|

సంగీత విద్యా నిధి

ముడుంబ సీతారామానుజాచార్యులు (1916-1996)
ఈనాటి సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ పట్టణానికి చేరువలో వున్న ‘బూరుగుగడ్డ’ గ్రామం చారిత్రికంగా, ఆధ్యాత్మికంగానే గాక సంగీత సాహిత్య విద్యాయుగళ ప్రతిభావంతులచేత ఎంతో ఖ్యాతి గాంచింది. ఇక్కడున్న వేణుగోపాలస్వామి దేవాలయం చాలా ప్రాచీనమైంది. ఎన్నో సంస్కృతాంధ్ర శాసనాలున్నాయి. పన్నిద్దరు ఆళ్వార్లు స్వయం వ్యక్త మూర్తులైన కథ అద్భుతమైంది. ఇంత ప్రాచీన దేవళానికి వంశపరంపరగా నేటికీ ముడుంబవారే అర్చకత్వం నిర్వహిస్తూ స్వామి సేవలో తరిస్తున్నారు.

క్రీ.శ. 1750 ప్రాంతంలో ఈ క్షేత్ర వైభవాన్ని ముఖ్యం చేసుకొని వాత్స్య శ్రీరంగాచార్య కవి రచించిన మూడాశ్వాసాల శాల్మలీకంద (బూరుగుగడ్డ) నందనందన విలాస ప్రబంధం అముద్రితంగానే నిలిచిపోయింది. ఇంతటి గొప్ప క్షేత్రం అర్చకులైన శ్రీనివాసాచార్యుల వారి పుత్రుల్లో ఒకరైన సీతారామానుజాచార్యులు సంగీత ప్రపంచంలో బూరుగుగడ్డ ఆచార్యులుగానే పేరుగాంచినారు.వీరి పూర్వపూర్వులు ఆనాడు త్యాగరాజస్వామి వెంట సంగీత యాత్ర చేస్తూ కాకతీయుల పరిపాలనలో వున్న బూరుగుగడ్డ యాతవాకిళ్ల గ్రామాలకు చేరుకున్నారట. ఆ స్థలం నచ్చిన కారణంగా బూరుగు గడ్డలో స్థిరపడిందానాడు ముడుంబ సంగీత కుటుంబం.

వేణుగోపాలస్వామికి ప్రాచీన కాలం నాడే మహారాజులు 600 ఎకరాల భూ దానం చేస్తే అది వీరి అనుభవంలోనే వుంటే రాజా సర్‌కిషన్‌ ప్రసాద్‌, ఈ స్వామి భక్తుడైనందున ఈ భూమినంతా ఏ వివాదాలు రాకుండా ‘దేవల్‌యినాం అనుభవం – ముడుంబవారు’ అని మార్చి ఎంతో మేలుచేస్తే ఈనాడు ఇవన్నీ కలలుగానే మిగిలినాయి.

సీతారామానుజాచార్యుల వారి తండ్రి శ్రీనివాసాచార్యులు – తల్లి వెంకటనరసమ్మగారు ముడుంబవారు చెప్పే విషయాన్ని బట్టి చూస్తే – వేణుగోపాల స్వామి దేవాలయాన్ని స్వయంగా పిళ్లలోకాచార్యులవారే సంప్రోక్షణ చేసి తీర్థ పరిగ్రహయోగ్యత కల్పించి తమశిష్య వర్గంనే, తమతో పాటు ‘దక్షిణ దేశంలోని ‘ముడుంబ’ గ్రామం నుండి వచ్చిన వారైన వీరికి దేవాలయ అర్చకత్వం పనిని అప్పగిస్తే అదే ముడుంబ వీరి గృహనామంగా ఖ్యాతమైందని తెలుస్తున్నది. ఈ విషయాలెట్లా వున్నా – శ్రీమాన్‌ సీతారామానుజాచార్యులు బాల్యం నుండి పితృపితామహదత్తమైన సంగీత విద్యను అభ్యసిస్తూ శ్రీరామ భక్తులుగా త్యాగ రాజ స్వామి ఆరాధకులుగా వుండేవారు. ముడుంబ వారింట్లో సంగీతం మరింగంటి వారింట్లో కవిత్వం – ఏపందిరి గుంజను కదిలించినా వినిపిస్తాయని ప్రతీతి. దీన్ని ఆచార్లవారు సార్ధకం చేసినారు. దేవాలయ వ్యవస్థ మార్పు చెందటం భూములు పరహస్తగతమై స్వామి ఆరాధనకే శ్రమగా మారినందున తమ వారినెవరినో వుంచి వీరు సూర్యాపేటకు చేరుకున్నారు. ఇక్కడ జీవితాన్ని సంగీతానికే అంకితం చేసి తమ నివాస గృహానికి ‘సంగీతనికుంజం’ పేరు పెట్టుకున్నారు. ఆచార్యుల వారింటికి ఏ సమయాన మనం వెళ్లినా వారు వీణ, వేణువు, ఫిడేలు, మృదంగం, తబలా, హార్మొని మొదలైన ఏదో ఒక దానిపై సంగీత సాధన చేస్తూ కాలం గడిపే ఆచార్లవారు ‘నరాల్లో సంగీతమున్న వాడు ఏ వాద్యాన్నయినా పలికించగలడు’ – అనే వారు. సంగీత – సాహిత్య ప్రఖ్యాతులైన ముడుంబ – మరింగంటి – వాణీ కటాక్ష వర్ధితులే కాని లక్ష్మీదేవి వీరి వాకిట్లోకి కూడా రాలేదు. ఇది వీరి దరిద్రత, సీతారామానుజాచార్యుల వారు అనుభవించిన బీదతనం – బీదవానికే బాధకలిగించే స్థితిలో వున్నది. ఇది వారి సంగీత విద్యకాటంకం కలిగించినా ఆచార్యవరులు ఎన్నో పాట కచేరీలు చేసినారు. మదరాసు వెళ్లి సినిమా ప్రపంచం విహారం చేసి కుటుంబ సమస్యల కారణంగా తిరిగి సూర్యాపేట చేరుకున్నారు. క్రీ.శ. 1950 ప్రాంతంలో హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తులో వీరి సంగీత విద్యకు ముగ్ధులైన దేవులపల్లి రామానుజరావు, మాడపాటి హనుమంత రావు గారు కరిగిపోయి రెండు దోసిళ్ల రూపాయిల బిళ్లలను వారి కొంగుకు కట్టితే అదే సభలో వున్న రాళ్లపల్లి ‘బ్రహ్మకడిగిన పాదము’ కీర్తనను పదే పదే పాడించుకున్నారు. ఒక సందర్భంలో మాడపాటి వారింట్లో వీరు ‘కానడరాగం’ ఆలపిస్తుంటే అక్కడే వున్న సముద్రాల రాఘవాచార్య (జూనియర్‌ సముద్రాల) వీరి ఆలాపనను మెచ్చి సినిమా రంగానికి ఆహ్వానించటంతో వీరి జీవితం ఒక మలుపు తిరిగిందనవచ్చు. అట్లా భక్తకుచేల, రుష్యశృంగం, సత్యనారాయణ వ్రతం చిత్రాల్లో ఎన్నో పాటలు పాడినారు. ఆటాటి మ్యూజికల్‌ హిట్‌ చిత్రం ‘భక్త జయదేవ’లో ‘హరహరాజయకరా’ అనే వీరు పాడినపాట గొప్ప సంచలనం సృష్టించింది.

ఆనాడు దీనికి ప్రతిగా జగదేకవీరుని కథలో ఘంటసాల పాడిన ‘శివ శంకరీ-‘ ప్రఖ్యాతమై – ఆచార్యుల వారికీ ఘంటసాల వారికీ స్నేహాన్ని కుదిరించింది. వీరి పరిచయంతో మహాగాయకుడు బడేగులాం ఆలీఖాన్‌ గూడా వీరి మిత్ర కోటిలో చేరినారు. ఒక పర్యాయం సినిమారంగానికి చెందిన పి. కోదండపాణి, సీతారామానుజాచార్యులని ‘అభేరి’ రాగం పాడవలసిందిగా కోరితే – సుమధురంగా

సుస్వరంగా 20 నిమిషాల పాటు వినిపించి ఆశ్చర్యపరిస్తే ఇంతగొప్ప సంగీతం మన సినిమాల్లోకి ఎపుడు వస్తుందని ఆలోచించే వారు. సినిమా రంగంలో వున్న సముద్రాల, ఘంటసాల, రాజేశ్వరరావులవంటి వారి ప్రోత్సాహం ఎంతవున్నా ఆచార్యులవారు సినీరంగంలో నిలువలేకపోవటానికి కారణాలు వారి అర్ధాంగి పరమపదించటం కుటుంబ భారం – మొదలైన సంక్షోభాలతో సతమతమైన ఆచార్యుల వారు మొదటి నుండీ తమకున్న నాటక సంగీత రంగం సన్నిహితత్వంతో వేమూరి గగ్గయ్య, ఇడుముక్కల సుబ్బారావు ఉప్పులూరి సంజీవరావు (స్త్రీవేషం) వంటి వారు ప్రదర్శించేనాటకాలకు వీరు వయోలిన్‌, హార్మనీలతో నేపథ్య సంగీతాన్ని అందించినారు. ఈ సమయంలోనే స్థానం నరసింహారావు, ఈలపాట రఘురామయ్యలతో సన్నిహితంగా వుంటూ వారున్న నాటకాలకు కూడా నేపథ్య సంగీతాన్ని కూర్చటం వీరికొక అనుభూతి (వీరిద్దరూ సూర్యాపేటలో ఆచార్యుల వారింటికి వచ్చి ‘చారుదత్తుని’ విందునుస్వీకరించేవారు).

అప్పట్లో వచ్చిన ‘పెంచినపిల్ల’ నాటకంలో ‘ప్రేమ సుమంసుమించేనాదు హృదయ సీమలో’ మకుటంగల ఈ పాటను ‘కల్యాణి’రాగంలో ట్యూన్‌ చేసిన ఆచార్యుల ప్రతిభ ఆనాడు మారుమ్రోగింది. తరువాత ఇదే ట్యూన్‌ సముద్రాల సాహిత్యం గల ‘నాదు ప్రేమ భాగ్యరాశి నీవె ప్రేయసీ’ అనే పాట ప్రసిద్ధమైంది. సీతారామానుజా చార్యులు వేల కొద్ది సంగీత కచేరీలు చేసినారు. 1979 నుండి సూర్యాపేటలో గురుకులం పద్ధతి సంగీత విద్యా బోధన చేసి ఎందరినో విద్యావంతుల చేసిన వీరు ‘చతురిక’ (నాల్గు వాద్యాలతో) నిరోష్ఠ్యరాగాలను కనిపెట్టినారు.

శ్రీమాన్‌ ఆచార్యులవారు వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాదు నగరాల్లో శతాధిక కచేరీలు చేసి ఖ్యాతులై భద్రాచల వాగ్గేయ కార ఉత్సవాల్లో క్రమం తప్పకుండా పాల్గొని రామదాస కీర్తనలను ఆలపించి ఎన్నో మార్పులు చేసిన వీరిని ఆనాడు పాపట్లహనుమత్‌ శాస్త్రి యాదగిరి దేవస్థాన సంగీత కార్యక్రమ నిర్వాహకులుగా నియమించి భగవత్సేవకవకాశం కల్గించినారు.

1946 ప్రాంతంలో నల్లగొండయందు జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్‌ ‘సాహితీ మేఖల’ వార్షికోత్సవాల్లో వీరిచేత శిక్షణ పొందిన వారు ప్రదర్శించిన నాటకాలు, వీరి సంగీత కచేరీలు, ఆ కార్యక్రమాలకు వన్నె చేకూర్చినాయి. ఆచార్యుల వారు 1949 – 59 వరకు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో సంగీత కార్యక్రమాలెన్నో యిచ్చినారు. అప్పుడు వారాలపించిన రామదాసు కీర్తనలు, మట్టపల్లి, యాదగిరినృసింహ స్తోత్రాలను ఆకాశవాణి వారు ఎప్పుడూ వినిపిస్తుంటారు. 1983 ప్రాంతంలో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో కచేరీ చేసినప్పుడు అప్పటి ప్రముఖులు టి. హయగ్రీవాచారి నుండి ‘సంగీత రత్న’ బిరుదాన్ని పొంది మరింకెన్నో సభల్లో ఎన్నో బిరుదాలు పొందినా, ఆచార్యులవారు ‘ఒదిగే వున్నారు’. రాముని సన్నిధియే సుఖమని భావిస్తూ ఒకప్పుడు సూర్యాపేట గాంధీ పార్కులో గొప్పగా జరిగే త్యాగరాయ గానసభల్లో ప్రతిసంవత్సరం తమ గళం వినిపిస్తూ ఆనాడు ఆ సభలకు వచ్చిన పి.వి.నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీరామారావు వంటి ప్రముఖుల ప్రశంసలనంది సన్మానాలను పొందారు. వీరికి ఆత్మీయులైన స్థానం నరసింహారావు, ఈలపాటి రఘురామయ్య, కాంతారావు వంటి వారికి ఇంట్లో ఆతిథ్యమిచ్చిన ఆచార్యుల వారు దాదాపు 17 సంవత్సరాల పాటు సూర్యాపేట జవహర్‌ బాల భవన్‌లో సంగీతాచార్యులుగా పనిచేసి ఎవ్వరేమిచ్చినా గ్రహించని దీక్షతో కాలంగడిపారు. వీరు ఖాన్‌ అబ్దుల్‌ కరీం ఖాన్‌ వలే పాడుతూ కన్నుమూయవలెననే తన కోరికను తెల్పుతుండే వీరు తన శిష్యులను ‘సుస్వరం పాడండి – అపస్వరం పాడితే గొంతుకోస్తా’ అనేవారు. అందుకే తమ జీవితాన్ని సుస్వర – సుమధుర గీతంగా ఆలపిస్తూ, ఇహలోకాన్ని త్యజించిన ఆచార్యుల వారిని ఇప్పుడు గుర్తించే వారెవరు? కనీసం సూర్యాపేట వారైనా, వారి స్మృత్యర్థం ప్రతివర్షం కార్యక్రమాలు జరిపి నేటి యువతరానికి ప్రేరణ కలిగించటం అవసరం.

డా|| శ్రీరంగాచార్య