|

విద్యుత్‌ విజయాలకు గుర్తింపుగా ప్రభాకర్‌రావుకు సిబిఐపి అవార్డు

tsmagazineకేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక సిబిఐపి ఆవార్డును ఈ ఏడాదికి తెలంగాణ ట్రాన్స్‌ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌ రావు అందుకున్నారు. న్యూ డిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రుల సమక్షంలో సిబిఐపి అధ్యక్షుడు రవీంద్రకుమార్‌ వర్మ ఈ ఆవార్డును ప్రభాకర్‌ రావుకు అందించారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ (సిబిఐపి) జ్యూరీ ఇటీవలనే ప్రభాకర్‌ రావును ఈ ప్రతిష్ఠాత్మక ఆవార్డు కోసం ఎంపిక చేసింది. విద్యుత్‌ సరఫరా రంగంలో విశేష కృషి చేసి దేశంలోనే తెలంగాణ ట్రాన్స్‌కోను పలు రంగాల్లో అగ్రగామిగా నిలిపినందుకు ఈ ఆవార్డు కోసం ప్రభాకర్‌ రావును ఎంపిక చేసినట్లు బోర్డు ప్రకటించింది.

అవార్డు ఎంపిక కోసం పరిగణలోకి తీసుకున్న అంశాలు

  •  గడిచిన మూడున్నర సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 514 సబ్‌ స్టేషన్లు, 1724 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 19,154 కిలోమీటర్ల కొత్త లైన్లు నిర్మించి విద్యుత్‌ సరఫరాను మెరుగుపరచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వున్న విద్యుత్‌ సరఫరా వ్యవస్థకు 40 శాతం అదనపు సిస్టంను జతచేశారు.
  • తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను వినియోగదారులకు చేర్చే విషయంలో తెలంగాణ ట్రాన్స్‌ కో 99 శాతం అందుబాటులోకి సాధించి దేశ సగటును మించింది.
  • తెలంగాణ ట్రాన్స్‌ కోలో సరఫరా నష్టాలు 3.37 శాతానికి తగ్గాయి. ఇది దేశ సగటు కన్న తక్కువ.
  • ఉత్తర దక్షిణ గ్రిడ్‌ల మధ్య కొత్త లైన్లు నిర్మించడంలో తెలంగాణ ట్రాన్స్‌ కో విశేషమైన చొరవను ప్రదర్శించింది.
  • 2017 సెప్టెంబర్‌ లో 9,500 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ఏర్పడినా ఒక్క క్షణం కూడా విద్యుత్‌ కోత లేకుండా రికార్డు స్థాయిలో 197 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ను వినియోగదారులకు తెలంగాణ ట్రాన్స్‌ కో అందించగలిగింది.
  • వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్‌ అందించడానికి 11 వేల మెగావాట్ల డిమాండ్‌ను ఎదుర్కోవడానికి తెలంగాణ ట్రాన్స్‌ కో సరఫరా వ్యవస్థను సిద్ధం చేసింది.
  • తెలంగాణలో తలసరి విద్యుత్‌ వినియోగం జాతీయ సగటును మించినప్పటికి ఎక్కడా అవాంతరాలు లేకుండా సరఫరా వ్యవస్థను తీర్చిదిద్ధడం జరిగింది.
  • అంశాలను పరిగణనలోకి తీసుకున్న బోర్డు ప్రభాకర్‌ రావును అవార్డుకు ఎంపిక చేసి అందించింది.

న్యూడిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌, కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌ వాల్‌, విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి రాజ్‌ కుమార్‌ సింగ్‌, సిబిఐపి

ఉపాధ్యక్షుడు మసూద్‌ హుస్సేన్‌, కార్యదర్శి కంజిల్లా, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యు.పి. సింగ్‌, సంప్రాదాయేతర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి ఆనంద్‌ కుమార్‌, కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ బల్లా తదితరులు పాల్గొన్నారు.