| |

యాదగిరీశుని దర్శించిన రాష్ట్రపతి ప్రణబ్‌

యాదగిరీశుని-దర్శించిన--రాష్ట్రపతి-ప్రణబ్‌యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందగలదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆకాంక్షించారు. హైదరాబాద్‌ లో వర్షాకాల విడిదికోసం విచ్చేసిన రాష్ట్రపతి జులై 5న యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ క్షేత్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి
కె. చంద్రశేఖర రావు చూపుతున్న ప్రత్యేక చొరవ, శ్రద్ధ అభినందనీయమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని మూలమూర్తులకు జరిగిన సువర్ణ పుష్పార్చనలో ఆయన పాల్గొన్నారు.

గుహలో వెలసిన స్వయంభువు గురించి అర్చకులు రాష్ట్రపతికి వివరించారు. ఆండాళమ్మ, అళ్వారులను కూడా ఆయన సందర్శించారు.

రాష్ట్రపతి వెంట గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కూడా యాదాద్రికి విచ్చేశారు. వీరికి తొలుత ఆలయ మర్యాదలతో, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సందర్శన అనంతరం వీరికి పండితులు చతుర్వేద పఠనాల మధ్య మహదాశీర్వచనం చేశారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ఈ సందర్భంగా రాష్ట్రపతికి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు జి. సునీత, ఆలయ ఈవో గీత, వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి స్వామివారి ప్రసాదాలను రాష్ట్రపతికి అందజేశారు.

ఈ సందర్భంగా యాదాద్రి అభివృద్ధి నమూనాను డిజైనర్‌ ఆనంద సాయి రాష్ట్రపతికి వివరించారు. దీనిని తిలకించిన రాష్ట్రపతి ప్రక్కనే వున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ప్రాధికార సంస్థ వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌ రావులను ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రపతి యాదాద్రిని సందర్శించడం ఇదే ప్రథమం. గతంలో ముగ్గురు రాష్ట్రపతులు యాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.

వర్షాకాల విడిది కోసం జూన్‌ 29న హైదరాబాద్‌ కు విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి హకీంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, శాసనసభ సభాపతి మధుసూదనాచారి, శాసన మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, డి.జి.పి అనురాగ్‌ శర్మ, తదితరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం విమనానాశ్రయంలో ఏర్పాటుచేసిన శిబిరంలో కొంతసేపు గడిపిన ప్రణబ్‌ ముఖర్జీ, అక్కడినుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు.

రాజ్‌ భవన్‌ లో విందు

హైదరాబాద్‌ కి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్‌ నరసింహన్‌ జూన్‌ 30వ తేదీ రాత్రి రాజ్‌ భవన్‌లో పసందైన విందు ఇచ్చారు. రాష్ట్రపతి రాక సందర్భంగా రాజ్‌ భవన్‌ ను రంగురంగుల పూలతో సుందరంగా అంకరించారు. దర్బార్‌ హాలులో హిందుస్థానీ సంగీత వాయిద్యాలను ఏర్పాటుచేశారు. విందు కోసం తెలంగాణలో పేరొందిన వివిధ రకాల వంటకాలను చేయించారు. హైదరాబాద్‌ బిర్యానీని ప్రత్యేకంగా తయారు చేయించారు. గవర్నర్‌ దంపతులు స్వయంగా ఈ వంటకాలను రాష్ట్రపతికి వడ్డించారు. విందు అనంతరం అందరితో ఫోటోలు దిగి, రాత్రికి తిరిగి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు.

నక్షత్ర వాటిక ప్రారంభం

బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నక్షత్ర వాటికను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జులై 6న ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలోని ఎకరం విస్తీర్ణంలో 27 నక్షత్రాలు, 12 రాశులు, 9 గ్రహాలకు సంబంధించిన మొక్కలను నాటారు. గ్రహకూటమికి సంబంధించిన 51 రకాల మొక్కలు ఈ నక్షత్ర వాటికలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర్య అనే పేరుగల మొక్కలను రాష్ట్రపతి నాటి నీరుపోశారు. అనంతరం గవర్నర్‌ నరసింహన్‌ తో కలసి ప్రాంగణంలోని దుర్గామాత గుడిలో పూజలు నిర్వహించారు.

రాష్ట్రపతి తేనీటి విందు

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జులై 7 సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తేనీటివిందు ఇచ్చారు. విందుకు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, శాసన సభాపతి మధుసూదనాచారి, శాసన మండలి ఛైైర్మన్‌ స్వామి గౌడ్‌, రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ తేనీటివిందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కె.సి. ఆర్‌ వీరిని రాష్ట్రపతికి పరిచయం చేశారు. పురావస్తుశాఖ రూపొందించిన రాక్‌ ఆర్ట్‌ పుస్తకాన్నిపర్యాటక శాఖ కార్యదర్శి, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ బి.పి. ఆచార్య రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి బహూకరించారు.

రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, ఐ.పి.ఎస్‌, ఐ. ఎ.ఎస్‌ అధికారులు కూడా ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్రపతితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రపతి తన పర్యటనలో భాగంగా జులై 1వ తేదీన తిరుమలకు వెళ్ళి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో సుమారు అర్ధగంటపాటు గడిపారు. వేదపండితులు ఆశీర్వాదం చేశారు. శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించారు.

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌ లో విడిది చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయనను కలుసుకున్నారు.

ఘనంగా వీడ్కోలు

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సుమారు 10 రోజులపాటు విడిదిచేసి జులై 8న తిరిగి న్యూ ఢిల్లీకి వెళ్ళారు. హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రాష్ట్రపతికి విమానాశ్రయం వద్ద గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఇతర మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకు ముందు, రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఫొటోలతో కూడిన ఆల్బంను, వెండి నెమలి ప్రతిమను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి బహూకరించారు. ఫొటో ఆల్బంను రాష్ట్రపతి ఎంతో ఆసక్తిగా తిలకించారు.

ఉనికి పుస్తకావిష్కరణ

ఉనికి-పుస్తకావిష్కరణఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కలసిమెలసి ఉండాలని, సఖ్యతతో మెలగాలని, దేశాభ్యున్నతికి పాటుపడాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆకాంక్షించారు. మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర రావు రచనా సంపుటి ఉనికి పుస్తకాన్ని హైదరాబాద్‌ లోని హైటెక్స్‌ లో జులై 3న జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నరాష్ట్రపతి పుస్తకం మొదటి ప్రతిని ముఖ్యమంత్రి నుంచి స్వీకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, విభేదాలు అభివృద్ధికి ఆటంకమని, పొరుగువారితో సఖ్యతను ఏర్పరచు కుంటే ఉభయతారకంగా వుంటుందని అన్నారు. దేశాభివృద్ధికి రాష్ట్రాల మధ్య సంబంధాలు బలపడాలి, విభేదాలు అభివృద్ధికి ఆటంకం. మనం స్నేహితులను మాత్రమే ఎన్నుకోగలం. పొరుగువారిని ఎన్నుకొనే అవకాశం లేదు. మనకు ఇష్టం వున్నా లేకున్నా వారు అక్కడే వుంటారు. వారితో స్నేహంగా వుండటమా, లేక శాశ్వత ఉద్రిక్తతను సృష్టించుకోవడమా అన్నది మనపైనే ఆధారపడి వుంటుంది. మనకు ఇష్టం లేనంతమాత్రాన వారిని వదులుకోలేం. అని రాష్ట్రపతి పేర్కొన్నారు.హైదరాబాద్‌ నగరం గురించి మాట్లాడుతూ, విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఇది. ఆధునిక నాగరికత కేంద్రం. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఈ నగరమంటే తెలుగువారికే కాదు, దేశానికే ఇష్టం అని అన్నారు.ఎన్నోదశాబ్దాల కల సాకారమైందని, తెలంగాణ సాధనకోసం పోరాడి సాధించిన నేతలను ప్రశంసిస్తున్నానని రాష్ట్రపతి అన్నారు. విద్యాసాగర రావు ఈ ఉనికి పుస్తక రచన చేయడం అభినందనీయ మన్నారు. పదిమందికి ఉపయోగ పడితేనే మనిషి జీవితానికి సార్ధకత వుంటుందని గవర్నర్‌ నరసింహన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. విద్యాసాగర రావు తన అనుభవాలను పుస్తక రూపంలో నిక్షిప్తం చేయడం అభినందనీయమన్నారు.

ఈ సభలో ఉనికి పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ, విద్యాసాగర రావు జీవితం పోరాటాలతో ముడిపడి వున్నదని, ఆయన విలక్షణ రాజకీయ నాయకుడని అన్నారు. విద్యాసాగర రావుతో తనకుగల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ పరిణామాలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ప్రత్యక్ష సాక్షి అని, తెంగాణ బిల్లుకు ఆమోదం తెలపడం ద్వారా ఆయన చరిత్ర సువర్ణాక్షరాలతో నిక్షిప్తమైనదని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ కూడా ఈ సభలో ప్రసంగించారు.

ఘనంగా-వీడ్కోు ఆకుపచ్చని-పొద్దు-పొడువాలేasఆకుపచ్చని-పొద్దు-పొడువాలేv