సాగునీటికి భారీగా రూ. 25,000 కోట్లు కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యం

waterనీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వం సాగునీటి రంగానికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యతనిస్తూ, కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా బడ్జెట్‌లో 25,000 కోట్ల రూపాయలు కేటాయించింది. 

తెలంగాణను బంగారు మాగాణంగా మార్చే దిశగా పాత, కొత్త నీటిపారుదల ప్రాజెక్టులకు, చెరువులను పునరుద్ధరించే మిషన్ కాకతీయకు భారీ నిధులు కేటాయించామని ఆర్ధిక మంత్రి ఈటల తెలిపారు.

తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే మేం చాలా సార్లు చెప్పాం. నదీ జాలాల్లో మన వాటా ప్రకారం మనం నీళ్లు వాడుకోలేకపోతున్నామని బాధ పడ్డాం. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటా 1250 టిఎంసీలు. మరో 150 టిఎంసిలకు పైగా మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఉంది. కానీ ఈ నీటిని వాడుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టులుకట్టలేదు. సమైక్య పాలనలో ప్రాజెక్టులన్నింటినీ అంతర్రాష్ట్ర వివాదాల్లోకి నెట్టేశారు. వివాదాల సాకు చూపి ప్రాజెక్టులను పక్కన పడేశారు. ఇది దురుద్దేశ్యంతో చేసిన కుట్ర. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లవు అని పాటలు పాడుకున్నం. ఇప్పుడు జరుగు తున్నది అదే. తెలం గాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే మన సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌ చేపట్టారు. శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగునీరు అందించడం కోసం సరైన ప్రణాళికలు వేశారు.

కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అటు గోదావరి, ఇటు కృష్ణా వాటి ఉప నదుల మీద దాదాపు 400 బ్యారేజీలు కట్టుకున్నవి. ఫలితంగా అటు ఎస్‌ఆర్‌ఎస్పిలో గానీ, ఇటు జూరాలలో గానీ చుక్క నీరు లేని పరిస్థితిని ఈ ఏడాది మనం కళ్లారా చూశాం. గోదావరి, కృష్ణా నదుల ద్వారా నీరు రావడం భవిష్యత్తులో కూడా గగనమే. ఇప్పుడు నీరు లభ్యమయ్యేది వేలం ప్రాణహిత, ఇంద్రావతి నదుల ద్వారా మాత్రమే. అందు ఆ నీళ్లను ఒడిసిపట్టుకుని పంట పొలాలకు అందివ్వాలన్నదే ప్రాజెక్టుల రీ-డిజైన్‌ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వ్యాప్కోస్‌ (వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌) ద్వారా కూలంకష సర్వే నిర్వహించాం. లైడార్‌ సర్వేలు చేయించాం. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో, నిపుణులతో చర్చించాం. దాని ఆధారంగా సరైన ప్రణాళికతో ప్రాజెక్టులు కట్టాలని నిర్ణయించాం.

గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై నిర్మించ తల పెటన్టి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 8న మహారాష్ట్రతో అంత రాష్ట్ర ప్రాజెకుల్ట పై చారిత్రక అవగాహన కుదుర్చుకుని వచ్చారు. రెండు రాష్ట్రాలలో ఉన్న ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై వచ్చే సమస్యలను సామరస్యపూర్వకంగా, త్వరితగతిన పరిష్కరించుకొనేందుకు అంగీకారం కుదిరింది. అందుకోసం ఉమ్మడి అంతర్రాష్ట్రీయ బోర్డును ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవగాహన ఫలితంగా గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తుమ్మిడిహట్టి, పెన్‌ గంగపై రాజుపేట, చనాఖా-కొరటా, పిన్‌ పహాడ్‌ బ్యారేజీల నిర్మాణానికి మార్గం సుగమం అయింది.

దక్షిణ తెలంగాణకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అటు ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాకు, శ్రీ సీతారామ ప్రాజెక్టు, భక్త రామదాసు ప్రాజెక్టుల ద్వారా ఖమ్మం జిల్లాకు సాగునీరు అందిస్తాం. ఇప్పటి నిర్మాణంలో ఉన్న భారీ, మధ్య తరహా నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తాం. భారీ, మధ్య తరహా నీటి ప్రాజెక్టులతో పాటు, చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొంటున్నది. ఏడాదికి తొమ్మిది వేల చెరువుల చొప్పున గత ఏడాది మొదటి విడత మిషన్‌ కాకతీయ ప్రజల భాగస్వామ్యంతో ఓ ఉద్యమంలా నడిచింది. రెండో విడత కూడా కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్నది. తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణానికి, ‘మిషన్ కాకతీయ’ పనుల కోసం బడ్జెట్‌లో ఏకంగా 25 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. దేశ చరిత్రలో నభూతో అనే విధంగా ఇంత పెద్ద మొత్తంలో సాగునీటి కోసం ఖర్చు చేసిన సందర్భం మరోటి లేదు. దీన్ని బట్టి రైతులకు సాగునీరు అందివ్వడాన్ని ఈ ప్రభుత్వం ఎంత ప్రధానమైన కార్యక్రమంగా తీసుకున్నదో అర్థం చేసుకోవచ్చు.

సాగు నీటి రంగానికి ప్రతిపాదించిన రూ.25,000 కోట్లలో, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి రూ.7861 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.6286 కోట్లు, సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులకు రూ .1152 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.

‘మిషన్‌ భగీరథ’ సృష్టికర్త కేసీఆర్‌ 

‘ప్రివెన్షన్‌ ఇజ్‌ బెటర్‌ దాన్‌ క్యూర్‌’ అని నానుడి. తాగు నీటి ద్వారా వచ్చే వ్యాధుల నివారణ రక్షిత మంచినీటి ద్వారానే సాధ్యం. ప్రజారోగ్యం మెరుగుపరచటానికి ఇదొక మంచి మార్గం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో సిద్ధిపేట శాసనసభ్యులుగా, ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు 20 సంవత్సరాల క్రితమే ఇచ్చారు. ఆ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ఆలోచనకు రూపమే ‘మిషన్‌ భగీరథ’. తెలంగాణ ఆడపడుచులు బిందె తలమీద పెట్టుకొని మైళ్ళ దూరం మంచినీటి కోసం పోరాదనే కల ఈ పథకానికి స్ఫూర్తి. గ్రామాల్లో అయితే 100 ఎల్‌.పి.సి.డి., పట్టాణాలలో 135 ఎల్‌.పి.సి.డి, నగరాలలో 150 ఎల్‌.పి.సి.డి చొప్పున ప్రజలకు మంచినీళ్ళు అందించడం ఈ పథక రచన. ఈ వినూత్న పథకం రూపకల్పన దశలోనే హడ్కో, నీతి అయోగ్‌ లాంటి సంస్థలు ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బీహారు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రశంసలను అందుకొంది.

భగీరథ ప్రాజెక్టును 26 సెగ్మెంట్లుగా విభజించినాము. కృష్ణా, గోదావరి వంటి జీవనదుల ప్రధాన రిజార్వాయర్ల నుండి 42.27 టిఎంసిల నీటిని భగీరథ ప్రాజెక్టు ద్వారా తాగు నీటి అవసరాలకు పంపిణీ చేస్తాం. రూ. 40,000 కోట్లతో నిర్మించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రానున్న మూడేళ్లలో పూర్తవుతుంది. రూ. 36,976.54 కోట్ల వ్యయంతో జరిగే పనులకు ఇప్పటి పరిపాలనాపరంగా మంజూరిని ఇచ్చాం. 2016 చివరి నాటికి మిషన్ భగీరథ ద్వారా, 6,100 గ్రామాలకు, 12 పట్టణాలకు తాగునీరు అందుతుంది. 2017 డిసెంబర్‌ నాటికి 95 శాతం గ్రామాలకు తాగునీరు అందించాలని కృషి చేస్తున్నాం. మిషన్‌ భగీరథ విజయానికి పంచాయతీరాజ్‌ శాఖ వారు అలుపెరుగక రేయింబవళ్ళు కృషి చేస్తున్నారు. వారిని ముందుండి నడిపిస్తున్న సహచర మంత్రి కె. తారకరామారావుకు హృదయపూర్వక అభినందనలు.

‘మిషన్‌ భగీరథ’ వ్యయానికి అవసరమైన నిధులను హడ్కో, నాబార్డు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నెరా బ్యాంకుల నుండి ఆర్ధిక (రుణం) సహాయంగా సమూరుస్తున్నాం. ఆ సమున్నత లక్ష్యం కోసం బడ్జెటేతర ఆర్ధిక వనరులను వినియోగించుకుంటున్నం. నిబద్ధతతో రానున్న మూడేళ్లలో మిషన్‌ భగీరథను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి తిరుగులేదు.

రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు

తెలంగాణ ఏర్పడే నాటికి తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఉంది. నిత్యం కరెంటు కోతలు, ఉక్కపోతలు, పరిశ్రమల మూతలు. కావాల్సినంత కరెంటు అందుబాటులో లేదు. విభజన చట్టం ప్రకారం విద్యుత్‌ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కుట్ర చేసింది. ఆ పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం చాలా తొందరగా తేరుకుంది. తెలంగాణ వస్తే మీకు చిమ్మ చీకట్లే మిగులుతాయి అని శాపాలు పెట్టిన వారి కళ్లు తెరిపించేలా కోతల్లేని విద్యుత్‌ అందిస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదో నెల నుంచే రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఎత్తివేశాం. ఇక భవిష్యత్తులోనూ తెలంగాణలో విద్యుత్‌ కోతలుండవు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో 23,912 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నది. కొత్తగా దిగువ జూరాల, పులిచింతల, హైడ్రో ప్రాజెక్టులు, భద్రాద్రి, కొత్తగూడెం, యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్టులను చేపట్టినం. 6160 మెగా వాట్ల విద్యుత్తును ఇవి ఉత్పత్తి చేయగలుగుతాయి. తెలంగాణలోని పలు చోట్ల మొత్తం 6000 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పాదక సామర్థ్యం గల థర్మల్‌ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నం. 680 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి అయి అందుబాటులోకి వచ్చాయి.

సంప్రదాయక ఇంధన వనరులతో పాటు సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా విస్తారంగా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. తెలంగాణలో సౌర విద్యుత్‌ ఉత్పాదనకు ఉన్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలన్నదే మా విధానం. సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పేవారికి మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. నూతన విధానం ప్రకారం ఒక సెల్‌ ఏక గావాక్ష పద్ధతిన పనిచేస్తుంది. సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పాలనుకునే వారికి అన్ని అనుమతులు ఆ సెల్‌లో ఒకే చోట లభిస్తాయి. సోలార్ ప్లాంటుకు అవసరమైన సాంకేతిక సామగ్రి కొనుగోలుకు చెల్లించిన వ్యాటును నూటికి నూరు శాతం తిరిగి చెల్లిస్తాం. 2017-18 నాటికి 5000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నాం.

ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల భయంకరమైన కరెంటు కొరత ఉన్న తెలంగాణ రాష్ట్రం తక్కువ సమయంలోనే సమస్యను అధిగమించగలిగింది. రూ.91,500 కోట్ల పెట్టుబడితో జెన్‌కో, సింగరేణి కాలరీస్‌, ఎన్టీపీసీ, సోలార్‌ యూనిట్ల ద్వారా ఈ లక్ష్యం నెరవేర్చబోతున్నాం. వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతులకు తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ అందిస్తామని ప్రకటించటానికి సంతోషిస్తున్నాం అని ఆర్ధిక మంత్రి చెప్పారు..

రైతన్నకు అండదండలు

రాష్ట్రంలో ఎక్కువ మంది ఆధారపడే రంగం వ్యవసాయం. ఎక్కువ మంది బతికేది వ్యవసాయంతోనే. అందుకే వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యనిచ్చింది ప్రభుత్వం. 17 వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసినం. ఋణ మాఫీకై చెల్లించాల్సిన వాయిదాలను నాలుగు విడతలకు గాను ఇప్పటికే రెండు విడతలు బ్యాంకుల్లో జమచేశాం. 2016-17లో మరో విడత అందిస్తున్నాం. వచ్చే ఏడాదిలో అంటే 2017-18లో రైతుల పంట రుణాలు వందకు వంద శాతం మాఫీ అవుతాయి. రాష్ట్రంలోని ప్రతి ఎకరా సాగు భూమికి సేద్యపు నీరు అందించాలన్న లక్ష్యంతో 2016-17 బడ్జెట్‌లో ముందెన్నడూ లేని విధంగా రూ. 25,000 కోట్లను ప్రతిపాదించినం. సమయానికి తగినంత సాగునీరు అందడంవల్ల వ్యవసాయ ఆదాయం మెరుగుపడుతుంది. వ్యవసాయ రంగంలో అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టాం. రాష్ట్రాన్ని వితన్త బాండాగారంగా అభివృద్ధి చేస్తున్నాం. 600 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు పాలీహౌజ్‌ కల్టివేషన్‌లో నూటికి నూరు శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించాం. రైతులందరికీ భుసార ఆరోగ్య కార్డులను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈ కార్డు వల్ల రైతుకు తమ భూసార ఆరోగ్య స్థితి తెలుస్తుంది. దీని వల్ల తమ భూమికి తగిన రసాయనిక ఎరువులనే వాడటం ద్వారా ఉత్పాదకత పెంచగలుగుతాం. సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీ పరిమితిని ఒక హెక్టారు నుండి ఐదు హెక్టార్ల వరకు పెంచాం. హార్టీ కల్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

రైతులకు బ్యాంకులు, నాబార్డు ఇచ్చే వార్షిక వ్యవసాయ పరపతి రుణాల పరిమితిని పెంచేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. కేంద్రం ప్రారంభించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర రైతు రంగానికి ఎంతో తోడ్పాటును ఇస్తుంది. పంట బీమా కోసం రైతులు ఖరీఫ్‌ పంటలపై 2 శాతం, రబీ పంటలపై 1.5 శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగతా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు పంట బీమా చేసిన రైతులకు పూర్తి పరిహారం లభిస్తుంది. 2016-17 బడ్జెట్‌లో వ్యవసాయశాఖ, సహకార శాఖ, మార్కెటింగ్‌ శాఖలకు రూ. 6,759 కోట్లను ప్రతిపాదిస్తున్నాం అని ఆర్ధిక మంత్రి చెప్పారు..

ఆరోగ్య రంగానికి చికిత్స 

ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త, నోబుల్‌ బహుమతి గ్రహీత, అమర్త్యసేన్‌ ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘మనదేశం ఆర్ధిక అభివృద్ధిలో రెండో స్థానంలో ఉంది. కానీ మానవ అభివృద్ధి సూచికల్లో 138వ స్థానంలో ఉంది’ అని అన్నారు. ఈ అంతరాన్ని కుదించడానికి విద్య, ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించడమే ఏకైక మార్గం. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. అయితే ఆ ప్రజలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నప్పుడే పథకాలకు సారక్ధత. అందుకే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది.

ప్రభుత్వ వైద్యశాలలను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచడానికి, ఆసుపత్రుల్లో పడకలు, విద్యుత్‌, టాయిలెట్లు, బెడ్‌ షీట్లు సరైన రీతిలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. 2016-17 బడ్జెట్‌లో ప్రజారోగ్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడతాం. సర్కారు దవాఖానాల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. అప్పుడు అవి ప్రైవేటు దవాఖానాలకు దీటుగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 చోట్ల డయాలసిస్‌ సెంటర్లు, 40 చోట్ల డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, శస్త్రచికిత్స సౌకర్యాలు కల్పించాలని, డాక్టర్లతో సహా అన్ని ఖాళీలు భర్తీ చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య విధానపరిషత్‌ పరిధిలోకి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను తీసుకొస్తాం.

సర్కారు దవాఖానాల ఆధునీకరణ కోసం ప్రజారోగ్య రంగానికి తగినన్ని నిదులు కేటాయిస్తం. వైద్య పరికరాల కొనుగోలు కోసం రూ.600 కోట్లు, డయాగ్నాస్టిక్‌ వ్యాధి నిర్ధారణ పరికరాల కొనుగోలు కోసం రూ.316 కోట్లు, పాత మంచాల స్థానంలో కొత్తవి వేసేందుకు, దవాఖాన భవనాల మరమ్మతులూ వన్‌ టైమ్ ప్రొవిజన్‌గా ప్రజారోగ్య రంగానికి కేటాయింపులు చేసాం. మందులు, శాస్త్ర చికిత్స పరికరాల కొనుగోలుకు నిధులను పెంచుతున్నాం అందుకోసం గత బడ్జెట్‌లో రూ. 117 కోట్లు ప్రతిపాదించినం. మందులు, చికిత్స పరికరాల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 225 కోట్లను ప్రతిపాదిస్తున్నం. పై కేటాయింపులకు అదనంగా వైద్య, ఆరోగ్య శాఖాధిపతులకు రూ. 56 కోట్లు కేటాయించాం. ఆకస్మికంగా ఏమైనా అవసరాలు వస్తే, తాత్సారం చేయక తగిన నిర్ణయాలు తీసుకొని ఈ నిధులను వినియోగిస్తారు.

హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, కింగ్‌ కోఠికి తోడు మరో నాలుగు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ నిర్మించాలని నిశ్చయిం చినాం. నెదర్లాండ్స్‌కు చెందిన రాబో బ్యాంకు వారి సహాయ సహకారాలతో వీటిని నెలకొల్పుతాం. వరంగల్‌ ఎంజిఎంను సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మారుస్తాం. ఖమ్మం, కరీంనగర్‌లో కూడా ఆధునిక సౌకర్యాలతో కొత్త దవాఖానాల నిర్మాణానికి ఇదే సంస్థను సంప్రదించినం. ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి మొత్తం రూ. 5,967 కోట్లు ప్రతిపాదిస్తున్నాను.

విద్య భవిష్యత్తుకు పునాది 

మానవ వనరుల అభివృద్ధి ద్వారానే మంచి సమాజాన్ని నిర్మించగలమనేది ప్రభుత్వ ఉద్దేశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర పేద వర్గాల పిల్లలకు పుస్తకాలు, బట్టలు, మంచి భోజనం సమకూర్చి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలకు పైగా విద్య కోసం ఖర్చుపెడుతున్నప్పటికీ, ప్రభుత్వ విద్యలో అనుకున్న ఫలితాలు రావడం లేదు. ప్రస్తుతమున్న అన్ని విద్యాసంస్థలు మెరుగైన పద్ధతుల్లో నడిచేవిధంగా, విద్యార్థులకు మంచి విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. అన్ని స్థాయిల విద్యాసంస్థల నిర్వహణ బాధ్యత విద్యాశాఖకే అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యాశాఖకు ప్రణాళిక వ్యయం కింద రూ. 1,694 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 9,0?? కోట్లు ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్యలకు సంబంధించిన వ్యయం మాత్రమే ఇది అని ఆర్ధిక మంత్రి చెప్పారు..