రైతు చేతికి పెట్టుబడి చెక్కులు

tsmagazine
రైతు బంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి మద్దతుగా ఎకరానికి 8వేల చొప్పున చేసే ఆర్థిక సహాయపు మొదటి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మే నెల 10న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. చెక్కులతోపాటు పాస్‌ పుస్తకాలను కూడా పంపిణీ చేసే సప్తాహ కార్యక్రమం అదే రోజు ప్రారంభించి, రోజుకొక గ్రామం చొప్పున అన్ని గ్రామాల్లో రైతులకు అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. మొదటి విడతగా వర్షాకాలపు పంటకోసం ఎకరానికి రూ. 4వేల చొప్పున, రెండో విడతగా ఎండాకాలపు పంట కోసం ఎకరానికి మరో నాలుగువేల రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మొదటి విడత వర్షాకాలపు పంట పెట్టుబడి మద్దతుకింద ఎకరానికి రూ. 4వేల చొప్పున చెక్కుల రూపంలో అందివ్వనున్నట్లు వెల్లడించారు.

చెక్కులిచ్చిన రైతులకు నగదు ఇవ్వడానికి వీలుగా బ్యాంకుల్లో కావాల్సిన నిల్వలు ఉంచడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని సీఎం చెప్పారు. 58 లక్షల పాస్‌ పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యాచరణను ప్రభుత్వం రూపొందించింది.

పాస్‌ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ‘ప్రగతి భవన్‌’లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించారు. చెక్కులు, పాస్‌ పస్తకాల పంపిణీకి సంబంధించిన కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యే 2762 బృందాలు ఒక్కో రోజు 1546 గ్రామాల్లో పాస్‌ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేస్తాయి. మే 10న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

రెవిన్యూ శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రెవిన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, వ్యవసాయశాఖ కమిషనర్‌ జగన్మోహన్‌, భూ పరిపాలనశాఖ డైరెక్టర్‌ వాకాటి కరుణతో కూడిన బృందం ప్రతీ రోజు నాలుగైదు జిల్లాల చొప్పున పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది. పాస్‌ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. పాస్‌ పుస్తకాలు, చెక్కులను ఆయా గ్రామాలకు చేర్చడంతోపాటు, అధికార బృందాలను ఏర్పాటు చేస్తారు.

ఏ గ్రామంలో ఏ రోజు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారో కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఈ విషయాన్ని పత్రికా ప్రకటనల ద్వారా, ఇతర ప్రచార సాధనాల ద్వారా, డప్పు చాటింపు ద్వారా, ఫ్లెక్సీలు, ఇతర మార్గాల ద్వారా ప్రజలకు తెలుపుతారు.
tsmagazine

ఆయా గ్రామాల పాస్‌ పుస్తకాల సంఖ్య ఆధారంగా ఏ గ్రామానికి ఎన్ని అధికారుల బృందాలను పంపాలనే విషయంలో కూడా కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. 300 పాస్‌ పుస్తకాలకు ఒకటి చొప్పున బృందాన్ని నియమించి, ఒకే రోజులో అందరికీ పంపిణీ చేస్తారు. రైతులకు పాస్‌ పుస్తకం, చెక్కులు ఇచ్చి వారి సంతకాలు తీసుకుంటారు. ఆ రోజు గ్రామంలో రైతులు లేకుంటే తర్వాత వాటిని మండల కార్యాలయంలో మూడు నెలల వరకు అందుబాటులో ఉంచి అందిస్తారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి 8వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని అత్యంత చిత్తశుద్ధితో, ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను కోరారు. రెవిన్యూ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమకోర్చి 100 రోజులపాటు గ్రామాల్లో పర్యటించి, భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారని, దాని ఆధారంగా వచ్చిన వివరాలతో పాస్‌ పుస్తకాలు రూపొందించారని సీఎం చెప్పారు. అలా రూపొందించిన పాస్‌ పుస్తకాలను రైతులకు అందించడంతో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి సార్థకత చేకూరుతుందని సీఎం అన్నారు. అన్ని భూ వివరాలతో ‘ధరణి’ వెబ్‌సైట్‌ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు.

‘రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రతీ ఏటా ఎన్నో అగచాట్లు పడతారు. అప్పుకోసం ఎన్నో తిప్పలు పడతారు. ఏ కారణం చేతనైనా పంట చేతికి రాకపోతే పెట్టిన పెట్టుబడిని నష్టపోతారు. దీంతో ఆర్థికంగా మరింత కృంగిపోతారు. ఈ పరిస్థితి నివారించడానికి, ఆర్థికంగా భారమైనప్పటికీ రైతులకు పంట పెట్టుబడి అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం పంట సీజన్‌ ప్రారంభం కాకముందే ప్రభుత్వం అందించే సాయం వారి చేతిలోఉండాలి. అప్పుడే రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు. కాబట్టి ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని, రైతుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం కష్టపడి పాస్‌ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు టి. హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జీ జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్‌రెడ్డి, బి. గణేష్‌గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, పార్థసారథి, రాజేశ్వర్‌తివారి, వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌మోహన్‌, భూపరిపాలన విభాగం డైరెక్టర్‌ వాకాటి కరుణ, ఐటీ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

నగదు చెల్లించని బ్యాంకులపై చర్యలు: సీఎం
అసైన్డ్‌ భూముల లబ్దిదారులు, ఆర్వోఆర్‌ పట్టాదారులు, ఏజెన్సీ ఏరియాలో వ్యవసాయం చేసే గిరిజనేతరులతో సహా పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్‌ పుస్తకాలు, పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఆర్థిక సహాయం అందించే చెక్కులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల నాయకత్వంలో జిల్లా అధికార యంత్రాంగమంతా తమ శక్తియుక్తులను, వ్యూహ చతురతను పూర్తిస్థాయిలో వినియోగించి మే 10నుంచి వారం రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

‘ప్రగతిభవన్‌’లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు, వివిధశాఖల ముఖ్య అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పాల్గొన్నారు. పాస్‌ పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమ నిర్వహణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

‘దేశంలోనేకాదు, ప్రపంచంలోనే ఎవరూ ఎత్తుకోని భారం మనం ఎత్తుకున్నాం. భూ రికార్డులను సర్వే చేసి, కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీ చేయడం, రైతులకు పెట్టుబడి ఇవ్వడంలాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ ఎవరూ నిర్వహించలేదు. కాబట్టి మనకు గతానుభవం లేదు. ఈ కార్యక్రమాలను మనమే రచించుకుని అమలు చేస్తున్నాం. కాబట్టి అతి జాగ్రత్తగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి. దార్శనికతతో కార్యాచరణ రూపొందించుకోవాలి’ అని ముఖ్యమంత్రి కోరారు.

’58 లక్షల పాస్‌ పుస్తకాలు, చెక్కుల పంపిణీ చేయాల్సి ఉంది. నెలాఖరు వరకు పాస్‌ పుస్తకాలు, చెక్కుల ముద్రణ పూర్తవుతుంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా బుక్కులు, చెక్కులు వస్తాయి. వాటిని జిల్లాల్లో భద్రపరిచి, గ్రామాలకు చేర్చాలి. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే బ్యాంకులనుంచి నగదు పొందేందుకు ఏర్పాట్లు చేశాం. పంట పెట్టుబడి మద్దతు పథకంకోసం రూ. 12వేల కోట్లను బడ్జెట్‌లో పెట్టుకున్నాం. మొదటి దఫా వర్షాకాలం పంట పెట్టుబడికోసం రూ. 6వేల కోట్లను సమీకరించాం. ఈ డబ్బులు బ్యాంకుల్లో సిద్ధంగా ఉన్నాయి. రైతులు చెక్కు ఇచ్చిన వెంటనే బ్యాంకులో నగదు చెల్లించాలి. లేనట్లయితే బ్యాంకులపై చర్యలు తీసుకుంటాం. తొలకరి వర్షాలు కురవడానికి ముందే రైతుల చేతిలో డబ్బులుండాలి. అందుకోసమే మే మాసంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.

‘మీ జిల్లాలకు వచ్చే పాస్‌ పుస్తకాలు, చెక్కులను కలెక్టర్లు పరిశీలించాలి. తప్పులు లేకుండా చూసుకోవాలి. అన్ని గ్రామాల బుక్కులు, చెక్కులు వచ్చాయో లేదో సరి చూసుకోవాలి. ప్రతీ 300 పాస్‌ పుస్తకాల పంపిణీకి ఒక బృందం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2762 బృందాలను ఏర్పాటు చేయాలి. ఆ గ్రామ రైతుల సంఖ్య ఆధారంగా ఎన్ని బృందాలు వేయాలనే విషయాన్ని కలెక్టర్లు నిర్ధారించాలి. ప్రతీ బృందంలో ముగ్గురు సభ్యులుండాలి. అన్ని మండలాల్లో కార్యక్రమం అమలు కావాలి. పంపిణీ కార్యక్రమం నిర్వహించే బృందాలకు జిల్లాలవారీగా శిక్షణ ఇవ్వాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలి. ఏ రోజు ఏ గ్రామంలో పంపిణీ ఉంటుందో ముందే నిర్ణయించి, ప్రజలకు సమాచారం ఇవ్వాలి. పేపర్లలో ప్రకటనలద్వారా, ఫ్లెక్సీలద్వారా ఈ వివరాలు తెలపాలి. గ్రామంలో పంపిణీ కార్యక్రమం చేపట్టినప్పుడు ఎవరైనా చెక్కులు, బుక్కులు తీసుకోకుంటే వారు తహసీల్దార్‌ కార్యాలయంలో పొందే విధంగా ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూములను సాగు చేసుకుంటున్న రైతులకు, ఆర్వోఆర్‌ పట్టాలున్న రైతులకు, ఏజెన్సీ ఏరియాలో వ్యవసాయం చేసే గిరిజనేతరులకు కూడా పెట్టుబడి మద్దతు చెక్కులు అందివ్వాలి. పట్టాదారులైన రైతులతోపాటు అసైన్డ్‌ దారుల జాబితా, ఆర్వోఆర్‌ పట్టాదారుల, గిరిజనేతరుల జాబితా రూపొందించి,వారికి కూడా చెక్కులు అందివ్వాలి. ఎవరైనా రైతుకు 50వేల రూపాయలకన్నా ఎక్కువ సహాయం అందించాల్సివస్తే, వారికి రెండు చెక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. 50వేల లోపు మొత్తానికి చెక్‌, 50వేలపైన మొత్తానికి మరో చెక్‌ ఇవ్వాలి. పాస్‌ పుస్తకాలు, చెక్కులు పొందిన వారినుంచి రశీదు తీసుకోవాలి. పంపిణీ సందర్భంగా ఎక్కడ ఏమైనా పొరపాట్లు జరిగినా, ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు తలెత్తినా వారి బాధ, సమస్య వినడానికి గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలి. గ్రామాల్లోని పాఠశాలల్లో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించాలి. అక్కడ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలి. చెక్కు ఇచ్చిన వెంటనే నగదు ఇచ్చేలా ఏర్పాట్లు చేయడానికి కలెక్టర్లు వెంటనే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి. చెక్కులిచ్చిన రైతులకు నగదు ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లకు ముందుగానే స్పష్టం చేయాలి. కొంతమందిరైతులు పెట్టుబడి మద్దతు వద్దు అని కూడా స్వచ్ఛంధంగా ప్రకటిస్తున్నారు. ఆ సొమ్ము ను రైతు సమన్వయ సమితి మూలధనంగా మార్చుకోవాలి’ అని ముఖ్యమంత్రి వివరించారు.

‘తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి చేయడంకోసం, రైతు సంక్షేమంకోసం దేశంలో మరే రాష్ట్రం తీసుకోని నిర్ణయాలెన్నో తీసుకుని అమలు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా రైతులు నిరాశ, నిస్పృహలో ఉన్నారు. గిట్టుబాటు ధర రాక వివిధ దేశాల్లో పంటలను రోడ్లపై పారబోసుకుంటున్నారు. పెట్టుబడి కూడా తిరిగిరాక నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం రైతుకు పెట్టుబడి అందించే కార్యక్రమం చేపట్టాం. ఈ పథకం అందరి ప్రశంసలు పొందుతున్నది. ప్రముఖ ఎకానమిస్ట్‌ అశోక్‌ గులాటి కూడా తెలంగాణ అనుసరిస్తున్న విధానం అందరికీ ఆదర్శమని ప్రకటించారు. పంటపోయినా సరే, రైతులు నష్టపోకుండా ఉంటారు. కాబట్టే ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా రైతులను కాపాడడానికి ఎకరానికి 8వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘పంటల సాగులో అవగాహన, శిక్షణ అందించ డానికి, గిట్టుబాటు ధర రావడానికి ప్రభుత్వం రైతులను సంఘటిత పరచడానికి రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశాం. ప్రతీ ఐదువేల ఎకరా లకు ఒకరు చొప్పున 2638 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాం. ఒక్కో క్లస్టర్లో ఒక్కో రైతు వేదిక నిర్మిస్తున్నాం. వీటన్నింటినీ వినియో గించుకోవాలి. మార్కెట్లో పంటను తీసుకొచ్చి, గిట్టుబా టు ధర వచ్చే విధంగా చేయడం, రైతులకు ఎప్పటిక ప్పుడు శిక్షణ, అవగాహన కల్పించడం, క్రాప్‌ కాలనీల ఏర్పాటు తదితర విషయాల్లో రైతు నమస్వయ సమితు లను వినియోగించుకోవాలి’ అని సీఎం కోరారు.

58 లక్షలు : పంపిణీ చేయాల్సిన పాస్‌ పుస్తకాలు, చెక్కులు
8,25,571 : ప్రతీరోజు పంపిణీ చేయాల్సిన పాస్‌ పుస్తకాలు, చెక్కులు
2,762 : ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాటయ్యే బృందాలు
300 : ఒక్కో బృందం ఒక్కో రోజు జారీ చేసే పాస్‌ పుస్తకాలు, చెక్కులు
10,323 : పంపిణీ కార్యక్రమం జరిగే మొత్తం గ్రామాలు
1,546 : ఒక్కో రోజు పంపిణీ కార్యక్రమం జరిగే గ్రామాలు