విఘ్నాలను పోగొట్టే ‘వినాయక చతుర్థి’ జగత్తును కాపాడే ‘కృష్ణాష్టమి’

డా|| అయాచితం నటేశ్వరశర్మ
tsmagazineఈ సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో రెండు ప్రధానమైన పండుగలు చోటు చేసుకున్నాయి. వాటిలో మొదటిది శ్రావణ బహుళాష్టమినాడు సంభవించే ‘కృష్ణాష్టమి’. దీనినే ‘గోకులాష్టమి’ అనికూడా అంటారు. రెండవది భాద్రపదశుద్ధ చతుర్థినాడు సంభవించే వినాయక చతుర్థి. ఈ రెండు పర్వదినాలూ లోకానికే శాంతి క్షేమాభ్యుదయదాయకాలు. సకల జనావళికి ఆయురారోగ్య భోగభాగ్య సంధాయకాలు.

కృష్ణాష్టమి సంపూర్ణావతారపురుషుడైన శ్రీకృష్ణుని పుట్టినరోజు. శ్రీకృష్ణుడు ద్వాపర-కలియుగాల సంధికాలంలో శుక్లనామ సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళాష్టమినాడు రోహిణీ నక్షత్రంలో రెండుజాముల రాత్రివేళ జన్మించాడని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణునికీ గోకులానికీ అవినాభావ సంబంధం ఉన్న కారణంగా ఈ పండుగను గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. ‘అష్టమి’ అంటే తిథులలో ఎనిమిదవ తిథి శ్రీకృష్ణునికి ఎనిమిదవ సంఖ్యతో దగ్గరి సంబంధం ఉంది. అతడు పుట్టిన తిథి అష్టమి. దశావతారాలలో కృష్ణావతారం ఎనిమిదవది. వసుదేవుని సంతానంలో ఎనిమిదవవాడు కృష్ణుడు. కృష్ణుని భార్యలు కూడా ఎనిమిదిమంది. ఇరవైఏడు నక్షత్రాలలో ఎనిమిదవ నక్షత్రం అయిన ‘రోహిణి’లో కృష్ణుడు జన్మించాడు. పదహారువేలమంది గోపికలతో కృష్ణుడు బృందావనంలో సంచరించాడు. ఎనిమిదవ సంఖ్యను రెండుతో గుణిస్తే వచ్చేది పదహారు. ఇలా ఎనిమిదవ సంఖ్యతో ముడివడిన శ్రీకృష్ణుని చరిత్ర, ఆబాలగోపాలానికి ఎంతో ఇష్టమైంది. శ్రీకృష్ణుని లీలలన్నీ జగత్కల్యాణకారకాలే. గోపాలురనూ, గోవులనూ, కర్షకులనూ ఎక్కువగా ప్రేమించే కృష్ణుడు నందగోకులంలోనే బాల్యమంతా గడిపాడు. ఎందరో లోకకంటకులైన దుష్టరాక్షసులను సంహరించాడు. పాడిపంటలను రక్షించాడు. భగవద్గీతామృతాన్ని లోకానికి పంచిపెట్టాడు.

కృష్ణాష్టమినాడు జనులందరూ తమతమ నివాసాలలో కృష్ణుణ్ణి పూజిస్తారు. వైష్ణవాలయాలను సందర్శించి, అర్చనలు చేస్తారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన పాలు, వెన్నలతోకూడిన ఉట్లను వ్రేలాడదీసి, వాటిని కొట్టి, కృష్ణునివలె పాలూ, వెన్న మొదలైనవి ఆరగిస్తారు.

కృష్ణునికి నైవేద్యంగా మధురాన్నాలూ, పిండి వంటలతోబాటు, శొంఠి, చక్కెరలతోకూడిన మినపపిండిని కూడా నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తారు. చిన్న పిల్లలతో కృష్ణుని వేషాలు వేయించి, అలనాటి బాలగోకులాన్ని గుర్తు చేసుకుంటారు. కృష్ణునికి సంబంధించిన పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పిల్లలూ, పెద్దలూ అనే తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో మునిగి తేలుతారు. కృష్ణుని అవతారం ఎన్నో సందేశాలను అందించి, లోకంలో ధర్మాన్ని నిలుపడానికి దోహదం చేసింది. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చేసిన ఈ సందేశం నేటికీ అందరికీ పఠనీయమైంది.

‘పరిత్రాణాయసాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌
ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే’

ఈ మాసంలో సంభవించే రెండవ పండుగ ‘వినాయక చతుర్థి’. వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల జ్యేష్ఠపుత్రుడు. ఆదిపూజ్యుడైన ఈ స్వామి జననకథ శైవ పురాణాలలో ఇతిహాసాలలో లభ్యమౌతుంది. ఈ లోకమంతా అనేక విఘ్నాలకు ఆలవాలమైంది. మానవులు అడుగడుగునా ఎన్నో ఆటంకాలతో, అడ్డంకులతో జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఈ విఘ్నాలు అనేవి కేవలం మానవులకే కాదు దేవతలకూ, రాక్షసులకూ కూడా ఉన్నాయి. వాటిని తొలగించుకోవడానికి ముల్లోకాలలోని దేవతలూ, మానవులూ, రాక్షసులూ విఘ్నేశ్వరుని పూజించారనీ, ఆ స్వామి అనుగ్రహంతోనే అన్ని విఘ్నాలనూ దూరం చేసుకొని, తమతమ కర్తవ్యాలలో విజయం సాధించారని పురాణాలు చెబుతున్నాయి. భూలోకానికి సంబంధించి నంతవరకు మానవులు ఏ శుభకార్యాన్ని తలపెట్టినా, ఏ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినా విఘ్నేశ్వరుని పూజించకుండా ఏ పనీ చేయరు. విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉంటే అంతటా విజయం, లాభం, క్షేమం తథ్యమని ఈ క్రింది పౌరాణిక శ్లోకం ప్రబోధిస్తోంది-

‘సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పడేత్‌ శ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రదేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యన జాయతేః

సుముఖుడూ, ఏకదంతుడూ, కపిలుడూ, గజకర్ణకుడు, లంబోదరుడూ, వికటుడూ, విఘ్నరాజూ, గణాధిపుడూ, ధూమకేతువూ, గణాధ్యక్షుడూ, ఫాలచంద్రుడూ, గజాన నుడూ, వక్రతుండుడూ, శూర్పకర్ణుడూ, హేరంబుడూ, స్కందపూర్వజుడూ అనే వినాయకుని పదహారు నామాలను ఎవరు పఠిస్తారో, ఎవరు వింటారో వారికి విద్యారంభంలో, వివాహాదులలో, గృహప్రవేశాలలో, ప్రయాణాలలో, యుద్ధాలలో, సమస్త కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు రావని పురాణాలు చెబుతున్నాయి.

ఇంతటి మహిమగల గణపతిని వివిధ ఆకృతులలో మట్టితోనూ, ఇతర పదార్థాలతోనూ ప్రతిమల రూపంలో రూపొందించి, భాద్రపదశుద్ధ చతుర్థినుండి తొమ్మిది రోజులపాటు నవరాత్రోత్సవాలను ఎంతో వైభవగా జనులు జరుపుకుంటారు. ఈ పూజలు కేవలం ఇండ్లలోనేకాకుండా గ్రామాలూ, పట్టణాలూ, నగరాలలోని ఎన్నో కూడళ్లలో మంటపాలు నిర్మించి అతి వైభవంగా పూజలు జరిపి, తొమ్మిది రోజుల తర్వాత పవిత్ర జలాలలో వినాయక ప్రతిమలను ఊరేగింపులతో వెళ్లి నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

వినాయకుడు ప్రకృతిని ఇష్టపడే దేవుడు కనుక ప్రకృతిలో లభించే వివిధ పత్రాలను పూజలో ఉపయోగించడం సంప్రదాయంగా మారింది. దీనినే ఏకవింశతి పత్రపూజ అంటారు. ఈ పత్రాలన్నీ మానవుల ఆయురారోగ్యాలను పెంచే ఔషధులు కావడం ఈ పూజలోని విశేషం. మాచీపత్రం (మాచపత్రి), బృహతీపత్రం (వాకుడు), బిల్వపత్రం (పత్రి), దూర్వాపత్రం (గరిక), దుత్తూరపత్రం (ఉమ్మెత్త), బదరీపత్రం (రేగు), అపామార్గపత్రం (ఉత్తరేణి), తులసీపత్రం (తులసీదళం), చూతపత్రం (మామిడి), కరవీరపత్రం (గన్నేరు), విష్ణుక్రాంతపత్రం (విష్ణుక్రాంతం), దాడిమీపత్రం (దానిమ్మ), దేవదారుపత్రం (దేవదారు), మరువకపత్రం (మరువం), సింధూరపత్రం (వావిలి), జాతీపత్రం (జాజి), గండకీపత్రం (గండకి), శమీపత్రం (జమ్మి), అశ్వత్థపత్రం (రావి), అర్జునపత్రం (మద్ది), అర్కపత్రం (జిల్లేడు) ఇలా ఇరవైఒక్క ఔషదీపత్రాలతో వినాయక ప్రతిమకు పూజలు చేస్తారు.

వినాయక నవరాత్రోత్సవాలలో దేవాలయాలలోనూ, మంటపాలలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలూ, ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలనూ ఏర్పాటు చేసి, వినాయక వైభవాన్ని లోకానికి చాటడం కనబడుతుంది. వినాయక చతుర్థినాడు సాయంకాల సమయంలో వ్రతకథను వినాలనీ, ముఖ్యంగా శమంతకోపాఖ్యాన కథను విని, అక్షతలు తలపై చల్లుకుంటే ఎలాంటి విఘ్నాలు రావని అందరి నమ్మకం. వినాయక చతుర్థినాడు చంద్రుని చూస్తే నీలాపనిందలు సంభవిస్తాయి కనుక ఆ దినాన చంద్రుణ్ణి ఎవరూ చూడరాదనే నియమం ఉన్నది. పొరపాటున ఎవరైనా చంద్రుణ్ణి చూస్తే, శమంతకోపాఖ్యానంతో కూడిన గణేశ మహిమ కథను విని, అక్షతలను తలపై దాల్చితే ఏ దోషమూ ఉండదని పురాణోక్తి.

జనులలో సమైక్యభావాన్ని పెంపొందించడానికి వినాయక చతుర్థి పర్వదినం ఎంతో మార్గదర్శకమై అలరారుతోంది. ఈ ప్రపంచం అంతా భగవంతుని లోనిదే అనీ, పంచభూతాలను చక్కగా కాపాడుకోవాలని సందేశం ఇస్తున్న పర్వదినంగా వినాయక చతుర్థి పేరుగాంచింది. తెలంగాణ రాష్ట్రంతోబాటు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలూ, సుభిక్షంగా ఉండాలనీ, ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలనీ ఈ రెండు పండుగల నేపథ్యంలో అందరూ ఆశిస్తారు. శ్రీకృష్ణుడూ, వినాయకుడూ ప్రజల అభీష్టాలను నెరవేర్చాలని ప్రార్థిద్దాం!