విశ్వనగరంవైపు.. మెట్రో పరుగులు

tsmagazineఎన్వీఎస్‌ రెడ్డి, ఐఏఎస్‌
హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రగతి విశ్వనగరం దిశగా పరుగు పెడుతోంది. మహానగరానికి మణిహారమైన మెట్రో రైలు రెండు కారిడార్లలో ఇప్పటికే పట్టాలెక్కి ప్రయాణీకులకు స్వర్గధామమయింది. అన్ని సౌకర్యాలతో పర్యావరణానికి మచ్చుతునకగా దూసుకుపోతోంది. మిగిలిన కారిడార్లలో పనులను వేగవంతం చేస్తూ ప్రారంభోత్సవానికి దగ్గరవుతోంది.

2017 నవంబర్‌ 28న భారత ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణీకుల ఆదరణతో పరుగులు తీస్తోంది. 72 కి.మీ. ప్రాజెక్టు పరిధిలోని 30 కి.మీ. దూరంలో ప్రస్తుతం మెట్రోరైలు ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది. మియాపూర్‌ (కారిడార్‌-1) నాగోల్‌-అమీర్‌పేట (కారిడార్‌-3)లలో ప్రారంభమైన వారం రోజుల్లోనే రెండు లక్షలమంది ప్రయాణీకులు మెట్రో రైలును వినియోగించుకోగా, గత ఆరు నెలల కాలంలో సుమారు ఒక కోటి మంది ప్రయాణీకులు మెట్రో రైలులో ప్రయాణం చేయడంద్వారా ప్రజలనుంచి విశేష ఆదరణ లభిస్తున్నట్లు స్పష్టం అయింది.
tsmagazine
మెట్రో రైలు ప్రస్థానం: 2012 జూన్‌లో ప్రారంభించిన హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు అంచెలంచెలుగా పురోభివృద్ధి సాధించింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హెచ్‌.ఎం.ఆర్‌. ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మునిసిపల్‌ వ్యవహారాల శాఖమంత్రి తారక రామారావు ప్రోత్సాహంతో ముందడుగు వేస్తోంది. 57 రైళ్లు, 171 కోచ్‌లు దక్షిణకొరియా హుందాయ్‌ రొటెమ్‌ ఫ్యాక్టరీనుండి పొందడం జరిగింది. మెట్రో ప్రాజెక్టు దాదాపు 85 శాతం పనులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తయిన 30 కి.మీ. మియాపూర్‌ (13 కి.మీ.) కారిడార్‌-1, నాగోల్‌-అమీర్‌పేట్‌ (17 కి.మీ.) కారిడార్‌-3 గత నవంబర్‌ చివరలో ప్రారంభించడం జరిగింది. పూర్తి ప్రాజెక్టు వచ్చే ఏప్రిల్‌ 2019 నాటికి పూర్తి అవుతుంది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు తెలంగాణ ఆవిర్భవించే వరకు శివార్లలో పని చేస్తుండగా, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత వేగం పుంజుకొని అనేక క్లిష్టమైన సమస్యలు, ముఖ్యంగా నగరంలోని రద్దీ ప్రాంతమైన కోర్‌ ఏరియాలో సమస్యలు పరిష్కరించబడ్డాయి.

సౌకర్యాల నిలయాలు మెట్రో రైలు స్టేషన్‌లు
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసుల రాకపోకల విషయంలో విలువైన సమయాన్ని ఆదా చేస్తూ తక్కువ ఖర్చుతో (ఛార్జి) సౌకర్యవంతమైన ఏసీ ప్రయాణాన్ని పర్యావరణ పరిరక్షణతో అందిస్తూ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌.ఎం.ఆర్‌.) ప్రత్యేకతగా నిలిచింది. కేవలం ప్రయాణంతోనే సరిపెట్టకుండా వారి అభిరుచులు, అవసరాలకు తగ్గట్టు మెట్రో రైలు స్టేషన్‌లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో హెచ్‌.ఎం.ఆర్‌. ముందుంది. ఈ కోణంలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల సహకారంతో ప్రయాణీకుల సేవకి అంకితమైంది.

మెట్రో స్టేషన్‌ల పరిసర ప్రాంతాల్లో మాల్స్‌, కూరగాయల మార్కెట్‌ వంటి అనేక సౌకర్యాలకు నిలయంగా తీర్చిదిద్దుతూ ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఏడు నిమిషాల వ్యవధిలో మెట్రో స్టేషన్లకు రైళ్ళ రాకపోకలు జరుగుతున్నాయి. సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు స్టేషన్‌లనుంచి తమతమ ప్రాంతాలకు వెళ్ళేందుకు వీలుగా పర్యావరణానికి కట్టుబడి సైకిళ్ళు ఏర్పాటు చేశారు. మియాపూర్‌, జేఎన్టీయూ, కూకట్‌పల్లి, బేగంపేట, రసూల్‌పురా, ప్రకాశ్‌నగర్‌, ప్యారడైజ్‌ స్టేషన్‌లలో ద్విచక్ర వాహనాలను కిలో మీటరుకు 4 రూపాయల అద్దెకు అందుబాటులో ఉంచారు. మైట్రో స్టేషన్‌లను పర్యావరణ, పచ్చదనాలతో సుందరీకరిస్తూ స్వచ్ఛత, భద్రతా కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. అన్ని హంగులతో ఏర్పాటు చేసిన మెట్రో స్టేషన్‌లలో దేశంలోనే నంబర్‌వన్‌గా హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ నిలిచింది.

భద్రతా సౌకర్యాలు
ప్రయాణికుల భద్రతకోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పోలీస్‌ సిబ్బంది, మెట్రో స్టేషన్లు, రైళ్ళలో ప్రయాణీకుల, సామానుల తనిఖీలు, మెట్రో రైలులో నిరంతర భద్రత, కెమెరాలు మొదలైన ఆధునిక రక్షణ పరికరాలు అందుబాటులో ఉంటాయి. మెట్రో స్టేషన్‌ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 24 గంటలు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మెట్రో స్టేషన్‌లలో మన కూరగాయలు
మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణీకులు ఇకపై కూరగాయల మార్కెట్‌లకు పరుగులు తీయాల్సిన పనిలేదు. రైల్వే స్టేషన్‌లలోనే ‘మన కూరగాయలు’ స్టాల్స్‌ ఏర్పాటుకు నాంది పలికారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ సమన్వయంతో ప్రస్తుతం 11 మెట్రో స్టేషన్‌ల పరిధిలో వీటిని ఏర్పాటు చేయ గా త్వరలో అన్ని స్టేషన్‌లలో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. వచ్చే అక్టోబరు నాటికి అన్ని స్టేషన్‌లలో ‘మన కూరగాయలు’ స్టాల్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రయాణీకులతోపాటు ఆ మార్గాన వెళ్ళే ఇతర వాహనదారులు, పాదచారులు కూడా మన కూరగాయలను కొనుక్కునే వీలు కల్పించారు.

మెట్రో మాల్స్‌
రవాణా ఆధారిత అభివృద్ధి పేరుతో హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు ముందడుగు వేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యాపార నమూనానే అయినప్పటికీ పూర్తిగా భిన్నమైంది. ప్రాజెక్టు కట్టుటకు అవసరమైన ప్రభుత్వ భూమిలోనే ఇంజినీరింగ్‌ నవ్యతతో కొంత భూమిని మిగుల్చుకొని దానిపై వినూత్న పద్ధతిలో మెట్రో మాల్స్‌ను కట్టి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొస్తు న్నారు. దీనిలో భాగంగా పంజాగుట్ట, హైటెక్‌సిటీల్లో మెట్రో మాల్స్‌ ప్రారంభం కాగా, త్వరలో మిగిలిన ప్రాంతాల్లో మెట్రో మాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఎల్‌ అండ్‌ టీ ప్రత్యేక కృషి చేస్తోంది. 72 కి.మీ. మేర కారిడార్‌లలో మాల్స్‌ ఏర్పాటు, రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికోసం సంస్థ కృషి చేస్తోంది.

మెట్రో స్టేషన్ల నుంచి స్కైవేలు
మెట్రో రైలు ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిచేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు పోతున్నారు. దీనిలో భాగంగా మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా హస్పిటల్స్‌, కళాశాలలు, మాల్స్‌, పాఠశాలలు, క్రీడా మైదానాలకు వెళ్ళేందుకు వీలుగా స్కైవేలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
tsmagazine
‘పచ్చదనం – పరిశుభ్రతకు పెద్దపీట’
మెట్రో కారిడార్‌లు, స్టేషన్‌ల వద్ద పర్యావరణం- పచ్చదనాన్ని పెంచేందుకు హెచ్‌.ఎం.ఆర్‌. పెద్ద పీట వేసింది. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో 72 కి.మీ. పరిధిలో 5 వేల చెట్లు తొలగించగా వాల్టా చట్టం ప్రకారం వాటి స్థానే 25 వేల మొక్కలను నాటాల్సివుండగా 5 లక్షల మొక్కలను నాటి సంస్థ ప్రత్యేకతను చాటుకుంది. అంతేకాకుండా తొలగించిన రెండు వేల మొక్కలను ‘ట్రాన్స్‌లోకేషన్‌’ పద్ధతిలో, ఇతర ప్రాంతాలకు తరలించి విలువైన చెట్లను సంరక్షించిన ఘనతను కూడా సంస్థ సొంతం చేసుకుంది. అదే విధంగా మెట్రో కారిడార్‌ల కిరువైపులా, ఫిల్లర్ల మధ్య ఖాళీ స్థలంలో అవసరాన్ని బట్టి నీడ నిచ్చేె మొక్కలతో పాటు సుందరీకరణ మొక్కలను నాటుతూ పర్యావరణం పచ్చదానానికి కట్టుబడి పని చేస్తున్నారు. తెలంగాణాకు హరితహారంలో భాగంగా ప్రతియేటా లక్ష మొక్కలు నాటేందుకు కృషిచేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 5 లక్షల మొక్కలు నాటారు.

మెట్రో లేడీస్‌ స్పెషల్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ‘మెట్రో’ ను బహుళ ప్రయో జనకారి ప్రాజెక్టుగా తీర్చిదిద్దే అంశంపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. దీనిలో భాగంగా మహిళల కోసం మెట్రో రైలులో ప్రత్యేక కోచ్‌ను ప్రారంభించడమే కాకుండా తరుణి పేరుతో మధురానగర్‌లో ప్రత్యేక స్టేషన్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.