|

రాష్ట్రానికి పలు ‘స్కోచ్‌’ అవార్డులు

తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన అనేక పథకాలను ఇతర రాష్ట్రాల మేధావులు ఒకవైపు ప్రశంసిస్తుంటే, మరో వైపు ఆ పథకాలు ప్రామాణికమైనవని చెప్పడానికి ఆయా పథకాలకు అవార్డులు దక్కుతుండడమే నిదర్శనం. రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతులకు రు.16124.16 కోట్ల రుణ మాఫీ, కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ఉద్దేశ్యంగా ఏడాదికి 25000 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతు బీమా, రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, మిషన్‌ కాకతీయ పథకంతో 46000 చెరువుల పునరుద్ధరణ వంటి అనేక వినూత్న రైతు సంక్షేమ పథకాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతుబంధు పథకం అమలు చేస్తున్నది.tsmagazine

ఈ పథకాలన్నింటిని అద్భుతంగా అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ పలు స్కోచ్‌ అవార్డులను అందుకున్నది. న్యూ ఢిల్లీలో జరిగిన స్కోచ్‌ 52వ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ శాఖకు 3 పురస్కారాలు దక్కాయి.

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని రైతు సంక్షేమ పథకాలు, మన రాష్ట్రంలో అమలు చేస్తున్నందుకు గాను తెలంగాణ స్టేట్‌ అఫ్‌ ది ఇయర్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ అవార్డును, రైతుబంధు పథకానికి గాను రెండు పురస్కారాలు దక్కాయి.అందులో ఒకటి అత్యున్నత స్థాయికి చెందిన ప్లాటినం అవార్డు, రెండవది ఆర్డర్‌ అఫ్‌ మెరిట్‌ అవార్డు. ఈ పురస్కారాలు స్టేట్‌ అఫ్‌ గవర్నెన్స్‌ అనే అంశం కింద ఎంపిక కావటం గమనార్హం. తెలంగాణ వ్యవసాయ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఐఏఎస్‌, స్కోచ్‌ సీఈవో సమీర్‌ కొచ్చర్‌ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు.
tsmagazine
మరికొన్ని స్కోచ్‌ అవార్డులను రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యా మండలి, రాష్ట్ర తూనికలు,కొలతల శాఖలు అందుకొన్నాయి. ఇంటర్మీడియట్‌ విద్యా మండలికి ”స్కోచ్‌ ఆర్డర్‌ అఫ్‌ మెరిట్‌ అవార్డు” ను టెక్నాలజీ ద్వారా మెరుగైన విద్య అందించినందుకు గాను, అలాగే సిబ్బందిలో ఉత్పాదకతను పెంపొంది చినందుకు గాను జాతీయ స్థాయిలో ఈ అవార్డును ప్రకటించారు. స్కోచ్‌ ఆర్డర్‌ అఫ్‌ మెరిట్‌ అవార్డు ను ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యదర్శి ఏ. అశోక్‌,ఐ ఏ ఎస్‌, స్కోచ్‌ సిఈఓ & ఎడిటర్‌ డా.గురుశరణ్‌ ధన్జాల్‌, నుండి అందుకున్నారు.

ఇక తూనికలు,కొలతల శాఖ ఇటీవల తూకాల్లో మోసాలు,అధిక ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.సులభంగా లావాదేవీలు నిర్వహించేలా ఆన్‌ లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడం.తూకాల్లో మోసాల పై వినియోగదారులకు అవగాహన కల్పించడానికి తీసుకుంటున్న చర్యలకు గాను తూనికలు,కొలతల శాఖకు స్కోచ్‌ అవార్డు లభించింది.తూనికలు కొలతల శాఖ మేడ్చల్‌ జిల్లా ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ ఈ అవార్డును అందుకున్నారు. తూనికలు,కొలతల శాఖకు స్కోచ్‌ అవార్డు రావడం పట్ల కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌ సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ అవార్డు రావడానికి కషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు.