|

రాష్ట్రానికి ‘ఎయిమ్స్‌’

tsmagazine
రాష్ట్ర విభజన హామీలలో భాగంగా, తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తామన్న ‘ఎయిమ్స్‌'(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) ఇపుడు వాస్తవం కానున్నది. రాష్ట్రంలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ పంపించింది. 2018-19 సంవత్సరానికిగాను ‘ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన’ కింద కేంద్ర బడ్జెట్‌లో రూ.3825 కోట్లు కేటాయించిన నేపథ్యంలో.. ఎయిమ్స్‌ తరహా ఆసుపత్రికి అనుమతిస్తున్నట్లుగా లేఖలో స్పష్టంగా పేర్కొన్నది. అయితే ఇందుకు అవసరమైన స్థల సేకరణపై సత్వరమేదృష్టిపెట్టాలనీ.. ఆసుపత్రికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీపీఆర్‌ రూపకల్పనకు ఉత్తమ ప్రమాణాలు పాటించే సంస్థను ఎంపిక చేసుకోవాలని లేఖలో సూచించింది. సాధ్యమైనంత త్వరగా సమగ్ర ప్రతిపాదనలతో వివరాలను పంపించాల్సిందిగా కోరింది.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణకు ఎయిమ్స్‌ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రెండేండ్లక్రితమే బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించినా.. నిధుల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన విషయాల్లో అనుమతులపై కేంద్ర ఆర్థికశాఖ జాప్యంచేసింది. దీంతో ఢిల్లీకి వెళ్లి, ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సందర్భంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు.. ఎయిమ్స్‌కు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బోయినపల్లి వినోద్‌కుమార్‌, బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు పార్లమెంటు వేదికగా తెలంగాణకు ఎయిమ్స్‌ కోసం పోరాటం చేశారు. పార్లమెంటు వెలుపల కూడా కేంద్ర ఆర్థిక,ఆరోగ్యశాఖ మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఎయిమ్స్‌ను సాధించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఐదుసార్లు ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి జేపీ సడ్డా తదితరులను మంత్రి లక్ష్మారెడ్డి పలుసార్లు కలిసి విన్నవించారు. అన్నిరకాల ప్రయత్నాలు ఫలించి.. ఎట్టకేలకు తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది

రాష్ట్ర చరిత్రలో ఇదో కీలక పురోగతి. ఎయిమ్స్‌ ఏర్పాటు వల్ల తెలంగాణలో మెరుగైన సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. సుమారు వెయ్యి పడకల ఆసుపత్రి, దానికి అనుబంధ వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల వస్తాయి. ఆసుపత్రి స్థాపనకు సుమారు 200 ఎకరాల స్థలంతోపాటు విద్యుత్తు, నీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవలసి వుంటుంది. ఆసుపత్రి నిర్మాణానికి, నిర్వహణకయ్యే సుమారు రూ.820 కోట్ల వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది. ఏటా సుమారు రూ.300-350 కోట్ల నిర్వహణ నిధులు కూడా కేంద్రమే ఇస్తుంది. దీనివల్ల సూపర్‌స్పెషాలిటీ నిర్వహణ భారం రాష్ట్ర ప్రభుత్వంపై తగ్గుతుంది.

ప్రభుత్వ సుదీర్ఘ పోరాటం ఫలితంగానే ఎయిమ్స్‌ సాధించగలిగామని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సీ.లక్ష్మారెడ్డి తెలిపారు. ఎయిమ్స్‌ సాధనకు కృషిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతోపాటు ఎయిమ్స్‌ ఏర్పాటుకు అనుమతించిన కేంద్రానికి ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాల పని ప్రారంభించగా.. సిద్ధిపేటకు మెడికల్‌ కళాశాల అనుమతి లభించిందని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ హామీల మేరకు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మెడికల్‌ కళాశాలల ఏర్పా టుకు కసరత్తు ముమ్మరంగా సాగుతున్నదని, ఈ రెండింటి కీ త్వరలోనే అనుమతులు రానున్నట్టు చెప్పారు. తాజాగా ఎయిమ్స్‌ కు కేంద్రం అనుమతించడంతో రానున్న ఏడాది తో కలుపుకొని ఐదేండ్లకాలంలో ఏడాదికొకటి చొప్పున ప్రభుత్వపరంగా మొత్తం ఐదు ప్రతిష్ఠాత్మక వైద్యసంస్థలు వచ్చినట్లయిందని మంత్రి వివరించారు. దీంతో మిగతా దవాఖానల మీద ఒత్తిడి తగ్గి అన్నిచోట్ల మంచి వైద్యం అందే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో అత్యవసర మెరుగైన సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.