|

రద్దుతో ఖజానాకు గండి

cs-rajiv-sharmaపెద్ద నోట్ల రద్దు వల్ల ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 వేల కోట్లకు పైగా తగ్గే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రాజీవ్‌ శర్మ కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యంకు వివరించారు. నవంబర్‌ 23న సచివాలయంలో జరిగిన సమావేశంలో నోట్ల రద్దు వల్ల ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పై బ్యాంకు అధికారులతో కలిసి కేంద్ర అధికారులకు వివరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్‌ చంద్ర, అజయ్‌ మిశ్రా, ముఖ్య కార్యదర్శులు రామ కృష్ణారావు, సునీల్‌ శర్మ , కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి అనామికాసింగ్‌, రాష్ట్ర కార్యదర్శులు పార్ధసారధి, నవీన్‌ మిత్తల్‌లతో పాటు ఆర్‌.బి.ఐ. ఎస్‌.బి.హెచ్‌., ఎస్‌.బి.ఐ., ఆంధ్రాబ్యాంక్‌, నాబార్డ్‌ , కోఆపరేటివ్‌ బ్యాంక్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రాజీవ్‌ శర్మ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర అదాయంపై ప్రభావం పడటంతో పాటు చాల మంది పేద ప్రజలు ఉపాధి కోల్పోయారని, నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, సన్న, చిన్న కారు రైతులు, వ్యాపారస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక సహాయం అందించడంతోపాటు, సి.ఎస్‌.టి. బకాయిలు విడుదల చేయించేలా చూడాలన్నారు. రబీ ప్రారంభమవుతున్నందున వారికి అవసరమైన ఇన్‌పుట్స్‌ను మార్క్‌ ఫెడ్‌ , రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల నుండి పాత 500, 1000 రూపాయల నోట్లతో కొనుగోలు చేయడానికి అంగీకరించాలని, పాత బకాయిల చెల్లింపు గడువు 24 వ తేదీని పొడిగించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 వేల చొప్పున నగదుగా అందించాలని, కొత్త 500 రూపాయల నోట్లను విస్తృతంగా చలా మణిలోకి తీసుకురావాలని, చిన్న విలువ గల నోట్లు మరిన్ని కేటాయించాలని , గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నోట్లు సరఫరా చేయాలని , అసరా పింఛన్లను ఫింఛనుదారులకు అందేలా చూడాలని , కేంద్ర ప్రభుత్వ అధికారులకు విన్నవించారు. పోస్టాఫీసుల ద్వారా పాత నోట్ల డిపాజిట్‌ , ఎక్సేంజ్‌ చేసుకోనే సదుపాయాన్ని కొనసాగించాలని, ఆర్‌.బి.ఐ. నుండి అధిక మొత్తంలో కొత్త నోట్లు కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.

రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర మాట్లాడుతూ, భూముల కోనుగోలు, అమ్మకాలపై పడే ప్రభావాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, గతంలో కొనుగోలు అమ్మకాల ప్రక్రియ జరిగి, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల దశలో ఉన్నా యని, రోజుకు 23 కోట్ల ఆదాయం తగ్గిందని, కాని డిసెంబర్‌ నుండి మార్చి 2017 వరకు దాదాపు నెలకు 100 కోట్ల కు పైగా నష్టపోయే అవకాశ ముందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అనిశ్చితి నెల కొన్నదని, ఆస్తుల విలువ తగ్గే అవకాశ ముందని తెలిపారు.

రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా మాట్లా డుతూ, నెలకు 50 కోట్ల చొప్పున 250 కోట్లు ఎక్సైజ్‌ , వాణిజ్య పన్నుల శాఖలో, వచ్చే 4 నెలల్లో నెలకు 420 కోట్ల నుండి 450 కోట్ల వరకు ఆదాయం తగ్గే అవకాశ ముందన్నారు.

రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి మాట్లాడుతూ, రవాణా రంగంలో నెలకు 90 కోట్ల చొప్పున 450 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం వుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ, నల్లధనం నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దుచేయడం వల్ల రాష్ట్రంలో ఏర్పడుతున్న ఇబ్బందులు, అందించాల్సిన సహాయం తదితర అంశాలు తెలుసుకొనుటకు, ప్రత్యక్షంగా పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి పర్యటిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కరెన్సీ, సరఫరా జరుగుతున్న తీరు, బ్యాంకుల వద్ద రద్దీ నియంత్రణ, బ్యాంకు సేవలు, చిన్న చిన్న వ్యాపారస్తులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరమైన కరెన్సీ తదితర అంశాలపై చర్చించి, ఏ విధంగా సహాయం అందించాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.