| |

వాన.. వాన.. ఇరుగదంచిన వాన..

ennela-eluguమస్తువానలు వస్తే కుంటలు చెర్లు రోడ్లు తెగేకాడ తెగుతయి. కాలం వచ్చినప్పుడు గట్టిగ లేనికాడ తెగుతది. దాంతోని కొంత నష్టం ఉంటది. ఉండనియి కని, వాన మంచిదే రావాలె, పడాలె వానల్ల మనందరం తడవాలె. కొంత అక్కడక్కడ కొన్ని పంటలు మునిగిపోతయి కొన్ని పంటలు సుత ఖరాబు అయితయి.

ఇరుగదంచిన వానను చూస్తే ఎవలకైనా కండ్ల సంబురం.
అబ్బబ్బ ఏం వాన ఇదని బొచ్చెలు గుద్దుకోని మురిసినంత పనయ్యింది.
పొద్దుందాక తెల్లందాక వాన ఒకటే కుతి తీర కొట్టింది. ఊరు ఊరంత మా చెర్వులు నిండినయని సంబురపడ్డది. వాన మబ్బులను సూస్తేనే మనుసుల అంత సంతోషం అయితది. ముసురు మొదలై దంచుడు సుర్వు అయినంక, ఇండ్ల ముందలికెల్లి కాలువలు వరుద పారుతయి. బాయిలు బందాలకాన్నించి ఒర్రెలు పారుతయి. ఒర్రెలు, ఒర్రెలు కల్సి వాగుల పడుతయి. వాగు వంక నిండార్గపారి చెర్వు నింపుతయి. చెరువు నిండుచూలాలి లెక్క నవ్వుతది. నిండిన చెరువును సూస్తే ఎవల కళ వాల్లకే కన్పిస్తది. ఎవుసం చేసికునేటోల్లకు అయితె పండుగనే. చెరువుకింద పొలాలు ఉన్నోల్లకు ఇట్ల నాట్లేసి వస్తే అట్ల వడ్లు ఇంట్లకస్తయి. చెరవులు నిండితే పలుగు పట్టెటోళ్ళకు మస్తు ఖుషి. చెర్వు నిండితేనే ఊరంత బాయిలల్ల, బోర్లల్ల నీళ్ళు నిండుకుంటయి. ఎన్కటినుంచి చెర్లల్ల పూటిక నిండిపోయి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రెండేండ్లల్ల చెర్లకు కళచ్చింది. నీళ్ళచ్చినయి. ఇయ్యేడు చెర్లు డ్యాంలు నీళ్ళగంగాళం లెక్క అయినయి.

మనిషికి నీళ్ళకు విడదీయరాని సంబంధం ఉన్నది. నీళ్ళుంటేనే మనిషి వికాసం. అసలు ఎన్కట నీళ్ళతావు ఉన్న కాడనే ఎవుసాలు చేసిండ్రు. ఊరిని పొందిచ్చిండ్రు. ఎన్కట ఎవలకైనా ఎవుసమే పని, లేకుంటే ఆ ఎవుసానికి అవసరమైన పలుగుపార, కర్రు, గడ్డపార, నాగలి, కుండ, తోలు, దందెడ, చెప్పులు తయారు చేసిచ్చే పనులే మనుషుల వృత్తులు. ఇగ మనిషి అవసరమైన బట్టలు బాతలు చేసుడు మరోపని. ఇవన్నీ నీళ్ళుంటేనే, నీళ్ళు, వానలు చెరువులు, నదులు పచ్చగ ప్రవహిస్తేనే ఆ ఊరి మనుగడ. చెరువులు నాశనం అయినంక దానిని అనుబంధంగ ఉన్నయన్ని పురాగ అడివి అయినవి. ఇప్పుడు కథ వేరు. మన చెరువులు మన పారకాలు, మన నీళ్ళు మన భూములు జాగలు మన ఎద్దు ఎవుసం అంతా మనదేనాయె.

అంత మనదే అన్న ఆలోచన సుడి తిరుగుతున్న దశలోనే పురాగ ఎండిపోయిన చెర్లన్ని నిండారుగ నిండినయి. వానకాలం అయినంక చెట్లు గుట్టలన్ని పచ్చబడ్డయి. గుట్టలంటే యాదికచ్చింది. ప్రకృతి పుట్టినప్పటి నుంచే ఉన్న గుట్టలను మాయం చేసుడు అంటేనే పల్లెలు దు:ఖపడుతున్నయి. అసలు వానలు పడుడు సుత ఎట్లనంటే అంత ఎత్తున్న గుట్ట మొగులును తాకి మబ్బులను కురిపిచ్చి వానలు పడేస్తది. అది పోయినంక ఇగ ఎట్ల?

వానలు దంచికొట్టినంక చెర్లు కొప్పరంగ నిండి మత్తల్ల దునుకుతున్నయి. ఆ నీళ్ళు మల్ల ప్రాజెక్టుల నిండుతున్నయి. ప్రాజెక్ట్‌ల నీళ్ళు మల్లా పొలాలకు పారుతన్నయి. ఇంకా నాలుగైదు ఏండ్లకు మన ప్రాజెక్ట్‌లు కట్టుకం పురాగ అయితే అంతా పచ్చపచ్చని జీవకళ. ఎన్కటికాలంల వానకాలం యాట అయ్యేది. పెద్దకరువు కాటకాలు లెవ్వు చెర్లల్ల నీళ్ళు

ఉండేవి. దాంట్లనే ఈత నేర్చుకునేది. చెర్లనే గాలంతోని శాపలు పట్టెతందుకు పోయేది ఇంటికి పర్కలు, జల్లలు తెచ్చి పులుసు పెట్టు కొని తినేది. పర్యావరణం పురాగ ఖరాబు అయినంక వనాలు పోయినయి దాంతోని వానలు పోయినయి. మల్ల ఇప్పుడిప్పుడు వానలు వస్తన్నయి.

మస్తువానలు వస్తే కుంటలు చెర్లు రోడ్లు తెగేకాడ తెగుతయి. కాలం వచ్చినప్పుడు గట్టిగ లేనికాడ తెగుతది. దాంతోని కొంత నష్టం ఉంటది. ఉండనియి కని, వాన మంచిదే రావాలె, పడాలె వానల్ల మనందరం తడవాలె. కొంత అక్కడక్కడ కొన్ని పంటలు మునిగిపోతయి కొన్ని పంటలు సుత ఖరాబు అయితయి. కని ఏం చేస్తం వానలు పడుడే అందరికి కావల్సింది. కని వానలు రమ్మంటే రావు వద్దంటే పోవు. పాత ఇండ్లు గోడలు కూలిపోతయి పోతే కొత్తగోడలు ఇండ్లు కట్టుకోవచ్చు కని ప్యాదోల్లకు తిప్పల. ఎట్లనో నెగ్గుకురావాలె. వానలు పడుతె యాడ సూసినా నీళ్ళుంటయి నీళ్ళవల్ల అడవి పచ్చగైతది. కొత్త చెట్లు మొలుస్తయి, పెరుగుతయి. వాతావరణమే అంతా కొత్తగ కన్పిస్తది. నేలనేలంత జలంతో పచ్చని చెట్లతో పైరుపంటలతో కన్పించేది నీళ్ళ వల్లనే. మొగులు మీదికెల్లి నీళ్ళు వస్తేనే భూమి పొరలల్ల నీళ్ళు భూమిల నీళ్ళుంటే ఊరంత పండుగ పబ్బం. ఎవుసం పచ్చగుంటేనే దసరైనా-సంక్రాంతి అయిన బతుకమ్మ పండుగైనా అవ్వల్‌దర్జగ జరుపుకుంటం. ఇయ్యేడు బతుకమ్మ పండుగ బెహెత్రీన్‌గ ఆడినం పండుగలు, పబ్బాలు, పరిపాలన, కొత్త జిల్లాలు, కొత్త మండలాలతో, మన రాష్ట్రంలో, మన ఆనందర మనకే సొంతం.