|

మేడిగడ్డలో రికార్డుస్థాయి కాంక్రీట్‌ పనులు

tsmagazine
వచ్చే వానకాలం నాటికి కాళేశ్వరం ఎత్తిపోతల ఫలాలను రాష్ట్ర రైతులకు అందించాలని పట్టుదలగా వున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు.. ఇప్పటివరకు జరుగుతున్న మేడిగడ్డ బరాజ్‌ పనుల వేగాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. సీఎం సమీక్ష తర్వాత గత కొన్నిరోజులుగా మేడిగడ్డ కాంక్రీట్‌ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్‌ నెల 22న ఉదయం 8 గంటల నుంచి కాంక్రీట్‌ పనులను రికార్డుస్థాయిలో ముందుకు తీసుకుపోయేందుకు ప్రాజెక్టు ఇంజినీర్లు, సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టారు. 72 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 25,584 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తిచేశారు.

గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల వరుస బరాజ్‌లలో అన్నారం, సుందిల్ల పనులు కొంతమేర ముందున్నాయి. అన్నారం నిర్మాణం చివరి దశలో వుంది. అక్కడ కాంక్రీట్‌ పనులు 99.05 శాతం పూర్తయ్యాయి. సుందిల్ల నిర్మాణంలోనూ 98.57 శాతానికిపైగా కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి. అయితే మేడిగడ్డ నిర్మాణంలో కాంక్రీట్‌ పనులు కొంతమేర వెనుకబడ్డాయి. ఇక్కడ మొత్తం 17,889,382 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకుగాను డిసెంబర్‌ నెల 22 ఉదయం వరకు 12,41,310 క్యూబిక్‌ మీటర్ల (63.38 శాతం) పనులు పూర్తయ్యాయి.

డిసెంబర్‌ 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఇరవైనాలుగు గంటల వ్యవధిలో 16,722 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులుచేసి రికార్డు సష్టించిన ఇంజినీర్లు. ఆ వ్యవధి కాస్తా 48 గంటలు గడిచేసరికి 21,467 క్యూబిక్‌ మీటర్ల మేర పనులను పూర్తి చేసి రికార్డుల పరంపరను కొనసాగిస్తూ, ఆ తర్వాత మరో 24 గంటలలో అంటే, 72 గంటలు గడిచేసరికి 25,584 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ పనులు పూర్తి చేశారు. ఫలితంగా మొత్తం 70.80 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 5,31,350 క్యూబిక్‌ మీటర్ల మేర పనులు చేయాల్సి ఉండటంతో అదే వేగాన్ని కొనసాగిస్తున్నారు. రేయింబవళ్లు మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయని, రోజుకు 5,500 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ పనులు నిర్వహిస్తున్నట్టు ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ ఎన్‌. వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్న ముఖ్యమంత్రి కే సి అర్‌ ఢిల్లీలో ఉన్నప్పటికీ ప్రాజెక్ట్‌ పనుల తీరు పై ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవాలంటే వేగాన్ని మరింత పెంచాలని సూచించారు. అవసరమైతే ఎక్కువ యంత్రాలను సిబ్బందిని, ఏర్పాటుచేసుకొని.. రోజుకు 5500 క్యూబిక్‌ మీటర్లు కాకుండా ఇంకా పరిమాణాన్ని భారీగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశంతో, పనుల్లో వేగం పెంచే విషయంపై ఇంజినీర్లు దష్టి కేంద్రీకరించారు.