‘రైతుబంధు’ రైతుల కోసమే

రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ప్రభుత్వం ‘రైతుబంధు’ అనే పథకం అమలు చేస్తున్నది తప్ప, కౌలు రైతుల కోసం ఎంతమాత్రం కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఇది రైతు బంధు పథకమే తప్ప, కౌలురైతు బంధు పథకం కాదని సీఎం తేల్చిచెప్పారు. సమాజంలో అనేక రకాల ఆస్తులను ఇతరులకు కొద్ది కాలం కోసం లీజుకు ఇస్తారని, అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు హక్కు దారులు కారని సీఎం అన్నారు. ఇతరులెవరికీ లేని నిబంధన కేవలం రైతులకే ఎందుకు ఉండాలని, రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని సీఎం ప్రశ్నించారు. రైతు బంధు పథకాన్ని కౌలురైతులకు వర్తింపచేయాలనే డిమాండ్‌ అర్థరహితమైనదని,ఆ వాదన న్యాయ సమ్మతం కాదని సీఎం అన్నారు.
tsmagazine

‘రైతుబంధు’ పథకం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ”రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి ఏడాదికి 8వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్నది. ఎలాంటి వివక్ష లేకుండా రైతులందరికీ ఈ పథకం వర్తిస్తున్నది. ఈ పథకం కేవలం రైతులకు ఉద్దేశించిందే తప్ప, కౌలు రైతులకు సంబంధించింది కాదు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది. బడ్జెట్లో ఈ పథకం అమలు చేయడానికి 12వేల కోట్ల రూపాయలు కేటాయించింది. శాసనసభ ఈ బడ్జెట్‌ ను ఆమోదించింది. దాని ప్రకారమే రాష్ట్రంలో భూమిపై యాజమాన్య హక్కులున్న రైతులకు, ప్రభుత్వం గుర్తించిన ప్రతీ రైతుకూ సాయం అందిస్తున్నాం. దీన్ని ఎవరూ తప్పు పట్టడానికి లేదు”.

ప్రభుత్వం దగ్గర కూడా కౌలు రైతుల వివరాలేవీ లేవు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా కౌలు రైతుకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదు. ఏ రైతు కూడా కౌలురైతులను గుర్తించలేదు. కౌలు రైతులు అని చెప్పబడే వారికి భూమిపై ఎలాంటి హక్కు లేదు, ఉండదు.

”కానీ, కొందరు కౌలు రైతులకు కూడా రైతుబంధు కింద సాయం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కౌలురైతులను ఎలా విస్మరిస్తారని వాదిస్తున్నారు. ఆ డిమాండ్‌ అర్థరహితమైనది, ఆ వాదనలో న్యాయం లేదు. ఎందుకంటే అసలు కౌలురైతులు ఎవరన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. ప్రభుత్వం దగ్గర కూడా కౌలు రైతుల వివరాలేవీ లేవు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా కౌలు రైతుకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదు. ఏ రైతు కూడా కౌలురైతులను గుర్తించలేదు. కౌలు రైతులు అని చెప్పబడే వారికి భూమిపై ఎలాంటి హక్కు లేదు, ఉండదు. అలాంటి వారికి ఏ ప్రాతిపదికన పెట్టుబడి సాయం అందించాలి. ఏ హక్కూ, ఆధారం లేని వారికి ప్రభుత్వం సాయం అందిస్తే, ఎవరు పడితే వారు తమకూ సాయం కావాలని అడిగే అవకాశం ఉంది. అలాంటి వారికి డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదు. కేవలం రైతులకే సాయం ఇవ్వాలన్నది ప్రభుత్వ విధానమే కాక, ప్రజాధనంతో కూడుకున్న అంశం. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి అసెంబ్లీ ఆమోదంతో చేయాలి. ఆ ఖర్చుకు ఆడిట్‌ ఉంటుంది. ఎవరికి పడితే వారికి డబ్బు పంచిపెట్టడం సాధ్యం కాదు. ఏ హక్కూ లేని వారికి, భూమిపై ఎలాంటి పత్రం లేని వారికి డబ్బులు ఇవ్వాలని కొందరు వాదిస్తున్నరు. ఇది న్యాయసమ్మతం కాదు” అని ముఖ్యమంత్రి వివరించారు.
tsmagazine

”కేవలం రైతులు మాత్రమే కాదు. చాలా మంది తమ ఆస్తులను ఇతరులకు కిరాయికి, లీజుకు ఇస్తారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇండ్లు, ఆటోలు, కార్లు, ఫంక్షన్‌ హాళ్లు… ఇలా చాలా రకాలైన స్థిర, చర ఆస్తులను నిర్ణీత కాల వ్యవధి కోసం లీజుకు, కిరాయికి ఇస్తారు. అలా లీజుకు తీసుకున్నవారు ఎన్నటికీ యజమానులు కారు. ఆ ఆస్తులపై ఎన్నటికీ వారికి హక్కులు లభించవు. అలాంటి వాటి విషయంలో లేని డిమాండ్‌ కేవలం రైతుల విషయంలో మాత్రమే ఎందుకు వస్తుంది అని సీఎం ప్రశ్నించారు. సమైక్య పాలనలో రైతులు చితికిపోయారు. నష్టపోయి ఉన్నారు. అలాంటి రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వం రైతుబంధు అమలు చేస్తున్నది. దీనికి కొర్రీలు పెట్టడం సమంజసం కాదు. కౌలు రైతుల పేరుతో అసలు రైతుకు అన్యాయం చేయాలని చూడడం మంచిది కాదు. రైతులు ఒక్కో పంట కాలానికి ఒక్కొక్కరికి తమ భూమిని కౌలుకు ఇస్తారు. ఒకే ఏడాది ఇద్దరు ముగ్గురికి కూడా కౌలుకు ఇస్తారు. అలాంటప్పుడు ప్రభుత్వం కౌలుదారును ఎలా గుర్తిస్తారు. అసలు ఏ రైతయినా తాను తన భూమిని కౌలు దారుడికి ఇస్తున్నట్లు లిఖితపూర్వకంగా అంగీకరిస్తాడా? అలాంటప్పుడు ప్రభుత్వానికి కౌలు రైతును గుర్తించడం ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి రైతు బంధు ఖచ్చితంగా రైతుల కోసమే అమలు చేయాలి. కౌలురైతులకు సాయం అందించాలనే డిమాండ్‌ నెరవేర్చడం సాధ్యం కానే కాదు. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా అధికారులు రైతులందరికీ సాయం అందించేందుకు సిద్ధం కావాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ముఖ్య కార్యదర్శులు ఎస్‌. నర్సింగ్‌రావు, రాజేశ్వర్‌ తివారి, పార్థసారథి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌ రావు, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రాంచందర్‌ రావు, వ్యవసాయశాఖ కమిషనర్‌ జగన్‌ మోహన్‌, సీఎంఓ కార్యదర్శులు స్మితా సభర్వాల్‌, భూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.