శాసనాల పరిశోధన చరిత్ర దాడులు దుష్ప్రచారాలు

విష్ణుకుండి గోవింద వర్మ ఇంద్రపాల నగర తామ్రశాసనాలు నల్లగొండ జిల్లా తుమ్మల గూడెం దగ్గర లభించాయి.నాగారం నివాసి తమ్మళి ఆంజనేయులు చేనులో పునాది యిటుకలు తీస్తుంటే మట్టి కుండ లభించింది. దానిలో ఊకమధ్య ఈ తామ్రశాసనం, మరొక తామ్ర శాసనం లభించాయి. వీటిని చదవడానికి ప్రయత్నించి విఫలమైన ఆంజనేయులు వీటిని రాజారావుకి చేర్చారు. వారి నుండి మనోహర రావు వద్దకు చేరాయి. వారు బి.యన్‌. శాస్త్రికి వీటిని చూపగా వారు వాటిని పరిష్కరించి భారతిలో ప్రకటించారు. ఈ రెండు తామ్ర శాసనాలు

1. గోవింద వర్మ 37వ రాజ్య సంవత్సరంలో వేయించినది. 2. విక్రమేంద్ర భట్టార వర్మ వేయించినది, విష్ణుకుండి చరిత్రను మలుపుతిప్పినవి. వీటి ద్వారా విష్ణు కుండిల తొలి ఆవాసము తెలంగాణాలోని ఇంద్రపాలనగరము – ఇదే నల్లగొండ జిల్లాలోని తుమ్మల గూడెం. ఈ నగరమే వారి తొలి రాజధాని. కాల క్రమేణ రాజ్య విస్తరణలో వీరికి అమరావతి, వేంగి, దెందులూరు, బెజవాడలు రాజధానులైనాయి. ఈ శాసనాలు వెలుగు చూడక ముందు విష్ణు కుండిల జన్మస్థలము, తొలి రాజధాని వినుకొండ అని, వేల్పూరని, అమరావతి అని చరిత్ర రచనలు సాగాయి. కానీ తెలంగాణలోని ఇంద్రపాల నగరము (తుమ్మలగూడెం) విష్ణు కుండిల జన్మస్థలమని లేక తొలి ఆవాసమని శాస్త్రి శాస్త్రీయంగా నిరూపించడం కొందరు చరిత్రకారులకు కొరుకుడు పడలేదు. ఈ తామ్రశాసనాలను, శాస్త్రిని విమర్శిస్తూ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దాడే జరిగింది. చివరికి అసలు ఈ తామ్రశాసనాలు నిజమైనవి కావని, శాస్త్రి వీటిని సృష్టించారని దుష్ప్రచారం చేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి భారతదేశపు అత్యున్నత శాసన పరిశోధనాధికారి (డైరెక్టర్‌ జనరల్‌) అయిన ఘాయ్‌ హైదరాబాద్‌ వచ్చి శాస్త్రి వద్దనున్న తుమ్మల గూడెం శాసనాలు నిజమైనవేనని, కూట శాసనాలు కావని తేల్చి చెప్పారు. ఆ తర్వాతే తప్పని పరిస్థితులలో అందరూ శాసనాలను అంగీకరించారు. తెలంగాణా శాసనాల పరిష్కరణ చరిత్రలో ఈ తుమ్మలగూడెం శాసనాలు అత్యంత ప్రాధాన్యమైనవి.

చైతన్యపురి గోవింద వర్మ విహార శాసనాలు –

హైదరాబాద్‌ దిల్‌సుక్‌ నగర్‌ దగ్గరి చైతన్యపురిలో గల ఫణిగిరి కాలని చివర మూసీ నదిని ఆనుకొని వున్న కొసగండ్ల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఎత్తైన రాతి గుండుపై విష్ణుకుండిల నాటి శాసనాలున్నాయి. వీటిలో ఒకదానిని పరబ్రహ్మ శాస్త్రి పరిష్కరించి భారతిలో ప్రకటించారు. దీని ద్వారా నేటి చైతన్యపురి కాలనీలోని ఫణిగిరి కాలనీ (శాసనంలో ఫుడగిరి అని చెప్పబడినది) ప్రాంతంలో గోవింద విహారమనే బౌద్ధ విహారముండేదని తెలుస్తున్నది. మూసీ నది, దాని ఉపనదులు బిక్కేరు, మున్నేరుల తీరంలో అనేక బౌద్ధ క్షేత్రాలుండేవి. వాటిలో తుమ్మలగూడెం, వర్ధమానుకోటలు ముఖ్యమైనవి. ఈ చైతన్యపురి శాసనాలు కూడా తెలంగాణా చరిత్రకు అత్యంత ప్రాధాన్యమైనవి. సుమారు 1500 సంవత్సరాల నాడే ఈ ప్రాంతం జనావాసాలతో బౌద్ధ భిక్షువులతో కళకళలాడి వుండేదేమో?!!

కుర్క్యాల బొమ్మల గుట్ట శాసనాలు :

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండల పరిధిలోని గ్రామం కుర్క్యాల. ఈగ్రామ సమీపమునగల గుట్టపేరు బొమ్మల గుట్ట. దీనిపై జైనమత విగ్రహాలతో పాటు 11 పంక్తుల శాసనమున్నది. ఇది

క్రీ. శ. 930 నుండి 955 వరకు రాజ్యం చేసిన రెండవ అరికేసరి కాలంలో వేయించబడినది. దీన్ని 2వ అరికేసరి ఆస్థాన కవి అయిన పంప మహాకవి సోదరుడైన జినవల్లభుడు వేయించాడు. ఈ జినవల్లభుడు సకల కళలందు ప్రావీణ్యమున్నవాడు. చతుర కవిత్వ రచనలో నేర్పరి. సంగీత శాస్త్ర పారంగతుడు. జిన, భవనములు నిర్మించుటలో నేర్పున్నవాడు. ఇతడు వేయించిన ఈ కుర్క్యాల శాసనం చారిత్రకంగా ప్రాధాన్యమున్నది. ”తెలుగులో కంద పద్యాలు తొలిసారిగా ఈ కుర్క్యాల శాసనంలోనే కనిపిస్తాయి. ఈ శాసనంలో రెండు కంద పద్యాలున్నాయి. తొలి పద్యశాసనం పండరంగని అద్దంకి శాసనం కాగా ఈ కుర్క్యాల శాసనం తొలి కందపద్య శాసనమన్నమాట.

ఈ కుర్క్యాల శాసనానికి కూడా అతి భయంకరమైన ముప్పు ఏర్పడ్డది. బొమ్మల గుట్టను ప్రభుత్వం గ్రానైట్‌ వారికి లీజుకిచ్చింది. వారు గ్రానైట్‌ రాయిని తొలిచే క్రమంలో ఈ జైన విగ్రహాలకు, శాసనానికి ముప్పు ఏర్పడి నాశనమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఆ సమయంలో తెలంగాణా చరిత్ర పరిశోధకులు, అభిమానులు, ‘డాక్రీ’ వంటి సంస్థలు, హెచ్‌ఎంటివి వంటి ప్రసార మాధ్యమాలు, ఈ లీజుకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. కుర్క్యాల గ్రామంలో ‘కుర్క్యాల పరి రక్షణ కమిటీ’ బొమ్మల గుట్ట పరిరక్షణ కమిటీలను ఏర్పరచి, గ్రానైట్‌ తవ్వకాలకి వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నిర్వహించారు. ఇది 2009 -10 నాటి మాట. వీరి నిరసనలకు, ఉద్యమాలకు దిగి వచ్చిన ప్రభుత్వం కుర్క్యాల బొమ్మల గుట్ట లీజును రద్దు పరిచింది. ఈ పోరాటంలో జైనమత అనుయాయులు, పోషకులైన కన్నడిగులు తమ పీఠాల ద్వారా కర్ణాటక ప్రభుత్వం, తద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి, తమ వంతు పాత్రను పోషించారు. మన బొమ్మలమ్మ గుట్ట తొలి కందపద్యాల శాసనం ఆ రకంగా బతికి బట్టకట్టింది. లేకుంటే ఏనాడో కాలగర్భంలో కల్సిపోయేది. నాటి ప్రభుత్వ కుట్రలకి కుతంత్రాలకి బలైపోయేది !!!

ఉర్సుగుట్ట శాసనాలు :-

తెలంగాణా శాసన పరిష్కరణ చరిత్రలో పేర్కొన దగ్గ మరో శాసనం వరంగల్‌ జిల్లాలోని ఉర్సు గుట్ట శాసనాలు. నిజానికి ఇవి నృసింహ కవి రచించిన గొప్ప కావ్యాలు. కాకతీయుల కాలం నాటి సంస్కృత భాషలో అద్భుతంగా రాయబడ్డాయి. సంస్కృత కావ్యాలని శిలపై చెక్కించడం, చెక్కడం ఒక గొప్ప విశేషంగా చెప్పవచ్చు. ఈ శాసనాలను (కావ్యాలని) తొలి సారిగా మానవల్లి రామకృష్ణ కవి కాపీ చేసుకొని పరిష్కరించి ప్రకటించారట గానీ, ప్రస్తుతమది అలభ్యము. అట్లే వీటిని మెకంజీ అనుయాయులుకాపీ చేసుకున్నారని చెబుతారు. శేషాద్రి రమణ కవులుకూడా వీటిని పరిష్కరించి ప్రకటించారు. వరంగల్‌ జిల్లా శాసనాలను సంకలించిన నేలటూరి వెంకట

రమణయ్య వీటిని మరోసారి పరిష్కరించారు. పరబ్రహ్మ శాస్త్రి ఈ శాసనానికి, కావ్యానికి ‘సిద్ధోద్వాహం’ అని పేరుపెట్టి తెలుగులోకి అనువదించారు. ఈ ‘సిద్ధోద్వాహం’ కాళిదాసు రచించిన మేఘసందేశం లాగా ఉన్నదని, నృసింహకవి రచన కాళిదాసు కవిత్వాన్ని పోలివుంటుందని శాస్త్రి అభిప్రాయ పడ్డారు. అట్లే సంస్కృత భాషా చరిత్రకు ఇది చక్కని ఆధారమని చరిత్రకారుల భావన. తెలుగువారి ఏ ఇతర ప్రాంతాలలో లేని విధంగా ఒక కావ్యాన్ని శాసనంలాగా శిలలపై చెక్కడం తెలంగాణాలోని వరంగల్‌లో మాత్రమే కన్పిస్తుంది. ఈ శాసనంలో దానకర్తలు, స్వీకర్తలు దాన విశేషాలు ఏవీ లేవు.

తొలుచువాండ్రు :- ఉత్పత్తి పిడుగు :-

ఏకవాక్య, లఘు శాసనాలైన ఈ రెండు కూడా తెలంగాణ శాసన చరిత్రలో ప్రముఖమైనవి. రంగారెడ్డి జిల్లా కీసరగుట్టలో ఒక గుండ్రని పెద్ద శిలపై చెక్కబడిన ‘ఏకపద’ లఘు శాసనం ఈ తొలుచువాండ్రు. ఇది విష్ణు కుండిల కాలంనాటిది. ”వాండ్రు” శబ్దంతో ఇది తెలంగాణలో తొలి తెలుగు శాసనమని చెప్పవచ్చు. ఇది శిల్పకారుల సంఘాన్ని తెలియజేస్తుంది. అట్లే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపురంలో లభించిన ఏకపద, లఘుశాసనం. ‘ఉత్పత్తి పిడుగు’. ఈ పదమే మనకు విజయవాడ శాసనాలలో కన్పిస్తుంది. ఈ ‘ఉత్పత్తి పిడుగు’ కూడా శిల్పకారుల సంఘమని శాసన పరిశోధకుల అభిప్రాయము. విజయవాడలోను, అలంపురంలోను కన్పించిన ఈ ఉత్పత్తి పిడుగు శిల్పకారుల సంఘాలు ఒకటేనా? వేర్వేరా? అన్నది ప్రశ్న. కృష్ణ (బెజవాడ) తుంగభద్ర (అలంపురం) నదుల మధ్య వీరి ప్రయాణ ప్రస్థానం ఎలా జరిగింది అన్నది ఆసక్తి కర విషయాలు. ఈ కోణంలో ఈ రెండు శాసనాలు ప్రాముఖ్యమైనవి.

కోటగిరి తామ్ర శాసనాలు :-

మన చరిత్రకు ముఖ్యంగా కాకతీయుల చరిత్రకు అత్యంత ముఖ్యమైనవి ఈ కోటగిరి తామ్రశాసనాలు. ఇవి బయల్పడ్డ విధానము వెలుగులోకి వచ్చిన విషయాలు ఆసక్తికరమైనవి. తప్పక తెల్సుకోవల్సినవి. 1925లో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ తాలూకా బిర్‌కూర్‌ జాగీర్‌లోని చెరువులో చేపలుపడుతున్న ‘బాలూగా’ అనే బోయవానికి ఈ తామ్ర శాసనాలు లభించాయి. స్థానిక పోలీస్‌, రెవిన్యూ అధికారుల ద్వారా ఇవి నాటి అధికారి అయిన బిల్‌ గ్రామీ వద్దకు చేరాయి. బిల్‌ గ్రామీ వీటిని బార్నెట్‌కి పంపగా, ఆయన వాటిని నిజాం కాలేజి చరిత్ర ఆచార్యులు యస్‌. హనుమంత రావుకి పరిష్కరణ నిమిత్తం పంపారు. నేటి తరం వారికి తెలియని ఈ యస్‌. హుమంతరావు ఆ రోజుల్లో గొప్ప చరిత్రకారుడుగా, శాసన పరిశోధకుడుగా పేరున్నవాడు. వీరు ఈ కోటగిరి తామ్ర పత్రాలను పరిష్కరించి లఘు గ్రంథంగా (మోనోగ్రాఫ్‌) రాసి స్ధిరపరిచారు. దీనిలో వీరికి ఛాదర్‌ఘాట్‌ హైస్కూల్‌ పండితులు లక్ష్మీకాంత శాస్త్రి సాయపడ్డారు. ఆ సమయంలో ఐరోపా యాత్ర ముగించుకొని హైదరాబాద్‌కి తిరిగొచ్చిన పురావస్తు శాఖ డైరెక్టర్‌ గులాం యాజ్దానీ వీటిని భారత ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ శాసన పరిశోధకులు రావు బహదూర్‌ హెచ్‌. కృష్ణ శాస్త్రి పరిశీలన నిమిత్తం పంపగా వారు మన వారి పరిశ్రమను, ప్రశంసిస్తూ దీనిని మోనోగ్రాఫ్‌గా ముద్రించమని సలహాయిచ్చారు.

ఈ కోటగిరి తామ్ర శాసనాలని ప్రశంసిస్తూ, వాటి ప్రాధాన్యత గురించి చెపుతూ కృష్ణశాస్త్రి ‘కాకతీయ గణపతి దేవుని పుత్రిక రుద్రాంబ, శత్రు భయంకరంగా రాజ్యము చేయుచున్నదన్న’ శాసనస్థవాక్యాన్ని ప్రస్తావిస్తూ ‘రుద్రమదేవి గణపతి దేవుని కుమార్తె’అని చెప్పిన తొలి శాసనాధారమన్నారు.’ అంతకు ముందు రుద్రమదేవి గణపతి దేవుని భార్య అని, మార్కోపోలో వంటి విదేశీయుల రచనల ఆధారంగా చరిత్ర రచన సాగింది. అట్లే ఈ కోటగిరి తామ్రశాసనాల ద్వారా కాకతీయులకు అత్యంత విశ్వాస పాత్రులు, బల శూరులు అయిన సామంతులుగా ‘విరియాల వంశ’మనేది ఒకటున్నదని తొలిసారిగా తెలిసింది. ఈ తామ్ర శాసనంలో విరియాల వంశానికి చెందిన సామంత ‘సూరుడనే’ రాజు కోటగిరిలో నివసిస్తూ తన శ్రేయస్సు కోసం, రాజు శ్రేయస్సు కోసం ఇరవై మంది బ్రాహ్మణులకు వైనాయక పురి అనే వేన్కలపురిని ధారాపూర్వకంగా ఇచ్చినట్లు చెప్పబడ్డది. వీటిని కాకతీయ సంచికలో (1935లో) ముద్రించారు.

గూడూరు శాసనము :

మన చరిత్రకు ప్రముఖమైన శాసనాలలో మరొకటి ఈ గూడూరు శాసనము. (క్రీ.శ. 1124) నాటి ఈ గూడూరు శాసనం ద్వారా కాకతీయులు ఎలాంటి తిరుగుబాట్లు చేయకుండానే ఎట్లు రాజ్యానికి వచ్చారో తెలుస్తుంది. అట్లే కాకతీయుల వంశావళితో పాటు ‘కామసాని’ గొప్పదనమును, రాజనీతి చతురతను ఈ శాసనం తెలియచేస్తుంది.

కరీంనగర్‌ తామ్ర శాసనం :-

తెలంగాణ చరిత్రకి ఆధారభూతమైన శాస నాలలో ఈ కరీంనగర్‌ తామ్రశాసనం ముఖ్య మైనది. క్రీ.శ. 1246 డిసెంబర్‌ 15 నాటి ఈ త్రామ శాసనంలో అగ్రహారీకుల భూములకు నీటిపారుదల విషయంలో వచ్చిన వివాదాన్ని, కమిటీలు, కమీషన్లు వేసి, చివరికి స్వయంగా తానే గణపతి దేవుడు పరిష్కరించాడన్న న్యాయ సంబంధ విషయం వివరించ బడ్డది. నీటి యుద్ధాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ శాసనం అత్యంత ప్రము ఖమైనది. దీన్ని ప్రాచుర్యంలోకి తేవడానికి ధర్మపురి వాసి సంగనభట్ల నర్సయ్య మిక్కిలి కృషి చేశారు.

చందుపట్ల శాసనము :-

ఈ మధ్యకాలంలో చరిత్రకారుల నోట అధికంగా వినిపిస్తున్న ఈ చందుపట్ల శాసనము మన కాకతీయుల చరిత్రకు, అదీ రుద్రమదేవి చరిత్రకు అత్యంత ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదో అంతకన్న ఎక్కువ దాడికి, దుష్ప్రచారానికి గురైనది. గురౌతూనే ఉన్నది.

నల్లగొండ జిల్లా నకిరేకల్‌ సమీపమున గల చందుపట్లలోని ఈ శాసనాన్ని 1970వ దశకంలో పరబ్రహ్మ శాస్త్రి వెలుగులోకి తెచ్చారు. ఈ శాసనంలో రుద్రమదేవి మరణ ప్రస్తావన వున్నది. నిజానికి రుద్రమ మరణ ప్రస్తావన వున్న ఏకైక ఆధారము, శాసనము ఇదొక్కటే. ఈ శాసనం వెలుగు చూడకముందు చరిత్రకారులు రుద్రమ దేవి క్రీ.శ. 1295 వరకు జీవించి వున్నదని, తర్వాత సహజ మరణం చెందిందని భావించారు. చందుపట్ల శాసనం వల్ల చరిత్రకారులీ అభిప్రాయాన్ని మార్చుకొనవలసి వచ్చింది. చందుపట్ల శాసనంలో కాకతీయ రుద్రమదేవి, ఆమె సేనాని మల్లికార్జున నాయుడు శివలోకానికి ‘విచ్చేస్తేని’, వారి శివలోక ప్రాప్తి కోసం బంటు (సామాన్య సైనికుడు) పువ్వుల ముమ్మడి చందుపట్ల సోమనాథ దేవరకు కొంత భూమిని, తోటను దానం చేసినట్లుగా చెప్పబడినది. శాసన కాలము 27 నవంబర్‌ 1289. శివ సాయుజ్యమన్నా, శివలోకప్రాప్తి అన్నా ‘మరణించడ’ మనే అర్థము. రాణి/రాజు, సేనాని ఒకేసారి మరణించారంటే అది యుద్ధంలోనన్నా కావాలి, లేక యుద్ధ సన్నాహ కార్యక్రమంలో నన్నా కావాలి లేకుంటే కుట్ర అన్నా జరిగి ఉండాలి.

చందుపట్ల శాసనంలో రుద్రమ మరణకాల ప్రస్తావన వున్నదేకాని ఆమె ఎవరితో యుద్ధంలో ఎక్కడ యుద్ధంలో మరణించిందన్న విషయం లేదు. అంతగొప్ప మహారాణి మరణ ప్రస్తావన వున్న ఏకైక చరిత్ర ఆధార శాసనం చందుపట్ల శాసనం. దీన్ని చందుపట్ల యువకులు, ఆరుదైన శాసనం గనుక అదే స్థలంలో గ్రానైట్‌ రాయితో గద్దె కట్టి చక్కగ భద్రపరచి దాని చరిత్ర ప్రాధాన్యతను వివరిస్తూ శిలా ఫలకాలు పెట్టారు. చరిత్ర రచనకి అత్యంత ముఖ్యమైన ఈ చందు పట్ల శాసనం పై ముప్పాళ్ళ హనుమంతరావు (గుంటూరు) అనే చరిత్రకారుడు పెద్ద దుమారమే లేపాడు. వారి అభిప్రాయంలో రుద్రమదేవి 1289 నవంబర్‌లో మరణించింది గానీ, యుద్ధము, యుద్ధ సన్నాహ కార్యక్రమాలతో కాదు, ఆమె వీరస్వర్గమలంకరించలేదు. వీరి అభిప్రాయంలో చందుపట్ల శాసనమే అబద్దం. అది కూట శాసనం. వీరి వితండ వాదానికి వ్యతిరేకంగా చరిత్రకారులు వ్యాసాలు రాసి వారిని నిలువరించే ప్రయత్నాలు చేశారు. రుద్రమ దేవి చందుపట్ల శాసనం కూడా ఒక రకంగా దాడికి, దుష్ప్రచారానికి గురైంది. (రుద్రమదేవి యుద్ధంలో మరణించిందా? సహజమరణమా? రచన డా. ముప్పాళ హనుమంతరావు గ్రంథమే రచించారట.)

తెల్లాపూర్‌ శాసనము :

హైదరాబాద్‌ సరిహద్దు ప్రాంతమైన నాటి మెదక్‌ జిల్లాలో భాగమైన తెల్లాపూర్‌ శాసనము తెలంగాణా చరిత్రలో ఆసక్తికరమైనది. క్రీ.శ. 1418 జనవరి 8 నాటికి ఈ శాసనంలో బహమనీ రాజు ఫిరోజ్‌ షా పాలన చేస్తున్నపుడు ‘తెలంగానాపురం’లో ఓజులు (విశ్వ బ్రాహ్మణులు) గాడి బావి త్రవ్వించినట్లు, ఫిరోజ్‌ షా భార్య సురతానికి బంగారు కంఠాభరణం చేయించినట్లుగా చెప్పబడినది. ‘తెలంగాణ’ అన్న పదం తొలిసారిగా శాసనాలలో ఇక్కడే కన్పిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. తెల్లాపూర్‌ శాసనంలో తెలంగాన అని చెక్కబడ్డది. ఇది ‘నకారమే’ ‘అణ’ కాదు. కొమర్రాజు, నైజాం రాజ్యంలోని భాగాల గురించి రాస్తూ నిజాం రాజ్యంలో మరాఠీ మాట్లాడే వారి ప్రాంతాన్ని మారఠ్వాడా అనాలని, కన్నడ భాష మాట్లాడే వారి భూ భాగాన్ని తెలంగా’ణ’ అని ‘అణ’తో అనాలని, తెలుగు మాట్లాడే వారి ప్రాంతాన్ని ‘తెలంగాన’ అనాలని అంటారు. మనం తెల్లాపూర్‌ శాసనంలో కూడా ఇదే చూడవచ్చు.

ఈ పై శాసనాలేగాక మహబూబ్‌నగర్‌లోని బూద్‌పూర్‌ హుప్పాంచిక శాసనం (చక్రబంధాలతోటి), వడ్డె మాన పురం శాసనాలు, రుద్రుని వేయి స్థంబాల శాసనం, వల్లాల శాసనం, అడవి దేవులపల్లి శాసనం ఇత్యాదులన్నీ తెలుగు, సంస్కృత సాహిత్య చరిత్రలకు ప్రముఖ మైనవి. కాకతీయుల అనంతర కాలంలో తెలంగాణలో విజయనగర రాజులవి (అలంపూర్‌లో) గజపతుల ప్రాంతీయ పాలకుడైన షితాబ్‌ఖాన్‌ (కుష్‌ మహల్‌ శాసనం), కుతుబ్‌షాలవి, బహమనీ సుల్తాన్‌లవి, రేచెర్ల పద్మ నాయకులవి (రాచకొండ దగ్గరి నాగారం శాసనం ప్రముఖమైనది). ముసునూరు వంశస్తులవి, అసఫ్‌జాల కాలంనాటి శాసనాలు తెలంగాణా చరిత్రకి ఆధారాలుగా లభిస్తున్నాయి.

కుతుబ్‌షాలు ఉర్దూ, పారశీక భాషలతో పాటుగా తెలుగులో అనేక శాసనాలు వేయించారు. ముఖ్యంగా మల్కిభరాముడైన ఇబ్రహీం కుతు కాలంనాటి శాసనాలు ప్రముఖమైనవి. వీరి శాసనాలలో ద్విభాషా శాసనాలు లభిస్తున్నాయి. ఇబ్రహీం కుతుబ్‌ షా నాటి పానుగల్లు ద్విభాషా శాసనం ‘మన మిషన్‌ కాకతీయ’ విషయాన్ని తలపింపచే స్తుంది. అసఫ్‌జాల కాలంలో కూడా పాలకులు, ప్రముఖులు తెలుగు శాసనాలు వేయించారు. వీటిలో మౌలాలీలోని మహలకాబాయి చాందా వేయించిన శాసనం ప్రముఖమైనది.

కనుకనే కొమర్రాజు మాట ‘చరిత్రకారులకు తెలంగాణ స్వర్గధామం’ అన్నమాటను మళ్ళీ మళ్ళీ తలుచుకోవచ్చు. చరిత్ర రచన నిరంతర ప్రక్రియ. శాసన పరిష్కరణ, పరిశో ధన, ప్రచురణ నిత్య నూతనం!! నూతన శాసనాలు లభిస్తూనే ఉంటాయి. నూతన చారిత్రక అంశాలు వెలుగు చూస్తూనేఉంటాయి. నూతన విషయ విశేషాలు ఆవిష్కరింపబడుతూనే ఉంటాయి. కనుకనే ‘తెలంగాణా ప్రాంతం శాసన పరిశోధకులకు స్వర్గధామం”

రుద్రమదేవి గణపతి దేవుని భార్య అని, మార్కోపోలో వంటి విదేశీయుల రచనల ఆధారంగా చరిత్ర రచన సాగింది. అట్లే ఈ కోటగిరి తామ్రశాసనాల ద్వారా కాకతీయులకు అత్యంత విశ్వాస పాత్రులు, బల శూరులు అయిన సామంతులుగా ‘విరియాల వంశ’మనేది ఒకటున్నదని తొలిసారిగా తెలిసింది. ఈ తామ్ర శాసనంలో విరియాల వంశానికి చెందిన సామంత ‘సూరుడనే’ రాజు కోటగిరిలో నివసిస్తూ తన శ్రేయస్సు కోసం, రాజు శ్రేయస్సు కోసం ఇరవై మంది బ్రాహ్మణులకు వైనాయక పురి అనే వేన్కలపురిని ధారాపూర్వకంగా యిచ్చినట్లు చెప్పబడ్డది. వీటిని కాకతీయ సంచికలో (1935లో) ముద్రించారు.

– డా|| డి. సూర్యకుమార్‌