సుపరిపాలన నినాదం కాదు, విధానం

తెలంగాణ రాష్ట్రంలో సంస్కరణల పర్వం.. పారదర్శక పౌరసేవలే లక్ష్యంగా సరికొత్త విధానాలు విస్తృత ప్రజా భాగస్వామ్యంతో పల్లెలు, పట్టణాలకు కొత్త శోభ.. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండో విడతలో దిగ్విజయంగా తొలి ఏడాది


గటిక విజయ్‌ కుమార్‌

‘స్వరాష్ట్రంలో సుపరిపాలన’.. ఇదిప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన విధానంగా మార్చుకున్న నినాదం. ఎలాంటి అవినీతికి, జాప్యానికి అవకాశం లేకుండా అత్యంత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడాన్ని ప్రభుత్వం తన కర్తవ్యంగా భావిస్తున్నది. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించడానికి అనుగుణమైన విధానాలు రూపొందించి, వాటిని సక్రమంగా అమలు చేయడానికి అవసరమైన కార్యరంగాన్ని సిద్ధం చేస్తున్నది. పల్లెలు, పట్టణాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలనే స్ప్రుహ ను కల్పించడానికి విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నది. 2018 డిసెంబర్‌ 13న ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రంలో పాలనా సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టారు. సరిగ్గా ఏడాది గడిచే సరికి తెలంగాణ రాష్ట్రంలో సంస్కరణల ప్రభావం కనిపిస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పాలనా పగ్గాలు చేపట్టిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన తొలి విడతలో సమైక్య రాష్ట్రంలో కుదేలైన ప్రతీ రంగానికి కాయకల్ప చికిత్స చేసింది. వాటికి మళ్లీ జీవం పోసింది. ఆకలి దప్పులు, ఆకలి చావులు లేని తెలంగాణను చూడాలన్న ఉద్యమకాలపు స్వప్నానికి అనుగుణంగా ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, ఆరు కిలోల బియ్యం, కేసీఆర్‌ కిట్స్‌, రైతుబంధు, రైతు బీమా లాంటి సంక్షేమ కార్యక్రమాలెన్నో పేదలకు బతుకుపై భరోసాను కల్పించాయి. ఆసరా పెన్షన్లు, రైతుబంధు సాయం, కుల వృత్తులకు చేయూత ద్వారా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న అవసరాలకు పేదలు చేయి చాపే దుస్థితి నుంచి బయటపడ్డారు. దాదాపు 40 పథకాలతో ఏడాదికి 40 వేల కోట్లకు పైగా సంక్షేమ రంగంలో ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయరంగాన్ని నిలబెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలితాలు అందిస్తున్నాయి. భారీ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తవుతూ, బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి.

సమైక్య పాలనలో శిథిలమైన చెరువుల్లో మళ్లీ జలకళ ఉట్టిపడుతున్నది. విద్యుత్‌ రంగంలో సంక్షోభాన్ని ప్రభుత్వం విజయవంతంగా పరిష్కరించింది. అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసుకోగలగడం తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత. రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా నేడు దేశం ముందు సగర్వంగా నిలబడినం. మంచినీటి సమస్యకు మిషన్‌ భగీరథ శాశ్వత పరిష్కారం చూపింది. కుల వృత్తులకు అవసరమైన ఆర్థిక ప్రేరణ ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు పెద్ద ఎత్తున రెసిడెన్షియల్‌ స్కూళ్ళు పెట్టడం వల్ల నిరుపేద విద్యార్ధులు కూడా ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందుకోగలిగి, బంగారు భవితకు పునాదులు వేసుకుంటున్నారు. ప్రజారోగ్యం మెరుగు పడింది. పారదర్శకమైన టిఎస్‌ ఐపాస్‌ విధానం వల్ల పారిశ్రామిక రంగంలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయి. ఐటి, సేవా రంగాల్లో తెలంగాణ నేడు అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబడింది. రాష్ట్రానికి వెన్నెముకలా నిలబడిన హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రతువులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. కేసీఆర్‌ నాయకత్వంలోని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి విడతలో ఇలాంటి ఘనతలెన్నో సాధించింది.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలను కొనసాగించుకుంటూనే, మరోవైపు తెలంగాణ సమాజాన్ని మరో మెట్టు ఎక్కించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నది. అందుకోసం చట్టాల్లో మార్పులు తెచ్చి, పరిపాలనా సంస్కరణలు అమలు చేస్తున్నది. ప్రజలు నివసించేది అయితే పల్లెల్లో, లేకుంటే పట్టణాల్లో. పల్లెలు, పట్టణాలు పచ్చగా, పరిశుభ్రంగా కళకళలాడాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు, మరోవైపు ప్రజలు అందరూ బాధ్యతగా ఉండాలని భావించింది. ఎవరి బాధ్యత ఏమిటో, ఎవరి విధులు ఏమిటో స్పష్టంగా పేర్కొంటూ కొత్త పంచాయతీ రాజ్‌ చట్టాన్ని, కొత్త మున్సిపల్‌ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారమే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ‘పల్లెప్రగతి’ పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలయింది. తెలంగాణ పల్లెలు ఆదర్శ గ్రామాలుగా రూపాంతరం చెందే ప్రక్రియకు శుభారంభం లభించింది. త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల తర్వాత పట్టణాల్లో కూడా పచ్చదనం, పరిశుభ్రత పెంచే ప్రత్యేక కార్యక్రమాలు అమలు కానున్నాయి. మొదటి విడతలోనే కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి సంస్కరణలు అమలు చేస్తున్నది.


భూ సంబంధ వివాదాలు సమాజంలో అవినీతికి, ఆందోళనలకు, ఘర్షణలకు, శాంతిభద్రతల సమస్యకు కారణమవుతూ వచ్చాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు మొదటి విడతలోనే భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కొత్త రెవెన్యూ చట్టానికి, కొత్త రిజిస్ట్రేషన్‌ విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నది. ఇలాంటి సంస్కరణలు అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పౌరులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నది. స్వరాష్ట్రంలో సుపరిపాలన నినాదంతో ప్రభుత్వం తీసుకొస్తున్న పరిపాలనా సంస్కరణలు కఠినంగానే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం, సరైన పర్యవేక్షణతో పారదర్శకమైన పాలన అందించడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ సమాజాన్ని ఆదర్శంగా నిలపడం, తెలంగాణ ప్రజల జీనవ ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రారంభించిన రెండో విడత ప్రయాణం మొదటి ఏడాది దిగ్విజయంగా ముగిసింది.

రెట్టింపైన ఆసరా పెన్షన్లు

ఆసరా పెన్షన్ల సాయాన్ని ప్రభుత్వం రెట్టింపు చేసి 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి అందిస్తున్నది. మొత్తం అన్ని రకాల ఆసరా పెన్షన్లు పొందే లబ్ధిదారులు 39,34,253 మంది వున్నారు. వృద్ధాప్య పెన్షన్‌ అర్హత వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం అన్ని రకాల పెన్షన్లు పొందేవారి సంఖ్య సుమారుగా 46 లక్షల వరకు చేరనుంది. ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం ఏటా రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నది.

ఎకరానికి 10వేల పంట పెట్టుబడి

రైతుబంధు పథకం కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. 2019 ఖరీఫ్‌ నుంచి పెంచిన పంట పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తున్నారు. రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఏటా రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. దాదాపు 56 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతున్నది.

రైతు బీమా కొనసాగింపు-పెరిగిన ప్రీమియం

ఏ కారణం చేత రైతు మరిణించినా, ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన రైతుబీమా పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో పాలసీకి ప్రీమియం రూ.2,271.50 ఉంటే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం రూ.3,556కు పెరిగింది. అయినా సరే మొత్తం సొమ్మును ప్రభుత్వమే చెల్లించి, దాదాపు 31 లక్షల మందికి బీమా సౌకర్యం కల్పించింది. ప్రభుత్వం ఈ పథకం కోసం ఏడాదికి 1100 కోట్లు ఖర్చు చేస్తున్నది. 2019 డిసెంబర్‌ నాటికి 19 వేల కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.5 లక్షల చొప్పున బీమా సొమ్ము అందింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం

తెలంగాణలో ప్రజల సాగు, తాగు నీటి ఇబ్బందులు, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా గోదావరి నదిపై యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌, మంత్రులు, అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు 21 జూన్‌, 2019న ఉదయం 11.23 గంటలకు మేడిగడ్డ బ్యారేజి వద్ద శిలాపలకాన్ని ఆవిష్కరించి కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం 2018 (29.3.2018)

పల్లెలు ప్రగతి సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టం-2018 తీసుకొచ్చి, పక్కాగా అమలు చేస్తున్నది. దీంతో గ్రామ స్వరాజ్యానికి బాటలు పడుతున్నాయి. పల్లెల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు నూతన చట్టం ప్రకారం పాలన సాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అధికారాలు, విధులు, నిధుల వినియోగం పకడ్బందీగా జరిగేలా చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చింది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం బిల్లు 2018 మార్చి 29న ఆమోదం పొందింది.

కొత్తగా 9355 మంది పంచాయతీ కార్యదర్శుల నియామకం

గ్రామ పంచాయతీల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం ప్రతీ గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా 9355 మంది పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని చేపట్టింది.

గ్రామ పంచాయతీలలో 30 రోజుల ప్రణాళిక అమలు

తెలంగాణ పల్లెలు పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో, ఆదర్శ గ్రామాలుగా మారాలనే ఆశయంతో ప్రభుత్వం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది. 2019 సెప్టెంబర్‌ 6న ప్రారంభమయిన కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగింది. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలకు గ్రామస్థాయిలోనే ప్రణాళిక రూపొందించారు. శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయడానికి స్థలాలు ఎంపిక చేశారు. హరితహారం ప్రణాళికను ఖరారు చేశారు. గ్రామ పంచాయతీల వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేశారు. గ్రామాల్లో చెత్తా చెదారం, కూలిన ఇండ్ల శిథిలాల తొలగింపు తదితర పనులు చేపట్టారు.

కొత్తగా 2 జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు

రాష్ట్రంలో గతంలో 31 జిల్లాలుండగా కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాల్ని, కొత్తగా మరో రెండు (కొల్లాపూర్‌, కోరుట్ల) రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 71 కి చేరింది.

గ్రామ పారిశుధ్య కార్మికుల జీతాలు రూ.8,500లకు పెంపు

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 36 వేల మంది సఫాయి కర్మచారుల జీతాన్ని పెంచుతున్నట్లు 30 ఆగస్ట్‌, 2019న సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని బట్టి నెలకు రూ. 5 వేల లోపు వేతనం దక్కేది. ఇక నుంచి వారికి నెలకు రూ. 8,500కు జీతం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

పంచాయతీ సిబ్బందికి జీవిత బీమా

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది కోసం పూర్తి ప్రభుత్వ ఖర్చుతో ఎస్‌.కె. డే పేరిట జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు 10 అక్టోబర్‌ 2019న సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రామ పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా సొమ్ము అందేలా ఈ పథకం ఉంటుంది.

గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్‌ ఏర్పాటు

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ వివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులతో ట్రిబ్యునల్‌ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్‌ కొత్త పంచాయతీరాజ్‌ సవరణ చట్టం సెక్షన్‌ 37, సబ్‌ సెక్షన్‌ 6 ప్రకారం గ్రామ పంచాయతీల వివాదాల అప్పీళ్లను విచారించి, తీర్పు చెబుతుంది. ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌ గా మహబూబ్‌ నగర్‌ మాజీ జెడ్పీ ఛైర్మన్‌ బండారు భాస్కర్‌, సభ్యులుగా నెక్కొండ మాజీ ఎంపీపీ గటిక అజయ్‌ కుమార్‌, సీనియర్‌ న్యాయవాది పులిగారి గోవర్ధన్‌ రెడ్డిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు

రాష్ట్రంలో కొత్తగా ఏడు మున్సిపాలిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీలుగా ఉన్న బడంగ్‌ పేట్‌, బండ్లగూడ జాగీర్‌, మీర్‌ పేట్‌, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, జవహర్‌ నగర్‌, నిజాంపేటలను కార్పొరేషన్లుగా మార్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్ల సంఖ్య 13కు చేరింది.

కొత్త మున్సిపల్‌ చట్టం అమలు

మున్సిపల్‌ పాలనలో సంస్కరణలు ప్రవేశ పెడుతూ ప్రభుత్వం కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. 2019 జూలై 19న అసెంబ్లీ కొత్త చట్టాన్ని ఆమోదించింది.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు ప్రారంభం

2019-20 విద్యా సంవత్సరం నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 119 బిసి గురుకుల విద్యాలయాలు ప్రారంభయ్యాయి. దీంతో రాష్ట్రంలో బిసి గురుకులాల సంఖ్య 281కి చేరింది.

తెలంగాణలో నీరా పాలసీ

కులవృత్తులకు పూర్వవైభవం తేవడం ద్వారానే గ్రామీణార్థికాభివృద్ధిని పరిపుష్టం చేయగలమని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణలో నీరా పాలసీ ప్రకటించారు. ఈ పాలసీలో నీరా నుంచి తయారుచేసే తాటిబెల్లం, తాటినీరు చక్కెర నీరా, తాటి కలకండ, తాటి షుగర్‌ క్యాండీ, తాటి పౌడర్‌ వంటి అనుబంధ ఉత్పత్తులు, ఉపాధి మార్గాల పై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. తెలంగాణలో తాటిచెట్లు పుష్కలంగా ఉన్నాయి. ఒక్కో తాటి చెట్టు నుంచి ఏడాదికి 600 నుంచి 1000 లీటర్ల దాకా నీరా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో రైలు ప్రారంభం

తేదీ. 29 నవంబర్‌ 2019 రోజున హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం వరకు కిలోమీటరున్నర మెట్రో మార్గాన్ని మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ ప్రారంభించి, అందులో ప్రయాణం చేశారు.

మణుగూరులో బీటీపీఎస్‌ మొదటి యూనిట్‌ ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీటీపీఎస్‌ మొదటి యూనిట్‌ ను టీఎస్‌ జెన్‌ కో సీఎండీ ప్రభాకర్‌ రావు 25.3.2019న ప్రారంభించారు. దీంతో తొలి యూనిట్‌ మొదటి దశలో 270 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి మార్గం సుగమమైందని, 2020 జనవరిలో 1, 2 యూనిట్ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే లక్ష్యంతో జెన్‌కో అధికారులు పనిచేస్తున్నారని సీఎండీ తెలిపారు. 2020 జనవరి 26 నాటికి 1, 2 యూనిట్ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని జెన్‌ కో సీఎండీ ప్రభాకర్‌ రావు బీటీపీఎస్‌ సందర్శనలో తెలిపారు.

విద్యుత్‌ ఆర్టిజన్ల సర్వీసుల క్రమబద్ధీకరణ

రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీసులను క్రబబద్ధీకరించిన ప్రభుత్వం వారికి సర్వీస్‌ రూల్స్‌ వర్తింప చేయాలని నిర్ణయించింది. ఆర్టిజన్లకు కూడా ఇకపై ఇతర ఉద్యోగుల మాదిరిగానే ఇంక్రిమెంట్లు, పిఆర్సీ, ఇతర సౌకర్యాలు అందుతాయి.

హైదరాబాద్‌ లో ఫ్లై ఓవర్ల ప్రారంభం

ఎల్‌.బి.నగర్‌ ఫ్లై ఓవర్‌, మైండ్‌ స్పేస్‌ అండర్‌ పాస్‌, బయో డైవర్సిటీ అండర్‌ పాస్‌ లు ప్రారంభమయ్యాయి.

ఆర్టీసీ ఉద్యోగులకు పెరిగిన పదవీ విరమణ వయస్సు

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిశ్చయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయించాలని నిర్ణయించింది.

ఫారెస్ట్‌ కాలేజీ ప్రారంభం

సిద్ధిపేట జిల్లా ములుగులో ఫారెస్టు కాలేజీ, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2019 డిసెంబర్‌ 11న ప్రారంభించారు.

హార్టికల్చర్‌ యూనివర్సిటీ ప్రారంభం

సిద్ధిపేట జిల్లా ములుగులో హార్టికల్చర్‌ యూనిర్సిటీ భవనాన్ని సిఎం కేసీఆర్‌ 2019 డిసెంబర్‌ 11న ప్రారంభించారు.