సంబరాల సంక్రాంతి

గన్నమరాజు గిరిజామనోహరబాబు

తెలుగువారి సంక్రాంతి సంబరాలను అందమైన సీసంలో పొందుపరచిన ‘గంగిరెద్దు’ వాక్యంలో డా. పల్లా దుర్గయ్య మాటలు నేటికీ మన పల్లెల్లో జరిగే సంక్రాంతి సంబురాన్ని కళ్ళకు కట్టిస్తున్నాయి. తెలుగు వారు చేసుకునే ఆనందకరమైన పర్వదినాల్లో సంక్రాంతికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆబాల గోపాలానికి ఆహ్లాదాన్ని పంచే సంక్రాంతి గురించి ఎన్నో విశేషాలున్నాయి. ఆకాశంలో జరిగే అనేక మార్పులతో పాటు, ఋతువుల సౌందర్యం, నేలతల్లి అందించే కొత్త పంటల్లోని ఆనందం, వాతావరణంలో కలిగే పలు మార్పులు ఇట్లా అనేక విధాల్లోనూ ఈ పండుగకు ప్రత్యేకతలు ఉన్నాయి.

సంక్రాంతి పండుగ అందమైన హేమంతంలో మంచు తెరల మధ్య పుష్యమాసంలో వచ్చే పండుగ. ఇది సూర్యమానం ఆధారంగా జరుపుకుంటాం కనుక ప్రతి సంవత్సరం జనవరి 13, 14ల్లో కాని 14, 15ల్లో కాని తప్పక వస్తుంది.

ఈ సంక్రాంతిని ”మకర సంక్రమణం” అని కూడా అంటారు. మేషాది ద్వాదశ రాశుల్లో సూర్య భగవానుడు ముందటి రాశి నుండి తరువాతి రాశిలోకి సంక్రమిస్తాడు గనుక ఇది సంక్రాంతి. సంక్రమణ మంటే మారడమని అర్ధం. ప్రతి యేటా 12 సంక్రాంతులుంటాయి. మకర రాశిలోకి సూర్యుడు సంక్రమించినప్పుడు వచ్చే సంక్రమణాన్ని ”మకర సంక్రమణం” అంటారు. మిగతా సంక్రమణాలకు లేని చాలా ప్రత్యేకతలు ఈ సంక్రమణానికి ఉన్న కారణంగా దీన్ని ప్రత్యేక పర్వదినంగా ప్రజలు జరుపుకుంటారు. పైగా సూర్య గమనం దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తుంది. ఉత్తరాయణం పుణ్యకాంలంగా విశ్విసిస్తారు గనుక ఉత్తరాయణ పుణ్యకాల సందర్భంగా ఆత్మీయులకు, పెద్దలకు తొలి తర్పణాలు వదలి వారిని స్మరించుకోవడం సంక్రాంతి రోజు జరుపడం విశేషం. ఉదయాన్నే స్వర్గద్వారాలు తెరిచి ఉంటా యన్న నమ్మకంతో ఆ తిల తర్పణ కార్యక్రమాన్ని నిర్వహించి తమ వాళ్ళకు స్వర్గ పథగాములు కావాలని వాంఛిస్తుంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని గురించి డా. పల్లా దుర్గయ్య

మూయబడెన్‌ యమాలయపు ముఖ్య కవాటము ప్రాణికోటికిన్‌
తీయబడెన్‌ సురాలయపు ద్వివ్యకవాటము, దక్షిణాయనాధ్యాయ
సమాప్త్యనంతర మనంత విహాయసచారి సూర్యనారాయణుడుత్తరాయణ పరాయణుడైన శుభాహమందునన్‌

అనడం ఈ కాల ప్రాశస్త్యాన్ని తెలుపుతున్నది. సూర్యగమనం మారిన దృష్ట్యా ప్రకృతిలోనూ, సృష్టిలోనూ చాలా మార్పులు సంభవిస్తాయి. మానవులకు అనేక విధాల అనుకూలమైన కాలం ఉత్తరాయణ కాలం. వ్యవసాయదారులకు కొత్త పంటలు ఇంటికొస్తాయి. అందుకని అమితానందంతో ఈ పండుగను అత్యంత సంబరంగా మూడు రోజులపాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ – కొన్ని ప్రాంతాల్లో నాలుగోరోజు కూడా ముక్కనుమను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ మూడు రోజులూ మిక్కిలి కోలాహలంగా తెలుగు లోగిళ్ళు వెలిగిపోతాయి.

సంక్రాంతికి రంగవల్లుల ప్రాముఖ్యం ఎక్కువ. ప్రతినిత్యం ఇంటి ముంగిలిలో ముగ్గులు వేయడం ఒక సంప్రదాయం. ఈ పండుగ దినాల్లో రంగురంగుల రంగవల్లులు వేసి రంజింపజేయడం ఒక సుందర దృశ్యం. ఆ ముగ్గు మధ్యలో ఆవుపేడతో చేసిన ‘గొబ్బెమ్మ’లను పెట్టి సంప్రదాయ దుస్తులతో అమ్మాయిలు దాని చుట్టూ పాటలు పాడుతూ తమ ఆనందాన్ని అందరికీ పంచుతుంటారు. ఈ గొబ్బెమ్మల్లో చిన్నవాటి మధ్యలో ఒక పెద్ద గొబ్బెమ్మను చేసి పెట్టడం గమనించవచ్చు. అది ‘గోదాదేవి’కి ప్రతీకగా భావిస్తారు. ఆ గొబ్బెమ్మల్లో నువ్వులు, రేగుపళ్ళు మాత్రమే గాక పూలు కూడా ఉంచి విశేషంగా గుమ్మడిపూలతో అలంకరించడం దీని ప్రత్యేకత.

భోగి పండుగ రోజు ఇంట్లోని పిల్లల తలలపై భోగిపళ్ళు పోయడం ఈ సందర్భంలో మనం చూసే మరో వేడుక. పిల్లల తలపై పోసే ఈ పండ్లు రేగు పండ్లు, వీటితో కలిపి చిల్లర నాణేలు, చెఱుకుముక్కలు, బియ్యం వంటివి జత చేసి తల్లులు తమ పిల్లల తలలపై పోస్తుంటారు. ఈ ఉత్సాహల్లో పాల్గొనడానికి తమకు తెలిసిన పేరంటాండ్రను ఆహ్వానించి అందరి మధ్య ఆనందోత్సాహాలతో వేడుక జరుపుకోవడం భోగి పండుగ నాటి ఆచారం.

ఈ భోగిరోజే భోగి మంటలు కూడా వేసుకుంటుంటారు. ప్రతి గ్రామంలోనూ నాలుగు మార్గాల కూడళ్ళలోనో, వీధుల చివర్లలోనో ఈ మంటలు వేసుకుంటుంటారు. తమ తమ ఇళ్ళలోని పాత చీపుర్లు, పాత తట్టలు మొదలైనవన్నీ ఈ మంటల్లో వేసి తెల్లారినుండి కొత్త వాటిని ఉపయోగించుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది. సుమారు భోగినాటి తెల్లవారు జామున గం. 3.30 మొదలు గం. 4.30 మధ్యలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు.

సంక్రాంతి రోజు రోజు కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు పెట్టడం, కొత్త అల్లుళ్లను ఆహ్వానించుకోవడం కనిపిస్తుంది. ఈ పండుగనాళ్ళలో విశేషంగా మనం చూసేది గంగిరెద్దుల ఊరేగింపును. గంగిరెద్దును తీసుకొని వచ్చే గంగిరెద్దులవాడు అనేక రంగులున్న వస్త్రాలతో అలంకరించిన తన గంగిరెద్దుతో పలురకాల విన్యాసాలను ప్రతి ముంగిట్లో చేయిస్తూ తిరగడం ఎంతో నేత్రపర్వంగా ఉండే సన్నివేశం. ఎద్దును శంకరవాహనంగా భారతీయులు పవిత్రంగా గౌరవిస్తారు. పైగా వ్యవసాయానికి అత్యంత ప్రధానమైనది వృషభమే. పండించే పంటలకు మూలం ఎద్దే. అందుకే ఈ పర్వదినాల్లో దానికంత గౌరవం. సాధారణంగా వృషభ జాతికి చెందిన ‘ఆవు’ను గోపూజ చేసి మనం గౌరవించడం ఒక రకంగా నిత్యకృత్యం. పైగా గోవును భూమికి సంకేతంగా మనవాళ్ళు గుర్తించారు. అందుకే ”జుగోప గోరూపధరామివోర్విం” అన్నారు. భూమి నుండి పండే పంటలే మన ప్రధాన ఆధారాలు. అందుకే పశుపూజ ఈ సందర్భంలో మనకు చోటు చేసుకుంది. కనుమ రోజు రైతులు తమ పశువులను పూజించడం కూడా ఇందులో భాగమే.

”హరిదాసు”లు ”హరిదాసు”లు సంక్రాంతికి వన్నె తెచ్చే మరో సంప్రదాయ ప్రవర్తకులు. గుమ్మడి పండు ఆకారంలో ఉండే ఒక కంచు (ఇత్తడి) పాత్రను శుభ్రంగా సిద్ధం చేసుకొని తాను పట్టె వర్ధనాలు పెట్టుకొని హరినామ సంకీర్తన చేసుకుంటూ ”హరిలో రంగ హరీ” అని ఆనందంగా పలుకుతూ ఇల్లిల్లూ తిరిగి ధాన్యం స్వీకరిస్తుంటాడు. కొత్త పంట వచ్చిన ఆనందంతో ప్రతివాడు తమ ఇంటి ముందుకు వచ్చిన హరిదాసు శిరస్సుపైనున్న పాత్రలో ధాన్యం పోస్తూ ఆనందించడం విశేషం.

పలు విధాలైన విన్యాసాలతో జానపద కళాకారుల ప్రదర్శనలు, బుడబుక్కల వారి పాటలతో హోరెత్తే వీధులు సంక్రాంతి సంబరాల్లో నిత్యం కనిపించే దృశ్యాలు. పాలు పొంగించడం, రకరకాల పిండి వంటలు చేసుకోవడం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దాదాపు నెలరోజుల ముందు నుండే ”సకినాలు” – ”అరిసెలు” వంటి చక్కని వంటలను చేసుకొని ఇంటిల్లిపాదీ ఆనందించడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ పండుగతో ధనుర్మాస సమాప్తి కూడా అవుతుంది కనుక నెల నుండి ప్రతి నిత్యం జరిగే తిరుప్పావైకాలక్షేపం ముగిసిన సందర్భంలో వైష్ణవాలయాల్లో ”గోదాకల్యాణం” నిర్వహించి పవిత్రులవుతారు.

ఖగోళంలోని చుక్కల్ని తలపించే చుక్కలతో అలరారే రంగవల్లుల రంగుల హంగులతో వెలిగే సంక్రాంతిని గురించిన ప్రసక్తి ఆ సంవత్సరం వచ్చిన ఉగాది నాటి పంచాంగంలో వస్తుంది. అదే ”సంక్రాంతి పురుషుడు” – ప్రపంచంలో ప్రతి హిందువు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి, ఉగాది ముఖ్యమైనవే. ఆనాటి పంచాంగ శ్రవణం నిర్వహించినా పురోహితుడు ఆ సంవత్సరపు సంక్రాంతి పురుషుణ్ణి గురించి అతడెక్కిన వాహనాన్ని గురించి వివరిస్తాడు. ఆయన అధిరోహించిన వాహనాల్లో కొన్ని అంతగా మేలుకలిగించవనీ, ఆ సంవత్సర ఫలితాల్ని విశ్లేషిస్తాడు. ఈ సంక్రాంతి పురుషుణ్ణీ కొన్ని ప్రాంతాల్లో సంకరుమయ్య అని అంటారు. ఈ పండుగనాడు ఆ సంక్రాంతి పురుషుణ్ణి భావిస్తూ ఒక మట్టి బొమ్మను చేసి కొన్ని ప్రాంతాల్లో పూజిస్తుంటారు.

జయసింహ కల్పద్రుమం పేర్కొన్న ”తత్ర మేషాదిషుద్వాదశరాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతి అన్నట్లు సూర్య సంక్రమణ విశేష పర్వదిన శోభను వర్ణించిన కవీశ్వరుల కావ్యాలు మనలో స్ఫూర్తిని నింపి సంక్రాంతి సంబరాలను మరింత ఆనందోత్సాలతో నిర్వహించుకుంటూ కొత్త సంక్రాంతిని ఆహ్వానిద్దాం!

పసిడి గన్నెరు పూలపట్టు పీతాంబర చ్చవ్వులు
దిక్కుల నిండ చౌకళింప
నింగిరంగు రంగు వంగ పూరైకఁబుత్తడియురమ్ము భరమ్ముతడబడుగ
కొదమరాయంచల గుమినవ్వు మొల్ల పువ్వుల దండ పేరుర స్థలి చలింప పొగవన్నె మంచు ముసుగు దుకూలము నుండి మిసిమిమైచాయ క్రొమ్మించులీన
ఘన నీల కచగ్రంథి కలిత హరితమరువక దళ్ళ నిబద్ధ సేమంతి దామ
మంజరీ సౌరభ ఘుమం ఘుమాయితహరి
దంతమయి వచ్చె మకర సంక్రాంతి
(డా. పల్లా దుర్గయ్య)