వర్థమాన ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం

kcr

ఏ దేశమేగినా ఎందు కాలిడినా/ ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా

పొగడరా నీ తల్లి భూమి భారతిని/ నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ…

ప్రతీ భారతీయ పౌరుడికీ కర్తవ్యబోధ చేసే పద్యపాదం ఇది. ప్రఖ్యాత తెలుగుకవి రాయప్రోలు సుబ్బారావు అందించిన ఈ అక్షరాల్లోని స్పూర్తి చైనాలో పర్యటించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రసంగంలో ప్రతిధ్వనించింది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ తన వార్షిక సదస్సును ఈ ఏడాది చైనాలోని డాలియన్‌లో నిర్వహించింది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా భారతదేశం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు ఆహ్వానం అందింది. దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఈ ఆహ్వానం రాలేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా, కేవలం ఓ ముఖ్యమంత్రిగానే కాకుండా సంపూర్ణ భారతీయుడిగా కేసీఆర్‌ వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకున్నది.

సంపన్న దేశాలుగా చలామణి అవుతున్న చాలా దేశాలు ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సందర్భంలో వర్థమాన ఆర్థిక వ్యవస్థలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఏ మార్గాన్ని అనుసరించాలో తెలియడం లేదు. కేవలం దేశాలే కాకుండా, ఆర్థిక సంస్థలు కూడా అయోమయంలో ఉన్న సందర్భంలో ఈ సదస్సు నిర్వహించారు. ‘‘ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఇన్‌ క్రాస్‌ రోడ్స్‌(దిక్కుతోచని స్థితిలో వర్థమాన ఆర్థిక వ్యవస్థలు’’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ‘‘వర్థమాన ఆర్థిక వ్యవస్థలన్నీ ఎటువైపు వెళ్లాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. సరైన దారికోసం వెతుకుతున్నాయి. అలాంటి వ్యవస్థకు ఓ దారి చూపించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ఆశిస్తున్నాం. మీరు కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలో అద్భుత ఆర్థిక వృద్ధి సాధిస్తున్నారు. మీ అనుభవాలు వర్థమాన ఆర్థిక వ్యవస్థకు తోడ్పడతాయి. భవిష్యత్‌ ను నిర్మించుకునేందుకు ఉపయోగపడతాయి’’. చైనాలో జరిగే సదస్సుకు రమ్మని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకు గత జూలైలో రాసిన లేఖలో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫిలిప్‌ రోస్లర్‌ పొందుపరిచిన పదాలివి.

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఆహ్వానం మేరకు చైనాకు వెళ్లిన ముఖ్యమంత్రి సెప్టెంబర్‌ 9న జరిగిన సదస్సులో మాట్లాడారు. పరనింద, ఆత్మస్తుతి నిండుగా ఉండే రాజకీయ నాయకుల సహజ ప్రసంగాలకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు చైనా సదస్సులో తన అభిప్రాయాలు వెల్లడించారు. నిండైన భారతీయ పౌరుడిగా, ఆర్థిక వ్యవస్థపై సంపూర్ణ అవగాహనతో, దేశాభివృద్ధి ప్రణాళికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చక్కని ఆలోచనలతో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్దికి తీసుకుంటున్న చర్యలు వివరిస్తూనే ప్రపంచ దేశాలకు భారతదేశం మార్గదర్శకంగా నిలుస్తున్నదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రపంచంలోని అనేక ఆర్థిక వ్యవస్థలు అయోమయంలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం అలా లేదని, నిలకడైన ఆర్థికాభివృద్ధితో ముందుకు పోతున్నదని సగర్వంగా ప్రకటించారు. భారతదేశ ఫెడరల్‌ స్పూర్తిని కూడా వివరించారు.

‘‘భారతదేశంలో రాష్ట్రాలది చాలా కీలకమైన పాత్ర. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చాలా విధులు, అధికారాలు, బాధ్యతలు అప్పగించింది. గతంలో ఉండే ప్రణాళిక సంఘం స్థానంలో రాష్ట్రాలకు ఎక్కువ భాగస్వామ్యం కలిపిస్తూ నీతి అయోగ్‌ అనే వ్యవస్థ వచ్చింది. ప్రధాన మంత్రి అధ్యక్షుడుగా ఉండే నీతి అయోగ్‌ లో ముఖ్యమంత్రులంతా సభ్యులు. దీన్ని మేము టీమ్‌ ఇండియాగా పిలుస్తున్నాము. మేమంతా కలిసి దేశ స్థూలాభివృద్ధికి, అదే సందర్భంలో రాష్ట్రాల పురోగతికి కావల్సిన కార్యాచరణను రూపొందిస్తాం. ఫెడరల్‌ వ్యవస్థ కలిగిన ఇండియాలాంటి దేశాల్లో రాష్ట్రాలది చాలా ముఖ్యమైన పాత్ర. మా రాష్ట్రం విషయాన్నే తీసుకుంటే… భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ కొత్తగా ఇటీవలే ఏర్పడింది. మేము అద్భుతమైన పారిశ్రామిక విధానం తీసుకొచ్చాము. దీనికోసం మా శాసనసభలో చట్టం చేశాము. రెండు వారాల్లోనే అనుమతులిచ్చే పద్ధతి తెచ్చాం. పెట్టుబడిదారులకు పారిశ్రామిక అనుమతులు సాధించడమనేది మా రాష్ట్రంలో ఓ హక్కు. ఇప్పటికే ఈ విధానం ద్వారా కేవం మూడు నెలల కాలంలోనే 56 కంపెనీలకు అనుమతులిచ్చాము. వీటి ద్వారా దాదాపు 2 బిలియన్ల డాలర్ల (రూ.12,000 కోట్లు) పెట్టుబడులు వస్తున్నాయి. ఇది దేశాభివృద్ధికి దోహదపడే విషయం. రాష్ట్రాలు ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటే దేశం ముందుకుపోతుంది. ఇది ప్రపంచానికి భారతదేశ వైఖరిని వెల్లడిస్తున్నది. భారతదేశం పెద్దసంఖ్యలో వినియోగదారులున్న దేశం మాత్రమే కాదు, ఎగుమతులకు ఎక్కువ అవకాశం ఉన్న దేశమని నేను ఖచ్చితంగా చెప్పగను. మా దేశం చాలా నిలకడగా పురోగమిస్తున్నది. ఈ పయనం ఖచ్చితంగా ఇలాగే సాగుతుంది. ముఖ్యమంత్రిగా గుజరాత్‌ ను అభివృద్ధి పథంలో నడిపిన సంస్కరణాభిలాషి అయిన ప్రధానమంత్రి మాకున్నారు’’ అని ముఖ్యమంత్రి వరల్డ్‌ ఎకమిక్‌ ఫోరమ్‌ సదస్సులో అన్నారు. 90 దేశాల నుంచి వచ్చిన 1500 మంది ప్రతినిధుల సమక్షంలో కేసీఆర్‌ చాలా తక్కువ సమయంలో చాలా సూటిగా భారతదేశ ప్రగతిపథాన్ని ఆవిష్కరించారు. దేశంలోని ఓ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్న తీరును వివరించారు. తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ పొరుగుదేశం వెళ్ళినప్పుడు భారతీయ పౌరుడిలాగానే మెలగాలని నిర్ణయించుకుని, అందుకు తగ్గట్టుగా ప్రవర్తించారు. భారతదేశం, తెలంగాణ గురించే కాదు. చైనా నుంచి మొదుకుని ప్రపంచ దేశాల ఆర్థిక గమనం గురించి కూడా ముఖ్యమంత్రి అత్యంత కీకమైన అభిప్రాయాలు వెల్లడించారు.

‘‘ఎక్కడైనా ఎగుడు దిగుడు సహజం. వాటిని ఎదుర్కొని నిబడాలి. చైనా అలాగే చేసింది. 30 సంవత్సరాల కింద చైనా వేరు. ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచమే చైనా వైపు చూస్తున్నది. ప్రతీ ఒక్కరూ చైనా నుంచి నేర్చుకోవాలి. అసలు చైనా నుంచి నేర్చుకోకుండా వదిలిపెట్టే అంశమేమైనా ఉన్నదా? ప్రతీ విషయాన్నీ చైనా నుంచి నేర్చుకోగలం. మేము కూడా మా దేశానికి తగ్గట్టు ఎదుగుతామనే నమ్మకం మాకుంది.’’ అని కూడా ముఖ్యమంత్రి అన్నారు. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం… అతి పెద్ద ఆయిల్‌ దిగుమతిదారులం అయిన భారత్‌ కు ఉపయోగపడే అంశమని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి ఉన్నదని ముఖ్యమంత్రి అన్నారు. తన ప్రసంగంలో భాతరదేశ గొప్పతనాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను, పురోగతిని వివరించిన ముఖ్యమంత్రి మంచి ఎక్కడున్నా స్వీకరించే గుణం తమకున్నదని చైనా నుంచి నేర్చుకుంటామనే సంకేతం ద్వారా తెలిపారు.
దేశంపైన, ప్రపంచంపైన తనకున్న అభిప్రాయాలు చెప్పే క్రమంలోనే కేసీఆర్‌ ఎక్కడా తొట్రుపాటుకు కానీ, మొహమాటానికీ కానీ పోలేదు. ఉన్నదున్నట్లు కుండబద్దలు కొట్టినట్లే చెప్పారు.

‘‘వేరే దేశాల ఆర్థిక వ్యవస్థలు గందరగోళంలో ఉండవచ్చు నేమో. కానీ మా భారతదేశం మాత్రం దిక్కుతోచని(క్రాస్‌ రోడ్స్‌) స్థితిలో ఎంతమాత్రం లేదు. మా ప్రభుత్వం సంస్కరణ దిశగా పోతున్నది. చాలా వేగంగా ముందుకుపోతున్నాం. ఆయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల మాకు చాలా డబ్బులు ఆదా అవుతాయి. వీటి ద్వారా పేద ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మెరుగుపర్చే అవకాశం చిక్కింది. సామాజికాభివృద్ధికి, దేశాభివృద్దికి దోహదపడే అభివృద్దికే మా ప్రాధాన్యం ఉంటుంది. పేదలు పేదలుగానే మిగిలిపోయి, ధనవంతులు మరింత ధనవంతులుగా మారే వ్యవస్థలో సమూలమైన మార్పు రావాలి. సమాజంలో పేదల గౌరవాన్ని కూడా కాపాడాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పిన మాటల్లో దేశం అభివృద్ధి చెందడమంటే, ఆ దేశంలోని పేదల స్థితిగతుల్లో మార్పు రావడం అని తేల్చి చెప్పారు. ఆయిల్‌ ధరల్లో తగ్గుదల వచ్చినందున ఆ అవకాశాన్ని పేదల కోసం ఉపయోగించుకోవాలనే సందేశాన్ని కూడా కేసీఆర్‌ చైనా వేదిక నుంచి భారత ప్రభుత్వానికి పంపినట్లయింది. పేదల ఆత్మగౌరవం కాపాడడమే అభివృద్ధి లక్ష్యంగా మారాలని కూడా కేసీఆర్‌ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలు చేసే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు, వాటర్‌ గ్రిడ్‌ పథకం, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నదని, ప్రపంచం కూడా అలాగే ఆలోచించాలని కేసీఆర్‌ చెప్పారక్కడ. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై ముఖ్యమంత్రి భారతీయతను చాటిచెప్పారు. తెంగాణ రాష్ట్ర పురోగతిని విడమరిచి చెప్పారు. చైనా సాధించిన ప్రగతిని కీర్తించారు. ఈ సదస్సుతో కేసీఆర్‌ మహోన్నత వ్యక్తిత్వం కూడా బయటపడింది. తెలంగాణ ఉద్యమ నాయకుడిగానే ప్రపంచానికి పరిచయమైన కేసీఆర్‌ గొప్ప దేశభక్తుడని, ఎక్కడికి పోయినా చాలా విశాల భావాలున్న దేశ పౌరుడిలా వ్యవహరిస్తారని రుజువైంది. అంతేకాదు. రాష్ట్రం, దేశం గురించే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు అవలంభించాల్సిన విధానాలపై కూడా అవగాహన కలిగి చొరవ చూపించే ప్రపంచ పౌరుడిగా కేసీఆర్‌ కొత్తగా పరిచయమయ్యారు.

ఏ రోజు ఏం చేశారు?

సెప్టెంబర్‌ 7న హైదరాబాద్‌ నుంచి బయుదేరిన కేసీఆర్‌ 16న తిరిగి వచ్చారు. పది రోజుల పర్యటనలో భాగంగా చైనాలోని డాలియన్‌, షాంఘై, బీజింగ్‌, షెన్జెన్‌, హాంగ్‌ కాంగ్‌ నగరాల్లో పర్యటించారు. పలు పారిశ్రామిక వాడల్లో కలియతిరిగారు. వివిధ కంపెనీ ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు.

సెప్టెంబర్‌ 7 :
హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో 16 మంది బృందంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చైనా పర్యటనకు వెళ్లారు. ఉదయం పదిగంటలకు బయలుదేరి సాయంత్రానికి చైనాలోని డాలియన్‌ చేరుకున్నారు. ముఖ్యమంత్రితో చైనాకు వెళ్లిన వారిలో శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనచారి, శాసనమండలి చైర్మన్‌ జి.స్వామిగౌడ్‌, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్‌ శాఖ మంత్రి జి. జగదీష్‌ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌ కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, టిఎస్‌ఐఐసి ఎండి ఇ.వి.నర్సింహరెడ్డి, సిఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి తదితరులున్నారు.

సెప్టెంబర్‌ 8:
— చైనాలోని ప్రముఖ బహుళజాతి సంస్థ లియో గ్రూప్‌ సంస్థ చైర్మన్‌ లియో వాంగ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో డాలియన్‌ లో సమావేశమయ్యారు. తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలతో భారీ సైజు పైపుల తయారీ కేంద్రాలను ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

— లియోనింగ్‌ ప్రాంతంలోని 30 కంపెనీ సిఇవోలు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలు, తమ కంపెనీల పరిస్థితిని పరస్పరం చర్చించుకున్నారు.

— చైనాలో భారత రాయబారి అశోక్‌ కె కాంతా ముఖ్యమంత్రిని కలిశారు. చైనాలో పరిస్థితిని, చైనా కంపెనీల శక్తి, సామర్థ్యాలను, తెలంగాణలో పెట్టుబడులు పెట్టే స్థోమత కలిగిన కంపెనీల గురించి వివరించారు.

సెప్టెంబర్‌ 9 :
— వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వ్యవస్థాపకుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు క్లాజ్‌ స్కావబ్‌ తో ముఖ్యమంత్రి ఉదయం పూట సమావేశమయ్యారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం లక్ష్యాలు, ఉద్దేశాలపై చర్చించారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో పెట్టుబడులకుండే అవకాశాలను, సానుకూలతను ముఖ్యమంత్రి వివరించారు. వచ్చే ఏడాది ఫోరమ్‌ సదస్సు హైదరాబాద్‌ లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్కావబ్‌ ను కోరారు. దీనికి ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చింది.
— స్కావబ్‌ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌ హిడ్లే స్కావబ్‌ తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ప్రపంచ వ్యాప్తంగా సమాజానికి ఉపయోగపడే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు స్కావబ్‌ ఫౌండేషన్‌ తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సామాజిక స్పృహ కలిగిన పారిశ్రామిక వేత్తలను ఏడాదికి ఒకరి చొప్పున ఫౌండేషన్‌ ఎంపిక చేసుకుని ప్రోత్సహిస్తున్నది. తెలంగాణలో సామాజిక పారిశ్రామిక వేత్తలు, సంస్థలు చాలా పనిచేస్తున్నాయని, ఏడాదికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కోరారు.

— వరల్డ్‌ ఎకమిక్‌ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సదస్సు ఉదయం పూట సెషన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. పట్టణాభివృద్ధి – సవాళ్లు అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను, తన వ్యూహాలను వెల్లడించారు. చైనాలోని ముఖ్య నగరాలైన గాంగ్జో, యువి తదితర నగరాల మేయర్లు ఈ చర్చలో పాల్గొన్నారు.

— సాయంత్రం సెషన్‌లో ‘ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఎట్‌ క్రాస్‌ రోడ్స్‌’ అనే అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పాల్గన్నారు.

సెప్టెంబర్‌ 10:
— డాలియన్‌ నుంచి ఉదయాన్నే ముఖ్యమంత్రి, ఇతర బృంద సభ్యులు షాంఘై చేరుకున్నారు. షాంఘై నగరం దేశంలోని పెద్ద నగరమే కాక, ఆ దేశ ఫైనాన్సియల్‌ హబ్‌ కూడా. విమానాశ్రయం నుంచి షాంఘై సిటీ వరకు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడిచే మెగ్లావ్‌ హైస్పీడ్‌ రైలులో ప్రయాణం చేశారు.

— షాంఘైలో న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు ప్రసిడెంట్‌ కెవి కామత్‌, వైస్‌ ప్రసిడెంట్‌ జియాన్‌ జులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణలో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే విషయంలోనూ, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలోనూ బ్యాంకు సహకారాన్ని ముఖ్యమంత్రి కోరారు.

— సిఐఐ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో సాయంత్రం సమావేశం జరిగింది. చైనాకు చెందిన 65 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సింగిల్‌ విండో పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి వివరించారు. పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ సదస్సులో పాల్గొన్న పలువురు చైనా పారిశ్రామిక వేత్తలు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని అభినందించారు.

— తెలంగాణలో 20 మిలియన్‌ డాలర్ల వ్యయంతో ఎల్‌.ఇ.డి. యూనిట్‌ స్థాపించేందుకు సెల్కాన్‌, మెకెనో కంపెనీు తెలంగాణ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఎంఓయు కుదుర్చుకున్నాయి.

— షాంఘై ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ వైస్‌ ప్రసిడెంట్‌ షావో ముఖ్యమంత్రిని కలిసి తెలంగాణలో అత్యుత్తమ సామర్థ్యం కలిగిన పంపు, ఎలక్ట్రిక్‌ పరికరాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

– చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ అంజు ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ డైరెక్టర్‌ యోగేష్‌ వా ముఖ్యమంత్రిని కలిశారు. తెలంగాణలో తమ కంపెనీ యూనిట్‌ స్థాపించేందుకు ముందుకు వచ్చారు. వారిని ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు.

సెప్టెంబర్‌ 11:

— ముఖ్యమంత్రితో వెళ్లిన బృందంలోని సభ్యులు సుజో ఇండస్ట్రియల్‌ పార్కును సందర్శించారు. 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చైనా – సింగపూర్‌ దేశాలు సంయుక్తంగా నెలకొల్పిన ఈ పార్కు దేశంలోని అతి ముఖ్యమైన ఆర్థిక సహకార ప్రాజెక్టుగా పేరు పొందింది. భూలోకంలోని స్వర్గంగా పిలువబడే సుజో నగరంలో ఉన్న ఈ పార్కు దేశ ప్రముఖ పర్యాటక ప్రాంతంల్లో కూడా ఒకటి. దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. తెలంగాణ బృంద సభ్యులు చైనా – సింగపూర్‌ ఇండస్ట్రియల్‌ పార్కు కమిటీ సభ్యుడు యు సే జెన్‌ తో సమావేశమయ్యారు.

— షాంఘై నుంచి చైనా రాజధాని బీజింగ్‌ చేరుకున్న ముఖ్యమంత్రి బృందం భారత రాయబారి అశోక్‌ కె కాంత మర్యాదపూర్వకంగా ఇచ్చిన విందులో పాల్గొన్నారు. చైనా సందర్శించే భారత ప్రముఖులు సంతకాలు చేసే రిజిష్టర్లో ముఖ్యమంత్రి సంతకం చేశారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న తర్వాత చైనాకు చెందిన చాలా మంది పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని అశోక్‌ కె కాంత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు తెలిపారు.

సెప్టెంబర్‌ 12:

— రఫెల్స్‌ బీజింగ్‌ హోటల్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చైనాకు చెందిన చాలా కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. చాంగ్‌ కింగ్‌ ఇంటర్నేషనల్‌ కన్‌ స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌, ఇన్పుర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌, చైనా ఫార్య్చూన్‌ లాండ్‌ డెవప్‌ మెంట్‌ కంపెనీ, చైనా రైల్వే కార్పొరేషన్‌, ఎస్‌.ఎ.ఎన్‌.వై. గ్రూపు ప్రతినిధులు ముఖ్యమంత్రితో మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి వారికి తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించారు. సమావేశం సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వారికున్న ఆసక్తిని వెల్లడించారు.

— బీజింగ్‌ లోని చైనా దేశపు చారిత్రక రాజభవనమైన ఫోర్బిడెన్‌ సిటీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. మింగ్‌ రాజవంశం నుంచి మొదలుకుని క్వింగ్‌ రాజవంశం వరకు చైనాను పాలించిన రాజులు ఈ భవనంలోనే ఉండేవారు. బీజింగ్‌ నడిమధ్యలో ఉండే ఈ రాజభవనాన్ని ప్రస్తుతం మ్యూజియంగా మార్చారు. ఈ నిర్మాణం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.

సెప్టెంబర్‌ 13:

— బీజింగ్‌ లోని తియానన్మెన్‌ స్క్వేర్‌, గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా తదితర పర్యాటక ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు.

— బీజింగ్‌ నుంచి సాయంత్రానికి షెన్జెన్‌ చేరుకున్నారు.

సెప్టెంబర్‌ 14:

— షెన్జెన్‌ హైటెక్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. ఇందులో అంతర్భాగంగా ఉన్న ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ జడ్‌.టి.ఇ. కార్పొరేషన్‌ లో కలియతిరిగింది. వైర్‌ లెస్‌, ఎక్స్చేంజ్‌, ఆక్సెస్‌,ఆప్టికల్‌ ట్రాన్స్‌ మిషన్‌, డాటా టెలికమ్యూనికేషన్స్‌ గేర్‌, మోబైల్‌ ఫోన్స్‌, టెలికమ్యూనికేషన్స్‌ సాఫ్ట్‌ వేర్‌ తదితర రంగాల్లో జడ్‌.టి.ఇ. కార్పొరేషన్‌ పనితీరును పరిశీలించారు. ఇలాంటి కార్పొరేషన్‌ను తెంగాణలో కూడా నెలకొల్పే విషయంలో కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చలు జరిపారు.

— షెన్జెన్‌ హైటెక్‌ ఇండస్ట్రియల్‌ పార్కు, చైనా కౌన్సిల్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ప్రతినిధులతో ముఖ్య మంత్రి చర్చలు జరిపారు. అంతర్జాతీయ వ్యాపారం, ఆర్థిక పరిస్థితులపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.

— సాయంత్రం షెన్జెన్‌ నుంచి హాంకాంగ్‌ చేరుకున్నారు. హాంగ్‌ కాంగ్‌లో ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ ప్రశాంత్‌ అగర్వాల్‌ ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికారు.

సెప్టెంబర్‌ 15:

— ‘బిజినెస్‌ అపార్చునిటీస్‌ ఫర్‌ హాంగ్‌ కాంగ్‌ కంపెనీస్‌ ఇన్‌ ద స్టేట్‌ ఆఫ్‌ తెంగాణ’ అనే అంశంపై హాంగ్‌ కాంగ్‌ లోని రినైసన్స్‌ హార్బర్‌ వ్యూ హోటల్‌ లో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం, సింగిల్‌ విండో సిస్టమ్‌, టిఎస్‌ ఐపాస్‌ చట్టం, సిఎంఓలో చేజింగ్‌ సెల్‌ తదితర విషయాలపై ముఖ్యమంత్రి అక్కడి పారిశ్రామిక వేత్తలకు వివరించారు. తెలంగాణ పారిశ్రామిక విధానంపై రూపొందించిన ఐదు నిమిషాల సిడిని వారికి చూపించారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ వివరించారు. సదస్సులో పాల్గొన్న పలువురు పారిశ్రామిక వేత్తలు అనేక అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. హాంగ్‌ కాంగ్‌ లోని ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ అరుణాచలం ముగింపు సందేశం ఇచ్చారు.

— లాంటా ద్వీపంలో నాంగ్‌ పింగ్‌ వద్ద నెలకొల్పిన టియాన్‌ టన్‌ బుద్ధ అని పిలువబడే అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని ముఖ్యమంత్రి బృందం తిలకించింది.

సెప్టెంబర్‌ 16:

— ముఖ్యమంత్రి బృందం హాంగ్‌ కాంగ్‌ నుంచి హైదరాబాద్‌ బయలు దేరింది. రాత్రి 8.30 గంటలకు ముఖ్యమంత్రి, ఇతర బృంద సభ్యులు శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్నారు.

గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా

బండరాళ్లు, ఇటుకలు, కలప, మట్టి తదితర పదార్థాలతో నిర్మించిన వరుస కోటల సముదాయం గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా. చుట్టు పక్కల రాజ్యాల నుంచి, ముఖ్యంగా మంగోలియన్ల దాడులను నివారించుకోవడానికి చైనా రాజు ఉత్తర సరిహద్దు వెంట తూర్పు నుంచి పడమర దిశగా ఈ కోటను నిర్మించారు. దాదాపు 8851 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన మానవ నిర్మిత కట్టడంగా గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా నిలుస్తున్నది. క్రీస్తుపూర్వం 221లో మొదలు పెట్టి 15 వందల సంవత్సరాల పాటు గోడను కట్టారు. ఒకప్పుడు చిన్న చిన్న రాష్ట్రాలుగా ఉండే చైనాను ఒకే సామ్రాజ్యంగా మార్చిన చక్రవర్తి పిహూయాంగ్‌ గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా నిర్మాణానికి రూపకర్త.

టియాన్‌ టన్‌ బుద్ధ

హాంగ్‌ కాంగ్‌ లోని లాంటా ద్వీపంలో నాంగ్‌ పింగ్‌ ప్రాంతంలో బుద్ధుడి అతిపెద్ద కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. 1990లో ప్రారంభమయి 1993లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ బుద్ధ విగ్రహం మనిషికి-ప్రకృతికి, ప్రజలకు – నమ్మకానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి గుర్తుగా నిలుస్తుంది. చైనా దేశపు ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ఈ ప్రాంతం బుద్ధిజానికి కేంద్రంగా కూడా భాసిల్లుతున్నది. 112 అడుగు పొడవు, 250 మెట్రిక్‌ టన్నుల బరువు, 202 కాంస్యపు కడ్డీలు కలిగి ఉన్నదీ విగ్రహం. ఈ బుద్ధ విగ్రహాన్ని చేరుకోవడానికి సందర్శకులు 268 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.