|

విజయ సోపానాలు..

విజయ సోపానాలు..పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు నేను ఉచితంగా ఒక్కరోజు ‘స్టడీస్కిల్స్‌-విజయం’పై అవగాహన శిక్షణ కార్యక్రమం పెట్టాను. 50 మంది విద్యార్థులు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చారు. ముందుగా వారందరితో విడివిడిగా సంప్రదించాను. అందులో చాలా మంది ఎంతో ఉత్సాహంతో, నమ్మకంతో పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. అయితే ఆ 50 మందిలో 30 శాతం మంది తెలుగు తప్పులు లేకుండా ఒక్క వాక్యం కూడా నిర్మాణం చేయలేకపోతున్నారు. చరిత్ర తెలియదు. తెలుగు వ్యాకరణం తెలియదు. జి.కె. అస్సలు రాదు, వాళ్ళలో కొంతమంది యువకులు మరీ పేదరికం నుండి వచ్చిన వాళ్ళు వున్నారు. పొలాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి కోచింగ్‌ల కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా వున్నారు. ”మీకు కావలసిన మీ స్థాయి చదువు నైపుణ్యాలు కూడా లేవు. ఎలా! ఈ పోటీ పరీక్షను ఎదుర్కొని విజయం సాధించగలరు”. మా మీద మాకు నమ్మకం వుంది సార్‌! చదువుతాం. కష్టపడతాం అన్నారు.

కాని మీరు నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మీరు గల్లీస్థాయిలో వున్నారు.. కాని మీరు ఢిల్లీ స్థాయిలో పోటీలో పాల్గొనాలనుకుంటున్నారు. కాబట్టి ముందు కనీస సామర్థ్యాలను పెంపొందించుకొని అప్పుడు డబ్బును ఖర్చు పెట్టుకుంటే బావుంటుందని నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మిత్రులారా! చేసే పనిపట్ల ఒక్క ఆసక్తి సరిపోదు. అందులో పోటీ పరీక్షలకు ఆసక్తితో పాటు, స్థాయికి తగిన నైపుణ్యాలు, నిరంతరం శ్రమించేతత్వం అవసరం.. ఆశ, ఉత్సాహం అవసరం.

పోటీలో పాల్గొని విజయం సాధించడం కష్టం. కాబట్టి పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకొని సన్నద్ధం కావడం అవసరం.

1. కోరిక 2. సామర్థ్యం 3. వినియోగం 4. శ్రమించడం

సాధించాలనే కోరిక:

మనం ఏ పని చేయాలన్నా ముందుగా దాన్ని చేయాలనే కోరిక ఉండటం అత్యంత ప్రధానం. కోరిక లేకుంటే ఏదీ సిద్ధించదు. అంటే దానికోసం మనస్ఫూర్తిగా కష్టపడటం. మీలో ఆ కోరిక ఉందా? అయితే లక్ష్యాన్ని వాస్తవిక దృక్పథంతో నిర్దేశించుకోండి. అంటే గతంలో మీరు సాధించిన ఫలితా లేమిటి? దాన్ని బట్టి మీ స్థాయి ఏమిటి? వీటన్నిటిని బేరీజు వేసుకొని లక్ష్యాన్ని ఎంచుకోవాలి. లక్ష్యం మరీ చిన్నదైతే దాన్ని అందుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. కాబట్టి విజయం సాధించినా మనకు లభించే సంతృప్తి అంతంత మాత్రమే. అందుకోలేనంత పెద్ద లక్ష్యం ఉన్నా చతికిల పడాల్సి ఉంటుంది. కొంతమందికి లక్ష్యం ఉంటుంది కాని దాన్ని అందుకోవానికి ఎటువంటి ప్రయత్నం చేయరు. పైగా దాని కోసం వేచి చూస్తారు. లక్ష్యం తనంత తానుగా సిద్ధించదు. దాని కోసం మనమే కష్టపడాలి. మీ లక్ష్యం, మంచి మార్కులు తెచ్చుకోవడం కాబట్టి దీనికి మీరు రెగ్యులర్‌గా తరగతులకు హాజరుకావడం, నోట్స్‌ రాసుకోవడం, స్నేహితులు, అధ్యాపకులతో చర్చించడం అవసరం. ఇవన్నీ మీలోని తపనను నిజం చేసుకోవడానికి మార్గం చూపుతాయి. శ్రమ లేకుండా కేవలం ఆలోచనల వల్ల ఏదీ జరుగదు.

సామర్థ్యంపై నమ్మకము

మన మెదడు కోట్లాది న్యూరాన్లతో నిర్మితయింది. ఒక న్యూరాన్‌లో ఉండే ‘మెమొరి’ ఒక కంప్యూటర్‌తో సమానమని, అది అందరిలో దాదాపు ఒకే స్థాయిలో ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. చాలా మంది విద్యార్థులకు తమ సామర్థ్యాలపై అపనమ్మకం ఉంటుంది. కొంతమందిలో ఇది పెరిగి ఆత్మన్యూనత భావనలోకి నెట్టేస్తుంది. ఒక గోడను కట్టే వ్యక్తికి దాన్ని ఎంత వ్యవధిలో నిర్మించవచ్చో. ” అంచనా” ఉంటుంది. దానికి అనుగుణంగానే ఆ పని పూర్తవుతుంది. ఈ ‘అంచనా’ కేవలం తన నైపుణ్యాల మీద ఉండే నమ్మకంతోనే సాధ్యమవుతుంది. ఒక పాఠ్యాంశాన్ని ఎంత సమయంలో నేర్చుకోవచ్చనే అంచనా వేయగల సామర్థ్యాన్ని ముందుగా సాధించాలి. అంటే తన శక్తియుక్తులపై విద్యార్థికి అవగాహన అవసరం. అప్పుడే తాను చేసే పనిమీద పూర్తి నియంత్రణ వస్తుంది. ఆత్మ విశ్వాసంతో వ్యవహరించి దుర్భర దారిద్య్రంలో ఉంటూ కూడా పోటీ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాగే శరీరం సహకరించని పరిస్థితుల్లో చక్కని ప్రతిభ కనబరచి ఐఐటీల్లో ప్రవేశించిన వాళ్ళున్నారు. ఈ సంవత్సరం ఐఎఎస్‌ ప్రథమ స్థానాన్ని సాధించిన కుమారి ఐరా సింఘాల్‌ వైకల్యాన్ని ఎదురొడ్డి విజయ బావుటా ఎగరవేసారు. వీరు మనందరికి స్ఫూర్తిదాయకం. వీటిని బట్టి నేర్చుకోవాల్సిన అంశం. మనలోని సామర్థ్యాలను గుర్తించడం, వాటిని పెంచుకోవడం అవసరం.

వనరుల వినియోగం:

ప్రపంచానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడంలో భారతదేశం కీలకమైన స్థానంలో ఉంది. వనరులు, నైపుణ్యాలు ఉండటం ఎంత ముఖ్యమో వాటిని వినియోగించుకోవడం అంతకంటే ప్రధానం. శక్తి సామర్థ్యాలతో పాటు మన చుట్టూ ఉన్న వనరులను ఎంత బాగా వినియోగించుకొంటున్నాం? అనే అంశం కూడా మన విజయాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి వ్యక్తిలో సామర్థ్యంతో పాటు అపనమ్మకం కూడా ఉంటుంది. అయితే తనపై తనకుండే అపనమ్మకం స్థాయిని, వీలైనంతవరకు తగ్గించుకొంటేనే విజయం వైపు పయనిస్తాం. చాలామంది ఈ అపనమ్మకమనే మంచుపొరను కరిగించుకోలేరు.

తమ నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శించలేరు. మరికొందరు తమ సామర్థ్యంపై విపరీతమైన విశ్వాసంతో ఉంటారు. ‘పరీక్షలకు ముందు చదవవచ్చులే’ అంటూ కాలయాపన చేసేవాళ్ళు ఈ రకమే ఈ ‘అతి విశ్వాసం’ వారిని ఎప్పుడో ఒకసారి దెబ్బతీయక మానదు. సామర్థ్యాన్ని వినియోగించకపోయినా, ‘తర్వాత చూద్దాంలే’ అనుకుంటూ నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని వినియోగిస్తేనే అది నిరంతరం మీకు సహకరిస్తుంది. ఒక అంశాన్ని నాలుగైదుసార్లు చదివినా అర్థం కాలేదంటే వెంటనే మనకన్నా చురుగ్గా ఉండే స్నేహితులనో, సీనియర్లనో, అధ్యాపకులనో సంప్రదించాలి. అలాగే విద్యాపరంగా ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకొని ఆయా మార్గాలను వినియోగించుకొంటేనే లక్ష్యం దిశగా ప్రయాణం సాఫీగా సాగుతున్నట్లు లెక్క.

త్రికరణ శుద్ధిగా శ్రమించడం:

ఏదైనా సాధించాలనే కోరిక, సామర్థ్యం, దాని వినియోగంతో పాటు ఎవరైతే ఎక్కువగా శ్రమించడానికి ఉత్సాహం చూపిస్తారో విజయం వారికి సొంతం. శ్రమించడం అంటే ఏదో కొన్ని గంటల పాటు ఇష్టం లేకపోయినా చదవడం కాదు. మనస్ఫూర్తిగా కష్టపడాలి. ఎందుకు కష్టపడాలో మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి. లక్ష్యాన్ని చేరుకోవడమే ప్రధానమనే విషయాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాలి. ఇష్టంతో చేసేపని ఎంత కష్టమైనదైనా మనకా కష్టం తాలూకు శ్రమ తెలియదు. పైగా అలా కష్టపడటంలో ఎంతో ఆనందం ఉందని తెలిసొస్తుంది. తద్వారా లభించే సంతృప్తి మరింత ఉత్సాహాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది. ప్రేరణనిస్తుంది. ”దీన్ని టేస్ట్‌ ఆఫ్‌ ది వర్క్‌’ అంటారు. ఈ అంశాలను పాటిస్తే మీరు అనుకున్న స్థాయిలో మార్కులు సాధిస్తారు. అప్పుడు లభించే అభినందనలు, ప్రశంసలు మిమ్మల్ని ఇంకా శ్రమించి మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలనిపించేలా చేస్తాయి. దీన్ని ‘టేస్ట్‌ ఆఫ్‌ సక్సెస్‌’ అంటారు. ఈ రెండూ కలగలిసిన ప్రయాణం జీవితాంతం విజయ సౌరభాలను ఆస్వాదించేలా చేస్తుంది. విజయ సోఫానాలపై జీవనయానానికి మీరు ఈ సంవత్సరమే పునాధి కావాలని ఆకాంక్షిస్తున్నా..