రెవెన్యూ పెంపునకు సాంకేతిక పరిజ్ఞానం


గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆస్తిపన్ను వసూళ్లను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు జియో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జి.ఐ.ఎస్‌) శాటిలైట్‌ మ్యాప్‌లను ఉపయోగించాలని నగరపాలక సంస్థ నిర్మయించింది. చెత్తకుప్పలుగా మారి పలు వ్యాధులకు కారణమవుతున్న ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీచేయడం, మరింత పకడ్బందీగా పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, నవంబర్‌ మొదటి వారంలోగా రోడ్లపై గుంతలను పూర్తిగా పూడ్చివేయడం, బయోమెట్రిక్‌ హాజరు మిషన్లకు జియో ఫెన్సింగ్‌ చేయడం తదితర కీలక అంశాలపై నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ డి.ఎస్‌ లోకేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన జోనల్‌, డిప్యూటి కమిషనర్లు, మెడికల్‌ ఆఫీసర్ల సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో మేయర్‌ రామ్మోహన్‌ మాట్లాడుతూ, నగరంలోని అన్ని సర్కిళ్లలో గార్బేజ్‌ను పూర్తిస్థాయిలో తొలగించడంతో పాటు రహదారుల వెంట ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ప్రతి సర్కిల్‌కు ప్రత్యేకంగా నాలుగు టిప్పర్లు, రెండు బాబ్‌కాట్‌లను అదనంగా అందజేశామని వివరించారు. అన్ని సర్కిళ్లలో ఓపెన్‌ గార్బేజ్‌ పాయింట్లను పూర్తిగా ఎత్తివేయడంతో పాటు జీరో గార్బేజ్‌ సర్కిళ్లుగా రూపొందించాలని స్పష్టం చేశారు.

కమర్షియల్‌ మార్గాల్లో ప్రతిరోజు రెండు లేదా మూడు సార్లు గార్బేజ్‌ను ఎత్తివేయడం, 25కిలోల గార్బేజ్‌ను ఉత్పత్తిచేసే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, ఇతర కమర్షియల్‌ సంస్థల నుండి ప్రత్యేకంగా గార్బేజ్‌ను తరలించే ప్రక్రియను జిహెచ్‌ఎంసి కేంద్రీకతంగా చేపట్టే ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు. నగరంలో గార్బేజ్‌ పాయింట్లుగా దోమల ఉత్పత్తికి కేంద్రాలుగా మారిన ఖాళీ స్థలాల యజమానులకు వెంటనే నోటీసులు పంపాలని, అవసరమైతే నిబంధనలను అనుసరించి కేసులు నమోదు చేయడానికి వెనుకాడవద్దని మేయర్‌ రామ్మోహన్‌ ఆదేశించారు.

పారిశుధ్య నిర్వహణపై వార్డు, సర్కిల్‌, జోన్‌ల వారిగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. నగరంలో ప్లాస్టిక్‌ నిషేధం అమలును మరింత పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేసే ట్రాక్టర్లు, లారీలు, వాహనాలకు మొదటిసారిగా 25వేల రూపాయలు, రెండోసారి 50వేలు, మూడోసారి లక్ష రూపాయలు తిరిగి పట్టుబడితే వాహనాన్ని సీజ్‌ చేయాలని రామ్మోహన్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని ఓడిఎఫ్‌గా తిరిగి ప్రకటించేందుకు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ బందాలు నగరంలో మరోసారి పర్యటించనున్నందున తగు జాగ్రత్తలు క్షేత్ర స్థాయిలో చేపట్టాలని మెడికల్‌ ఆఫీసర్లకు సూచించారు.

రెవెన్యూ పెంపునకు చర్యలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆస్థిపన్ను పరిధిలోకిరాని భవనాలు, తక్కువ పన్ను ఉన్న ఆస్తులను జియో ఇన్ఫర్మేషన్‌ (జి.ఐ.ఎస్‌)విధానం ద్వారా ఆస్తిపన్ను సవరణలను చేపట్టనున్నట్టు మేయర్‌ రామ్మోహన్‌ తెలిపారు. శాటిలైట్‌ మ్యాప్‌ ద్వారా నగరంలోని దాదాపు 15 లక్షలకు పైగా ప్రాపర్టీలను మ్యాపింగ్‌ చేయడం, కొత్త ప్రాపర్టీలను గుర్తించడం, అండర్‌ అసెస్‌డ్‌ ప్రాపర్టీలను గుర్తించి సరిచేయడం చేపట్టనున్నట్టు తెలిపారు. మూసాపేట్‌ సర్కిల్‌లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే చేపట్టడం జరిగిందని తెలిపారు. డిసెంబర్‌ మాసాంతం వరకు జి.ఐ.ఎస్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను హైదరాబాద్‌ నగరంలో పూర్తిచేసి జనవరి నుండి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్టు మేయర్‌ తెలిపారు. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలయ్యేలా కమిషనర్‌ తో పాటు విజిలెన్స్‌ విభాగం కూడా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు.

జిహెచ్‌ఎంసి పారిశుధ్య కార్మికుల హాజరుకై ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ యంత్రాలకు జియో ఫెన్సింగ్‌ పరిధిని అనుసంధానం చేస్తున్నట్టు మేయర్‌ ప్రకటించారు. హాజరు విధానంలో మరింత పారదర్శకంగా ఉండేందుకు ఈ విధానం దోహదపడుతుందని అన్నారు. నగరంలో మొత్తం మూడు షిఫ్ట్‌లుగా ఉన్న పారిశుధ్య కార్మికులకు ఈ బయోమెట్రిక్‌ యంత్రాల ద్వారా ఉదయం షిఫ్ట్‌ కార్మికులకు ఉదయం 5:30 నుండి 7గంటలలోపు ఒకసారి, మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల వరకు మరోసారి హాజరును నమోదు చేయనున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం షిఫ్ట్‌ కార్మికులకు రెండు గంటల నుండి మూడు గంటల మధ్య, రాత్రి 8గంటల నుండి 10గంటల మధ్య, రాత్రి షిఫ్ట్‌ వారికి రాత్రి 10గంటల నుండి 11గంటల మధ్య, తిరిగి తెల్లవారుజామున 5గంటల నుండి 6గంటలలోపు హాజరును నమోదు చేయనున్నట్టు వివరించారు.

నగర పారిశుధ్య నిర్వహణపై రాజీపడే ప్రసక్తిలేదని, ఈ విషయంలో మరింత నిబద్ధతతో పనిచేయాలని అధికారులను కోరారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఇందుకుగాను ప్రత్యేకంగా స్పెషల్‌ కమిషనర్‌ సుజాతగుప్తాను కూడా నియమించిందని మేయర్‌ గుర్తు చేశారు.

స్పెషల్‌ కమిషనర్‌ సుజాతగుప్తా, అడిషనల్‌ కమిషనర్‌ సిక్తాపట్నాయక్‌, విజిలెన్స్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి, జోనల్‌ కమిషనర్లు హరిచందన, ముషారఫ్‌ అలీ, శంకరయ్య, శ్రీనివాస్‌ రెడ్డి, మమతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.