హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన

husenనిజాం రాజులు పాలించిన కాలంలో మంచినీటి చెరువుగా ఉన్న హుస్సేన్‌సాగర్‌ రానురాను మురికికూపంగా మారింది. కలుషిత జలాలతో దుర్గంధాన్ని వ్యాపిస్తున్నది. దీన్ని ప్రక్షాళన చేసి మునుపటి మంచినీటి చెరువులా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారు. అందులో భాగంగా హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. సాగర్‌ మురికి కూపంలా మారడానికి కారణాలను అన్వేషించి వాటి నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించారు.

ముఖ్యంగా సాగర్‌లో కలుస్తున్న నాలాలను మళ్ళించి, సాగర్‌కు స్వచ్చమైన నీరు వచ్చే విధంగా ప్రణాళికలు తయారుచేశారు. సాగర్‌కు ఎక్కువగా కలుషిత జలాలను పారిస్తున్న కూకట్‌పల్లి నాలాలను మళ్ళించేందుకు జలమండలి అధికారులు యుద్థప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇదే కాకుండా పికెట్‌, బంజారా, బల్కాపూర్‌ నాలాల నుంచి కూడా కలుషిత జలాలు సాగర్‌లో కలుస్తున్నాయి.

కూకట్‌పల్లి నాలాలకు సంబంధించి మూడు కిలోమీటర్ల మేర పనులను 4 ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్నారు. రూ. 58 కోట్ల వ్యయంతో ట్యాంక్‌బండ్‌-సికింద్రాబాద్‌ మార్గంలో 200 మీటర్ల పైప్‌లైన్‌ వేస్తున్నారు. ఇందులో రూ. 23 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, రూ. 35కోట్లు జైకా నుంచి రుణం తీసుకుని ఖర్చుచేయనున్నారు. పనులు ప్రారంభమవుతున్నందున మే 22 నుంచి హుస్సేన్‌సాగర్‌ కట్ట (ట్యాంక్‌బండ్‌) పైనుంచి వెళ్ళే ట్రాఫిక్‌ను మళ్ళించారు. ఈ పనులు త్వరలో పూర్తయ్యే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.