|

మేడిన్‌ మెదక్‌

mede-in-medakమేడిన్‌ మెదక్‌

నిరంతరం పరిశోధన సాగిస్తే అపూర్వ ఫలితాలు, ప్రయోజనాలు అందివస్తాయి. నిశిత పరిశీలనకు శాస్త్రీయ దృక్పథాన్ని జోడించి, అంకిత భావంతో శోధించిన ఓ గ్రామీణ రైతు అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రధానంగా అన్నదాతలకు ఉపయోగపడే వివిధ ఆవిష్కరణలు, ఆయన ప్రతిభా సామర్థ్యాలకు రుజువుగా నిలిచాయి. అందరికీ అందుబాట్లో ఉండే విధంగా రూపొందిస్తున్న పరికరాలు వ్యవసాయ క్షేత్రాల్లో రైతన్నలకు బాసట. మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన ఓ విలక్షణ రైతు విజయగాథ ఇది!

నూతన అంశాలను పరిశోధించి వెలుగులోకి తేవడం కేవలం విద్యావంతులకు మాత్రమే కాకుండా సహజ పరిజ్ఞానం, సాంకేతిక విచక్షణ ఉన్న ఎవరికైనా సాధ్యమేనని మెదక్‌జిల్లా తాడ్‌ధాన్‌పల్లికి చెందిన కాగితాల రామచంద్రయ్య పరిశోధనలు గమనిస్తే అర్థమవుతుంది. సాధారణ రైతుగా జీవనం సాగిస్తున్న రామచంద్రయ్య ఉపాధి కోసం కొన్ని కంపెనీలలో పని చేసినపుడు సాంకేతిక అంశాలపై దృష్టి మళ్ళింది. ఫలితంగా గత ఐదు సంవత్సరాలుగా వివిధ కొత్త పరికరాలు రూపొందించడం కోసం రామచంద్రయ్య చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. వీటిలో రైతులకు ఉప యుక్తంగా ఉన్న సోలార్‌ హూటర్‌, లైట్‌ ట్రాప్‌ రైతులకు బాగా ఉపయుక్తంగా ఉన్నాయి. ఈ రెండు ఉత్పత్తులు కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా కొందరు రైతులు ప్రయోగాత్మకంగా వినియోగించుకుంటున్నారు. వీటితోపాటు మరొక రెండు పరిశోధనలను రామచంద్రయ్య ప్రయోగాత్మక స్థాయికి తీసుకు రాగలిగారు.

సోలార్‌ హూటర్‌:

తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో అడవి పందుల కారణంగా పంట నష్టపోవడం ప్రధానమైనది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాలలో రైతులు మొక్కజొన్న వంటి పంటలని వేయడమే మానుకున్నారు.వేసిన కొద్ది మంది రైతులు వేలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడానికి రామచంద్రయ్య సౌరశక్తితో పని చేసే ఒక పరికరాన్ని అభివృద్ధి చేశారు. విద్యుత్‌ సరఫరా అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇది మరింత ఉపయుక్తంగా ఉంటుంది. సౌర ఫల కాలు అమర్చిన ఈ పరికరం పగలంతా సూర్యరశ్మిని గ్రహించి దానిని బ్యాటరీలో నిలువచేసుకుని రాత్రి అవసరానికి వాడుకుంటుంది. నిర్ణీత కాల వ్యవధిలో సుర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ప్రతీ పది నిముషాలకు ఒకసారి ఏకకాలంలో కాంతిని, శబ్దాన్ని విడుదల చేస్తుంది. దీనిద్వారా ఈ పరికరం అడవి పందుల దాడిని సమర్థవంతంగా ఆరికట్టగలుగుతుంది. టైమర్‌ అమర్చడం వల్ల, సెన్సర్లు వినియోగించడం కారణంగా ఈ పరికరం సూర్యాస్తమయం కాగానే తనంతట తానుగా పని చేయడం మొదలుపెట్టి సూర్యోదయం కాగానే పనిచేయడం ఆపేస్తుంది. ఫలితంగా రైతు పొలానికి వెళ్ళి ఈ పరికరాన్ని ప్రత్యేకంగా పనిచేయించాల్సిన అవసరం లేదు. మెదక్‌, నల్గొండ, పొరుగునే ఉన్న బీదర్‌ జిల్లాలలో పలువురు రైతులు పంటలను కాపాడుకోవడంతో పాటు సాయం సమయాలలో పొలాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా చేయగలిగింది ఈ పరికరం.

”దాదాపు దశాబ్ద కాలం తరువాత పొలం గురించి ఆందోళన చెందకుండా ఇంటి దగ్గర ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాము” అంటూ ఇస్మాయిల్‌ఖాన్‌ పేటకు చెందిన రైతు నరసింహ రామశర్మ చేసిన వ్యాఖ్యలు ఈ పరికరం ఉపయోగాన్ని సవివరంగా తెలియజేస్తాయి.

సోలార్‌ లైైట్‌ ట్రాప్‌:

క్రిమి కీటకాల దాడి నుండి పంటలను రక్షించడానికి తయారు చేసిన మరొక పరికరం సోలార్‌ లైట్‌ ట్రాప్‌. ఇది కూడా టైమర్‌, సెన్సర్లు అమర్చిన కారణంగా నిర్ణీత వ్యవధిలో పని చేసి రైతు పంటను కీటకాల బారిన పడకుండా నిరోధిస్తుంది. సోలార్‌ పానెల్‌, బ్యాటరీ, కీటకాలను ఆకర్షించే లైటు అమర్చిన ఈ పరికరం సూర్యాస్తమయం నుండి రాత్రి పన్నెండు గంటల వరకూ మాత్రమే పనిచేస్తుంది. పంటలకు హాని కలిగించే కీటకాలు సాయంకాలం నుండి అర్ధరాత్రి వరకు పంటలపై దాడి చేసే అవకాశం ఉన్నందున ఆ సమయం వరకు మాత్రమే పని చేసేలా ఈ పరికరాన్ని రూపొందించడం జరిగింది. అర్థరాత్రి నుండి ఉదయం వరకూ పంటలపై వాలే ‘మిత్ర’ పురుగులకు ఈ పరికరం ఏ విధంగానూ హాని కలిగించదు. సూర్యకాంతితో నడిచే ఈ పరికరం వెలువరించే కాంతికి కీటకాలు ఆకర్షితమై లైటు కింద అమర్చిన కిరసనాయలు కలిపిన నీటి తొట్టెలో పడతాయి. ఈ చనిపోయిన కీటకాలను మరుసటి రోజు అదే పొలంలో ఎరువుగా వాడుకోవచ్చు.

స్నేక్‌ అరెస్టర్‌:

అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో పాముల సంచారం, బెడదను అరికట్టడానికి ఈ పరికరం ఉపయుక్తంగా ఉంటుంది. సుమారు మూడు నుండి నాలుగు అడుగుల లోతున భూమిలో పాతిపెట్టే ఈ పరికరం నిరంతరం అతి తక్కువ స్థాయిలో ప్రకంపనలు చేసి పాములు సంచరించకుండా నిరోధించ గలుగుతుంది. ఈ పరికరాన్ని సౌర విద్యుత్తుతో కానీ, ఇళ్ళకు సరఫరా అయ్యే విద్యుత్తుతో కానీ వినియోగించుకోవచ్చు.

ప్రయోగాత్మకంగా మెదక్‌ జిల్లాలోని కొల్చారం పోలీసు స్టేషనులో దీనిని ఉపయోగించడం జరిగింది. నిత్యం పాములను చూసిన పోలీసు సిబ్బంది ఈ పరికరం పెట్టిన తరువాత పాముల బెడద తప్పిందని నిర్థారించారు.