|

రాష్ట్రం గర్వించేలా కాళేశ్వరం పనులు సిడబ్య్లూసి ఛైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌

tsmagazineతెలంగాణ రాష్ట్రం గర్వించేలా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రాష్ట్రానికే తలమానికం, తెలంగాణ కొంగుబంగారం అని కేంద్ర జల సంఘం ఛైైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌ ప్రశంసించారు. మంత్రి హరీష్‌రావుతో కలిసి ఆయన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, 6, 8 ప్యాకెజి పనులు, రామడుగు లక్ష్మి పూర్‌ టన్నేల్‌ పనులను, బరాజ్‌లు, పంపుహౌజ్‌, గ్రావిటీ కెనాల్‌లను పరిశీలించారు.

ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం సిడబ్ల్యూసి ఛైర్మన్‌ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు త్రాగు నీటితో పాటు రైతులకు సాగు నీరు అందుతుందన్నారు. మంత్రి హరీష్‌ రావు, ఆయన బృందం పని తీరును ప్రశంసించారు. పనులను అత్యంత వేగంగా చేస్తున్న తీరు అబ్బురపరుస్తున్నదన్నారు. దేశంలో మరే ప్రాంతంలో కూడా ప్రాజెక్టు పనులు ఇంత త్వరగా పూర్తి కావడంలేదన్నారు. ఇది ఒక రికార్డుగా ఆయన అభివర్ణించారు. ఇంతటి గొప్ప ప్రాజెక్టును చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. క్లిష్టమైన పనులను కూడా శాస్త్రీయంగా చేపడుతూ ఇంజనీరింగ్‌ సవాళ్ళను అధిగమించారన్నారు.

కాళేశ్వరం ఘనత విని తానే స్వయంగా పరిశీలనకు వచ్చానన్నారు. తమ ఫీల్డ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఇంజనీర్లు కూడా ఈ ప్రాజెక్టు సందర్శించేందుకు అనుమతించాలని ఆయన మంత్రి హరీష్‌రావును కోరారు.

వాయువేగంతో పనులు

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాయు వేగంతో, యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయని, రోజుకు 6000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వాడకం జరుగుతున్నదని ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌ రావు సిడబ్ల్య్యూసి ఛైర్మన్‌కు వివరించారు. అనుకున్న రీతిలో పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. వచ్చే రెండు మూడు నెలలు కూడా ఇదే విధంగా జెట్‌ స్పీడ్‌ తో పనులు జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర , తెలంగాణ రెండు వైపులా గోదావరి ఒడ్డున పనులు కూడా పూర్తి కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్ట్‌ సి.ఇ.వెంకటేశ్వర్లు ప్రాజెక్ట్‌ రూపకల్పన, పనితీరు, ప్రాజెక్ట్‌ డిజైన్‌ల స్తితి గతులను సి.డబ్ల్యు.సి.బృందానికి తెలియజేశారు. ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ రావు, సీఈ వెంకటేశ్వర్లు, ఈ.ఈ నూనె శ్రీధర్‌తోపాటు పలువురు ఇంజనీరింగ్‌ అధికారులు వారికి ప్రాజెక్టు నిర్మాణ విషయాలు వివరించారు.

సిడబ్ల్యూసి ఛైైర్మన్‌తో పాటు మంత్రి హరీష్‌ రావు, సీఈ (ఐఎంవో-సీడబ్ల్యూసీ) నవీన్‌ కుమార్‌, డైరెక్టర్‌ (ఐపి-ఎస్‌) బి.సి.విశ్వకర్మ, సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్ర మూర్తి, సీనియర్‌ పాత్రికేయులు మల్లెపల్లి లక్ష్మయ్య ఉన్నారు.