వ్యవసాయ ‘లీడర్‌’ తెలంగాణ

దేశంలో అత్యధికంగా చిన్న, సన్నకారు రైతులున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం. ఏర్పడక ముందు పీకల్లోతు అప్పుల్లో రాష్ట్ర రైతులుండేవారు. రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలో ముఖ్యమంత్రి

కె. చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో రైతును ఆదుకునే పలు వ్యవసాయ పాలసీలతో నేడు దేశంలో ‘వ్యవసాయ లీడర్‌’గా తెలంగాణ ఎదిగింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మానస పుత్రికలైన రైతు బంధు, రైతు బీమా నేడు ప్రపంచ వ్యవసాయ దేశాలకు ఆదర్శం. ప్రతి వ్యవసాయ రాష్ట్రం రైతులకు మేలు చేసే విధానాలు ఆలోచిస్తున్నప్పుడు వారి మెదడులో మొదటి ఆలోచన ఈ రెండు పాలసీలే.

ఇక వర్షాధార సాగు, నిలకడ లేని అస్పష్ట వర్షపాతం బాధల నుండి రాష్ట్ర రైతులను విముక్తులను చేసేందుకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి సాగునీటి వరదాయణి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. గత ప్రభుత్వాలు పెండింగ్‌లో పెట్టిన పలు ప్రాజెక్టులను పూర్తి చేయటం, ఫలితంగా పెరిగిన సాగు నీటి లభ్యతతో ఇప్పటికే సాగు విస్తీర్ణం పెరిగింది. వరి ఉత్పాదకత పెరిగింది. ఫలితంగా రాష్ట్ర అవసరాలు తీరగా, మిగులు

ఉత్పత్తులను సద్వినియోగ పరచుకోవాలి. ధరలు పడిపోకుండా చూడాలి. రైతులు నష్టపోకూడదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మిక్కిలి అనువైన వాతావరణం ఉన్నది. ముఖ్యమంత్రి చెప్తున్నట్లు ప్రపంచంలో అమెరికాలోని అరిజోనా రాష్ట్రం, భారత్‌లోని కేవలం తెలంగాణ రాష్ట్రం విత్తన సాగుకు అనుకూలంగా ఉంది. ఇప్పటికే భారత విత్తన రాజధానిగా ఉన్న తెలంగాణాను ప్రపంచ విత్తన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ముఖ్యమంత్రి ప్రణాళికలు ఉన్నాయి. ఇందుకు అధిక విస్తీర్ణంలో సాగవుతూ లాభసాటిగా లేని పంటల స్థానంలో పంటల వైవిధ్యీకరణ క్రింద విత్తన పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఈ పంటల సాగులో రైతులకు ఎల్లప్పుడూ సాంకేతికంగా, నైపుణ్య పరంగా, పాలసీల పరంగా ప్రభుత్వం మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ విత్తన పరిశ్రమలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రైతులు తాను వేసిన పొలంలో నుండి సేకరించిన విత్తనాలే వాడేవారు. నేడు అత్యంత నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయింది. ఫలితంగా నేడు భారత్‌ ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద విత్తన పరిశ్రమగా ఎదిగింది. ప్రపంచ విత్తన మార్కెట్‌లో 4.4 శాతంతో అమెరికా, చైనా, ఫ్రాన్స్‌, బ్రెజిల్‌ తర్వాత స్థానం భారత్‌ది. 2017లో భారత విత్తన మార్కెట్‌ విలువ 3.6 బిలియన్‌ అమెరికా డాలర్లు ఉంటే, వృద్ధిరేటు 17 శాతంగా వుంది. 1988 విత్తన అభివృద్ధి నూతన విధానం, 2002 జాతీయ విత్తన విధానంలో విత్తన పరిశోధన, అభివృద్ధి, నాణ్యత, ఉత్పత్తి, అభివృద్ధి, సరఫరా వ్యవస్థలో మెరుగుపడి పరిశ్రమ ఎదుగుదలకు తోడ్పడ్డాయి.

తెలంగాణ విత్తనోత్పత్తికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, నిపుణులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, నిల్వ, రవాణా సౌకర్యాలు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో దేశానికి అవసరమున్న విత్తనాలలో 60 శాతం పైగా రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. చల్లని పొడి వాతావరణం వరి, మొక్కజొన్న, సజ్జ, జొన్న. కంది, పెసర, శనగ, సోయాబీన్‌, పల్లి, ప్రత్తి పంటలలో విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలం. ముఖ్యమంత్రి కల అయిన ‘ప్రపంచ విత్తన రాజధాని’గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 400కు పైగా జాతీయ, అంతర్జాతీయ విత్తన సంస్థలు ఉన్నాయి. వీటి విత్తనోత్పత్తి రైతుల క్షేత్రాలలోనే జరుగుతుంది. 1500 గ్రామాల్లో 2.5 లక్షల మంది విత్తన రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 65 లక్షల క్వింటాళ్ల విత్తనం రాష్ట్రంలో

ఉత్తత్తి అవుతోంది. దీంతో రైతులకే లాభాలు అందుతున్నాయి. భారత్‌ విత్తన భాండాగారంగా ఉంది. ఓఈసిడి విత్తన స్కీంలు, ఆన్‌లైన్‌ విత్తన ధృవీకరణ వ్యవస్థలు అమలు పరిచిన మొదటి రాష్ట్రం కూడా తెలంగాణయే.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార సరఫరా పెరగాలి. 2050 నాటికి 75 శాతం అదనంగా ఆహార ధాన్యాలు అందాలి. తరుగుతున్న సహజ వనరులు, సాగునీటి అందుబాటు, సరాసరి తలసరి కమతాల విస్తీర్ణం. ఇందుకు పెరగాల్సిన వ్యవసాయ ఉత్పత్తిలో అత్యంత కీలకం విత్తనం అవుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు నాణ్యమైన విత్తనం అవసరం. ప్రస్తుతం ప్రపంచ విత్తన వ్యాపారం విలువ 60 బిలియన్ల డాలర్లు ఉంది. అదే సందర్భంలో భారత విత్తన వ్యాపారం విలువ 2.5 బిలియన్‌ డాలర్లు. ప్రపంచంలో మిగతా దేశాలు విత్తనం వాడకం, ఎగుమతులలో మేలుగానే ఉన్నాయి.

అయితే ఇతర ఆసియా దేశాలు, ఆఫ్రికా ఖండపు దేశాలలో నాణ్యమైన విత్తనం కొరత ఉంది. సగం హైబ్రిడ్‌ కూరగాయల విత్తనాలు, 70 శాతం ఆహార ధాన్యాల విత్తనాలు ఆసియా దేశాలకు భారత్‌ నుండే సరఫరా అవుతున్నాయి. ప్రపంచ విత్తన మార్కెట్‌లో వృద్ధి రేటుతో పోలిస్తే ఆసియా విత్తన పరిశ్రమ వృద్ధిరేటు 10-12 శాతం. ఇది పారిశ్రామికీకరణ వృద్ధి రేటు కంటే ఎక్కువ. ఇక ఆఫ్రికా దేశాల విషయానికి వస్తే, ఆ ఖండపు ప్రాంతీయ ఆర్థిక పరిస్థితిలో, 50 శాతం వ్యవసాయం, అనుబంధ వ్యాపారాలదే. 70 శాతం పైగా నేరుగా వారి జీవనోపాధికి వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అందులో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే. ప్రస్తుతం 80-90 శాతం ఆఫ్రికా రైతులు సాధారణంగా, సంప్రదాయంగా ఉత్పత్తి చేసిన విత్తనమే వాడుతున్నారు. కేవలం ఒకవంతు రైతులకు మాత్రమే నాణ్యమైన విత్తనం అందుబాటులో వుంది. ఇదే సందర్భంలో భారత వాతావరణ పరిస్థితులు, ఆఫ్రికా ఖండపు వాతావరణ పరిస్థితులు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి మన దగ్గర పండే అన్ని పంటల విత్తనాలను మనం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయగలం. ఇప్పటికే కొన్ని మన రకాలకు అక్కడ మేలైన ఆదరణ వుంది.

ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరానికి తగ్గట్లుగా పంటల ఉత్పత్తి పెంచాలి. 2018 నాటికి ప్రపంచ జనాభా 7.6 బిలియన్లు ఉంటే, 2050 నాటికి 9.9 బిలియన్లకు చేరనుంది. ఈ మేరకు ఆహార ధాన్యాల డిమాండ్‌ 70 శాతం పైగా అవసరం. పంటల ఉత్పత్తి ఉత్పాదకతకు విత్తనమే కీలకం. అందుకే విత్తనాన్ని ‘పవర్‌ హౌస్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌’ అంటారు.

ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో నాణ్యమైన విత్తనం అందుబాటు పెరగాలి. గత రెండు దశకాలలో ప్రపంచ విత్తన రంగం గణనీయంగా మారింది. అధిక విలువ కలిగిన నూతన రకాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి నాణ్యమైన విత్తనాల అందుబాటుతో పంటల ఉత్పాదకత, విత్తన వ్యాపారం పెరిగాయి. 2018 నాటి ప్రపంచ విత్తన పరిశ్రమ మార్కెట్‌ విలువ 60 బిలియన్‌ అమెరికా డాలర్లు ఉంటే, 2024 నాటికి 90 బిలియన్ల అమెరికా డాలర్లకు చేరనుంది. ఆహార ధాన్యలు, నూనెగింజలు, కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్‌తో వాటి విత్తన డిమాండ్‌ పెరిగింది.

ప్రపంచ ‘విత్తన భాండాగారం’ దిశగా

రైతులకు లబ్ధి చేసే శాస్త్రీయ, ఆర్థిక పాలసీలతో వ్యసాయ లీడర్‌గా ఉన్న తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరించింది. అంతర్జాతీయ, దేశీయ విత్తన ఎగుమతుల ప్రమాణాలు ఏర్పరిచే ‘అంతర్జాతీయ విత్తన పరీక్ష అసోసియేషన్‌’ 32వ అంతర్జాతీయ విత్తన సదస్సుకు వేదికైంది. అంతర్జాతీయ విత్తన సంస్థల ప్రతినిధులు, నిపుణులు, పాలసీదారుల మేధో మథనం, చర్చల ద్వారా వచ్చే పలు విత్తన సంబంధిత అంశాలు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్న సహజ వనరులను ఉపయోగించుకొని తెలంగాణ ‘ప్రపంచ విత్తన భాండాగారం’గా ఎదిగే అవకాశం ఉన్నది.

విత్తన ఎగుమతుల ద్వారా రైతుల ఆదాయాలు పెరగాలంటే అంతర్జాతీయ విత్తన ప్రమాణాలపై అవగాహన అవసరం. ఆ మేరకు అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న పరిశోధనల ఫలితాలు, ఆయా దేశాల ఎగుమతి విత్తన ప్రమాణాలు కావాలి. వాటికనుగుణంగా మన విత్తన నాణ్యత ఉండాలి. ఆ ప్రమాణాలు నేరుగా మన నిపుణులకు, రైతులకు అందించే ప్రయత్నమే ఈ సంవత్సరం విత్తన సదస్సు నిర్వహణ రాష్ట్రంలో చేపట్టడం.

1924లో మొదలైన ఈ అంతర్జాతీయ విత్తన సంస్థ ఇప్పటి వరకు ఐరోపా, అమెరికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాలలో మాత్రమే నిర్వహణకు అంగీకరించాయి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే విత్తన సదస్సు ఈ సారి భారత దేశంలో తెలంగాణలో నిర్వహించాం. ఆసియా దేశాలలో మొట్టమొదటి సారిగా జరిగిన విత్తన సదస్సు ఇది. ఈ సదస్సుకు 80 దేశాల నుంచి ప్రపంచ విత్తన నిపుణులు భారత్‌ నుంచి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి నిపుణులు హాజరయ్యారు.

– సుధాకర్‌ వన్నోజు