సైన్స్ రహస్యాలు

బి: శ్రీ దోర్బల బాలశేఖరశర్మ

సూక్ష్మ జీవ రక్షణ!
మహోన్నత సృష్టి (విశ్వం)లో మనిషి పరిమాణం ఎంత అత్యల్పమో అంత ప్రాధాన్యమైంది కూడా. ఎందుకంటే సకల జీవరాశిలో ప్రస్తుతానికి మానవుడిని మించింది లేదు కనుక. అలా అని మనం విర్రవీగి పోవడానికి వీల్లేదు. కారణం, మన మేథాశక్తికి అందని విజ్ఞానం ఇంకెంతో అపారం. అండపిండం నుంచి బ్రహ్మాండం వరకు తెలియని రహస్యాలు ఎన్నెన్నో. కనిపించే అద్భుతాలు కొన్ని అయితే, మన సాధారణ కంటికి కనబడని వింతలు మరెన్నో.

మనిషి శరీరంలోని సూక్ష్మజీవులు, జీవకణాల ‘విశ్వరూపం’ తక్కువదేమీ కాదు. ఈ దేహంలో జీవకణాల కంటే సూక్ష్మజీవుల (బాక్టీరియా) సంఖ్యే అత్యధికమని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చారు. మానవ శరీరంలో మొత్తం సుమారు 30 ట్రిలియన్ల (30 లక్షల కోట్లు) జీవకణాలు వుండగా, సూక్ష్మజీవులు (పరాన్నజీవులు) మాత్రం అంతకు మించి దాదాపు 39 ట్రిలియన్ల (39 లక్షల కోట్లు) మేర వుంటున్నట్లు ఒక అంచనా. కానీ, తాజాగా ఈ లెక్క మరింత పెరిగింది. ఒక అధ్యయనం ప్రకారం, ‘మానవ జీవకణాలకంటే 10 రెట్లు ఎక్కువగా సూక్ష్మజీవులు మానవ శరీరంలో నివాసం ఉంటున్నట్లు’ జీవ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే, వీటిలో చాలావరకు మనకు ‘మేలు చేసే సూక్ష్మజీవులే, కావడం గమనార్హం. మంచి సూక్ష్మజీవుల వల్లే మనిషి భౌతికంగా మనుగడలో ఉంటున్నాడన్నది కాదనలేని సత్యం.

‘సి సెక్షన్‌ ద్వారా పుట్టిన పిల్లలకంటే సహజ సిద్ధంగా జన్మించిన పిల్లలలో రోగ నిరోధక శక్తి అధికంగా
ఉంటుందని, శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కారణం, ప్రసవ సమయంలో అక్కడ బిడ్డకు అధిక మొత్తంలో మంచి సూక్ష్మజీవ శక్తి లభిస్తుందని వారు అన్నారు. ప్రాణశక్తికి మూలాధారమైన జీవకణాలకు అంత గొప్ప సామర్ధ్యాన్ని అందించడంలో మనకు మేలు చేసే (మంచి) సూక్ష్మజీవులే అత్యంత గణనీయమైన పాత్రను పోషిస్తాయని వారు తెలిపారు. అందుకే, ఈ కరోనా సమయంలోనే కాదు, ఎప్పుడైనా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, మన ఎదుట ఎవరైనా తుమ్మినా, దగ్గినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

పరాన్నజీవులతోనే మన మనుగడ
సాధారణ జీవకణాలకంటే అర గ్యాలెన్‌ (1 గ్యాలెస్‌కు ద్రవ పరిమాణం R 4.55వ లీటర్లు) జగ్గు నిండిపోయేంత మొత్తంలో (సుమారు 10 రెట్లు అధికంగా) సూక్ష్మజీవకణాలు (bacterial cells) మనిషి దేహంలో ఉంటున్నట్లు మాస్కోలోని యూనివర్శిటీ ఆఫ్‌ ఇడా హో’’ (University of Idaho)కు చెందిన మైక్రోబయాలజిస్టు క్యారొలీస్‌ బొహాచ్‌ (Carolyn Bohach) ప్రకటించారు. అయితే, వీటిలో అధిక మొత్తం సూక్ష్మజీవులు మనకు మేలు చేసేవే. ఇవే కనుక లేకపోతే అసలు మనిషికి భౌతిక మనుగడే ఉండదని పరిశోధకులు అంటున్నారు. మనం తిన్న ఆహారం నుంచి శక్తి, పోషకాలను వినియోగించుకోవడానికి సహాయపడే రసాయనాలను ఈ సూక్ష్మ క్రిములే ఉత్పత్తి చేస్తాయి. మనుషులే కాదు, జంతువులూ తగిన పాళ్లలో తమ శరీర బరువును కలిగి ఉండటానికి ఇవి తప్పనిసరి. పలు అధ్యయనాలలో ఇది నిరూపితమైంది కూడా!

ఉదాహరణకు తగినంత మేర ‘సూక్ష్మక్రిములు లేని ఎలుకలు’ సాధారణ ఎలుకల (తగినంతగా సూక్ష్మక్రిములు ఉన్నవి) కంటే సుమారు మూడొంతులు ఎక్కువ క్యాలరీల శక్తిని ఉపయోగించు కోవలసి ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. అవే జంతువుల (సూక్ష్మక్రిములు లేని ఎలుకలు)కు తర్వాత ఒక ‘బ్యాక్టీరియా డోస్‌’ (సూక్ష్మక్రిముల మోతాదు) ఇచ్చినప్పుడు అవి బరువు పెరగడాన్ని వారు గుర్తించారు. నిజానికి ఆ ఎలుకలు అంతకు మించి ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేక పోతున్నాయన్నది ఇక్కడ గమనార్హం. అయితే, రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటానికి గాను ఆంత్రాల (పేగులు)లోని బ్యాక్టీరియానే (సూక్ష్మజీవులు) కీలక పాత్రను పోషిస్తాయని పరిశోధకులు వెల్లడిరచారు.

జీవాణువుల విశ్వరూపం
మనిషి సహా వివిధ జంతువులలో జీవకణాలను మించిన సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటుండగా, వీటి కంటే అనేక రెట్లు అధిక సంఖ్యలో జీవాణువులు ప్రతీ జీవకణాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఒక్కో జీవకణంలో వుండే ‘డీఎన్‌ఎ జీవాణువు’లను విడదీస్తూ పోతే, అవతరించే ‘విశ్వరూపం’ దిగంతాలకు వ్యాపిస్తుంది. మానవ శరీరం సుమారు ఆరడుగులే అయినా మన ‘డిఎన్‌ఏ’ అణువులలోని కోడ్‌ (సంకేతం) లక్షల కోట్ల అడుగుల వరకు సాగుతుంది. ఒక అంచనా ప్రకారం ఈ పొడవు సూర్యుని నుంచి ఫ్లూటో వరకు గల దూరాన్ని ఏకంగా 17 పర్యాయాలు చుట్టేస్తుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ప్రతీ మానవ జీవకణంలోని ఒక్కో జన్యు సంకేతం (జినోమ్‌)లో మొత్తం 23 డిఎన్‌ఏ అణువులు (క్రోమోజోమ్స్‌) ఉంటాయి. ఒక్కో ‘క్రోమో జోము అణువు’ సుమారు 5 లక్షల నుంచి 25 లక్షల వరకు న్లూక్లియోటైడ్‌’ జతలను కలిగి ఉంటాయి. ఈ మొత్తం ‘డిఎన్‌ఎ అణువు’లను అన్నింటినీ సాగదీసినప్పుడు ఆ పొడవు సుమారు 5 సెం.మీ.కు విస్తరిస్తుంది.

సగటు మనిషి దేహంలో సుమారు 37 ట్రిలియన్‌ (37 లక్షల కోట్లు) జీవాణువులు ఉన్నాయని అనుకొంటే, వాటన్నింటిలోని ‘డిఎన్‌ఏ అణువు’లను సాగదీస్తూ పోతే వ్యాపించే పొడవు ఏకంగా ‘సూర్యునికి ` ఫ్లూటో’కు గల మధ్య దూరానికన్నా చాలా ఎక్కువ. ‘అది 17 పర్యాయాల ప్రయాణానికి సమానమని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే, ఇక్కడ తెలుసుకోవలసిన విషయ మేమిటంటే, మనమంతా దాదాపు 99 శాతం మేర మన ‘డిఎన్‌ఎ’ను ప్రతి ఒక్కరితోనూ పంచుకొంటాం. కేవలం ఒకే ఒక్క శాతం ‘డిఎన్‌ఎ’ మనుషుల్లో అత్యంత సంక్లిష్ట రీతిలో తేడాలను సృష్టిస్తుంది. దీనిని బట్టి అత్యధిక శాతం మనమంతా ఏకస్థితి మానవులమని గుర్తుంచుకోవాలి.

ఒక్క నిమిషంలోనే దేహయానం!
ఒక రక్తకణం ఒక్క నిమిషం (60 సెకండ్లు)లో మన శరీమంతా ప్రయాణిస్తుంది. సగటున ప్రతి ఒక్కరిలోనూ దేహం మొత్తంలో 5 లీటర్ల మేర రక్తం ఉంటుంది. సాధారణంగా ఒక మనిషి గుండె ఒక్కో ‘లయ’ (కొట్టుకోవడం)లో 70 మి.లీ. రక్తాన్ని పంపిణీ చేస్తుంది. ఆరోగ్యవంతుడైన మానవుని హృదయం ఒక నిమిషానికి 70 పర్యాయాలు కొట్టు కొంటుంది. ఈ లెక్క గుణిస్తే. ఒక్కో నిమిషానికి గుండె నుండి పంపిణీ అయ్యే రక్తం సుమారు 4.9 లీటర్లు. ఇది దేహం మొత్తం రక్త పరిమాణంతో సమానమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే, కేవలం 60 సెకండ్ల (ఒక నిమిషం)లోనే గుండె మన శరీరంలోని మొత్తమంత రక్తాన్ని పంపిణీ చేస్తుందన్నమాట.