సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ ఆణిముత్యాలు

కేశవపంతులు వేంకటేశ్వరశర్మ


పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదు!
ప్రేమ్‌సాగర్‌ (170వ ర్యాంక్‌)

పల్లెటూరు, పేదరికం.. చదివిన కోర్సు బ్యాక్‌గ్రౌండ్‌ ఏది అడ్డుకాదు. కేవలం సాధించాలనే పట్టుదల ఉంటే చాలు జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు ప్రేమ్‌సాగర్‌. తను చదివిన కోర్సు పాలిటెక్నిక్‌ తర్వాత బీటెక్‌ కానీ సాధించింది సివిల్స్‌. గ్రామీణ ప్రాంత నేపథ్యం నుంచి వచ్చిన తన ప్రిపరేషన్‌, కుటుంబ నేపథ్యం, భవిష్యత్‌ అభ్యర్థులు చదవాల్సిన విధానం గురించి సమగ్రంగా చెప్పిన విషయాలు..

మా కుటుంబ నేపథ్యం మానాన్న నవీన్‌ రెడ్డి టీవీ మెకానిక్‌. తల్లి అనితారెడ్డి గృహిణి. చెల్లి సాహితీరెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. నాన్న టీవీ మెకానిక్‌ షాప్‌ నడవకపోవడంతో హుస్నాబాద్‌కు వచ్చాం. 4వ తరగతి వరకు వల్మిడిలో చదువుకున్నా. తర్వాత హుస్నాబాద్‌లో 10వ తరగతి వరకు చదివాను. వరంగల్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఈసీఈ చదివాను. తర్వాత ఈసెట్‌ ద్వారా బీటెక్‌ రెండో సంవత్సరంలో చేరాను. కానీ ఫీజుకు ఇబ్బంది ఏర్పడింది. ఈ సమయంలో మురళీమోహన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సహాయం చేసింది. 2012లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో కాగ్నిజెంట్‌ టెక్నాజీస్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఐదేండ్లు పనిచేశాను. ఈ సమయంలోనే ఆర్థికంగానే కాదు సొసైటీకి ఏదైనా చేస్తేనే జీవితం సంతృప్తి అని భావించాను. దీంతో సివిల్స్‌ సాధించాలని నిర్ణయించుకున్నాను. ప్రిపరేషన్‌ ప్రారంభించగా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. కానీ నిరాశపడకుండా చదువుతూ రెండో ప్రయత్నంలో 170వ ర్యాంక్‌ సాధించాను.

ప్రిలిమ్స్‌ వ్యూహం
– ఇన్‌సైట్‌ టెస్ట్‌ సిరీస్‌ ఫాలో అయ్యాను.

– 6-12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ బుక్స్‌ చదివాను. బుక్స్‌ చదువుతూ టెస్టులు రాయడంవల్ల అవగాహన పెరిగింది. అయితే కొన్ని కాన్సెప్ట్‌కు క్లారిటీ లేదు. వాటిని యూట్యూబ్‌లో విన్నాను. ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ గురించి బీబీసీ న్యూస్‌ యాప్‌ చూసే వాడిని. దీనిలో 1 మినిట్‌ న్యూస్‌ చెప్తారు. నాలుగు గంటలకు ఒకసారి చూసేవాడిని. ప్రాక్టీస్‌పైనే ఎక్కువ ఆధారపడ్డాను.

– 100 శాతం సమయాన్ని ఒక సబ్జెక్టుకు కేటాయిస్తే 70 శాతం టెస్టు. 30 శాతం చదువు ఉండాలి.

– ప్రిలిమ్స్‌ ఫార్ములా: తక్కువ చదవడం ఎక్కువ రివిజన్‌ చేయడంం ప్రాక్టీస్‌ చేయడం చేయాలి.

మెయిన్స్‌ వ్యూహం
– నాలుగు జీఎస్‌ పేపర్లు ఉంటాయి. రెండు ఆప్షనల్‌ ఉంటాయి. మొదట ఎక్కువ స్కోర్‌ చేసే పేపర్‌ జీఎస్‌-4 ఎథిక్‌ పేపర్‌ తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు వస్తాయి. 20-30 రోజుల్లో చదివి 250కి 120 తెచ్చుకోవచ్చు.

– ఆప్షనల్స్‌ రెండు పేపర్లు తప్పనిసరి. ఇక జీఎస్‌-3 ఎకానమీ పేపర్‌. దీనికోసం రెగ్యులర్‌గా న్యూస్‌ పేపర్‌ చదివితే చాలు. దీనికి ఎక్కువ సమయం పట్టదు. పై వాటిపై ఎక్కువ దృష్టిపెడితే 60 శాతం మార్కులు సులభంగా రెండు నెలల సమయంలోనే పూర్తి చేయవచ్చు. అన్నింటిపై ఈక్వల్‌ సమయం కేటాయించవద్దు. ఈజీ, డిఫికల్ట్‌ ఆధారంగా సమయం కేటాయించడం మంచిది.

– మెయిన్స్‌కు ముఖ్యమైనవి.. ప్రాక్టీస్‌ టెస్ట్‌లు, రోజు రాయడం ప్రాక్టీస్‌. ఎందుకంటే మెయిన్స్‌ డిస్ట్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది.

భవిష్యత్‌ విద్యార్థులకు
– ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ కోసం 2018 జనవరి నుంచి ఇంటిగ్రేటెడ్‌ ప్రిపరేషన్‌ కొనసాగించాలి, కొంత కాన్ఫిడెన్స్‌ రాగానే ప్రతిరోజు 2-3 ప్రశ్నలకు జవాబులు రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. ఆ తర్వాత ప్రిలిమ్స్‌ ముందు కనీసం రెండుమూడు నెలలైనా ఎక్స్‌క్లూజివ్‌గా చదవాలి. ప్రిలిమ్స్‌ కాగానే ప్రిపరేషన్‌లో ఎలాంటి గ్యాప్‌ ఇవ్వద్దు. మూడునెలల కాలం చాలా విలువైంది. మూడునెలల్లో ఎన్నిటెస్ట్‌లు రాస్తే అంత మంచిది. రాయడం అనేది ప్రాక్టీస్‌ చేయాలి.

మొదటి ప్రయత్నంలోనే!
సత్యప్రకాశ్‌ గౌడ్‌ (ర్యాంకు 218)


చదివింది ఇంజినీరింగ్‌. ప్రజాసేవ చేయాలన్న తపన. దీంతో సివిల్స్‌ వైపు అడుగువేశాడు. ఇంట్లో అమ్మనాన్న ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించాడు. పట్టుదల, సరైన ప్రణాళిక ఉంటే ఏదైనా సాధించవచ్చంటున్న సత్యప్రకాశ్‌ గౌడ్‌ పంచుకున్న విషయాలు…

కుటుంబ నేపథ్యం: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తంగడపల్లి గ్రామం. ప్రస్తుతం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో స్థిరనివాసం. తండ్రి బడేటి అశోక్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఏజీఎంగా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. అక్క ఉషశ్రీ బీడీఎస్‌ పూర్తిచేసింది.

సివిల్స్‌వైపు రావడానికి ఎవరైనా ప్రోత్సహించారా? లేక సొంతంగా నిర్ణయించుకున్నారా?
– నాకు నేనే నిర్ణయించుకున్నాను. సొంత ఆలోచనతోనే ప్రయత్నం మొదలుపెట్టాను. బీటెక్‌ ఫోర్త్‌ ఇయర్‌లోనే సివిల్స్‌ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ రాయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను.

సివిల్స్‌నే ఎందుకు ఎంచుకున్నారు? ఇటు వైపు రావడానికి కారణం?
– సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగం అంటే ప్రజాసేవ చేయడం. అందులోనూ తొలినుంచి మా ఇంట్లో సామాజిక స్పృహ ఎక్కువే. ఇంకా సమాజ పరిస్థితులపై కుబుంబ సభ్యులందరికి అవగాహన ఉండటం ఇవన్ని కూడా సివిల్స్‌ రాయాలనే నా ఆలోచనకు దారితీసిందని చెప్పవచ్చు.

ఎన్నో ప్రయత్నంలో సివిల్స్‌ సాధించారు?
– ఇది నా మొదటి ప్రయత్నం. మొదటి ప్రయత్నంలోనే 218 ర్యాంకు సాధించాను. వాస్తవానికి నాది బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ 2018 ఐఐటీ పట్నా నుంచి పూర్తిచేశాను. ఆ తరువాత 2018 జూన్‌లో ఢిల్లీ వెళ్లి నా ఆప్షనల్‌ సబ్జెక్టు (పొలిటికల్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ రిలేషన్స్‌) కోసం సుప్రారంజున్‌ మేడమ్‌ దగ్గర కోచింగ్‌ తీసుకున్నాను. జూన్‌ 2019లో ప్రిలిమ్స్‌ పాసై మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యాను. మెయిన్‌ పరీక్షను సెప్టెంబర్‌లో రాశాను. మెయిన్స్‌ పాసవడం, ఇంటర్వ్యూ ఇలా.. అన్ని విజయాలతో అనుకున్నది సాధించాను. అది కూడా


మొదటి ప్రయత్నంలోనే రావడం గర్వంగా ఉంది.
భవిష్యత్‌ లక్ష్యాలు ఏమిటి?
– సివిల్స్‌లో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకున్నా. ఇక నా దృష్టి శిశుసంరక్షణ, మహిళా భద్రత, సేవ చేయడంపైనే. ముఖ్యంగా పిల్లల చదువులకు, గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి, మహిళలరక్షణకే నా మొదటి ప్రాధాన్యం.

మీ విజయానికి దోహదపడిన అంశాలు ఏమిటి?
– సరైన ప్రణాళిక, గతంలో అడిగిన ప్రశ్నల విధానాన్ని అర్థం చేసుకోవడం.
ఇంకా దానికి తగిన విధంగా సిలబస్‌ను ఎంత, ఏ మేర చదవాలో నిర్ణయించుకోవడం, ఎప్పటికప్పుడు సబ్జెక్టులవారీగా సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవడం, గత ప్రశ్నప్రత్రాలకు సమాధానాలు రాయడం. అందులో రాసిన తప్పులను తెలుసుకోవడం. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలకు ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్‌ కావడం నా సక్సెస్‌కు కారణాలు.

సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు మీరిచ్చే సలహాలు?
– ఏదైనా మనం అనుకుంటే సాధించవచ్చు. పట్టుదల ఉంటే కానిది లేదు. ఒక ప్రణాళిక ప్రకారంగా వందశాతం డెడికేషన్‌తో హార్డ్‌వర్క్‌ చేస్తే మొదటి ప్రయత్నంలో కాకపోయినా మరో ప్రయత్నంలోనైనా విజయం సాధించవచ్చు.

పట్టు వదలకుండా ప్రయత్నించాను
సందీప్‌ కుమార్ (244వ ర్యాంక్‌ )

సివిల్స్‌లో ర్యాంక్‌ కొట్టాలనేది అతడి కల దానికోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రిపేరయ్యాడు. మూడుసార్లు ఫెయిలైనా నాలుగోసారి అతడి కల నెరవేరింది. అతడే ఇటీవల వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో 244వ ర్యాంక్‌ సాధించిన సందీప్‌ కుమార్‌. సివిల్స్‌ ర్యాంక్‌ రావడానికి ఎలా కష్టపడ్డాడనే విషయాలు పంచుకున్న విషయాలు.

ఫ్యామిలీ, ఎడ్యుకేషన్‌..
నాన్న పేరు పిన్నపునేని కోటేశ్వరరావు, అమ్మ పేరు ప్రభావతి. అన్నయ్య సంపత్‌. నాన్నది పెన్‌పహాడ్‌ మండలం ధూపాడు గ్రామం. హుజూర్‌నగర్‌కు వచ్చి స్థిరపడి ఇక్కడ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టారు. విద్యుత్‌ శాఖలో నాన్న జేఏవోగా, అమ్మ సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు హుజూర్‌నగర్‌లోని విజ్ఞాన్‌ పాఠశాలలో, 9 నుంచి 10వ తరగతి వరకు కోదాడలోని గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో, ఇంటర్‌ హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో, ఇంజినీరింగ్‌ జేబీఐఈటీలో పూర్తి చేశాను. ఢిల్లీలోని ఖాన్‌ స్టడీ గ్రూప్‌లో కోచింగ్‌ తీసుకున్నాను.

ఎన్నో ప్రయత్నంలో ?
నాలుగో ప్రయత్నంలో ర్యాంక్‌ సాధించాను. 2016లో 732వ ర్యాంక్‌ వచ్చింది. ఉద్యోగానికి సెలవు పెట్టి రెండోసారి ప్రయత్నించగా ప్రిలిమ్స్‌ పాస్‌ కాలేదు. అయినా పట్టువిడవకుండా ప్రయత్నించగా మూడోసారి ఇంటర్వూ వరకు వచ్చాను. ఎలాగైనా ర్యాంక్‌ కొట్టాలని ప్రిపేరయ్యాను. నాలుగోసారి 244వ ర్యాంక్‌ సాధించాను.


ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు వ్యూహం?
ముందుగా సిలబస్‌ను బాగా అధ్యయనం చేశాను. తర్వాత ఏయే పుస్తకాలు చదవాలో నిర్ణయించుకున్నాను. ప్రిలిమ్స్‌కు విస్త్రృతంగా చదివాను. ప్రీవియస్‌ క్వశ్చన్‌ పేపర్స్‌ను ఫాలో కావాలి. దానికి మాక్‌టెస్ట్‌ను రాస్తూ ఎప్పటికప్పుడు పోగ్రాంను చూసుకోవాలి.

మెయిన్స్‌ వచ్చే సరికి ఆన్సర్‌ రైటింగ్‌ చాలా కీలకపాత్ర వహిస్తుంది. స్టాటిక్‌ పార్ట్‌, డైనమిక్‌ పార్ట్‌ రెండింటిని అనుసంధానం చేసి చదవాలి. మంచి షార్ట్‌ నోట్స్‌ను తయారు చేసుకుని దానిని ఎప్పటికప్పుడు రివైజ్‌ చేయాలి. ఎక్కువ ఆన్సర్లు రాస్తే అంత నాణ్యత వస్తుంది. ఆన్సర్‌ రైటింగ్‌తో స్కిల్స్‌ మెరుగుపడుతాయి. వీటి కోసం ఏదో ఒక టెస్ట్‌ సిరీస్‌ను ఫాలో కావాలి. టాపర్స్‌ ఆన్సర్స్‌ చూసేవాడిని. మెయిన్స్‌ అనేది కొంచెం ఇంటెన్సివ్‌గా, స్పెషల్‌గా ఉన్న టాపిక్‌ను తీసుకుని వాటినే లోతుగా పరిశీలన చేసి ప్రిపేర్‌ కావాలి.

సలహాలు, సూచనలు
సివిల్స్‌లో విజయం సాధించాలంటే విషయ పరిజ్ఞానం, మేథో సంపక్తి కన్నా చాలా ముఖ్యమైనవి క్రమశిక్షణ, ఓర్పు, సంకల్ప బలం. గెలవాలన్న తపన, గెలవగలనన్న నమ్మకంతో కష్టాన్ని ఇష్టపడుతూ ముందుకు సాగాలి. జీవితంలో లక్ష్యం లేకపోతే ఇతరులు లక్ష్యం కోసం మనం పనిచేయాల్సి
ఉంటుంది. అందుకే మంచి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దానిని సాధించడానికి కృషి చేయాలి.

విక్రమార్కుడిలా ఆరో ప్రయత్నంలో
సివిల్స్‌ నిజంగా ఒక తపస్సు. కొందరకి అది వెంటనే ఫలం ఇస్తుంది. కానీ మరికొందరికి పలుమార్ల తర్వాత అందుతుంది. అలాంటి కోవలోనే నల్లగొండకు చెందిన శీతల్‌ కుమార్‌ ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో సక్సెస్‌ అయ్యాడు. ఓ సామాన్య దర్జీ కుటుంబంలో పుట్టిన అతడు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఆరోసారి 417వ ర్యాంకు సాధించాడు. ఈ లక్ష్యసాధనలో ప్రిపరేషన్‌ విధానం.. ఇంటర్యూ అంశాలపై పంచుకున్న విశేషాలు..


విద్యాభ్యాసం-కుటుంబ నేపథ్యం..
నల్లగొండలోని క్రాంతినగర్‌ మా స్వస్థలం. నాన్న రేణుకుంట్ల నరేందర్‌ టైలర్‌. అమ్మ సుజాత టైలరింగ్‌ మెటీరియల్‌ విక్రయిస్తుంది. అక్క సింధూర ఎస్‌బీఐలో ఉద్యోగి. బావ నాగరాజు డివిజనల్‌ ఇంజినీర్‌. మమ్మల్ని బాగా చదివించాలని అమ్మానాన్నలు బాగా కష్టపడేవారు. వారి కష్టాన్ని చూసి కష్టపడి చదివాం. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చదివాను. ఎంటెక్‌ కూడా పూర్తి చేశాను. బీటెక్‌లో ఎన్‌సీసీలో జాయినయ్యా. అక్కడే తొలిసారిగా సోషల్‌ యాక్టివిటీ గురించి అవగాహన ఏర్పడింది. సేవ చేయాలంటే ఏదైనా పబ్లిక్‌ రంగం ఉద్యోగంవైపు వెళ్లాలని భావించాను. అందుకు సివిల్స్‌ సాధించాలని ఫ్రెండ్స్‌ ద్వారా తెలుసుకున్నా. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ పూర్తికాగానే తొలిసారిగా 2014లో సివిల్స్‌కు హాజరయ్యాను. అప్పుడు ఫలితం రాకపోయినా.. సివిల్స్‌ అంటే ఏంటి? ఎలా ప్రిపేర్‌ కావాలి? లాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడింది.

ఎన్నో ప్రయత్నంలో ..
ఇది ఆరో ప్రయత్నం. 417వ ర్యాంకు సాధించాను. ఈ ర్యాంకుతో ఐపీఎస్‌ గ్యారంటీ. ఐఏఎస్‌కు చాన్స్‌ ఉండవచ్చని భావిస్తున్నా. 2016లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అక్కడి నుంచి వెనుదిరిగా. ఇంటర్వ్యూ వరకు వెళ్లడంతో నాలో విశ్వాసం పెరిగింది. ఇంకా కష్టపడితే ర్యాంకు కొట్టవచ్చని కుటుంబసభ్యులంతా ఎంకరేజ్‌ చేశారు. దీంతో 2017, 2018ల్లోనూ రాశాను. కానీ నిరాశే మిగిలింది. 2019 అటెంప్ట్‌ చివరిదనుకుని ప్రిపేరయ్యాను. రోజుకు పది గంటల వరకు కష్టపడి చదివా. గతంలో చేసిన పొరపాట్లను గుర్తించాను. అవి పునరావృతం కాకుండా ప్రిపేరయ్యాను. చివరికి సక్సెస్‌ అయ్యాను.

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు వ్యూహం..
2014లో తొలిసారిగా పరీక్షకు హాజరైనప్పుడు హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో కోచింగ్‌ తీసుకున్నా. దీంతో సివిల్స్‌ స్టడీ మెటీరియల్‌, పరీక్షా విధానంపై అవగాహన ఏర్పడింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కోచింగ్‌కు వెళ్లలేదు. సొంతంగానే నోట్స్‌ తయారు చేసుకుని వాటినే ఒకటికి రెండుసార్లు చదివాను.

కోచింగ్‌ లేకుండా…
కోచింగ్‌ తీసుకోవాలా వద్దా అనేది ప్రిపేరయ్యే అభ్యర్థల కాన్ఫిడెన్స్‌ స్థాయిని బట్టి ఉంటుంది. తొలిసారిగా 2014లో సివిల్స్‌ రాయడం కోసం హైదరాబాద్‌లో పదినెలల పాటు కోచింగ్‌ తీసుకున్నాను. దీంతో స్టడీ మెటీరియల్‌, పరీక్షా విధానం, ప్రిపరేషన్‌ వ్యూహంపై అవగాహన ఏర్పడిరది. ఆ తర్వాత కోచింగ్‌వైపు చూడలేదు.


అపజయమే పట్టుదలను పెంచింది!
చిన్నప్పుడు జరిగిన సంఘటన, నాన్న చెప్పిన విషయాలు బాల్యం నుంచే మనస్సులో స్థిరపడిపోయాయి. ఏప్పటికైనా సివిల్స్‌ సాధించాలనే తపన. పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా సివిల్స్‌ పరీక్ష రాసి గతేడాది రైల్వే సర్వీస్‌ సాధించి ఈసారి మరింత మెరుగైన ర్యాంక్‌ సాధించిన శశికాంత్‌ నాయక్‌ విజయంపై ఆయన చెప్పిన విషయాలు.
– శశికాంత్‌ నాయక్‌ (764వ ర్యాంక్‌)

– మాది మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం చాకలిదానితండా. నాన్న హాస్టల్‌ వార్డెన్‌గా పనిచేస్తూ 2008లో చనిపోయాడు. అమ్మ సీతమ్మ. తమ్ముడు, చెల్లి ఉన్నారు. నాన్న చనిపోయిన అమ్మ కష్టపడి నన్ను చదివించింది. వట్టెం జవహర్‌ నవోదయలో ఉన్నప్పుడు ఒకసారి జిల్లా కలెక్టర్‌ వచ్చారు. అక్కడ ఆయన్ను దగ్గరి నుంచి చూసి స్ఫూర్తి పొందాను. అప్పటినుంచే కలెక్టర్‌ కావాలన్న కోరిక పెరిగింది. నాన్న కూడా ఎప్పుడు కలెక్టర్‌ గురించి చెప్పేవారు.

– సివిల్స్‌ ప్రిపరేషన్‌ కోసం ఢిల్లీకి వెళ్లాను. కోచింగ్‌ తీసుకున్నాను. అక్కడ స్నేహితులతో ఉండి గ్రూప్‌ స్టడీ చేశాను. ఆప్షనల్‌ సబ్జెక్టు ఆంత్రోపాలజీ.

– విజయానికి దోహదపడ్డ అంశాలు హార్డ్‌వర్క్‌, ప్లానింగ్‌, పాజిటివ్‌ ఆటిట్యూడ్‌. 2012 నుంచి సివిల్స్‌ రాస్తున్నాను. ఫెయిల్‌ అయిన ప్రతిసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రిపేరయ్యేవాడిని.

– స్మితా బోర్డు ఇంటర్వ్యూ చేసింది. రైల్వే సర్వీస్‌ నుంచి ఐఏఎస్‌ ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నావు? ఐఏఎస్‌గా ఏం చేయదలుచుకున్నావు? పట్టణాల పేర్లు మార్పుపై, తెలంగాణ వంటలు, రైల్వే ప్రైవేటీకరణ, మహబూబ్‌నగర్‌, గ్రామీణ సమస్యలపై ప్రశ్నలు అడిగారు.

– గతేడాది రైల్వే సర్వీస్‌ వచ్చింది. ఇంకా మంచి సర్వీస్‌ సాధించాలని ప్రయత్నించాను. ఈసారి 764వ ర్యాంక్‌ వచ్చింది.