|

శానీతో తెలంగాణ బంధం

శానీతో తెలంగాణ బంధంప్రపంచస్థాయి అగ్రశ్రేణి చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి మన రాజధాని నగరానికి తరలివచ్చాయి. ఈ మధ్యనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాలకు చైనా వెళ్ళినప్పుడు అక్కడి అగ్రశ్రేణి కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఆ పిలుపునందుకుని ఆయా కంపనీల ప్రతినిధులు దాదాపు 14 కంపెనీల నుండి 45 మంది ప్రతినిధులు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అక్టోబరు 16న రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హాజరయ్యారు. తెలంగాణ డ్రైపోర్టు ఏర్పాటుకు, ప్రీ ఫ్యాబ్‌ కాంక్రీట్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఫ్యాక్టరీ స్థాపన కోసం చైనా కంపెనీ శానీ గ్రూప్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ రెండు ఎంవోయూలు కుదిరాయి. డ్రైపోర్ట్‌ ఎంవోయూపై రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి కార్యదర్శి జయేష్‌ రంజన్‌, పోర్ట్‌ ఆఫ్‌ శానీ హెవీ ఇండస్ట్రీ ఛైర్మన్‌ లియాన్‌ వెన్‌జన్‌ సంతకాలు చేశారు. ఈ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. నిర్మాణాలకు ఉపయోగించే ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ కాంక్రీట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫ్యాక్టరీ స్థాపనకు సంబంధిత ఎంవోయూపై తెలంగాణ గృహనిర్మాణ శాఖ కార్యదర్శి దానకిశోర్‌, శానీ ఇంటర్నేషనల్‌ హౌజింగ్‌ కార్యదర్శి హైజెన్‌ డెంగ్‌ సంతకాలు చేశారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చైనా పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేకంగా చర్చించారు. తన ఆహ్వానాన్ని, మన్నించి చైనా నుంచి ఎంతో ఆసక్తితో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి శానీ గ్రూప్‌ హైదరాబాద్‌కు తరలివచ్చి నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలోని అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు అపారంగా ఉన్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మించే డబుల్‌ బెడ్‌ రూమ్‌ విభాగంలో సాంకేతిక సహకారానికి అవకాశాలున్నాయన్నారు. రాష్ట్రంలో మంచి పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తీసుకొచ్చాం. అవినీతి రహిత పాలనను అందిస్తున్నాం అని చైనా ప్రతినిధులకు వివరించారు. భూగర్భ ఖనిజవనరులు, బొగ్గు ఉత్పత్తి, విద్యుత్‌ రంగంతో పాటు ఇతర రంగాలలో పుష్కలంగా వనరులున్నాయని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సూ చించారు. శానీ గ్రూపు తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచు కోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు.

ముఖ్యమంత్రి ప్రసంగానికంటే ముందు రాష్ట్ర అధికారులు పారిశ్రామిక విధానం, మిగులు విద్యుత్‌ ఉత్పత్తి కోసం చేస్తున్న ప్రయత్నాలు, డ్రైపోర్టు ఆవశ్యకత, సింగరేణి కాలరీస్‌ ద్వారా జరిగే బొగ్గు ఉత్పత్తి, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్‌ నగరంలో రహదారులు, రవాణా వ్యవస్థ అభివృద్ధి తదితర అంశాలపై చైనా ప్రతినిధులకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి కేటీ రామారావు, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చైనా బృందంలో శానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ లియోన్‌ వెన్‌జెన్‌, ప్రెసిడెంట్‌ టాంగ్‌ జిగువో, వైస్‌ ప్రెసిడెంట్‌ డుయాన్‌డవే, శానీ ఇండియా డైరెక్టర్‌; సీఈవో దీపక్‌గార్గ్‌, సీసీటీఈజీ షెన్యాంగ్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఝూంగ్‌ కేషు, చైనా మిన్‌షెంగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చెన్‌ గుయోగాంగ్‌, చైనా కోల్‌మైన్‌ కన్‌స్ట్రక్షన్‌ గ్రూప్‌ కార్పోరేషన్‌ ఛైౖర్మన్‌ క్సావో పబ్లింగ్‌, పవర్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా వైస్‌ ప్రెసిడెంట్‌ జింగ్‌జింగ్లియాంగ్‌, చింట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ ఛైర్మన్‌ నాన్‌, గోల్డెన్‌ కాంకర్డ్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ షుహువా, వైస్‌ ప్రెసిడెంట్‌ ట్జాపు సియాన్‌; లియాన్‌ యాంగ్‌గాంగ్‌ పోర్ట్‌ హోల్డింగ్‌ గ్రూప్‌ కంపెనీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లీ చున్‌హాంగ్‌, స్టేట్‌ పవర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మాలు, టెబియాన్‌ ఎలక్ట్రిక్‌ అప్పారటస్‌ స్టాక్‌ కంపెనీ సీఈవోతోపాటు చైనా ఎంబసీ నుంచి జుయిజియాన్‌ ఇన్వెస్ట్‌ ఇండియా నుంచి సిద్ధార్థ ఆనంద్‌, ప్రియారావత్‌ తదితరులు పాల్గొన్నారు.