|

వేదాంత మహోదధి రఘునాథాచార్య

– డాక్టర్‌ కోవెల సుప్రసన్నా చార్య
tsmagazine

కవి శాబ్దిక కేసరి, శాస్త్రరత్నాకర, మహామహోపాధ్యాయ, ఉభయ వేదాంత మహోదధి శ్రీమాన్‌ నల్లాన్‌ చక్రవర్తుల రఘునాధా చార్య స్వామి వారు పరమపదించిన వార్త సంస్కృత విద్వన్లోకానికి, అశేష శ్రీవైష్ణవ సంప్రదాయ వేత్తృ లోకానికి పిడుగుపాటు వంటిది. స్వామివారు సీతారాంబాగ్‌ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన 19వ ఏటనే తమ జీవితానికి రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. 1. సంస్కృతి భాషాసేవ 2. యతిపతి సిద్ధాంత వరివస్య అపారమైన శాస్త్ర పాండిత్యం, నిరంతర అధ్యయన అధ్యాపనాలు వారి శాస్త్ర ప్రవచన పద్ధతికి ఎల్లలు లేకుండా చేసింది. ఎక్కడో రేడియోలో విని మద్రాసు ప్రభుత్వ ఆస్థాన కవి కె.యస్‌. కృష్ణమూర్తి నిర్ధుష్టమైన కవిత్వాన్ని మెచ్చి, వారి రచనలను త్రిపురాభరణం ప్రకృతి విలాసం, లాంటి వాటిని అచ్చువేయించారు. శబ్ధ చర్చ విషయంలో వారు చిరు ప్రాయంలోనే అపార విద్వత్తు కలిగినవారు.

శ్రీమాన్‌ ప్ర.భ. అణ్ణంగరాచార్య స్వామి వారితో వివాదపడ్డ సందర్భంలో దక్షిణ దేశపు సంస్కృత విద్వన్లోకం రెండుగా చీలిపోయింది. అప్పటికి వారికి సుమారు పాతికేళ్ళు. వారు శ్రీ భాష్య భగద్విషయములో నిరంతరం అధ్యాపన చేస్తూ కూడా, శాంకర గీతా భాష్యాన్ని, అన్యమత, ప్రస్థాన గ్రంథాలను కూడా ప్రవచించినారు. సంస్కృత విజ్ఞాన పరిషత్‌ అనే సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలను, చర్చా గోష్ఠులను నిర్వహించారు. మా వంటి వారి కోసం శ్రీ భాష్యాన్ని 30 రోజులు ప్రణాళికా బద్ధంగా ఉపన్యసించారు.

సంస్కృతంలో వారి కవిత్వం పూర్వ సంస్కృత కవుల స్థాయిలో మనోహరంగా కొనసాగింది. ఈశ, కఠ, ముండకాది ఉపనిషత్తులకు విశిష్టాద్వైత సిద్ధాంత పరంగా వ్యాఖ్యానం చేశారు. సంప్రదాయ పరిరక్షణ సమితి అనే సంస్థ ద్వారా అనేక సంప్రదాయ, శాస్త్రీయ గ్రంథాలను రచించి ప్రచురించి రామానుజ దర్శనానికి సుబోధకతను, పరివ్యాప్తిని కలిగించారు. ఆ సంస్థ ప్రచురించిన గ్రంథాలలో మహా సిద్ధాంతం వరకు శ్రీభాష్యానికి విపులమైన వివరణను వెలయించారు. పరాశర భట్టరు రచించిన విష్ణు సహస్రనామ భాష్యానికి విస్తృతమైన వ్యాఖ్యానాన్ని వెలయించారు. వారు జీవితమంతా దర్శన, స్థాపనమునకై వినియోగించారు. అనేక మంది శ్రీవైష్ణవ విద్వాంసులు, జీయర్‌ స్వాములు, వారి చరణ సన్నిధిలో శాస్త్ర గ్రంథాన్ని పొందారు.

స్వామి వారు స్వయంగా భాగవత సేవా పరాయణులు, అళ్వారుల యందు, ఆచార్య పురుషుల యందు అపారమైన భక్తి శ్రద్ధ కలవారు. శాస్త్ర విషయంలో నిర్ధుష్టత కోసం ఎంతవారినైనా ఎదిరించే వారు. అయినా విద్యా వితరణ విషయంలో అపార కృపా సంపన్నులు. అనేక దేవాలయాల నిర్మాణం, ప్రతిష్ఠలు, నిర్వహించారు. భగవత్‌ కైంకర్య నిధి ద్వారా ఎంతో ధనాన్ని ఈ కార్యక్రమాల కోసం వితరణ చేశారు. పైకి ఎంత గంభీరంగా వున్న లోపల అంత వాత్సల్యము కలిగి ఉండేవారు. సింహాద్రి బాగ్‌ పాఠశాల, ఎస్‌.వి. సంస్కృతాంధ్ర కళాశాల వారి ప్రవచనాల చేత పునీతము లైనాయి. వర్తమాన కాలంలో ఉభయ వేదాంతాలకు అపారమైన సేవ చేసిన ఇద్దరు మహా విద్వాంసులు అణ్ణంగరాచార్య స్వామివారు, రఘునాధాచార్య స్వామి వారు శ్రీ స్వామి వారికి నేను కూడా శిష్యప్రాయుడనే, వారిని స్మరించుకోవడం నాకు నిరంతరం ప్రేరణ కలిగించే విషయం. మా తాతగారు శ్రీమాన్‌ కోయిల్‌ కందాడై రంగాచార్య స్వామి వారి ఉపన్యాసాల కార్యక్రమాలకు మార్గదర్శకులై వాటి విలువ పెంచారు.

వారికి పరమ పదంలో శ్రియఃపతి వాత్సల్యం, సౌభాగ్యములు కలుగవలెనని కోరుకుంటున్నాను.