|

వినియోగదారులకు భరోసా

tsmagazine

ఈ భూప్రపంచంలో జీవించే మానవాళి యావత్తు వినియోగదారులే. మనిషి తన జీవన మనుగడ కోసం అనేక వస్తువులు,పదార్థాలపై ఆధారపడు తుంటాడు. వాటన్నింటిని కూడా కొనుగోలు చేయవలిసిందే. కొనుగోలుదారు లేకపోతే వ్యాపారస్తులు వుండరు. వినియో గదారు ప్రాముఖ్యతను మహాత్మాగాంధీ ఇలా పేర్కొన్నారు. ”ఆయా వ్యాపారసంస్థలు, ప్రభుత్వకార్యాలయాలన్ని కూడా వినియోగ దారుడిపై ఆధారపడి వుండేవే కానీ, వినియోగదారుడు ఆ సంస్థలపై ఆధారపడి లేడు” అని తెలిపాడు.

ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో కొను గోలుదారులు ఎదో ఒక ప్రాంతానికే పరిమిత మయిపోలేదు. ఆధునికత, సాంకేతికతను అందిపుచ్చుకున్న ఈ కాలంలో వినియోగ దారులు ప్రపంచ వినియోగదారులుగా మారి పోయారు. అయితే వినియోగదారు నష్ట పోయినపుడు,వినియోగదారుల ఫోరంలలో ఫిర్యాదు చేసి తగిన పరిష్కారాన్ని పొందవచ్చు. తక్కువ ఖర్చుతో, వినియోగదారులకు సత్వర న్యాయం అందించాలన్న లక్ష్యంతో వినియోగదారుల ఫోరాల ఏర్పాటు జరిగింది. ఈ ఫోరంలలో లభిస్తున్న పరిష్కారాలు వినియోగదారులకు ఎంతో మనోధైర్యాన్ని ఇవ్వడంతోపాటు, వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెడుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వినియోగదారుల సమాచార కేంద్రం ఒక ఫోరం బాధ్యతలను నిర్వహిస్తూ ఎంతో విజయవంతంగా దూసుకెళ్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈ వినియోగదారుల ఫోరం 2006 నుండి పనిచేయడం ప్రారంభించినా కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విని యోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారాలను అందిస్తూ అప్రతిహతంగా ముందుకు వెళ్తున్నది. కమీషనర్‌ సి.వి.ఆనంద్‌ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి మరింత వేగంగా సమస్యలను పరిష్కరిస్తూ, వినియోగదారుల ప్రశంసలను అందుకుంటున్నది.

వినియోగదారులారా! మీకు అండగా ప్రభుత్వ వినియోగదా రుల ఫోరం వుంది. విని యోగదారులు ఎవరు నష్టపోయినా, అక్కడ ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-42500333 వుంది. ఈ నంబర్‌ కి ఫోన్‌ చేస్తే సమస్యను విని ఫిర్యాదును నమోదు చేసుకుంటారు, లేదా వ్యక్తిగతంగా వెళ్లి ఫిర్యాదును నమోదు చేయవలసి వుంటుంది.

వినియోగదారుల రక్షణ చట్టం 1986 ను అనుసరించి ఏర్పాటు చేసిన ఈ కేంద్రం,ఎర్రమంజిల్‌ లోని పౌరసరఫరాల శాఖ భవనం నుండి పని చేస్తున్నది. ఈ కేంద్రం లో వినియోగదారుల ఫోరం ఇంచార్జితో పాటు మరో నలుగురు సిబ్బంది వుంటారు. వీరిలో ఇద్దరు ప్రత్యేకంగా వినియోగదారుల సంబంధిత టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-42500333 సమస్యలనే స్వీకరిస్తారు. మరో ఇద్దరు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1967 ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఇందులో రేషన్‌ కార్డు, రేషన్‌ దుకాణాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

2015 నుండి ఫిబ్రవరి 2018 వరకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-42500333 కి 31,235 కాల్స్‌ రాగా,అందులో ఫిర్యాదులుగా నమోదయినవి 2978. వీటిలో పరిష్కరింప బడినవి 2956. మిగతా 37 పెండింగ్‌ లో వున్నవి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి 2018 ఫిబ్రవరి వరకు ఈ ఫోరంకి నేరుగా వచ్చి ఫిర్యాదు చేసిన వివాదాలు 659. వీటిలో 572 వివాదాలకు పరిష్కారం లభించగా, 87 కేసులు పెండింగ్‌ లో వున్నాయి. ఇక్కడ నమోదయిన కేసులలో చాలావరకు నెల నుండి మూడు నెలల లోపలే పరిష్కారమవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్‌,ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకు,మెడికల్‌,ఇన్సూరెన్స్‌,గ హోపకరణాలకు సంబంధించిన ఎన్నో సమస్యల వివాదాలకు పరిష్కారాలు లభిస్తున్నాయి. వందల రూపాయల వివాదాల నుండి లక్షల రూపాయల విలువ గల వివాదాలకు కూడా ఇక్కడ చాలా త్వరితంగా పరిష్కారం లభిస్తున్నది.

ఈ మధ్యనే, ఓ స్కానింగ్‌ సెంటర్‌ నిర్లక్ష్యం మూలంగా బిడ్డను కోల్పోయిన కామారెడ్డికి చెందిన తల్లితండ్రులకు, రెండు నెలలలోపే రూ. 3.11లక్షల నష్టపరిహారాన్ని ఇప్పించింది ఈ వినియోగదారుల ఫోరం.

ఓ వ్యక్తి కొన్న ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ సరిగ్గా లేదని ఫిర్యాదు వస్తే,అతనికి అది అమ్మిన డీలర్‌ నుండి కుక్కర్‌ ఖరీదును తిరిగి ఇప్పించడం జరిగింది.

రియల్‌ ఎస్టేట్‌ కు సంబంధించి ఒప్పందం ప్రకారం అనుకున్న గడువు లోపు ఇంటిని పూర్తి చేసి ఇవ్వనందుకు గాను ఫోరం బిల్డర్‌ నుండి యాభైవేల నష్టపరిహారం ఇప్పించింది.

పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోల కోసం ఓ డిజిటల్‌ స్టూడియోకు యాభై వేలు చెల్లించాడు ఓ వ్యక్తి. స్టూడియోలో పనిచేసే వ్యక్తి నిర్లక్ష్యం వల్ల సదరు ఫోటోలు, వీడియోల ఫైలు గల్లంతయ్యింది. ఎంతో ముఖ్యమయిన పెళ్ళికి సంబంధించిన జ్ఞాపకాలు సమసిపోయిన బాధతో ఫోరం లో ఫిర్యాదు చేశాడు ఆ వ్యక్తి. అతనికి తాను చెల్లించిన యాభై వేలరూపాయలతో పాటు అదనంగా ఎనభయ్‌ వేల రూపాయల నష్టపరిహారాన్ని ఇప్పించింది ఈ ఫోరం.

ఈ ఫోరంలో నమోదయ్యే కేసుల సంఖ్యను బట్టి వారానికి లేదా పదిహేను రోజులకు ఒకసారి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తుంటారు నిర్వహకులు. ఇక్కడ వినియోగదారులకు సంబంధించి అన్ని రకాల వివాదాలకు పరిష్కారం లభిస్తుందని, ఈ కేంద్రం ఇంచార్జి జక్కుల నాగలక్ష్మి వివరించారు.

ఇటువంటి వినియోగదారుల సమాచార కేంద్రం దేశంలోనే ప్రత్యేకంగా వున్నదని జాగో గ్రాహక్‌, జాగో నిర్వాహకులు, 2017 సంవత్సరానికి కన్స్యూమర్‌ ఫ్రెండ్లీ స్టేట్‌ గా గుర్తిస్తూ అవార్డు ఇచ్చారు.

నష్టపోయిన విని యోగదారులు ఎప్పుడూ బలహీనులు కాదు.నయా పైసా ఖర్చు లేకుండా వినియోగదారులు ఇక్కడి ఈ వినియోగదారుల సమాచార కేంద్రం లో ఫిర్యాదు చేసుకోవచ్చని, వారికి అండగా ఈ ఫోరం నిలుస్తున్నదని సంయుక్త సంచాలకులు యేసురత్నం వివరించారు.

ఫిర్యాదు చేసుకునే పద్ధతి

సమస్య ఎదురైన వెంటనే ముందుగా వస్తువు అమ్మిన వ్యక్తికి విషయం తెలియజేయాలి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే డీలర్‌ను.. పంపిణీదారుణ్ణి కలవాలి. అయినప్పటికీ ఫలితం లేకపోతేనే ఫిర్యాదు

చేయవచ్చు. మీ ఫిర్యాదు స్పష్టంగా సూటిగా ఉండాలి. వినియోగ వస్తువుల విషయంలో ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు బ్రాండ్‌, మోడల్‌, బ్యాచ్‌/సీరియల్‌ నంబర్లు, తయారీ తేదీ, కాలం చెల్లే తేదీ, చెల్లించిన ధర, తయారీదారుని పేరు, చిరునామా, తదితర వివరాలను పేర్కొనాలి. ఆర్థిక సేవల విషయంలో మీ ఖాతాకు సంబంధించిన అన్ని వివరాలు, వాటి విలువ, జారీ చేసిన-గ డువు తేదీలు, పునరుద్ధరణ, ప్రీమియం చెల్లించిన ఫీజులు, సేవలు అందించిన కంపెనీ లేదా సంస్థ, ఏజెంటు, కన్సల్టెంట్ల చిరునామా మొదలైన వివరాలు రాయాలి. ఫిర్యాదుకు సంబంధించిన అన్ని పత్రాలు బిల్లులు, నగదు రశీదులు ఇతర పత్రాల ప్రతులను జత చేయాలి. సమస్యనే కాదు.. దానికి ఎలాంటి పరిష్కారం కోరుకుంటున్నారో కూడా రాయాలి. మీరు చెల్లించిన సొమ్ము వాపసు కోరుతున్నారా? మీకు కలిగిన నష్టానికి ఎంత పరిహారం కోరుతున్నారు? ఒకవేళ కోరితే ఇందుకు తగిన కారణాలు ఏంటో వివరించాలి.
tsmagazine
tsmagazine