రెండో విడత గొర్రెల పంపిణీ


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌ గ్రామంలో సంగీత్‌ ఫంక్షన్‌ హాల్లో జరిగిన కార్యక్రమంలో 6 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కుల వృత్తులను ప్రోత్సహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఐదు వేల కోట్ల రూపాయలతో గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీ పై గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. గొర్రెల కాపరుల మందలు వృద్ధి చెంది ప్రస్తుతం వారు సంతోషంగా వున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వర్షాలు బాగా పడుతున్నందున చెరువులలో నీరు బాగా వచ్చాయని గంగపుత్రులు, ముదిరాజ్‌లు చెరువులో చేప పిల్లలను వేసి ఆర్థికంగా ఎదగాలని కోరారు. బతుకమ్మ పండుగకు చీరలు అందిస్తున్నామని, బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు.

ఆ తరువాత మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని తెలిపారు. గొల్ల, కురుమ, యాదవ కులవృత్తులను ప్రోత్సహించి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్‌ మార్కెట్‌లో మాంసానికి మంచి గిరాకీ వుందని, గొర్రెలను పెంచి మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి రావాలని సూచించారు.జిల్లా కలెక్టర్‌ యం.వి. రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మేడ్చల్‌ జిల్లాలోని అలియాబాద్‌లో ప్రారంభించడం చాలా సంతోషకరమని తెలిపారు. రెండవ విడతలో 8 మందికి 6 యూనిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. డబ్బులు కట్టి వున్నవారికి గొర్రెల యూనిట్లను అందిస్తామని తెలిపారు. గొర్రెల బరువు పెంచడానికి దాణా పంపిణీ చేయడం జరిగిందని, జీవాలకు ఆరోగ్య సమస్యలు లేకుండా సంరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, నవీన్‌ కుమార్‌, జిల్లా జడ్పీ ఛైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ బెస్త వెంకటేశ్‌, జడ్పీటీసీలు అనిత, శైలజ, మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ సునీత, ఎంపిపిలు ఎల్లుబాయి, పద్మ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గొర్రెల సొసైటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.