|

రాష్ట్రంలో మరిన్ని.. పెట్టుబడులు

ktrతెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఐటి శాఖా మంత్రి కె. తారక రామారావు మరో అడుగు ముందుకు వేశారు. ముంబై పర్యటనలో వివిధ కంపెనీల అధిపతులతో సమావేశమై రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు హామీలు పొందారు. మార్చి 3వ తేదీన ముంబైలో జరిగిన విసి సర్కిల్‌ పార్ట్‌నర్స్‌ సమ్మిట్‌లో పాల్గొని కెటిఆర్‌ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహీంద్రా, సుజ్లాన్‌, కోటక్‌ గ్రూప్‌ అధిపతులతో సమావేశమయ్యారు.

సుజ్లాన్‌ సిఎండి తులసి తంతితో సమావేశమైన మంత్రి కెటిఆర్‌ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. దీంతో త్వరలోనే తెలంగాణలో 3వేల మెగావాట్ల సోలార్‌, విండ్‌, హైబ్రీడ్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను ప్రకటించింది. ఇందుకోసం మొత్తం 1200కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది.

ఆ తర్వాత కోటక్‌ గ్రూప్‌ ఎండి, వైస్‌ ప్రెసిడెంట్‌ ఉదక్‌కోటక్‌ తో మంత్రి సమావేశమయ్యారు తెలంగాణకి మరిన్ని ఉద్యోగాలు, పెట్టుబడులకు హామీ ఇచ్చి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ మహీంద్రాతోనూ మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో గ్రూప్‌ పెట్టుబడులు, విస్తరణపై వీరు చర్చించారు. ఆనంద్‌ మహీంద్రాతో సమావేశం ఆనందాన్ని ఇచ్చిందని, తెలంగాణలో ప్రస్తుతం గ్రైప్‌కి ఉన్న అనుబంధం మరింత ధృఢమౌతుందన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

అంతకు ముందు జరిగిన విసి సర్కిల్‌ పార్ట్‌నర్స్‌ సమ్మిట్‌లో కె.టి. రామారావు మాట్లాడుతూ.. పెట్టుబడులు, పరిశోధనలున్న సరికొత్త రంగాల్లోకి ఎక్కువగా వెడుతున్నాయని, ప్రపంచంలో అత్యధిక లాభాలు అందించగలిగే దేశాల్లో భారత దేశం ఒకటని, అందుకే ప్రపంచ ప్రసిద్ధ్ద వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు భారతదేశంలో విస్తృతంగా నిధులను పెట్టుబడులుగా పెడుతున్నారని మంత్రి తెలిపారు. భారతదేశంలోని పెట్టుబడులతో పాటు కొత్త రాష్ట్రం తెలంగాణలో వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను, ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. తెలంగాణలో నిర్ణయాత్మక ముఖ్యమంత్రి, నాయకత్వం ఉన్నదని, అందుకే గత రెండు సంవత్సరాల్లో తెలంగాణలోకి అనేక పెట్టుబడులు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ నగరంలో వ్యాపారాభివృద్ధితో పాటు పరిశోధనల కోసం అనేక నూతన వసతులు ఏర్పడ్డాయని, టి హబ్‌ని ఒక్క సారైనా పరిశీలిస్తే అందరికీ ఈ విషయం అర్ధమవుతుందన్నారు. త్వరలోనే టీ ఫండ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని, పాశ్చాత్య ప్రపంచంలో విజయాలు సాధించిన పలు సంస్థలు, వ్యక్తులు ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. ఈ సంస్థ దాదాపు రూ. 125 కోట్లతో ఏర్పాటు కాబోతుందన్నారు. ఇలాంటిది దేశంలోనే మొదటిదన్నారు. దీని ద్వారా హెల్త్‌, ఐఒటి, అగ్రిటెక్‌, థీమటిక్‌ బి2బి రంగాల్లో పరిశోధనలకి ఊతం ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు.

ద్వితీయ శ్రేణి నగరాలైన కరీంనగర్‌, వరంగల్‌ లాంటి పట్టణాలలో పరిశ్రమలు విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న పోటీ వలన పరిశ్రమలకి అద్భుతమైన అవకాశాలు, వెసులు బాటు కలుగుతున్నదని, పెట్టుబడి దారులకు అత్యంత పారదర్శకమైన, ప్రభావవంతమైన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ పారిశ్రామిక విధానం ద్వారా అందించామన్నారు. ఈ సమ్మిట్‌లో దేశంలోని రెండువేలకు పైగా పారిశ్రామిక పెట్టుబడి దారులు, ఫండింగ్‌ సంసశీవలు హాజరయ్యాయి విసి సర్కిల్‌ పార్ట్‌నర్స్‌ సమ్మిట్‌లో మంత్రి కె.టి. రామారావుతో పాటు పరిశ్రమ శాఖ, ఐటి శాఖ కార్యదర్శులు అరవింద్‌ కుమార్‌, జయేష్‌ రంజన్‌లు పాల్గొన్నారు.