వికారిలో బంగారు పంటలు

శ్రీ వికారి నామ సంవత్సరం చైత్ర, వైశాఖములలో పాలకులు ప్రజాభీష్టపాలనకై చూసారు. ధాన్యాదుల ధరలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాలలో రాజకీయ కల్లోలములు, జ్యేష్ఠాషాఢములలో భయోత్పాతములు, అచ్చటచ్చట ఖండవృష్టి, శ్రావణ, భాద్రపదములలో ప్రజాసౌఖ్యము, నదీనదములు జలపూర్ణముగా ప్రవహిస్తాయి. ధాన్యాదుల ధరలు నిలకడ కలిగి ఉంటాయి. ఆశ్వయుజ, కార్తికములలో రాజకీయ వైరుధ్యములు, భయోత్పాతములు, తుఫాన్‌ బాధ, ప్రమాదకర సంఘటనలు, రోగబాధలు, రసవస్తువుల ధరలు మధ్యమముగా నుండుట. మార్గశిర, పుష్యములలో హిమాధిక్యము, శీతాధిక్యము, పైరలు కలుగును. మాఘ ఫాల్గుణములలో దేశనాయకులకు ప్రాణభయము, వాయుసహితముగా జల్లులు పడవచ్చును. అచ్చటచ్చట స్వల్పముగా శిలావృష్టి కలుగును.

శనికిరాజ్య, అర్ఘాధిప, మేఘాధిప, దైవజ్ఞత్వములు. రవికి మంత్రి, సేనాధిప, గ్రామపాలకత్వములు. చంద్రునకు అపరసస్యాధిప, ధాన్యాధిపతిత్వములు. బుధునకు పూర్వ, సస్యాధిప, నీరసాధిప, పురోహిత, పరీక్షకత్వములు. గురువునకు గణకత్వము. శుక్రునకు రసాధిపతిత్వము, బలరామునకు పశుపాలక, స్థానరక్షకత్వములు, రోహిణీ నక్షత్రమునకు తటస్థితి. కాలపురుషునకు చాకలివారి గృహవాసము, ఆర్ద్రాప్రవేశము రాత్రికాలమునందు ప్రవేశము కలుగుట మొదలగు శుభాశుభ యోగములచే రాజకీయ నాయకులలో పరస్పర కలహాలు, రాజులు, రాజకీయ వేత్తలు, నాయకులు ఐక్యత లేనివారై పరస్పరము విరోధ భావము కలవారగుదురు. తీవ్రమగు యుద్ధభయము లేకుండును. అయినప్పటికి దేశరక్షణకై విశేషముగా ద్రవ్యమును వినియోగిస్తారు. ప్రభుత్వము ద్రవ్యోల్బణమును తగ్గించుటకు కృషిచేస్తుంది. నాయకులకు పదవీ చలనములు కలుగును. భూకంపాది ఉపద్రవములు, బ్రాహ్మణులు ఆస్తిక బుద్ధికలవారై ఉందురు. వ్యాపారరంగమున ధరలు నిలుకడ లేక అయోమయ స్థితి ఏర్పడుతుంది.

బంగారము మొదలగు అన్నిలోహములు, రసవస్తువులు, ధాన్యముల వెలలు తగ్గిహెచ్చును. ప్రజలకు తప్పని పన్నులబాధలు, ద్రవ్య వినియోగములలో మార్పులు, ప్రజాహిత కార్యములు చక్కగ నడుపుటకు నాయకులు యత్నించుదురు. రాజ, చోరాగ్ని బాధలు, భౌతిక విప్లవములు, పశువులకు పాడితక్కువ, తృణజలసమృద్ధి కలిగియున్నను బంగారు పంటలు పండును. తుపాన్‌, వాయుగుండముల వలన తీరవాసులకు సంకటముగా నుండును. జల, స్థలధాన్యములు, జొన్న, మక్క, జొన్న, సజ్జ, పెసలు, కందులు, మినుములు, నువ్వులు మొదలగునవి చక్కగా ఫలించును.

ఆషాఢ బ|| షష్ఠి మంగళవారం తేది 23-7-2019 రోజున పగలు గం.02-53ని||లకు

శుక్ర మౌఢ్యారంభమై భాద్రపద శు|| ఏకాదశి సోమ

తేది : 9-09-2019 రోజున తె.గం.4-39ని|| లకు శుక్ర మౌఢ్యత్యాగము కలుగును. మార్గశిర బ|| తృతీయ ఆది. తేది 15-12-2019 రోజున

ఉ.గం.05-57 ని||లలకు గురు మౌఢ్యారంభమై పౌష

శు|| చతుర్దశి గురు. తేది 09-1-2020 రోజున

ఉ. గం. 06-51ని||లకు గురు మౌఢ్యత్యాగము కలుగును.

చైత్ర బ|| అమావాస్య శని. తేది 04-05-2019 రోజున వాసుకర్తరీ ప్రారంభమై వైశాఖ బ|| దశమి బుధ.

తేది 29-05-2019 రోజున వాస్తుకర్తరీ త్యాగము కలుగును. జ్యేష్ఠ శు|| పంచమి శని.

తేది 08-06-2019 రోజున మృగశిరా కార్తె ప్రవేశము. కార్తిక బ|| అష్టమి సోమ. తేది 04-11-2019 రోజున రా.గం. 01-30ని||లకు గురువునకు ధనూరాశి ప్రవేశముచే సార్ధత్రికోటి పుష్కరవాహిని నదీ పుష్కరారంభము కలుగును. పుష్య బ|| పంచమి బుధవారము తేది 15-01-2020 రోజున ఉత్తరాయణ పుణ్యకాలము. ఆషాఢ శు|| పూర్ణిమ మంగళవారము తేది 16-07-2019 రోజున చంద్రగ్రహణము, మార్గశిర బ|| అమావాస్య గురువారము తేది 26-11-2019 రోజున సూర్యగ్రహణము. ఏకాఢక పరిమిత వర్షము, ద్వ్యాఢక పరిమిత వాయువు కలిగి సరాసరి 1/2 పాళ్ళుగా పంటలు ఫలించును.

– ఆకెళ్ళ జయకృష్ణ శర్మ సిద్ధాంతి