సలికాలం వచ్చిందంటే అరికట్ల కట్టుకునుడు, మంట కాగుడు

అన్నవరం దేవేందర్‌

వానకాలం పోయి సలికాలం వచ్చిందంటే సంకల్లేవకుంట సలిపెడుతది. కాళ్ళు ఇర్రిర్రు మంటయి. చెయ్యిలు పల్గుతయి. మొకం ఎండిపోయినట్టు అయితది. పొద్దుగాల లేవబుద్దికాదు. లేశినంక పని లేనోల్ల కైతే ఎండపొడలు కాగుకుంట ఉంటరు. సలి నుంచి రక్షించుకునేందుకు అరికట్లం కట్టుకుంటరు. అరికట్లం ఉంటే చెవుల మీదికెల్లి తలకాయ మీంచి పాత దోతి గుడ్డ లేకుంటే చీర గుడ్డను కప్పుకునుడు. అప్పుడు గాలి నెత్తిలకు సలిరాదు. సలి బాగ పెడ్తె వణుకుతరు. ఇగంపడుతరు. ఏం తిన బుద్దికాదు.

ఇండ్లడ్ల పని చేసుకునే ఆడోల్లు ఎక్కువగ అరికట్లం కట్టుకుంటరు. ఏ కాలమైనా వాల్లు పెద్ద ఎగెలి వారంగనే లేవాలె. లేశి నీళ్ళు చేదుకొని వాకిలి ఊడ్చి, సాన్పు సల్లుడు ఉంటది. బోల్లు బొస్కర తోముడు, ఇవన్నీ నీళ్ళతోనే పని. చేతులు ఇగం పడుతయి. అందుకే ఎగిలివారంగ మంట పెట్టుకుంటరు.

వాకిల్లల్ల కంది పొరుక వరిగడ్డి అక్కెరకు రాని చెత్త చెదారం అంతముందట ఏసుకొని తంపె పెట్టుకుంటరు. ఆ మంట సుట్టూర కూకొని మంట కాగుతరు. పాణం అంత ఎచ్చగ అయితది. ఎచ్చగ అయినంక మెల్లగ లేశి పోయి ఎవల పనికి వాల్లు కదిలిపోతరు. ఒగలు ఇల్లు ఈడ్సుడు, ఇంకోగలు వాకిలి నూకుడు మొదలు పెట్టి, పెండ నీళ్ళ తోని సాన్పు సల్లితె, పచ్చగ వాకిలి మెరుస్తది. అటెన్క ముగ్గులు వేస్తరు. గదే యాల్లకు పొద్దు పొడుస్తది. గరగర పొద్దు మీదికి వస్తాంటే మంచి ఎండ పొడ వస్తది ఆ ఎండ పోడ పెయ్యికి ఆయి మంటది.

ఎండ పొడకు నిలబడితే మనిషికి విటమిన్‌ డి అందుతది. ఎన్కట ఎండల, వానల, సలిల పని చేస్తే అన్ని విటమినులు ప్రకృతి పరంగానే తెల్వకుంటనే వచ్చేటియి. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా సంటి పిలగాండ్లను ఎండ పొడకు పది నిమిషాలు పట్టుండ్రి అని డాక్టర్లు చెప్పుతున్నరు. మనిషికి సూర్యరశ్మి తాకకపోతే చర్మ వ్యాధులు వస్తాయి. ఇరవై నాలుగు గంటలు ఎసీలనే ఉండెటోల్లకు స్వచ్ఛమైన గాలి వెలుతురు దొరకక అవస్థలు పడుతుంటారు. ఇవన్నీ సలికాలంలోనే ఎక్కువగ అవసరం ఉంటయి. సలికాలంల ఇంటి కాడ పిలగాండ్లకు ఏదన్న చిరుదిండి కావాలంటే పల్లీ ముద్దలు నువ్వుల ముద్దలు చేసుకుంటరు. నువ్వులలో వేసినవి తింటే పెయ్యిల వేడి పుట్టి సలిపెట్టది.

సలికాలం ఎవుసాల కాడికి మక్కకంకుల కావలి, పల్లి చేన్ల కావలికి పోతే అదొక పెద్ద సలి వాతావరణం. మగోల్లు అరికట్లం కట్టుకోరు. గొంగడి కొప్పెర పెట్టుకొని కిర్రు చెప్పుల తోని సర్ర సర్ర నడిచి పోతాంటే, సలిగిలి ఎటో పోయినట్టు అన్పిస్తది. శేనుకాడికి నడిచి పోయినంక అక్కడ మల్ల గంట సేపు ఆ పుల్ల, ఈ పుల్ల ఏరుకచ్చి మంట పెట్టుకుంటరు. మంటల ఎలుగుకు కూసొని అక్కన్నే మంచె మీద వరిగడ్డిల పంటరు.

వరిగడ్డి సుట్టు పెట్టుకొని లోపల గొంగడి కప్పుకొని ఎంత సలిల పన్నా ఉడుకపోత్తది. సలి కాలం ఉడుకుడుకు చాయ ఊదుకుంట ఊదుకుంట లోట గిలాసెడు తాగవచ్చు. చాయ కప్పుకన్న ఎక్కువ తాగితే లోపల ఎచ్చగ అన్పిస్తది. అన్నం కూడ వేడి వేడిది తింటరు. మాపటి జాం అయితే సర్వపెట్టుకుని అందరు కల్సి తింటరు. సలికాలం రాత్రిపూట గడిచినట్టే అనిపియ్యదు. బాగ పొద్దుంటది. తొమ్మిది దాటంగనే, సలి పెట్టంగ వట్టిగ కూసునుడు ఏందని ముడుసుకొని పంటరు. తెల్లారంగ ఐదు వరకు మేల్కరానే వస్తది. అటో ఇటో పనులు చేసుకునే వరకు పొద్దు పొడుస్తనే ఉంటది. జర ఆకలి గాదు తినకుంటే గావర అయితది. సంక్రాంతి వస్తందంటే దవుడకు నమిలేందుకు సకినాలు గారెలు లగాంచి తయారు అవుతయి. సలికాలం సలిసలకు ఇదో గమ్మతి సలి బారి నుంచి ఎచ్చబడే ఆలోచనలు కన్పిస్తయి. ఎవలన్న సుట్టాలు వస్తే, మంచి గుడ్ల కోడినన్న కోసుకుందుం. ఇంత మందన్న తాగచ్చునన్న ఆశపుడుతది. అంతలనే ఇంటి ముందట కాకి ఒర్రుతది రాత్రి సుట్టం వస్తడు.