|

స్వాతంత్య్ర దినోత్సవ సభలో సీఎం కేసీఆర్‌ లక్షకుపైగా కొలువులు

magaతెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా నేను వినమ్ర నివాళులు సమర్పిస్తున్నాను. భారత జాతీయోద్యమం స్పూర్తితోనే, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఏ ఆశయ సాఫల్యం కోసం మనం స్వరాష్ట్రాన్ని కోరుకున్నామో ఆ లక్ష్య సాధన దిశగా రాష్ట్రం పురోగమిస్తున్నందుకు ఎంతగానో హర్షిస్తున్నాను. తెలంగాణ చారిత్రిక వైభవానికి ప్రతీక అయిన ఈ గోల్కొండ కోటలో, మూడేళ్ల కింద మొదటి సారి త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి రాష్ట్ర ప్రగతికి పథ నిర్దేశం చేసుకున్నాం. ఆనాడు ప్రకటించుకున్న ప్రణాళికల వెలుగులోనే అద్భుత విజయాలు సాధిస్తూ ముందడుగు వేస్తున్నాం.

సాధారణంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు అంత తొందరగా కుదురుకోవు. కానీ ఈ పరిస్థితిని మన రాష్ట్రం సమర్ధవంతంగా అధిగమించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 21.7 శాతం ఆదాయ వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. ఇది మనందరికీ గర్వకారణం. రాష్ట్ర ప్రగతికి శుభ సూచకం. తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న పారదర్శక విధానాల వల్ల, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణ వల్లనే ఈ ఫలితం వచ్చింది. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో నూతన ఒరవడిని దిద్దింది. మనం ప్రవేశ పెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇవి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రజల మద్దతుతో, ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్ధతతో, సమన్వయంతో చేసిన నిరంతర కృషి వల్లనే ఈ అభివృద్ధి సాధ్యమవుతున్నది.

అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాల మీద పరిపాలన సాగుతున్నది. కేవలం ఆర్థిక లక్ష్యాలను సాధించడమే కర్తవ్యంగా భావించే యాంత్రిక ధోరణిని ప్రభుత్వం విడనాడింది. సమానత్వం, సామాజిక న్యాయం అనే ఉదాత్త లక్ష్యాలను సాధించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నది. తెలంగాణలో 90 శాతం ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. వారి సమస్యల పట్ల సానుభూతితో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కనీస జీవన భద్రతను కల్పించేందుకు సంక్షేమ రంగానికి బడ్జెట్‌ లో సింహ భాగాన్ని వెచ్చిస్తున్నది.

నిరుపేదలకు, నిస్సహాయులకు కనీస భద్రత కల్పించేందుకు లక్షలాది మందికి ఆసరా పెన్షన్లను అందిస్తున్నది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులతో పాటు ఇటీవలనే ఒంటరి మహిళలకు కూడా జీవన భృతిని కల్పించింది. కళ్యాణలక్ష్మి/ షాదీముబారక్‌ పథకాల కింద ఇచ్చే మొత్తాన్ని రూ.75 వేలకు ప్రభుత్వం పెంచింది. ఆడపిల్ల పెండ్లి భారాన్ని ప్రభుత్వం పంచుకోవడంతో నిరుపేద ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతో ఊరట పొందుతున్నారు.

విద్యుత్‌ విజయాలు

విద్యుత్‌ రంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన అభివృద్ధిని సాధించింది. ఒక నిమిషం కూడా కోత విధించకుండా, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు సరఫరా చేస్తున్నది. ఈ పరిణామం రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తున్నది. వ్యవసాయ రంగానికి 9 గంటల పాటు పగటి పూట నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నది. ఇటీవల పాత మెదక్‌, కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తున్నది. వచ్చే యాసంగి నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ 24 గంటల ఉచిత విద్యుత్‌ అందివ్వడానికి తీవ్రంగా కృషి జరుగుతున్నది. దశాబ్దాల తరబడి కరెంటు కోసం తెలంగాణ రైతులు అనుభవించిన దుస్థితి నుంచి, దుఃఖం నుంచి విముక్తి కలిగించింది. ఈ పరిణామం తెలంగాణ రైతాంగంలో నూతనోత్సాహాన్ని, ఆశావాహ దృక్పథాన్ని కలిగించింది. నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది. పరిశ్రమలు మూడు షిఫ్టులు నడవడం వల్ల కార్మికులకు ఎక్కువ పని దొరుకుతున్నది. రాష్ట్రంలో స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం నూతన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను నెలకొలుపుతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా వెలుగొందుతుంది.

మన రాష్ట్ర ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించే అపురూపమైన పథకం మిషన్‌ భగీరథ. ఈ పథకం లక్ష్యాన్ని ముద్దాడే దిశగా గ్రామీణ నీటి సరఫరా అధికారులు రేయింబవళ్లు పరిశ్రమిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ వరకే అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన నదీ జలాలు అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మనం సంకల్పించిన ప్రధాన లక్ష్యం నెరవేరుతున్నది. గ్రామాలలో అంతర్గత పైపులైన్లు, నీటి ట్యాంకుల నిర్మాణం, ఇండ్లలో నల్లాల ఏర్పాటు తదితర పనులు కొనసాగుతాయి.

ప్రభుత్వం చేపట్టిన కె.జి. టు పి.జి. ఉచిత విద్యా విధానంలో భాగంగా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలను నెలకొల్పుతున్నది. 58 ఏండ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు అరకొర వసతులతో 259 రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తే, కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం కార్పొరేట్‌ విద్యాసంస్థలకన్నా మెరుగైన వసతులతో 522 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం నూతనంగా ప్రారంభించింది. ఈ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే విధంగా ఇంగ్లీష్‌ మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నది. సమతుల పౌష్టిక విలువలు కలిగిన మంచి ఆహారం పెడుతున్నది. దుస్తులు, పుస్తకాలు, ఆట వస్తువులు అన్నీ ఉచితంగా అందిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కావాల్సిన వసతులు కల్పిస్తున్నది. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మీద ప్రతి సంవత్సరం లక్షా 25వేల రూపాయలు వెచ్చిస్తున్నది.

తక్కువ వేతనాలతో, అర్థాకలితో అలమటిస్తున్న చిన్న తరగతి ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం సముచితంగా పెంచింది. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు శ్రమదోపిడీకి గురి కావద్దనే ఉదాత్త ఆశయంతో ప్రభుత్వం తపన పడుతుంటే, కొన్నిప్రతీప శక్తులు సంకుచితత్వంతో అడ్డుతగులుతున్నాయి. ఐనా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా, పట్టుదలతో వ్యవహరించి ఆ ఉద్యోగుల జీతభత్యాలు పెంచింది. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం ఊపందుకున్నది. పేద ప్రజలకు వైద్యం అందించే ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగుపరిచింది. ఇటీవల గాంధీ హాస్పటల్‌ ను సందర్శించిన రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ గారు హాస్పటల్‌లో అమలవుతున్న పారిశుధ్యం, మెరుగైన వైద్యం గురించి ప్రశంసించిన విషయం గుర్తు చేస్తున్నాను.

గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ అనే మంచి పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇల్లు గడవడం కోసం గర్భిణిగా ఉన్న స్త్రీలు సైతం పనులకు పోవాల్సి రావడం బాధాకరం. దీనివల్ల ఆమెతో పాటు గర్భస్త శిశువుకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని కేసీఆర్‌ కిట్‌ అనే పథకం ప్రవేశపెట్టింది. గర్భవతులు పనికి పోయే దుస్థితి ఉండకూడదని భావించి, పనికి పోకపోవడం వల్ల వారు కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే అందిస్తున్నది. మూడు దశల్లో నాలుగు వేల చొప్పున మొత్తం 12వేల రూపాయలు అందిస్తున్నది. ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నది. తల్లీ బిడ్డలకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్‌ను ప్రోత్సాహకంగా అందిస్తున్నది. పథకం ప్రవేశపెట్టిన రెండున్నర నెలల్లలోనే 42 వేల మంది ఈ కిట్‌ ప్రయోజనాలను అందుకున్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకంవల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచడంలో ప్రభుత్వం సఫలీకృతం అయింది.

తెలంగాణ నేలను పచ్చదనంతో నింపాలనే ఆశ యంతో చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతమవుతున్నది. పోలీస్‌ వ్యవస్థను పటిష్టపరచడంతో శాంతి భద్రతలు ఎంతో మెరుగుపడ్డాయి. నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పేకాట, గుడుంబా మహమ్మారులను దాదాపు తరిమి కొట్టగ లిగాం. గుడుంబా తయారు చేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపిస్తున్నాం. మహిళలపై జరిగే వేధింపులను అరికట్టడంలో షి టీమ్స్‌ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ప్రజల కోరిక మేరకు జిల్లాల్లో షీ టీమ్స్‌ సంఖ్యను పెంచాలని నిర్ణయించాం. మన రాష్ట్రం మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లో కూడా షీ టీమ్స్‌ దళాలను అక్కడి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. మాదక ద్రవ్యాల లాంటి సామాజిక రుగ్మతలను ఆదిలోనే అంతం చేసేందుకు ప్రభుత్వం రాజీలేని వైఖరిని అవలంబిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేసింది. వీటితో పాటు 25 నూతన డివిజన్లను, 125 మండలాలను ఏర్పాటు చేసింది. ఈ సంస్కరణ వలన పరిపాలన సౌలభ్యం పెరిగింది. పాలన ప్రజలకు చేరువైంది. కొత్త జిల్లాలో కలెక్టరేట్లు, పోలీస్‌ కార్యాలయాల నిర్మాణం జరుగుతున్నది.

పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ పదేపదే పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్య భావనను ప్రతి పాదించారు. స్వావలంబనతో, స్వయంసమృద్ధితో విలసిల్లిన భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేక కారణాల వల్ల విచ్ఛిన్నం అయిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పట్ల కొనసాగిన వివక్ష విద్రోహ పూరిత విధానాలు ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసాయి. దశాబ్దాల పాటు సాగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ గ్రామీణ జీవితం సంక్షోభంలో కూరుకుపోయింది. శ్రమించే తత్వం, వృత్తి నైపుణ్యం కలిగిన తెలంగాణ ప్రజానీకం ‘అన్నమో రామచంద్ర’ అంటూ దూర దేశాలకు వలస పోవాల్సిన దుర్గతి పట్టించారు. కూలిన బతుకులను నిలబెట్టేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం కట్టింది.

తెలంగాణకు జీవన రేఖలుగా ఉన్న గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించేందుకు మిషన్‌ కాకతీయ పథకాన్ని అమలు చేస్తున్నది. మొత్తం 46,500 చెరువుల్లో ఇప్పటికి 20 వేల చెరువులను పునరుద్ధరించింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తుంది. చెరువుల్లో నీటి నిలువ సామర్థ్యం పెరగడం, విద్యుత్‌ సరఫరా మెరుగు కావడంతో ఈ సంవత్సరం చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంటలు పండినయి. దాదాపు 96 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతాంగం నూతన చరిత్రను లిఖించింది. ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే తెలంగాణ రైతులు మట్టిలో బంగారం పండిస్తారనడానికి ఇది తిరుగులేని సాక్ష్యం.

నదీ జలాల్లో మన రాష్ట్రం వాటాను పూర్తిగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. తెలంగాణలో కోటికిపైగా ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా సంవత్సరానికి 25వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ నీటిపారుదల రంగానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నది. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల పథకాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది.

ఇటీవలనే ప్రభుత్వం శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవన పథకానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఒత్తిడి వల్ల గోదావరి మీద నిర్మించిన ఏకైక ప్రాజెక్టు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు. దశాబ్దాల పాటు కొనసాగిన తీవ్ర నిర్లక్ష్యం, వివక్ష ఫలితంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాలువలు శిథిలమైనాయి. చివరికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఉండీ, లేని సమానం అన్నట్లు అయింది. శ్రీరాంసాగర్‌ ఆయకట్టు రైతుల ప్రయోజనాలని కాపాడేందుకు శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవన పథకానికి ఇటీవలే శంకుస్థాపన చేసుకున్నాం. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను, వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌ జలాశయానికి మళ్ళించి శ్రీరాంసాగర్‌కు తిరిగి ఊపిరి పోసి పునర్‌ వైభవం కల్పిస్తున్నాం. అతితక్కువ సమయంలో, అతితక్కువ ముంపుతో, అతితక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ పథకం సర్వత్రా ప్రజల అభినందనలను, హర్షామోదాలను పొందుతున్నది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేయడం ద్వారా తెలంగాణ రైతాంగం అనుభవిస్తున్న సాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి.

రైతులు అనుభవిస్తున్న ఇతర కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ సంస్కరణలను అమలు చేస్తున్నది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతాంగానికి 17వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. గతంలో విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించకపోవడం వల్ల రైతాంగం ఎన్నో బాధలు పడ్డారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొరత లేకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నది. కల్తీ విత్తనాలతో రైతాంగం నష్టపోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. కల్తీలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలలో మార్పులు తెచ్చింది. మార్కెట్లో రైతులు పంట నిల్వ చేసుకునేందుకు పెద్ద ఎత్తున గోదాములు నిర్మించింది. గతంలో కేవలం 4లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములుంటే, నేడు తెలంగాణలో 22.5 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములున్నాయి. ఇది ప్రభుత్వ పనితీరుకు ఒక మెచ్చుతునక.

రైతు కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి ఆదర్శవంతమైన పథకాన్ని ప్రవేశపె డుతున్నది. పంట వేసే సమయంలో పెట్టుబడి కోసం రైతు అక్కడా ఇక్కడా అప్పు కోసం చేయి చాచే పరిస్థితి ఇక ఉండొద్దని నిశ్చయించింది. అప్పు చేసి పంట వేస్తే అనుకోకుండా పంట నష్టం వాటిల్లితే అటు రుణభారం, ఇటు పంటనష్టం రెండూ కలిపి రైతును ఆర్థికంగా కృంగదీస్తున్నాయి. రుణం చెల్లించలేక వడ్డీలు పెరిగి, అప్పుల ఊబిలో కూరుకపోతున్నారు. నిరాశనిస్పృహలకు లోనవుతు న్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించి రైతాంగాన్ని కాపాడుకో వడానికి ప్రభుత్వమే పంటకు అవసరమైన పెట్టుబడిని అందించాలని నిర్ణయించింది. సంవత్సరంలో రెండు పంటల కోసం ఎకరానికి 8వేల చొప్పున రాష్ట్రంలోని ప్రతీరైతుకు వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వమే పెట్టుబడిని సమకూరుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన రైతులకు పెట్టుబడి పథకం యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలిచింది.

రైతులను సంఘటిత పరచి వారి ప్రయోజనాలు వారే రక్షించుకునే విధంగా రైతుసంఘాలను, సమాఖ్యలను ప్రభుత్వమే పూనిక వహించి ఏర్పాటు చేస్తున్నది.

సమగ్ర భూ సర్వే

సమగ్ర భూ సర్వేతో తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించబోతున్నది. 1936లో నిజాం కాలంలో మాత్రమే ఒకసారి భూ సర్వే జరిగింది. ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ సర్వేకు పూనుకోలేదు. మళ్లీ ఇన్నాళ్లకు 81 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం భూ సర్వేను నిర్వహిస్తున్నది. రాబోయే కొద్ది నెలల సమయంలోనే జరిగే ఈ భూ సర్వే విజయవంతం కావడానికి రాష్ట్రంలోని రైతులే సారథ్యం వహించాలి. ఎక్కడి రైతులు అక్కడే వారి వారి గ్రామాలకు కథానాయకులు కావాలి. ఇది ఎవరి పనిగానో భావించి ప్రేక్షక పాత్ర వహించకుండా, ఇది మన పని అనుకుని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రైతు సంఘాలు సర్వేను విజయవంతం చేయాలని పవిత్ర స్వాతంత్య్ర దినోత్సవం శుభ సందర్భాన పిలుపునిస్తున్నాను. సర్వే పూర్తయిన తర్వాత భూ రికార్డులన్నీ పూర్తిగా సరిచేయడం జరుగుతుంది. రైతులకు కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీ జరుగుతుంది. భూ సమస్యల పరిష్కారం కోసం రైతాంగం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దూరమవుతుంది. అవినీతికి ఆస్కారం లేని పారదర్శక విధానం అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ సర్వే జరుగుతుంది. రైతు పండించిన పంటకు డిమాండ్‌ రావడం కోసం ప్రభుత్వం రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా విభజిస్తుంది. దీని వల్ల రైతులంతా ఒకే పంట వేసి నష్టపోయే పరిస్థితి ఉత్పన్నం కాదు. పండిన పంటకు మార్కెటింగ్‌ సమస్య తలెత్తదు.వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు దేశంలో ఏ రాష్ట్రం కూడా అమ లు చేయని విధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఈ ప్రణాళికలో రైతులు నిబద్ధతతో భాగస్వాములు కావాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా సంక్రమించిన నైపుణ్యంతో సేవలందించే కులవృత్తిదారులు మన రాష్ట్రానికి లభించిన అపార మానవ సంపదగా తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తున్నది. మానవ వనరులను గుర్తించటంలో ప్రభుత్వ వ్యవస్థలు ఇప్పడిదాకా అనుసరిస్తున్న సంకుచిత వైఖరి వల్ల ఆయా కులాల వారికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించలేదు. మానవ వనరులు అంటే నగరాలలో, పరిశ్రమలలో, కంప్యూటర్ల ముందు పనిచేసే వారు మాత్రమే అనే అసమగ్రవైఖరి వల్ల సమాజాన్ని అర్దంచేసుకోవడంలో గతంలో వైఫల్యం చెందారు. ఇందుకు భిన్నంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మానవ వనరులను గుర్తించడంలో సరికొత్త విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నది.

గొర్రెల పెంపకంలో గొప్ప ప్రావీణ్యం కలిగిన గొల్ల కురుమలు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ గొర్రెలు పంపిణీ చేయడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గొర్రెలు పెంచే పథకాన్ని ఐదువేల కోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేస్తున్నది. ఈ పథకంలో భాగంగా ప్రతీ గొర్ల కాపరికి 20 గొర్రెలు, ఒక్క పొటేలు కలిపి ఒక యూనిట్‌ గా పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వం గొర్రెల యూనిట్ల కోసం 4 లక్షల దరఖాస్తులు వస్తాయని వేసిన అంచనాకు భిన్నంగా 7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులందరికీ కోటి 47 లక్షల గొర్రెలను అందించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 12 లక్షల గొర్రెలను 57 వేల కుటుంబాలకు అందించింది. ఈ పథకం ద్వారా గొల్ల కురుమల ఆర్థిక శక్తి పెరగడంతో పాటు రాష్ట్రానికి అవసరమైన మాంసాహారం, సేంద్రీయ ఎరువు రాష్ట్రంలోనే లభిస్తుంది. రాబోయే రోజుల్లో మాంసం ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుంటుంది.

రాష్ట్ర వ్యాప్తంగా వున్న నీటి వనరులన్నింటిలో చేపల పెంపకాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు విధ్వంసానికి గురైనాయి. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నది. మధ్య దళారీల ప్రమేయం లేకుండా చేపలను పట్టేవారే ఆదాయం పొందే విధంగా చేపల పెంపకం విధానాన్ని రూపొందించింది. చేపల పెంపకాన్ని ఒక పరిశ్రమ స్థాయికి చేర్చేందుకు సమగ్ర చర్యలను తీసుకుంటున్నది. మెరుగైన మార్కెట్లను నిర్మిస్తున్నది.

చేనేతకు చేయూత

చేనేత మరియు పవర్‌ లూమ్‌ కార్మికులను ఆదుకు నేందుకు ప్రభుత్వం సమగ్ర చేనేత విధానాన్ని రూపొందించి అమలుచేస్తున్నది. చేనేత కార్మికులకు అవసరమైన నూలుతో పాటు అద్దకానికి అవసరమైన రసాయనాలను 50 శాతం సబ్సిడీతో అందిస్తున్నది. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. పవర్‌ లూమ్‌లను ఆధునీకరించి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకున్నది. విద్యుత్‌ చార్జీలలో రాయితీలు కల్పిస్తున్నది. పవర్‌లూమ్‌ కార్మికులకు ప్రతీ నెల 15 వేలకు తగ్గకుండా వేతనం ఇచ్చేవిధంగా యాజమాన్యాలను ఒప్పించింది. ప్రభుత్వం తరపున జరిపే అన్ని శాఖల వస్త్రాల కొనుగోలు ఆర్డర్లను చేనేత, మరమగ్గాల సొసైటీలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసు కోవాలనుకునే నేత పనివారికి తగిన ఆర్ధిక సహాయం అందజేస్తుంది. వచ్చే బతుకమ్మ పండుగ నుండి రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్‌ కార్డు కలిగిన 93 లక్షల మంది మహిళలకు చీరలను పండుగ కానుకగా అందించే పథకం ప్రవేశ పెడుతున్నది. ప్రతీ సంవత్సరం పండుగ సందర్భంగా కుల, మతాలకతీతంగా పేదలందరికీ పండుగ బట్టలు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ పథకం కోసం చేనేత, పవర్‌లూమ్‌ల ద్వారా ఉత్పత్తి అయిన చీరలనే కొనుగోలు చేస్తున్నది. తద్వారా చేనేత, పవర్‌ లూమ్‌ కార్మికుల ఉపాధికి పూర్తి హామీ ఏర్పడుతుంది. మరో వైపు వరంగల్‌లో అతిపెద్ద టెక్స్‌ టైల్‌ పార్క్‌, సిరిసిల్లలో అపరెల్‌ పార్క్‌ నిర్మా ణాలకు కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది.

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యప్రదమైన నవీన క్షౌరశాలలను ఏర్పాటు చేసుకునేందుకు, ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ప్రవేశపెడుతున్నది. ఈ పథకం ద్వారా నాయీ బ్రాహ్మణుల సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవకాశం కలుగుతుంది.

బట్టలుతకడమే బ్రతుకుతెరువుగా జీవించే రజక సోదరులు ఇంకా సాంప్రదాయక పద్ధతులనే అనుస రిస్తున్నారు. రజక సోదరులు బట్టలు పరిశుభ్రం చేసేందుకు అధునాతన యంత్రాలను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. తద్వారా వారి వృత్తిని ఆధునీకరించి వర్తమాన సమాజంలో వారు నిలదొక్కుకునేల చేయడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేయబోతున్నది. ఇప్పటికీ స్థిరజీవనం లేని సంచార కులాలు, బిక్షాటన వత్తిగా కలిగిన కులాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ‘అత్యంత వెనుకబడిన వర్గాల (ఎం.బి.సి.) కార్పోరేషన్‌’ను ఏర్పాటు చేసింది. వారి అభివద్దికి అవసరమైన పథకాల రూపకల్పన జరుగుతున్నది. విశ్వకర్మలుగా పిలవబడే ఔసుల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకారులకు, బట్టలు కుట్టి జీవించే మేర కులస్తులకు, కల్లు గీతతో జీవించే గౌడులకు, కుమ్మరి పనివారికి తదితర కులవత్తుల వారందరికీ అవసరమైన ఆర్ధిక సహకారం, పరికరాల పంపిణీ చేయడానికి నిర్దిష్ట పథకాలను ప్రభుత్వం రూపొందిస్తున్నది.

పరుగులు తీస్తున్న పారిశ్రామికరంగం

ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరుస్తూనే మరోవైపు పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు ప్రభుత్వం సమగ్ర కృషి చేస్తున్నది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టిఎస్‌ఐపాస్‌ చట్టం ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించగలిగింది. నేడు రాష్ట్రం ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలిచింది. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు తెలంగాణలో తమ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటి వరకు లక్షా ఒకవేయి ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. 4,118 నూతన పరిశ్రమలు అనుమతులు పొందాయి. వీటి ద్వారా 2 లక్షల 90 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.

పారిశ్రామిక రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న చొరవను, స్ఫూర్తిని ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. టిఎస్‌ఐపాస్‌ చట్టం ఇతర రాష్ట్రాలకు కరదీపికగా మారింది. ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న తెలంగాణ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు వేదిక కావడం మనందరికీ గర్వకారణం. నవంబర్‌ 28 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో జరిగే ప్రతిష్టాత్మకమైన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు దేశ ప్రధాని నరేంద్ర మోడితో పాటు, అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, అమెరికా ప్రభుత్వ సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్‌ హాజరవుతున్నారు. ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలందరూ పరస్పరం చర్చించుకునేందుకు, సహకరించుకునేందుకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు స్పూర్తిని పంచేందుకు వేదిక కాబోతున్నది. ఈ సదస్సును విజయవంతం చేసి తెలంగాణ ఘనకీర్తిని దశ దిశలా చాటేందుకు ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నది.

నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే, ఒక లక్ష మందికి నూతనంగా ఉద్యోగాలు లభిస్తాయని ఉద్యమ సమయంలో భావించాం. ఈ పవిత్ర స్వాతంత్య్ర దినోత్సవ వేళ తెలంగాణ నిరుద్యోగ యువతకు ఒక శుభవార్తను తెలియచేస్తున్నాను. ఇప్పటి వరకు చేపట్టిన 27,660 నియామకాలతో పాటు, మరో 84,876 ఉద్యోగాల నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. దీంతో తెలంగాణలో ఆశించిన దానికంటే మిన్నగా 1,12,536 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. వచ్చే సంవత్సరం ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి కూడా ఈ సంవత్సరమే నియామక ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రతీప శక్తులు మా ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగించేందుకు ఎన్ని కుట్రలు చేస్తున్నా ప్రజల ఆశీర్వాదంతో వాటన్నింటిని ఛేదిస్తూ ముందడుగు వేయగలుగుతున్నాం. తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివద్ధి కోసం నిరంతరం పాటుపడే మా ఏకాగ్రతను ఇటువంటి క్షుద్ర ప్రయత్నాలతో మరల్చలేరని వారికి మరోసారి స్పష్టం చేస్తున్నాను.

శ్రామిక జనుల సౌభాగ్యంకోసం, సకల జనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతుంది. ప్రజల అండదండలే మాకు తిరుగులేని ఆత్మబలాన్ని అందిస్తున్నాయి. మాలో అంకిత భావాన్ని పెంపొంది స్తున్నాయి. అట్టడుగు వర్గాల దాకా అభివృద్ధి ఫలాలను చేరవేసి ప్రజల ముఖాలపై చిరునవ్వులు విరబూసే బంగారు తెలంగాణను సాకారం చేసే మా ప్రయత్నంలో కలిసి వస్తున్న వారందరికీ హదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ మరోమారు భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.

జైహింద్‌…

జై తెలంగాణ… జై జై తెలంగాణ.