసు జారీచేయగా, ఆయా తేదీల నుంచే నామినేషన్లకు తెరలేచింది.