సంకల్ప బలంతో ప్రగతి బాట

ఒక ప్రభుత్వ పథకం, ప్రజా ప్రతినిధి, ప్రభుత్వ ప్రతినిధుల సంకల్పం, ఊరి ప్రజల ఐకమత్యం, సహకారంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడిని నిజం చేస్తూ కేవలం అభివృద్ధి పథంలో దూసుకు పోవడమే కాకుండా చెత్తను రీసైకిల్‌ చేస్తూ ఆదాయాన్ని సృష్టించుకుంటూ, సమస్యల వలయంలో నుండి బయటపడుతూ జిల్లాకే ఆదర్శ గ్రామంగా నిలిచింది చందుపట్ల గ్రామ పంచాయతి. నాగర్‌కర్నూల్‌ జిల్లా, మండలంలో ఉంది చందుబట్ల గ్రామ పంచాయతి. అన్ని గ్రామల్లాగే ఈ గ్రామానికి కావలసిన వనరులున్నా అభివృద్ధిలో మాత్రం వెనుకబడిరది. దీనకి కారణం సరైన దిశా నిర్దేశం, సహకారం లేకపోవడమే. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ్‌ భారత్‌ పథకం, దానికితోడు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో యువ నాయకత్వం సర్పంచ్‌ రమేశ్‌ కుమార్‌, గ్రామ కార్యదర్శి రజని ప్రత్యేక చొరవతో ఈ గ్రామం అద్భుత ప్రగతిని సొంతం చేసుకుంది.

పరిశుభ్రతతోనే ప్రజల ఆరోగ్యం, గ్రామాభివృద్ధి సాధ్యమని భావించి గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ప్రతిరోజు ఉదయం ఇల్లిల్లూ తిరుగుతూ సైకిల్‌రిక్షా, ట్రాక్టర్‌లతో 6గురు మల్టిలెవెల్‌ పారిశుధ్య కార్మికులు చెత్తను సేకరిస్తున్నారు. ఈ చెత్తను ఒకే దగ్గర కాకుండా తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించేందుకు ప్రతి ఇంటికి ఆకుపచ్చరంగు, నీలిరంగు చెత్త బుట్టలు ఉచితంగా సరఫరా చేయడం జరిగిందని సర్పంచ్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఆకుపచ్చ రంగు డబ్బాలో తడి చెత్త, నీలి రంగు డబ్బాలో పొడి చెత్తను వేసే విధంగా గ్రామస్థులకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. సేకరించిన చెత్తను బయట పారేయకుండా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సూచనతో గ్రామాల్లో ప్రభుత్వం నిర్మించిన సెగ్రెగేషన్‌ షెడ్‌లో సేంద్రియ ఎరువును తయారు చేస్తోంది. ఈ సేంద్రియ ఎరువును విక్రయిస్తూ ఆదాయాన్ని సైతం పొందుతున్నట్లు సర్పంచ్‌ తెలిపారు.

ప్రభుత్వం కల్పించిన సదవకాశాన్ని పంచాయతి సెక్రెటరితో సమన్వయం చేసుకుంటూ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి పని గ్రామ సభలో చర్చించి ఆమోదం పొందామని చెప్పారు. చెత్తను, బుట్టలో కాకుండా బయట పడేసినా జరిమానా విధిస్తామని తీర్మానం చేసుకొని ఊరంత చాటింపు చేయడం జరిగిందన్నారు. మొదట్లో కొంతమందికి జరిమానాలు విధించి గ్రామా పంచాయతి నిధులకు జమ చేసినట్లు తెలిపారు. తడిచేత్తతో సేంద్రియ ఎరువు తాయారు చేసి ఈసారి తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో నాటిన మొక్కలకు ఇక్కడ తాయారు చేసిన సేంద్రియ ఎరువునే వాడుకోవడం జరిగిందన్నారు. తద్వారా తాము బయటి నుండి ఎరువు కొనాల్సిన పరిస్థితి రాలేదన్నారు.

ఒక్కో సెగ్రెగేషన్‌ షెడ్‌ నిర్మాణానికి 2.51 లక్షల రూపాయల వ్యయం చేయడం జరిగిందని, భవిషత్తులో గ్రామ పంచాయతి అవసరాలకు పోను, మిగతా ఎరువును అమ్మి గ్రామ పంచాయతికి ఆదాయం సమకుర్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఆ గ్రామ పంచాయతి సెక్రెటరి రజని. భూగర్భ మురికినీటి వ్యవస్థ, సిసి రోడ్లు, ఇంటింటికి ఇంకుడు గుంతలు, హరితహారంలో ఇంటింటికి చెట్లు నాటి పచ్చదనాన్ని పెంపొందించినట్లు ఆమె తెలిపారు. ఒక్కో మౌలిక వసతిని సమకూర్చుకుంటూ, ఒక సర్పంచు, పంచాయత్‌ సెక్రెటరి చిత్త శుద్ధితో పని చేసి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ గ్రామపంచాయతి నిధులను సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి అభివృద్ధి, విజయాలు సాధించగలరో చందుబట్ల గ్రామాన్ని చూసి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఆ గ్రామం అంతటా పరిశుభ్రం, ఆహ్లాదకర వాతావరణం, రోడ్డుకు ఇరువైపులా మొక్కలతో కళకళ లాడుతూ గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా కనిపిస్తోంది.