స్వపరిపాలన – సుపరిపాలన

  • మా శర్మ

తెలంగాణ జయపథంలో దిగ్విజయ దుందుభి మోగిస్తూ దూసుకెళ్తోంది. దీనికి భూమిక, పూనిక, ఏలిక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కెసిఆర్‌ నాయకత్వంలో 2014 జూన్‌ 2వ తేదీనాడు ‘తెలంగాణ’ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది. నేడు సప్త వసంతాలు పూర్తి చేసుకొన్న గొప్ప సందర్భం, గొప్ప సంరంభం. 

ఒకప్పుడు, షోడశ మహాజనపదాల్లో దక్షిణాదిలోనే ఏకైక మహాజనపదంగా భాసించిన గొప్ప ప్రాంతం తెలంగాణ. చరిత్రలో ఎందరో మహారాజులు ఈ భూమిని పరిపాలించారు. బహుముఖ వైభవాలకు నెలవుగా ఈ నేల విలసిల్లింది. గొప్ప చరిత్రను వశం చేసుకుంది. రాచరికపు వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యం వైపు సాగిన పరిపాలనా పయనంలో, నేడు స్వపరిపాలన, సుపరిపాలనతో తెలంగాణ జయకేతనం ఎగురవేస్తోంది. ఈ ఏడేళ్లలో వందేళ్లకు మించిన ప్రగతికి పునాదులు ఏర్పడ్డాయి.పూర్వ వైభవాన్ని పునఃలిఖిస్తూ, అపూర్వ ప్రాభవాన్ని ఈ పుడమికి దత్తం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ గొప్ప పథకాలను రచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయి. ఈ భాగ్యం భాగ్యనగరికే పరిమితం కాక, పల్లెపల్లెలో వెలుగుపూలు పూస్తు న్నాయి. సర్వసంపదలకు నిలయంగా, సంపన్న రాష్ట్రంగా తెలంగాణా పునర్ని ర్మాణం శరవేగంగా జరుగుతోంది. 

ప్రగతి ఏ ఒక్కరి సొత్తు కాక, ప్రతి ఒక్కరికీ దక్కే కృషి అమేయంగా జరుగు తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ రూపకల్పన చేసిన కొత్త పథకాలు సామాన్య మైనవి కావు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా వీటిని అనుసరించి, ఆచరించాలని చూస్తున్నాయి. 

తెలంగాణలో నేడు భూమి బంగారాన్ని మించిపోతోంది. ‘బంగారు తెలంగాణ’ అనే మాటను కూడా దాటిపోతోంది. వేలరూపాయల్లో ఉండే ఎకరం భూమి ఇప్పుడు లక్షలు, కోట్లు దాటుతోంది. ఈ నేల విలువ ఇంతగా పెరగడానికి కారణం ప్రభుత్వం చేపట్టిన పథకాలు. యాదాద్రి గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మహా నిర్మాణం జరిగింది. దీనికి కర్త, కర్మ, క్రియ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని జగతి మొత్తం గుర్తించింది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు సమాంతరంగా సంస్కృతికి, సంప్రదాయానికి, భారతీయతకు అగ్రతాంబూలం ఇచ్చే పరిపాలకుడిగా కెసిఆర్‌కు విశేష ఖ్యాతి దక్కుతోంది. అందుకు సజీవ ఉదా హరణలు మన కళ్లెదుట ఎన్నో ఉన్నాయి. యాదాద్రి అనగానే తరతరాలకు కెసిఆర్‌ గుర్తుకు వచ్చి తీరుతారు. ఇది ఎవ్వరూ చెరపలేని ఖ్యాతి. 2017లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ జాతి ఖ్యాతి అంబరచుంబితంగా ఎగసిపడిరది. ‘తెలంగాణ’ అంటే తెలుగుదేశం అని అర్ధం. (తెలుంగు + ఆణెం = తెలుగు + దేశం) ఆ పదం అక్షరాలా, అణువణువునా ఆ సభల్లో ప్రతిఫలించింది. ‘‘తెలుగదేల యన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ’’ అన్న శ్రీకృష్ణదేవరాయలవారి పదాలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదాలలో, పథాలలో ప్రతిధ్వనించాయి.ఈ సభకు సుమారు 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్రలోని అన్ని పార్శ్వాలు సమగ్రంగా ఆవిష్కార మయ్యాయి.ఈ ఉత్సవాల ఫలితంగా తెలుగు వికసించడమే కాక, తెలంగాణ సారస్వత వైభవం విశ్వవ్యాప్తంగా విరాజిల్లింది. 

2015లో, జగదాశ్చర్యకరంగా నిర్వహించిన ‘అయుత చండీ మహా యాగం’ లోక కల్యాణ యోగంగా సాగడమే కాక, పూర్వ చక్రవర్తుల సంప్రదాయ ఘనతను ఈ తరాలకు గుర్తుచేసింది.ఆధునిక కాలంలో, ఇంత ఘనంగా, ఇంత స్ఫుటంగా ఎవ్వరూ నిర్వహించలేదన్న ఖ్యాతి తెలంగాణకు, రాష్ట్ర పాలకుడైన చంద్రశేఖరరావుకే దక్కింది. నభూతో న భవిష్యతి అంటూ ఎందరో పెద్దలు శ్లాఘించారు, దీవించారు.ఈ ఏడేళ్ల పాలనలో శాంతి సౌభాగ్యాలు రాజ్యమేలాయి. క్రైమ్‌ రేటు గణనీయంగా తగ్గింది. మత, సామాజిక వైషమ్యాల దాఖలాలు లేవు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ నివసించే, జీవించే ఆంధ్ర ప్రాంతీయులకు కష్టనష్టాలు, అవమానాలు తప్పవని, రాష్ట్రం నుంచి తరిమేస్తారని, పారిపోవాల్సి వస్తుందనే పుకార్లకు చీటీ చెల్లిపోయింది. సర్వజనులు సోదర భావంతో మెలిగే వాతావరణమే సర్వత్రా దర్శన మిస్తుంది. 

పోలీసింగ్‌ చాలా చక్కగా ఉంది. పోలీస్‌ యంత్రాం గానికి పూర్తి స్వేచ్ఛ దక్కింది. ఆధునిక సాంకేతి కతను అందిపుచ్చుకొని, పౌర రక్షణలో, శాంతి భద్రతలను కాపాడడంలో, వృత్తినైపుణ్యాలను చాటి చెప్పేలా, తెలం గాణ ప్రభుత్వం పోలీసులకు అన్ని హంగులను సమకూర్చింది. జీత భత్యాలను పెంచి, ప్రోత్సాహకంగా ఊతమిచ్చింది. మహిళల రక్షణలో ‘షీ టీమ్స్‌’ స్థాపన సరికొత్త ప్రయోగం. అడుగడుగునా నిఘానేత్రాలు ఉన్నాయనే సంకేతం తప్పు చేయాలనే దురాలోచన ఉన్నవారికి భయాన్ని, సాధారణ పౌరులకు అభయాన్ని ఇస్తోంది. 

తెలంగాణలో కరెంటు కష్టాలు అనేవి దివిటీ వేసి వెతికినా కానరావు అన్నట్లుగా విద్యుత్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో కనిపించే నిరంతరమైన వెలుగులు దానికి అద్దంపడతాయి. ఇది గతంలో ఎన్నడూ లేని గొప్ప ప్రగతి. కెసిఆర్‌ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలు అడుగడుగునా ఉన్నాయి. ఈ ఏడేళ్ళలో నిర్మాణం చేసిన ప్రతి పథకమూ అమృతగుళికయే. ‘రైతుబంధు’ అందించిన మేళ్లు అన్నీఇన్నీ కావు. వ్యవసాయం కోసం పెట్టుబడిని నగదు రూపంలో అందించి, ప్రతి రైతు పక్కన మేము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వడమే కాక, వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి బలమైన పునాదులు వేసిన గొప్ప పథకం ‘రైతు బంధు’. ఈ పథకం  తెలంగాణ ప్రభుత్వానికి దేశవ్యాప్త ఖ్యాతిని అందించింది. ‘గురుకుల విద్యా విధానం’ గొప్ప మలుపు. ఈ విద్యా లయాల్లో చదువుకుంటున్న పిల్లలు కార్పొరేట్‌ స్కూళ్ళకు మించిన ప్రతిభతో ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారు. కార్పొరేట్‌ స్కూల్స్‌లో చేరడం సామాన్యుడికి గగనకుసుమం. లక్షల ఫీజులు ఎవ్వరు కట్టగలుగుతారు? ఎవరో కొందరు కోటీశ్వరులు తప్ప. చదువు, భోజనం, వసతి అన్నింటినీ ఉచితంగా పొందుతూ, మెరికల్లాంటి విద్యార్థులు భావి భారత నిర్మాతలుగా తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థలో తయారవుతున్నారు. వీరందరూ బడుగు బలహీన వర్గాల బిడ్డలే కావడం విశేషం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగిన నిపుణత, సెంట్రల్‌ యూని వర్సిటీ, నల్సార్‌ మొదలైన ప్రతిష్ఠాత్మక విశ్వ విద్యాల యాల్లో ప్రవేశం పొందగలిగిన ప్రవీణత, క్రీడలు, లలిత కళల్లో అద్భుత మైన విన్యాసాలు చేయగలిగిన ప్రదర్శక ఘనత తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థలో అందు తోంది. ఆదర్శానికి నెలవుగా తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దిన మహాసౌధం ఈ విద్యా విధానం. తెలంగాణలో ఫార్మా రంగం మారుత వేగంగా దూసుకెళ్తోంది. 

బల్క్‌ డ్రగ్‌ క్యాపిటల్‌గా, వాక్సిన్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ ఖ్యాతి ప్రపంచపటంపై రెపరెప లాడుతోంది. రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట తారక రామరావు మానస పుత్రికలలో (బ్రెయిన్‌ చిల్డ్రన్‌) ప్రధాన స్రవంతిలో నిలిచేది ‘హైదరాబాద్‌ ఫార్మా సిటీ’. ఈ ప్రాజెక్ట్‌ సంపూర్ణ నిర్మాణం పూర్తయిన నాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా స్యూటికల్‌ పార్క్‌గా విఖ్యాతి గడిరచి తీరుతుంది. దివ్య ఔషధాలకు కేంద్రంగా నిలవడమే కాక, లక్షలమందికి    ఉపాధిని కల్పించే వ్యవస్థలలో ఇది ముందు వరుసలో ఉంటుంది. నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (ఎన్‌ఐ ఎంజెడ్‌)గా 2019లోనే భారత ప్రభుత్వ గుర్తింపును పొందింది. తెలంగాణ ప్రభుత్వ కీర్తికిరీటంలో కలికితురా యిగా హైదరాబాద్‌ ఫార్మాసిటీ విలసిల్లి తీరుతుంది. 

ఐటి రంగం అంచనాలనుమించిన ప్రగతి పరుగులు పెడు తోంది. ‘టీ-హబ్‌’ ఒక వినూత్న ప్రయోగం.    యువత కలలు సాకారమవ్వడానికి సంకల్పించిన విశేష మైన ప్రాజెక్ట్‌. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో టీ హబ్‌ భవనం నిర్మాణమైంది. ఇది జగద్విఖ్యాత పారిశ్రామిక వేత్త రతన్‌ టాటాను సైతం ఎంతగానో మురిపించిన ప్రాజెక్ట్‌. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన భాగస్వామిగా, ఇండియన్‌ స్కూల్‌ అఫ్‌ బిజినెస్‌, ట్రిపుల్‌ ఐటీ, నల్సార్‌ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాలు, మరి కొన్ని సుప్రసిద్ధమైన కంపెనీల సహకారంతో ఏర్పాటు చేసిన ‘టీ హబ్‌’ స్టార్టప్‌లకు కొండంత అండ. ఆలోచనతో రండి… ఆవిష్కరణతో వెళ్ళండి.. అనే నినాదం అక్షరాలా నిజం చేసే ఈ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా స్టార్టప్‌లను ఒకే గొడుగు కిందకు తెచ్చే విశిష్టమైన వేదికగా తెలంగాణ ప్రభుత్వ ఖ్యాతిని సమున్నతంగా నిలబెడుతోంది. 

నల్గొండ అనగానే మొన్నటి వరకూ ఫ్లోరైడ్‌ సమస్యే గుర్తుకువచ్చేది. తెలంగాణ ప్రభుత్వం ఈ భూతాన్ని తరిమికొట్టి చరిత్రలో నిలిచిపోయింది. ఇది మామూలు విజయం కాదు. ఒకప్పటి తెలంగాణ వేరు. నేడు మనం చూస్తున్న తెలంగాణ పూర్తిగా వేరు. నీరు, నిధులు, నియామకాలు మూడు అంశాలు విజయపరంపరలో మునుముందుకు సాగుతున్నాయి. యావత్తు తెలంగాణ నేలలో సాగుకు పుష్కలంగా నీరు అందుతోంది. తాగునీటి కష్టాలు తీరుతు న్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఆశయం పునాదిగా రచించిన పథకం ‘మిషన్‌ భగీరథ’. తెలంగాణలోని ప్రతిపల్లెలో నూటికి నూరు శాతం స్వచ్ఛమైన నీరు అందుతోందనే కితాబును ప్రభుత్వం దక్కించుకుంది. తాగునీటి సమస్యను తీర్చడం, స్వచ్ఛమైన మంచినీరు అందించడం, ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటు చేయడం లక్ష్యాలుగా నిర్మాణ మైన ‘మిషన్‌ భగీరథ’ చరిత్రలో నిలిచి పోయే పథకం. 

‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’ దేశంలోనే తలమానికమైన మహా పథకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్‌ ఇది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌. తెలంగాణ ముఖ చిత్రాన్ని సమున్నతంగా, సమగ్రంగా మార్చే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడం ముఖ్యమంత్రి కెసిఆర్‌ దార్శనికతకు, ధైర్యానికి, భూమిభక్తికి ఆకసమంత నిదర్శనం. ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’ అపూర్వమైన యజ్ఞం. రాష్ట్ర మంతా చెరువులు, కాలువలు, జలకళతో కళకళ లాడాలనే పవిత్రమైన సంక ల్పానికి ఈ పథకం నిలువుటద్దం. శ్రీకృష్ణ దేవరాయలు, కాకతీయ రాజులు మొదలైన ఉత్తమ చక్రవర్తుల జీవిత చరిత్రలను చదివితే చెట్లు నాటించెను, చెరువులు తవ్వించెను అనే విశేషాలు కనిపిస్తాయి. అవి నిన్నటి వరకూ పాఠ్య పుస్తకాలకే పరిమితమైన విషయాలు. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో అనేక రాయల చెరువులు దర్శనమిస్తాయి. తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయులు పాలించిన సమయంలో ఎన్నో కాలువలు తవ్వించారు. ఆ మహా చక్రవర్తుల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొప్ప పథకం ఇది. దశాబ్దాలుగా ఎన్నో వేల చెరువులు పూడుకుపోయాయి. ఈ పథకం ద్వారా వాటి పునరుద్ధరణ జరిగి, ఈ నేలంతా సస్యశ్యామల మవుతుంది. మన ఊరు – మన చెరువు, అని గర్వంగా చెప్పుకునే ఈ ప్రాజెక్టుకు ప్రారం భించిన తొలి నాళ్ళల్లోనే గొప్ప పేరు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విభిన్న, విశేష, వినూత్న పథకాలకు ఆలవాలంగా నిలి చింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయక త్వంలో, ఆధ్వర్యంలో, కనుసన్నల్లో యావత్తు మంత్రి మండలి, అధికారగణం, యంత్రాంగం ప్రతి పథకాన్ని దిగ్విజయ పరంపరలో నడిపిస్తున్నాయి. ఈ ఏడేళ్ల పాలనలో వెనుక బాటు తనం అనే మాట కని పించకుండా, వినిపించకుండా ఏటో వెళ్లిపోయింది. తెలంగాణ పల్లెసీమల ప్రగతికి జతగా హైదరాబాద్‌ నగర విఖ్యాతి మరింతగా విశ్వ వ్యాప్తమయ్యింది. ‘ట్రీ సిటీ’గా హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోని 63 దేశాలలో, భారతదేశం నుంచి ఈ ఘన గౌరవాన్ని దక్కిం చుకున్న ఏకైక నగరం హైదరాబాద్‌ కావడం దేశానికే తలమాణికం.

ఈ ఘనత ఆషామాషీగా దక్కింది కాదు. చెట్లను నాటడంలో, పోషించడంలో, విస్తరించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేసిన గొప్ప వ్యవస్థ ప్రధాన కారణం. ఇందులో గొప్ప ప్రణాళిక, కృషి, హృదయం దాగివు న్నాయి. అన్ని రకాల ప్రజలు జీవించడానికి, జీవనం సాగించడానికి అనువైన నగరంగానూ హైదరాబాద్‌కు ఎంతో పేరు వచ్చింది. భయంకరంగా పెరిగి పోతున్న ట్రాఫిక్‌ కష్టాలకు నగరంలో అడుగడుగునా నిర్మించిన ఫ్లై ఓవర్లు చరమ గీతం పాడాయి. ఇంకా అనేక ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఫ్లై ఓవర్లేమిటి? స్కై ఓవర్లే నిర్మి ద్దామని మంత్రివర్యులు కెటిఆర్‌ గొప్ప ఉత్సాహానికి ఊపిరి లూదారు. నగరంలోకి మెట్రో రైళ్లు కూడా అందు బాటు లోకి వచ్చాయి. ఇంకా కొన్ని రాబోతున్నాయి. పల్లెలు కూడా ఏకమై విస్తరిస్తున్న మహా నగరంలో, ఎంత దూర మైనా, సునాయాసంగా, సుఖంగా ఘడియలో గమ్యాలను చేరుస్తున్న ‘మెట్రో వ్యవస్థ ‘భాగ్యనగర వాసులకు దక్కిన గొప్ప వరం. 

ఇక ‘దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి’ ఒక సాంకేతిక అద్భుతం. దీన్ని చూడడానికే లక్షల మంది ఎగబడుతున్నారు. ఇది పెద్ద పర్యాటక కేంద్రంగా మారిపోయింది. ఇది ఆసియాలోనే రెండవ అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది. మాదాపూర్‌, జూబ్లీ హిల్స్‌ ట్రాఫిక్‌ సమస్యను అధిగమించడం దీని లక్ష్యం. దీనివల్ల రోడ్‌ నంబర్‌ – 45 నుంచి ఐటీ కారిడార్‌కు ప్రయాణం అత్యంత సులువుగా మారింది. నగర ఆధునిక నిర్మాణంలో ‘దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి’ అత్యంత వినూత్నమైన ప్రాజెక్ట్‌. 

సినిమా, వినోద పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. స్టూడియో నిర్మాణాలకు సబ్సిడీ రేట్లతో స్థలాలను కేటాయిస్తోంది. ఇప్పటికే దర్శకుడు శంకర్‌కు భూమిని కేటాయించింది. తెలుగు సినిమా పెద్దలతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ అనేకసార్లు సమావేశమయ్యారు. తెలంగాణలో సినిమా, వినోద రంగాలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా పరిశ్రమ వర్గీయులకు ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్నినింపింది.

హైదరాబాద్‌ నగర అభివృద్ధి అనంతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న రింగ్‌రోడ్డుకు అదనంగా, దాని చుట్టూ, ‘హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌రోడ్డు’ను నిర్మించాలనే మహదాశయానికి తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం పెట్టింది. 340 కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుంది. ఇది  మహనీయమైన ప్రాజెక్టు. సంగారెడ్డి, తూఫ్రాన్‌, చౌటుప్పల్‌, ఆమన్‌గళ్‌, శంకరపల్లి మొదలైన పట్టణాలు ఈ రింగ్‌రోడ్‌తో అనుసంధానం (కనెక్ట్‌) కానున్నాయి. ఈ ప్రాజెక్టు సంపూర్ణమైన నాడు హైదరాబాద్‌ మహానగర చరిత్రలో గొప్ప మలుపుగా నిలబడుతుంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో సర్వోన్నత వైభవానికి, సర్వోత్తమ ఖ్యాతికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తోంది. 

తెలుగుతేజమైన పీవీ నరసింహారావును ప్రభుత్వాలు,పార్టీలు మరిచి పోయాయి. ఆ మహనీయుడికి దక్కాల్సినంత గౌరవం, గుర్తింపు దక్కలేదన్నది చేదు నిజం. ఈ మాననీయుడిని ప్రతిఒక్కరూ గుండెల్లో పెట్టుకొని పూజించాలి. 1921 జూన్‌ 28వ తేదీ నాడు పీవీ నరసింహారావు తెలంగాణ గడ్డలో పుట్టారు. 2021 జూన్‌కు వందేళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పెద్ద సంబురంగా చెయ్యాలనే విశేషమైన ఆలోచన కెసిఆర్‌కే వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెను వెంటనే మహాసంకల్పం చేసుకున్నారు. 2020 జూన్‌ నుంచి 2021 జూన్‌ వరకూ సంవత్సరం పాటు ‘పీవీ శతజయంతి ఉత్సవానికి’ శ్రీకారం చుట్టారు. సంబురాలతో సరిపెట్టకుండా, పీవీ స్మృతి చిహ్నంగా అనేక అంశాలను రచించారు. పీవీకి ‘భారతరత్న’ ప్రకటించాలని తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయించి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్‌లో ఆ మనీషా మూర్తి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 

ప్రభుత్వ మాసపత్రిక ‘తెలంగాణ’ 2020 డిసెంబర్‌లో పీవీ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక సంచికను రూపొందించింది. అంతే కాక, ఏడాది పొడవునా పీవీ నరసింహారావుపై ప్రతినెలా ప్రత్యేక వ్యాసాలను ఎందరో పెద్దలతో రాయించి ప్రచురించింది. ‘తెలంగాణ’ మాస పత్రికలో వచ్చిన వ్యాసాలను చదివితే, పీవీ నరసింహారావుపై ఎవరికైనా సమగ్రమైన అవగాహన వస్తుంది. ఒక పత్రికను ఒక మహామనీషికి ఇంతగా అంకితం చేయడం చరిత్రలోనే అరుదైన విషయం. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్దేశించిన అంశాలే.

పీవీ వారసత్వానికి అత్యంత గౌరవాన్ని ఇచ్చే క్రమంలో, ఆయన కుమార్తె సురభి వాణీదేవిని ఎంఎల్‌సిగా ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. గతంలో కాంగ్రెస్‌ సహా ఏ రాజకీయ పార్టీ చెయ్యని విశిష్టమైన కార్యాన్ని కెసిఆర్‌ చేసి చూపించారు. పీవీ నరసింహారావు వంటి మహనీయుని విషయంలో ఏ వ్యక్తి, ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఇంతకు ముందు ఎన్నడూ ఇటువంటి అపు రూపమైన కార్యాలను చేపట్టలేదన్న ఘనత ముఖ్యమంత్రి కెేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. పీవీ నరసింహారావుకు – కేసీఆర్‌ అందించిన అపూర్వమైన నివాళిగా ఇది చరిత్రలో మిగిలిపోతుంది. 

గత కొన్నినెలల నుంచి కరోనా కల్పించిన, కల్పిస్తున్న కష్టనష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాటిని అధిగమిస్తూ, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తూ, ప్రాణాలను కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం శతవిధాలా కృషి చేస్తోంది. నేడు సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్వయంగా అస్పత్రులను సందర్శిస్తున్నారు, వ్యాధి పీడితులకు ధైర్యాన్ని నింపు తున్నారు, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు, ప్రతి చర్యనూ పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో ఈ కేంద్రాలను సందర్శించడమంటే, ఇది అత్యంత సాహసో పేతమైన చర్య. ఎక్కడా వెరవకుండా ముందుకు సాగు తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించి తీరాల్సిందే. 

2014 జూన్‌ 2 నుంచి ఏడేళ్లపాటు కొత్త రాష్ట్రంలో, సొంత ప్రభుత్వంలో సాగిన పాలన గొప్పప్రగతికి ఆన వాళ్లుగా, తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయానికి మైలు రాళ్లుగా నిలిచిందన్నది నిర్వివాదాంశం. ఏడేళ్ల పాలనలో వందేళ్లకు మించిన ప్రగతికి పునాదులు ఘనంగా ఏర్పడ్డాయి. ఈ పునాదులపై భావి తెలంగాణ భవ్య భవ నాలను నిర్మిస్తుందని విశ్వసిద్దాం. ఇందులో భాగస్వామ్యు లైన ప్రతి ఒక్కరికీ అభినందనలు అందిద్దాం. ముఖ్యంగా, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు జేజేలు పలుకుదాం. 

జయహో.. జయ జయహో..