‘వికారి’ నవాబ్దరాగం – డా|| తిరునగరి

అందంగా హృదయం ఉంటే

అష్టావక్రుడుకూడా

అనంగునిలా కన్పిస్తాడు

నవాబ్ది ‘వికారి’గా వస్తేనేం

దృష్టి సుందరంగా ఉంటే

వికారి

వివ్వజన హృదయాహ్లాది

వికారి ! నిన్ను

పచ్చపచ్చగా హసించే

వన సీమలలో చూస్తున్నాను

పూచి పరిమళించే

మామిళ్ళతో చూస్తున్నాను

వనాలలో కిలకిలా రావాలుచేసే

పక్షులలో చూస్తున్నాను

మామిళ్ళ కొమ్మలపై ఊగుతూ

పాడుతున్న కోకిలలో చూస్తున్నాను

రా వికారీ!

రసరమ్యస్య కావ్యంగా

రా నవబ్దీ!

రమణీయగీతంగా

నా జనాల పెదవులపై

నవ్వులు పూయించే

నవమోహనరాగంగా

ఆరుకాలాలు శ్రమించే

అన్నదాత గరిసెనింపే

ధాన్యలక్ష్మిగా

పొద్దంతా చెమటోడ్చి పనిచేసే

కూలివాని

పొట్టనింపే

అన్నపు ముద్దగా

పేదవారి గుడిసెల్ని వెలిగించే

ఆశాదీపంగా

చెట్ల కింద బ్రతుకులీడ్చే

జీవితాలకు నీడ చూపించే

రెండు పడక గదుల నివాసంగా

రా వికారీ !

కోట్ల ఎకరాలను

సస్యశ్యామలం చేసే

‘మిషన్‌ కాకతీయ’గా

రా నవాబ్దీ !

ఇంటింటికీ తాగునీరందించే

‘మిషన్‌ భగీరథ’గా

రా వికారి!

నానేలకు

అభ్యుదయ పథం చూపించే

నవచైతన్య ఝరిగా

రా వికారీ !

నా సీమకు

శాంతి సౌభాగ్యాలు ప్రసాదించే

ఉగాది లక్ష్మిగా.